కథామధురం 

-జగద్ధాత్రి

ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో మహిళల గురించిన రచనలను అవి మహిళ చేసినా లేక రచయితలు రాసినవి అయినా ఆ కథను ఇక్కడ అందించ దలిచాము. తెలుగు సాహిత్యం లో చాలా మంచి కథలు వచ్చాయి వస్తున్నాయి. అయితే మిగిలిన భాషల్లో సాహిత్యం లాగా ఇవి ప్రపంచ భాషల్లోకి ముఖ్యంగా ఆంగ్లం లోకి వెళ్ళడం తక్కువ. అందుకే ప్రపంచ స్థాయి లో తెలుగు సాహిత్యం ఎవరికీ తెలియడంలేదు. మిగిలిన భాషల, ప్రాంతాల , దేశాల రచయిత్రుల లాగానే మన రచయిత్రులు కూడా వివిధ రకాలైన స్త్రీ సమస్యలను చిత్రిస్తున్నారు గళం విప్పి కలం పట్టి. ఇవి ఈ మహిళా ఇతివృత్త రచనలు ఒకే దగ్గర పొందుపరిచి మీకు అందించాలని మా సంకల్పం. ఇలాంటి కథల అనువాదాలు ప్రచురించే దిశగా కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి వారు, కొంత కృషి చేసినప్పటికీ ఇంకా విస్తృతంగా అనువాదాలు జరిగి మన కథలు ఇతర భాషల్లోకి వెళ్ళాలి, అప్పుడే మన తెలుగు సాహిత్య ప్రాశస్త్యం అందరికీ అర్ధం అవుతుంది. అనువాద సాహిత్యానికి కూడా అతి మంచి గౌరవం లభిస్తుంది అన్నది ఇటీవలే మనం మాన్ బుకర్ ప్రైజ్ వచ్చిన రచయిత్రి జోఖా అల్హర్తి ని చూసాము. ఆమె ఆరబ్ భాష లో రాసిన రచనకి ఆంగ్లానువాదానికి ఈ బహుమతి లభించడం విశేషం. మారిలిన్ బూత్ అనే ఆవిడ ఆంగ్లానువాదం చేసిన ‘సెలెస్టియల్ బాడీస్’ అనే నవలకు ఈ విశిష్ట పురస్కారం లభించింది. ఆరబ్ మహిళల జీవనాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం ఈ రచనను మరింత విశిష్టం చేసింది. అలాగే ఇతర దేశాల , భాషల రచయిత్రుల కథల అనువాదాలు సంకలనాలుగా వస్తున్నాయి. అలా మన రచయిత్రులవి కూడా విస్తృతంగా రావాలి అన్నది ఒక సామాజిక అవసరం. 

ఈ శీర్షికలో మన రచయిత్రుల కథలను మనం చదువుకుందాం, మరింతమంది కొత్త తరం పాఠకులకి అందిద్దాం, ఇదే ఈ శీర్షిక ఉద్దేశం, ఆశయం. 

ఇక్కడ ఇలా మన సాహిత్యం లో వచ్చిన మహిళా ఇతివృత్తం కలిగిన కథలను పరిచయం చేసుకుందాం , చదువుకుందాం , చర్చించుకుందాం. 

