చూడలా గులాబిలా!

-చంద్రలత

లా వి యెనా రోజా ! ఎడిత్ పియెఫ్ 

( La Vie en Rose *  Edith Piaf)

బురదగుంటలో వేళ్ళూనుకొన్నప్పటికీ, తామరలా వికసించమంటాడు గౌతమ బుద్ధుడు.

ముళ్ళకంపపై మొగ్గతొడిగినా, గులాబీలా జీవితాన్ని చూడమంటొంది ఎడిత్ పియెఫ్.

అలాగని, ఎడిత్ పియెఫ్ తాత్వికురాలో దార్షనికురాలో కాదు. ఒక గాయని.తన పాటలు తానే రాసుకొని ,తనే స్వరపరుచుకొని పాడగలిగిన జనరంజక గాయని.ఫ్రెంచ్ దేశీయుల గుండెల్లో ప్రతిధ్వనించే  ఫ్రాన్స్ జాతీయ సంపద. ఫ్రెంచ్ గాయనీ మణిమాణిక్యం. “ది ఫ్రెంచ్ మిత్!”

 

“ప్యారిస్ ఆత్మను నీ గొంతులో ధ్వనింప చేస్తున్నావ్! “అంటూ మార్లీన్ డీట్రిక్ వంటి విదుషీమణుల హృదయాలను స్పృశించిన ఆ గాన మధురిమ ప్యారిస్ నగరం లోని ఒక మురికివాడలో వేళ్ళూనుకొంది. 

విక్టర్ హ్యూగో  వివరంగా చిత్రించిన ప్యారిస్ పేదరికపు జీవితాల “లే మిజర బుల్స్”(బడుగు జీవులు ) నవలలోంచి నడిచివచ్చిందా అన్నట్టుగా సాదాసీదా గా ఉండే  అతి సామాన్యురాలు. 

ప్యారిస్ మురికివాడల్లో ,1915,డిసెంబర్ 15 న కళ్ళుతెరిచిన ఎడిత్ జోవాన్నా గేసన్ కు, మొదటి ప్రపంచ యుద్ధకాలంలో,జర్మన్ నిర్బంధంలోనుంచి తప్పించుకోవడానికి ఫ్రెంచ్ సైనికులకు సహాయం చేసినందుకు మరణదండన విధించబడిన, ఎడిత్ కావెల్ అనే బ్రిటిష్ నర్స్ పేరు పెట్టారు.  

ఎడిత్ పియెఫ్ తల్లి,అనెట్టా జొవాన్నా మైలార్డ్ (1895-1945),  ఒక క్యాబరే గాయని. ఎడిత్ పియెఫ్ తండ్రి, లూయి ఆల్ఫాన్స్ గేసన్ (1881-1944), వీధుల్లో  సాముగరడీలు చేసే విన్యాసకుడు. దేశదిమ్మరి. 

ఏ పూటకు ఆ పూట అరకొర సంపాదనతో పొట్ట నింపుకోవాల్సిన  వాళ్ళు. కేవలం తానొక గాయనే కాదు మంచి కళాకారిణినని ఎడిత్ తల్లికి గొప్ప నమ్మకం. కళాకారిణిగా ఎదగాలన్న స్పృహ.కాంక్ష. ఎడిత్ తండ్రి మొదటి ప్రపంచ యుద్ధానికి వెళ్ళగానేఆమె పసిబిడ్డ ఎడిత్ ను అమ్మమ్మ వద్ద వదిలేసి ,ప్రదర్షన అవకాశాలను వెదుకుతూ  వెళ్ళింది.

ఎడిత్ అమ్మమ్మ పసిబిడ్డ బాగోగులు సరిగ్గా చూసుకోలేక పోయింది. యాచన చేసి,చేతికందితే నోటికందిస్తూ, మనవరాలిని  పోషించాల్సి వచ్చేది. పసిఎడిత్ ను ఎప్పుడూ అమ్మమ్మ ఇంట్లో ని వంటరి గా వదిలి వెళ్ళేది.ఆలనాపాలనా లేకుండా, శుచీ శుభ్రతా లేకుండా , మురికిబట్టి, ముఖాన చీము నెత్తురు గడ్డల్తో , పసి 

ఎడిత్ ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధ పడుతూ ,బలహీనంగా ఉండేది. 