ఈ నెల కథ “ఉడ్ రోజ్” : మొన్ననే మరణించిన ప్రతిభావంతమైన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారి కథతో ఈ శీర్షిక  ఆరంభించుకుందాం. తరాల అంతరాన్ని చూపుతుంది ఈ కథ. ఈ కథలో రచయిత్రి తల్లిగా అనుబంధాలను అల్లుకున్న స్త్రీని, ఉడ్ రోజ్ తీగను పొలుస్తూ చిత్రిస్తారు. అందమైన పూలు పూస్తుంది అని  ఆ తీగను నాటిన కోడలు, అనవసరంగా ఎక్కువగా అల్లుకుని ఇల్లు చీకటి చేస్తుని, పైగా దోమలు కూడా అని విసుక్కుని ఆ తీగను తీసి పారేసిన కొడుకు యువతరానికి ప్రతినిధులు. వృద్ధాప్యం లో ఇంట్లో గడుపుతోన్న తల్లిగా ఆ తల్లి రేపు తన పరిస్థితి కూడా ఆ తీగ లాంటిదేనా , అంతేనా అనే సందేహం తో కథ ముగుస్తుంది. వృద్ధులైన తల్లి తండ్రులు జీవితాలు వ్యర్ధమా , వారికి శాంతిగా జీవించే హక్కు లేదా ? ఇప్పుడు యవ్వనం లో ఉన్నవారు ఒకనాటికి వృద్ధులు అవుతారు కదా ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించరు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి ఈ కథ చదివితే. అక్కర్లేని పూల తీగను తీసిపారేసినట్టు తల్లి ని కూడా రేపు ఎక్కడో ఏ వృద్ధాశ్రమంలోనో పడేస్తారా? నానాటికీ ఈ సమస్య పెరుగుతోందా అనే హెచ్చరిక , యువకులైన పిల్లలకు కనువిప్పుగా ఒక్క సారి ఆలోచించుకోవడానికి ఈ కథ చాలా ఉపయుక్తం గా ఉంటుంది. సాహిత్యం ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది. ఇది అందరం నమ్మాలి. అయితే ఈ మార్పు వెంటనే రాదు నెమ్మదిగా వస్తుంది. నేటి సమాజం లో వృద్ధులైన తల్లి తండ్రుల సంరక్షణ అతి పెద్ద సమస్య గా పరిణమిస్తోంది ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు. అందుకే వృద్ధాశ్రమాలు నిండి పోతున్నాయి. ఇలాంటి సమస్యని తీసుకుని తనదైన శైలి లో విలక్షణ సృష్టి చేసి కథగా మనకి అందించారు ఛాయాదేవి గారు. ఇది సమాజానికి యువతరానికి ఒక ప్రశ్న, ఒక పునరాలోచన చేసుకునేందుకు  ఇచ్చే అవకాశం. అభిశంసను కూడా అతి సున్నితంగా వెలిబుచ్చిన రచయిత్రి రచనా లాఘవానికి జోహార్లు.ఈ కథ చదవండి చర్చించండి ఇకకథ మీకోసం. ఇందులోని రచయిత్రి చిత్రించిన అంశాలు, ఒకటి వృద్ధాప్యం , తమ పాత తరాన్ని మరిచిపోయి, వాళ్ల విలువను గ్రహించకుండా వాళ్ళు తమకు ఒక బరువు అనుకునే నేటి తరం వారిలో ఒక ఆలోచన రేకెత్తించడం ,తమని కన్న వారిని గురించి అవగాహన కలిగించడం. మరీ ముఖ్యంగా వారిలో రావాల్సిన మార్పును సూచించడం లో రచయిత్రి కృతకృత్యురాలు అయ్యారని చెప్పవచ్చును. ఛాయాదేవి గారి మిగిలిన కథలు కూడా ఎక్కువగా మహిళా సమస్యలను చిత్రించే కథలు. ఛాయాదేవి గారి వంటి రచయిత్రి కథలు ప్రపంచ స్థాయి లో ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ప్రపంచ సాహిత్యం లో ముఖ్యంగా ఆరబ్ దేశాల్లో, తీవ్రంగా ఉన్న సమస్యలు మహిళల జీవితాలను గురించి ఎక్కువ గా వస్తున్నాయీ. నేటి రచయిత్రులు ఇప్పుడు తమ గళాలను స్వేచ్ఛగా వినిపిస్తున్నారు. అలాంటి ఒక జ్వలనా స్వరం ఛాయాదేవి గారు ఆమె రచనలు ఎన్నటికీ చిరంజీవిగా ఉంటాయని భావిస్తున్నాను. 

వచ్చే నెల మరో రచయిత్రి కథతో మీ ముందుకు వస్తాము .. అంతవరకు సెలవు.! 

 మీ కోసం “ఉడ్ రోజ్” కథ పూర్తిగా ఇక్కడ:-

 

ఉడ్ రోజ్

-అబ్బూరి ఛాయాదేవి 

సాయంకాలం పూట బాల్కనీలో కూర్చుని వీధిలో వచ్చే పోయే వాళ్లని చూడటం అలవాటైంది నాకు. పనేముంది నాకు! అంతా కోడలే చూసుకుంటుంది. ఏదన్నా చేద్దామని వంటింట్లోకి వెళ్లబోతే, “మీరేం చేస్తారు, వెళ్ళి రెస్టు తీసుకోండి” అంటుంది. విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఒక్కక్షణం తీరిక లేకుండా చాకిరీతో సతమతమయ్యేదాన్ని. ఇప్పడిక విశ్రాంతి-విశ్రాంతి. విశ్రాంతి అంటే విసుగు పుడుతోంది. వృద్ధాప్యం ఇంత విసుగనిపిస్తుందమ కోలేదు.

వాలుకుర్చీలో పడుకుని కునుకు తియ్యడం, మనవలందరితో ఆడుకోవడం, కథలూ, కబుర్లూ చెప్పడం, ఇరుగు పొరుగు వాళ్లతో, వచ్చే పోయే బంధువులతో ముచ్చట్లాడటం, ఇంట్లో వాళ్లని సాధిస్తూ కర్ర పెత్తనం చేస్తూండటం వృద్ధాప్యం ఎంతో హాయి అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు నాదాకా వచ్చాక తెలుస్తోంది. పల్లెటూళ్లలో వృద్ధాప్యం గడపటానికీ, పట్నాల్లో వృద్ధాప్యం గడపటానికీ బోలెడు తేడా వుందని కూడా తెలుస్తోంది.

ఈ మహానగరంలో ఎవరికి వారే యమునా తీరే ఆన్నట్లు అంటీముట్టనట్లు వుంటారు. ఇరుగు పొరుగువాళ్లు. వాళ్లు చనువుగా మనింటికి రారు, మనం వెడితే ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని వద్దుమొర్రో అంటున్నా గుక్కెడు కాఫీ పోసి పంపిస్తారు. అందుకే ఇలా బాల్కనీ లో కూర్చుని వీధిలో వచ్చే పోయే వాళ్లని చూడటమే నయం. చూస్తూ కూర్చుంటే ఏవో ఆలోచనలు పాతవి, కొత్తవి వచ్చి పోతూంటాయి. అదే కాలక్షేపం.

బాల్కనీ పక్కని గోడవారగా కోడలు ఏదో విత్తనం నాటుతోంది. “ఏమిటి కమల అది?” అన్నాను. “ఓ పూల తీగ విత్తనం నాటుతున్నానండి”అంది. “ఏం పువ్వులు? శంఖం పూలతీగా?” అని అడిగాను.

“కాదండి. దీన్ని ఉడ్ రోజ్ అంటారండి” అంది తలవంచుకుని మన్ను కెలుకుతూ..

నేనెప్పుడూ ఆ పేరు వినలేదు. వీళ్లు చామంతి పువ్వుల్ని కూడా ఇంగ్లీషు పేర్లతో పిలుస్తారు. అలాగే నాకు తెలిపిన పూల పేరేనేమో తెలుసు కుందామని, “ఆ పువ్వులు చూడ్డానికెట్లా వుంటాయమ్మా?” అన్నాను.

“పసుపు పచ్చని బాకా పువ్వులు పూస్తాయి ముందు. తరవాత వాటి తొడిమల్లోంచే గంధం చెక్కరంగులో గులాబీ పువ్వుల్లాంటివి పూస్తాయండి అంది.” “సువాసనేమైనా వుంటుందా? లేకపోతే పూజకి పనికొచ్చేవా?” అని అడిగాను కుతూహలం ఆపుకోలేక.

“సువాసవ వుండదు కానీ, చాలా అందంగా వుంటాయి ఆ పువ్వులు. వాజ్ లో పెట్టుకుంటే ఎన్నాళ్లయినా నిలవుంటాయి”అంది.