               యుద్ధానంతరం, బిడ్డను చూడడానికి వచ్చిన ఎడిత్ తండ్రి , తన భార్య బిడ్డను వదిలేసి వెళ్ళడం, పసి ఎడిత్ ఆ దుస్థితిలో , అనారోగ్య పరిస్థితుల్లో  పెరగడం చూసి, హతాశుడయ్యాడు. పసి ఎడిత్ ను,తనతో పాటూ తీసుకెళ్ళాడు. నేరుగా తన బిడ్డను, తన తల్లి వద్దకు తీసుకెళ్ళాడు. ఎడిత్ నాయనమ్మ, మామన్ టీన్, నార్మండీ లో ఒక చవకబారు బ్రోతల్ హౌస్ నిర్వాహకురాలు. పది పదిహేను మంది కడుపేద స్త్రీలు  మామన్ టీన్ సంరక్షణలో ఉండే వారు. 

                  చిన్నారిఎడిత్ రాక వారందరి జీవితాల్లో కొత్త ఊపిరి నింపింది. చిన్న వెలుగు తెచ్చింది. ఎడిత్ కు మొదటిసారిగా మానవసంబంధాల్లోని ఆప్యాయత, ఆత్మీయత, ప్రేమలు  అనుభవంలోకి వచ్చాయి.          అప్పటి వరకు ఎడిత్ ఎంతటి నిర్లక్ష్యానికి లోనయ్యిందంటే, నార్మండీ వచ్చే దాకా ఎడిత్ కు కంటి చూపు మందగించిందన్న సంగతే ఎవరూ గుర్తించలేదు. ఎడిత్ నాయనమ్మ , కంటి వైద్యం చేయించింది. కెరటైటిస్  అన్న వ్యాధి గా గుర్తించి చికిత్స మొదలు బెట్టారు వైద్యులు. ఆ క్రమంలో కళ్ళకు గంతలు కట్టుకొని, దాదాపు నాలుగేళ్ళ పాటు ఎడిత్ చీకటిలో కాలం గడిపింది .

      నాయనమ్మ ఇంట్లోని ఆ దీనాతిదీనమైన జీవితాన్ని గడుపుతోన్న ఆ అభాగ్య స్త్రీల ఆటలు పాటలే ఎడిత్ కు ఆధారం. వారికి ఎడిత్  పెంపకం ఊరట.  ఎడిత్ చుట్టూ వినబడిన ధ్వనులే , ఆమె జీవితం అయ్యాయి. ఆ మురికివాడల ఇరుకు గదుల్లోని, బాధను,దిగులునూ, ఆర్తినీ, అంతులేని ఆశలను చెవిన బెట్టుకొంది.వారి దయనీయ పరిస్థితుల్లో, వారి గాయపడిన మనసులకు చిన్నారి ఎడిత్  పెంపకం ఒక నవనీతమైయ్యింది. ఒక ఆటవిడుపు, ఒక ఆనందం అయ్యింది. వారి ఆపేక్షలే ఎడిత్ కు ఆయువు పోసాయి. కంటి చూపు నిచ్చాయి. గొంతులో గుండెలో పాటల బీజాలు వేశాయి.   వాళ్లు ఆ బిడ్డను గారాబం గా, అపురూపంగా, ఒక విరిసీవిరియని గులాబీ లా చూసుకొన్నారు.  నిజానికి ,ఎడిత్ జీవితమంతా ఆమె విశాలమైన కళ్ళల్లో ప్రతిఫలిస్తుందా అనిపిస్తుంది. నిండుగా,నిశ్చలంగా, నర్మగర్భితంగా, గుంభనంగా పారే ప్యారిస్ నది సియెన్నా లోని నీలిరంగులను నింపుకున్నట్లుగా.        