ఏమో, ఏమిటో, నేనెప్పుడూ అలాంటి పువ్వుల్ని చూళ్ళేదు! శుభ్రంగా ఏ సన్నజాజి తీగో వేసుకుంటే ఘుమ ఘుమ లాడుతూ బోలెడు పువ్వులు పూస్తాయి. తల్లో పెట్టుకోవచ్చు. పిల్లలు ఇంటి కొచ్చిన ముత్తయిదువలకిచ్చుకుంటే ముచ్చటగా వుంటుంది. అంతే గాని, కనీవిని ఎరుగని ఇలాంటి తీగలు తెచ్చి వేసుకోవడం ఎందుకో! పోనీ ఏ బూడిద గుమ్మడికాయ తీగో వేసి డాబా మీద కెక్కిస్తే బోలెడు కాయలు కాస్తాయి. రెండు చేతులా నలుగురికీ పంచి పెట్టుకోవచ్చు. ఆలా అనుకునే, ఆ మధ్య గోడవారగా విత్తనాలు నాటాను. చక్కగా మొలిచాయి. ఆ మర్నాడు చూస్తే మొక్కలు కనిపించలేదు. ఇక్కడ మొక్కలు ఏమయినాయర్రా?” అని అబ్బాయిని, కోడల్ని ఇద్దర్నీ అడిగామ. మాకు తెలియదు పొమ్మన్నారు. ఏ గడ్డి మెక్కలో అనుకొని వాళ్లే పీకి పారేసి వుంటారు. నామాటంటే గడ్డి పరకంత విలువ లేకుండా పోతోందీమధ్య.

‘నాలుగు వంగ మొక్కలూ, బెండ మొక్కలూ పెంచండి అంటే, ఆ జాగాలో ముదనష్టపు బ్రహ్మదేవుడు మొక్కలూ, క్రోటను మొక్కలూ వేశారు. ఇద్దరి కిద్దరే. ఒకరి కొకరు తందాన తాన అనడం- అదైనా నేనెప్పుడైనా సలహా ఇచ్చినప్పుడే. ఉత్తప్పుడు అయిందానికీ కానిదానికీ కీచులాడుకుంటూ వుంటారు!

సరే, నాకెందు కొచ్చిందని ఊరుకున్నా. ఓ పది రోజులకి ఆ విత్తనం మొలకెత్తింది. మా కోడలు సంబరం ఇంతా అంతా కాదు. దాన్ని రోజూ ఎంతో అపురూపంగా చూసుకుంటూ, కొంచెం ఎదగ్గానే దాన్నిగోడకి అంటి వున్న పైపుకి కట్టి, ఆ పైపుని పట్టుకుని డాబామీదకి అల్లుకునేలా ఏర్పాటు చేసింది. మూడు నెలలు తిరిగే సరికి బాల్కనీ గోడ చుట్టూ అల్లుకుంది. బాల్కనీ చుట్టూ వున్న ‘గ్రిల్లు’ నిండా అల్లుకుంటోంది. నేను బాల్కనీలో కూర్చుని వీధిలోకి చూడాలంటే ఇబ్బంది అవుతుందేమో, వున్న కాస్త కాలక్షేపం పోతుందేమోనని గిజగిజ లాడింది నా మనస్సు. ఊరుకోలేక కోడలితో ఓసారి అని చూశాను. ఏమనుకుందో, ఆ తీగని కాస్త బిగించి పైకి లాగి, డాబా మీదకే ఎక్కువగా అల్లు కునేలా తాళ్లూ, వైరులూ వేసి కట్టింది.

మేడమీద ఒక్కటే గది వుంది. తక్కినదంతా డాబాయే. ఆఫీసు నుంచి వచ్చాక అబ్బాయి అక్కడే కూర్చుని చదువుకుంటూ వుంటాడు. ఆదివారాలు కూడా స్నేహితులతో అక్కడే గడుపుతూ వుంటాడు. వాడో రోజున పెళ్ళాన్ని పిలిచి కేకలేశాడు. నాకు సరిగ్గా వినిపించలేదు ఆ కీచులాట. నేను కలగజేసుకోలేదు బాగుండదని.