        యుద్ధానంతరం తన బిడ్డ బాగోగులు చూసుకోవడానికి వచ్చిన తండ్రి, నార్మండీలో ఎడిత్ పెరుగుతోన్న వాతావరణం నచ్చక, తనతో పాటు తీసుకు వెళ్ళి పోయాడు. ఎడిత్ కు పదేళ్ళ వయస్సు వచ్చేదాకా , ఒక సర్కస్ కంపనీలో సాముగారడీలు చేసేవాడు. ఎడిత్ ను సర్కస్ గుడారాల లోపలే  వంట సహాయపు పనులు అవీ చూసుకోమనేవాడు. ఆమెను సర్కస్ లో అందరి ముందుకు రానిచ్చేవాడు కాదు. చివరకు సర్కస్ వారితో ఇమడలేక, ఎడిత్ ను తీసుకొని రోడ్డున పడ్డాడు. వీధుల్లో విన్యాసాలు చేస్తూ,ఏ పూటకు ఆ పూట కడుపునింపుకొనేవారు.ఎడిత్ తండ్రి విన్యాసాలు చేస్తుంటే, డబ్బు కోసం టోపీ పట్టుకు ఛుట్టూ పోగయిన గుంపు దగ్గర గా తిరిగేది. అలాంటిది ,ఒక రోజు గుంపులో ఎవరో “ఈ అమ్మాయి ఏం చేస్తుంది?” అంటూ వేసిన ప్రశ్నతో,కూతురిని “ఏదో ఒకటి చేయి!”అని ముందుకు తోసాడు.ఎడిత్ చేయగలిగిందల్లా ఒక్కటే,పాట పాడడం. అలా అనుకోకుండా, వీధిపాటతో ఒక గానకోకిల గళం విప్పింది.                              

                          (కన్న తండ్రి ,సవితి తల్లితో వీధిలో పాటలు పాడే రోజుల్లో పదేళ్ళ ఎడిత్)

ఎడిత్ నాయనమ్మ తో సహా ఆ స్త్రీలంతా కలిసి ,ఎడిత్ కంటి చూపు కోసం ప్రార్ధిస్తూ, లైనక్ష్  లోని సెయింట్ థెరిస్సా చర్చ్ కి తీర్థయాత్ర చేసారు. మొక్కులు చెల్లించుకొన్నారు. ఎడిత్ నాయనమ్మ వైద్యం కూడా చేయించింది. అయినా, జీవితాంతం వరకూ,ఎడిత్ తన కళ్ళ చూపు సెయింట్ థెరిస్సా మహిమే నని విశ్వసించేది. ఆనాడు ఆ స్త్రీలు భక్తితో, ఎడిత్ మెడలో వేసిన, శిలువ తాయత్తును ను , ఎడిత్ ఎప్పుడూ ధరించేది. చివరి వరకూ ఎడిత్ మతస్తురాలిగానే ఉన్నది. 

అయితే, ఎడిత్ గడిపిన విశృంఖల జీవితాన్ని ప్రస్తావిస్తూ,ప్యారిస్ ఆర్చ్ బిషప్ ఆమెకు మతపరమైన అంత్యక్రియలు జరపడానికి నిర్ద్వంద్వంగా  నిరాకరించాడు. వేలాది మంది అభిమానులు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ కళాకారులు, గాయకులు, సంగీతజ్ఞులు ,రచయితలు, నటులు, మేధావులు,నాయకులు, ఎడిత్ అంతిమయాత్రలో పాల్గొనగా, ఆమె పార్ధివ శవాన్ని సుప్రసిద్ధ పెర్ -లా-షాయెస్ సెమిటరీలో , అజరామరులైన ఫ్రెంచ్ కళాకారుల వరుసలో ఖననం చేశారు. అదే , అంతిమవాటికలో , పుట్టి రెండేళ్లయినా నిండకుండా, అర్ధాంతరంగా ఆయువుతీరిన , ఎడిత్ ఏకైక కన్నబిడ్డ, మార్సెలెనా, కూడా ఖననం చేయబడింది. 

మొత్తానికి, వస్త్రధారణ,ఉచ్చారణ నుంచి అంతిమయాత్ర వరకూ, స్వయంగా కొరియోగ్రాఫ్ చేసుకొన్న మొట్టమొదటి ఫ్రెంచ్ కళాకారిణిగా ఎడిత్ ను పరిగణిస్తారు.

    కీర్తికీ అపకీర్తికీ మధ్యన, ఒడిదొడుకుల జీవితాన్ని జీవించి, కడకు, కన్నబిడ్డ పక్కకు చేరి సేదదీరింది , నలభైఏడేళ్ళ  ‘ఫ్రెంచ్ మిధ్య ఎడిత్ పియెఫ్. 

***

“నీ జీవితంలో చేసిన ప్రతి పొరపాటుకూ మూల్యం చెల్లించాల్సింది నీవే! ” అన్న మాటలే, ఎడిత్ పియెఫ్ చివరి  మాటలని చెపుతారు.  

       ఎడిత్ పియెఫ్ జీవితం చుట్టూ అల్లుకొన్న కట్టుకథలు  ఆన్నని ఇన్నని చెప్పలేము. ఆమె పుట్టుకే ,ఒక పెద్ద కట్టుకథలా అనిపిస్తుంది వినడానికి.ఆమె ప్యారిస్ మురికివాడలో, నడి వీధి లో ,నడకదారిలో జన్మించినదని అంటారు.  కడుపేదలయిన ఆమె అమ్మానాన్నలు, ఆసుపత్రి ఖర్చులు పెట్టులేనంత దయనీయంగా ఉండేవారని చెప్పకనే చెపుతుంది ఈ సంఘటన. అయితే, ఆమె జననం అదే,ప్రాంతంలోని ఒక సర్వజన ఆసుపత్రిలో రికార్డ్ అయ్యింది. మొక్కుబళ్ళు తీర్థయాత్రలతో కంటిచూపు తిరిగి రావడం కూడా ఆ తరహాదే. 

ప్యారిస్ మురికివాడల్లో  కళ్ళుతెరిచిన ఎడిత్ జోవాన్నా గేసన్ఎడిత్ పియెఫ్ గా ప్రవర్ధమానం అవడం , “ఫ్రెంచ్ జాతీయ సంపద ” అన్న స్థానాన్ని ఫ్రెంచ్ వారి మనస్సుల్లొ పొందడం, “మై ఫేర్ లేడీ” అన్న హాలీవుడ్ చిత్రానికి మూలమైన,    జార్జ్ బెర్నార్డ్ షా పిగ్మిలియన్”  నాటకాన్ని గుర్తుకు తెస్తుంది.

ప్యారిస్ మురికి వాడ లో వీధి గాయనిగా ఏ పూటకు ఆ పూట పొట్టపోసుకొనే, ఎడిత్ ఒకానొక రోజు , తన రోజువారీ వీధిని వదిలి  ,సరిగ్గా అవతలి వైపుకు వెళ్ళి,ఒక వీధి మూలన నిలబడి, గొంతెత్తి పాడసాగింది.కొత్త చోటు . ఎడిత్ సవితి సోదరి (హాఫ్ సిస్టర్) ,మొమోన్ టోపీ పట్టుకొని, డబ్బు సేకరిస్తోంది.ఎప్పటి లాగానే.ఎడిత్ ఆ పూట అనుకొన్నదానికన్నా ఎక్కువ సంపాదించ గలిగింది.

      సరిగ్గా, అప్పుడే ఆమె లూయి లెప్లీ (1883-1936) కంట బడింది. లూయి లెప్లీ ఎడిత్ దగ్గరికి వచ్చి,పలకరించ బోయాడు. కొత్త ప్రాంతం కావడంతో,ఎడిత్ కొత్తమనిషితో మాట్లాడడానికి మొదట సందేహించింది. తన ఆఫీసుకు వచ్చి కలవమని, “చిన్న పాపా” (లా మొమె)” అని బిడ్డను సంబోధిస్తున్నట్లు సంభోదిస్తూ,  చిరునామా ఇచ్చి వెళ్ళాడు.