ఆ తరవాత ఓ నాడు మా కోడలు ఇల్లంతా శుభ్రంగా సర్ది, ముందు గదిలో బల్ల మీద గాజు కూజాలో పువ్వుల కొమ్మలు గుచ్చుతోంది. పసుపు, ఎరుపు గులాబీలతో బాటు గంధపుచెక్క రంగులో వున్న గులాబీ పూల కొమ్మల్ని కూడా గుచ్చింది. చూడటానికి తమాషాగా అనిపించి, ఇవేం పువ్వులా అని పట్టుకు చూశాను. ఎండి పోయి పెళ పెళలాడుతున్నట్లున్నాయి.

’’ఇవేం పువ్వులు, ఇలా వున్నాయి? ఆ తాజా గులాబీలతో పాటు వీటినెందుకు పెట్టావమ్మా?” ఆన్నాను.

“వీటినే ఉడ్ రోజ్ అంటారండీ. ఇలా అమర్చడం ’’వృద్ధాప్యం, యవ్వనం” కలిపి చూపించడానికి. ఉడ్ రోజ్ పువ్వులు వృద్ధాప్యానికీ, తాజా గులాబీలు యవ్వనానికీ ప్రతీకలన్నమాట. ఇటువంటి అలంకరణ “ఇకెబానా” అంటారు.”

“అత్తా కోడళ్లని పిలవరాదా!‘‘ అన్నా నవ్వుతూ మా కోడలు కూడా నవ్వేసింది.

అప్పటి నుంచీ ఆ ఉడ్ రోజ్ పువ్వులు ఎప్పుడు పూస్తాయా అని బాల్కనీలో కూర్చుని ఆ తీగ కేసి చూస్తూ వుండేదాన్ని. వీధిలో వచ్చే పోయే మనుషుల్ని చూడ్డానికి ఆ తీగతో ఏదో అనుబంధం ఏర్పడినట్లు అనిపించింది.

తీగనిండా పసుపు పచ్చని బాకా పువ్వులు కళకళ్లాడుతూ కనిపిస్తున్నాయి. ఇంక ఉడ్ రోజ్ పువ్వులు ఎప్పుడు పూయడం మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాను.

ఆ రోజు ఆదివారం, భోజనాల కింకా వేళ కాలేదు. పూజ ముగించుకుని, ఏం తోచక బాల్కనీలోకి వెళ్లాను అక్కడ కూర్చుందామని.

“అదేమిట్రా, ఆ పూల తీగని అలా పీకేస్తున్నావ్?” అని అరిచాను.

అబ్బాయి గోపాలం నామాట వినిపించుకోలేదు. వరండా చుట్టూ అల్లుకుని డాబా గోడదాకా దట్టంగా అల్లుకున్న ఉడ్ రోజ్ పూల తీగని అలా చీల్చి చెండాడుతుంటే నా మనస్సు గిలగిల్లాడింది. వాడు నా మాట వినిపించుకోవడంలేదని, వంటింటి వేపుకి వెళ్ళి కోడల్ని పిలిచి ఆడిగాను.

“అదేమిటమ్మా, వాడు ఆ ఉడ్ రోజ్ తీగని అలా పీకి పోగులెడుతున్నాడు, వచ్చి చూడు”అన్నాను.

“నా మాట వింటారేమిటి? ఆయనిష్టం- తీగ పీకుతారు, ఇల్లు పీకుతారు, పీక్కోనివ్వండి” అంది నిష్టూరంగా.

నా మనసు నిలవక, మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి చెప్పి చూశాను నిక్షేపంలా పువ్వులు పూస్తున్న తీగని పీకి పారెయ్యడం బాగుండదని. నామీద బస్సుమని లేచాడు. నోరు మూసుకుని ఇవతలికి వచ్చేశాను.

చిన్నప్పుడు వాడికి నేనంటే ఎంత ఆపేక్ష వుండేది! వాళ్ల నాన్న గారు నన్ను చిన్న మాటన్నా సహించలేకపోయేవాడు. పొయ్యిలో కట్టెలు మండక, వంటింట్లో పొగతో నేను సతమతమవుతూంటే, “అమ్మా, నేను పెద్దయ్యాక నీకు ఈ వంట బాధ లేకుండా చేస్తానమ్మా” అనేవాడు. కళ్ళలో నీళ్లు తిరిగేవి వాడి మాటలికి.