        లెప్లీ ఒక కేబరే క్లబ్ నిర్వాహకుడు. అక్కడికి అన్నివర్గాల వారు వచ్చే వారు. బెరుకు బెరుకుగా వెళ్ళిన ,ఎడిత్ ను లెప్లీ  బిడ్డలా ఆదరిచాడు. పాడే వేదికను ఎక్కించాడు. అప్పటీ వరకూ, వీధి గాయనిగా ఆమె లో ఉన్న మొరటుతనాన్ని, ముతకతనాన్ని మార్చుకొనేలా చేసాడు, నాలుగు అడుగుల ఎనిమిది అంగుళాలున్న  చిన్న పిచ్చుక లాంటి ఎడిత్ గేసన్ కు, ఒక సభానామం ఇచ్చాడు. ఎడిత్ పియెఫ్ అని. పియెఫ్ అంటే చిన్నిపిచ్చుక అని అర్ధం ఫ్రెంచ్ లో. అలా , మొదటి సారి వీధిచివర మూలలో తారసపడిన ఎడిత్ కు పెంపుడు తండ్రి అయ్యాడు లెప్లీ. ఆమె మాట, పాట, భాష, ప్రదర్షనాశైలి , వస్త్రధారణ, నేపథ్యసంగీతానికి ఒదిగేట్టుగా పాడడం అన్నీ ఒక్కొక్కటిగా  నేర్చుకోసాగింది పియెఫ్.1935 లో లెప్లీ క్యాబెరే క్లబ్ “లె గెర్నీస్” వేదిక మీద పునర్జన్మ పొందింది, ఎడిత్ పియెఫ్ లాగా. 

 లెప్లీనీ పెంపుడు తండ్రి గానే భావించేది ఎడిత్. “నాన్నా” అని నోరారా , మనసారా పిలిచేది. లెప్లీ ,అతని కుటుంబం కూడా ఎడిత్ ను “చిన్న పాపా” అంటూ గారాబం చేసే వారు.

ఎడిత్ పియెఫ్ అనతికాలంలోనే , గాయని గా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎడిత్ ,మెమొన్ లకు ఈ మార్పు బావుంది.ఎడిత్ కు  నిలకడ గల ఆదాయము, ఊహించని పేరు ప్రఖ్యాతులు, కావాల్సినంత మద్యం లభించ సాగాయి. ఒక స్థిరమైన జీవితం లోకి వారు ప్రవేశించారు. అంతటితో కథ సుఖాంతం అవలేదు.

          తన పుట్టిన రోజయిన మరునాడే, స్వంత క్యాబరే క్లబ్ లోనే ,లెప్లీ హత్యకు గురయ్యాడు. ఒక గాయనిగా గౌరవ జీవితానికి పునర్జన్మ నిచ్చిన పెంపుడు తండ్రిగా ఎడిత్  లెప్లీ పై పెంచుకొన్న అభిమానానికి తీవ్ర ఆఘాతం తాకడమే కాక,ఆ హత్యానేరంలో ఎడిత్ పాత్ర ప్రశ్నించబడింది. ఆ గుర్తుతెలియని హంతకులు లోగడ ఎడిత్ ను పలకరిచడమే దీనికి మూలం.ఎడిత్ ఒక్కసారిగా, అపకీర్తి పాలయ్యింది. ఎంతో ఆదరించిన లెప్లీ కుటుంబం  ఎడిత్ ను నేరస్తురాలిగా భావించి నిందించారు. అసహ్యించుకొన్నారు. కఠినమైన పోలీసు విచారణ తరువాత,ఆమెను నిరపరాధిగా నిర్ధారించారు. చుట్టూ అల్లుకొన్న  అపకీర్తి వలన,ఎక్కడా ఉపాధి దొరక లేదు.  

 ఎడిత్ తిరిగి మురికివాడకు చేరుకొంది.అక్కడి  చవకబారు క్లబ్ లలో పాడసాగింది. 

        సరిగ్గా, అప్పుడే ఆమె భావి మార్గదర్శి,సహచరుడు, గేయరచయిత, రేమండ్ ఆస్సె ,ఎడిత్ ను వెతికి పట్టుకొన్నాడు. లెప్లీ క్యాబెరే క్లబ్ లోనే, ఎడిత్ పియెఫ్ పాటను మొదటి సారి రేమండ్ ఆస్సో  విన్నాడు. ఎడిత్ ద్వితీయ ప్రస్తానం అద్వితీయంగా సాగింది. అయితే,లెప్లీ క్యాబరే క్లబ్ వేదిక నుంచి సంగీత సభల వేదిక మీదికి , ఎడిత్ ఎదిగింది. ఆ క్రమం అంత సులభంగా జరగ లేదు. రేమండ్ ఎడిత్ ను కర్కశంగా , నిరంకుశంగా  సాన బెట్టాడు. ఎడిత్ పియెఫ్ కు సంతకం అనదగ్గ వస్త్రశ్రేణి , సాదాసీదా నల్లని గౌను దగ్గర నుంచి,ఆమె ప్రదర్షనా శైలి  వరకూ అంతా , రేమండ్ నిర్ధారించాడు.మొండిగా మొరటుగా ప్రవర్తించే ,ఎడిత్ కు ఈ కఠిన అభ్యాసం పెద్ద సవాలయ్యింది.

రేమండ్ తో వాదోపవాదాలు చేసేది. రేమండ్ కూడ అంత నిర్దయగానే, శిక్షణను ఇచ్చాడు. 

“నువ్వు ఆ పాటలో జీవించడంలేదు. నువ్వు ఆ పాటలోని ప్రేమికవు కావాలి.ఒక నటిలా ఆలోచించు.పాటలో జీవించు.ఒక పాటను మాకివ్వు . జీవం లేని పాట మాకొద్దు ! పాట పాడడం ఒక కళ!” రేమండ్ ఆమె కు ఖరాఖండి గా చెప్పాడు. (లా వి యెనా రోజా ,సినిమా,1:04:40) 

ఎంత అభ్యాసం చేయించినా ఆశించిన రీతిలో ఎడిత్ పాడలేక పోవడంతో,రేమండ్ ఒకసారి గట్టిగా విసుక్కొంటాడు, “అవి శబ్దాలా ? పదాలా? ” 

” నీకేం కావాలి? ,” ఎడిత్ అంతే వేగంలోజవాబిచ్చింది .

“ఖచ్చితమైన వాక్సరళి!, ” రేమండ్ బదులిచ్చాడు.

ఎడిత్ మొండిగా అన్నది,” నేను మాట్లాడినట్లే పాడతాను!” 

రేమండ్ ఖచ్చితంగా అన్నాడు, ” తప్పుగా! నీ మాటలు అస్పష్టంగా పలుకుతావు. నీ మాటలు నీవే అర్ధం చేసుకోవు!”  (లా వి యెనా రోజా ,సినిమా)

ఎడిత్ ,రేమండ్ల సాహచర్యం ,అతను ప్రపంచ యుద్ధానికి వెళ్ళే దాక కొనసాగింది. 

రేమండ్ ఒక గండశిలను వజ్రంలా సాన బెట్టాడు.                                

ఆ ఖచ్చితమైన వాక్సరళి పట్టుబడడం చేతనే , ఎడిత్ ఫ్రెంచ్ వారి ఆత్మను ధ్వనించే గానాన్ని సృష్టించ గలిగింది. రేమండ్ శిక్షణలోనే ,ఎడిత్ చదవడం ,రాయడం నేర్చుకొంది.    తన పాటలను తానే రాసుకొనేది.స్వరపరుచుకొనేది. ఎడిత్ సుమారు 80 కి పైగా పాటలు రాసింది. అనేక పాటలకు స్వరకల్పన చేసింది. ఆమె కు SACE(Society for Authors, Composers and Publishers of Music)  నిబంధనలకు సరిపోయే అర్హతులు లేక పోవడం చేత, చాలా సంధర్భాలలో , స్వరకర్తగా ఎడిత్ అప్రకటితంగానే ఉండవలసివచ్చింది. “లా వి యెనా రోజా ” పాటతో సహా. 