వాడు పెద్దయాడు. నాకు వంట తప్పింది. నన్ను వంటింట్లో అడుగు పెట్టనివ్వదు కోడలు. ఆలా అని మురిసి పోనా! వాడు అమెరికాలో మూడేళ్ల నుండి వచ్చినప్పటి నుంచి కారాలు తినలేకపోతున్నాడు. నా వంటలో కారం బాగా పడుతుంది మరి. అలవాటయిన చెయ్యి ఎంత తగ్గించుకుందామన్నా చాతకావడంలేదు. మా కోడల్లా చప్పిడి వంటలు చెయ్యడం నాకు రాదు. కారాలూ, పులుపులూ ఒంటికి మంచివి కావని ఉపన్యాసాలిస్తారు ఇద్దరూ కలిపి. నా కొచ్చిన పిండి వంటలు కూడా ఇప్పుడు పాతకాలపు వయిపోయాయి. ఆ బిరియానీలు, కేకులూ నాకు రావు. కందిపచ్చడి కూడా మిక్సీలో నాయె! ఆ రుబ్బురోలూ నాలాగే మూల పడింది.

పెద్ద వాళ్ళను బట్టే పిల్లలూనూ, మనవడికీ మనవరాలికీ నాతో కబుర్లేం నచ్చుతాయి? అవేవో కామిక్కులుట – అవి పుచ్చుకు కూర్చుంటారిద్దరూ. ఇద్దరికీ భూతద్దాల్లాంటి కళ్లజోళ్ళు అప్పుడే.

రాత్రి వాళ్లు భోజనాలు చేస్తూండగా వాళ్ల భోజనాల బల్ల దగ్గర నించుని అడిగాను “అబ్బాయ్, గోపాలం, ఎందుకురా ఆ తీగని అలా పీకేశావ్?” అని.

“ఏ తీగ?” అన్నాడు. వాడప్పుడే మరిచి పోయాడు! నా మనసులో ఇంకా అదే పీకుతోంది. “అదేరా, ఆ వుడ్ రోజు తీగని” అన్నాను.

“ఓ, అదా! అదో న్యూసెన్స్ అయిపోయింది. వరండా గ్రిల్లంతా చుట్టుకుని హాల్లోకి వెలుతురు రాకుండా చేస్తోంది. మేడ మీద గది కిటికీ అంతా అల్లుకు పోయింది. డాబా అంతా అల్లుకు పోయేటట్టుగా వుంది. ఇక ఇల్లంతా ఆక్రమించేలా వుందని పీకి అవతల పారేశాను” అన్నాడు నిర్లక్ష్యంగా.

“తీగనిండా బోలెడు పువ్వులున్నాయిరా పచ్చగా” అన్నాను ప్రాణం వుసూరుమనిపించి. “పువ్వులమాటెలా వున్నా, తీగకదిపితే చాలు, పుట్టెడు దోమలు!” అన్నాడు ఆ దోమలన్నీ ఒక్కసారి కుట్టేసినట్లు మొహం పెట్టి.

నాకింకేం మాట్లాడాలో తోచలేదు.

పోయి నా మంచంమీద పడుకున్నాను. నిద్ర రాదు. ఒకటే ఆలోచనలు. ఆ ఉడ్ రోజ్ తీగే నా మనసునిండా. ఎందుకో దాన్ని తలుచుకుంటే పుట్టెడు జాలేస్తోంది. రేపు నా పరిస్థితీ అంతే అవుతుందా అనిపించింది. ఆ ఊహకే నా వళ్ళు జలదరించింది.

మనిషికీ మనిషికీ మధ్య మమత ఆ తీగంత దట్టంగా పెరగకూడదేమో. అలా పెరిగితే పిల్లలైతే పెకిలించి పారెయ్యగలరు. తల్లికి అల్లుకు పోవడమే తెలుసు.

*****



Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.