రేమండ్ ఎడిత్ కు ‘ఫ్రెంచ్ ఛాసోన్ రియలిస్ట్ ‘ను పరిచయం చేసాడు. ఎడిత్ ఛాసోన్ గీతానికి ప్రత్యాన్మాయంగా రూపొందింది.  ఫ్రెంచ్ ఛాన్ ట్యూస్ గా చరిత్ర సృష్టించింది.  

    ఎడిత్ పాటలో ఫ్రెంచ్ ఆత్మను ప్రతిధ్వనిస్తుందంటే, అందుకు ముఖ్యంగా  ఆమె అనుసరించిన సాహితీ ప్రక్రియే మూలం. అప్పటి పాప్ ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న ‘ఇంగ్లీషు శైలి’ని కాక, ఆమె ‘ఫ్రెంచ్ ఛాసోన్ రియలిస్ట్ ‘ (వాస్తవ ‘ఫ్రెంచ్ సోలో’ గీతం ) శైలిలో , ఫ్రెంచ్ భాషలోని లయాత్మకతని తన స్వరంగా మలుచుకొంది. మాతృభాషలోని మాధుర్యాన్ని, సహజ భావ సౌందర్యాన్ని ఫ్రెంచ్ భాషలోని అంతర్లీన ధ్వనిని రంగరించి, స్వర రచనకు శృతి చేసుకొంది. 

ఛాన్ ట్యూస్ (chanteuse) అన్నమాటకు ఫ్రెంచ్ లో రెండు అర్థాలు ఉన్నాయి. గాయని, పాటాడే పిట్ట అని. ఎడిత్ పియెఫ్ పాటాడే పిట్టమ్మ .ఆ గుప్పెడంత  మనిషి గొంతులోనుంచి ,” పడాం …పడాం” అంటూ గుండెల్ని తట్టిలేపే ‘సముద్రఘోష లాంటి  గంభీరమైన పాటలు వినబడడం , పిట్టకొంచం కూత ఘనం అన్న నానుడికి నిజరూపం. ఎడిత్ పియెఫ్ ఒక సజీవ సాక్ష్యం          .                  

***

         ఫ్రెంచ్ వారి ఆదరాభిమానాలను ఎంతగా చూరగొన్నా, ఎన్ని మిలియన్ రికార్డ్ లు అమ్మిన  పాటలు పాడినా, యుద్ధానంతరం  ఎడిత్ తీవ్ర  నిరసనకు, తిరస్కారానికి,అపకీర్తికి గురయ్యింది. ఎడిత్ పాటలను ,ఎడిత్ ను  ఫ్రాన్స్ నుంచి బహిష్కరించాలి అనేంతగా. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, శత్రుకూటమితో ఎడిత్ మైత్రి ప్రశ్నించబడింది. అటు ప్రభుత్వం నుంచి ఇటు ప్రజల నుంచి. ఫ్రెంచ్ చరిత్రలో  యుద్ధకాలం నాటి ఎడిత్ ప్రవర్తన ఒక తుడిచివేయాల్సిన మచ్చలా భావించ బడింది. 

అందుకు మూలం, యుద్ధకాలంలో ,ఎడిత్ తన ప్రదర్షనలను నాజీస్థావరాల్లో,కాన్సెంట్రేషన్ క్యాంపులలో ,ఫ్రెంచ్ యుద్ధఖైదీల కారాగారాల్లో ఇవ్వడమే కాక, జర్మనీ లో ప్రదర్షనా పర్యటనలు చేయడం, తీవ్ర విమర్షలకు గురయ్యింది. 

                 నిజానికి , ఎడిత్ కున్న అపారమైన కీర్తిప్రతిష్టలకు మచ్చ పడుతుందేమోనని, ఆమె యుద్ధకాల జీవితాన్ని ప్రస్తావన కూడా చేయకుండానే  ,ఆమె జీవిత గాథ ను సినిమాగా మలిచి, ఆస్కార్ బహుమతులు గెలుచుకొన్న ఫ్రెంచ్ సినిమా లా వి యెనా రోజా (2007)లాగా , ఆమె యుద్ధకాల జీవితాన్ని ప్రస్తావించ కుండా దాటవేయక్కరలేదు. అలాగని, ఒక పురాణగాథలా ఆమె  జీవితాన్ని అతిగా పొగడవలసినదీ ఏమీ లేదు. 

              యుద్ధకాలం నాటి ఎందరో కళాకారుల్లా ,ఎడిత్ కూడా తన వృత్తిని నిలబెట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆనాటి సంక్లిష్ట రాజకీయ ధోరణుల పట్ల ద్వైదీ భావనతో, ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. నాజీ దురాక్రమణపై జరిగిన  రహస్య తిరుగుబాటు ఉద్యమాలతో, స్వేచ్చావాదనలతో సంబంధాలు కొనసాగించింది.

            సరిగ్గా ,9 మే 1940,ఫ్రెంచ్ ప్రభుత్వం ప్యారిస్ ను నాజీ సేనలకు అప్పజెప్పడానికి నాలుగు రోజుల ముందు, రెడ్ క్రాస్ సానుకూల ప్రదర్షనలు ఇస్తోన్న మారిష్  వాలిర్  తదితర కళాకారులతో కలిసి, టౌటాస్ ప్రదర్షనా యాత్రకు బయలు దేరింది.  యుద్ధ ఒప్పందాలు జరిగి, ప్యారిస్ నాజీలకు అప్పగించ బడి, ప్యారిస్ లో ప్రశాంతత నెలకొనగానే, ప్యారిస్ కు తిరిగి వచ్చింది. నాజీ నియంతృత్వ పాలనలో, ఆక్రమిత ప్యారిస్ లో, అంతకు మునుపు ఉన్నట్లుగానే యథాతథాస్థితిని కొనసాగించారు. జర్మన్ ప్రచార విభాగంలో రిజిస్టరు చేసుకొని, ఆమె పాటల ప్రతులను వారికి సమర్పించి, అనుమతులు పొందాల్సివచ్చేది. 

             జర్మన్లకు ఎడిత్ పాటలు నచ్చాయి. వారు ఎంతగా ఎడిత్ పాటలను అభిమానించారంటే, ఆమె నియతృత్వ వ్యతిరేక స్వతంత్రభావాలను ప్రకటించిన పాటల ప్రదర్షనను కూడా చూసీ చూడనట్లు వూరుకొన్నారు. 1940 లో, ఎడిత్ రచించి పాడిన ,” నా బాల్యస్నేహితులు ఏరీ? ” అన్న పాట యుద్ధానికి వెళ్ళి తిరిగి  రాని తన స్నేహితుల గురించిన పాట. ఆక్రమిత ప్యారిస్ లో ఒక వేదికపై ఈ పాట పాడుతూ , ఫ్రెంచ్ జాతీయ పతాకాన్ని తనపై అలంకరించుకొంది. తిరిగి, 1961లో ఆమె అంతిమయాత్రలో,ఫ్రెంచ్ ప్రభుత్వ సత్కారాలతో ఫ్రెంచ్ పతాకాన్ని ఆమె పార్ధీవ శరీరంపై  అలంకరించి, ఫ్రెంచ్ ప్రభుత్వం తమ గౌరవాన్ని ప్రకటించారు. 

ఆత్మహత్యా సదృశ్యమైన ఆ జాతీయ భావ స్వేచ్చాప్రకటన , చిన్నారి పిచ్చుకమ్మ ఇనుప గుండెకే చెల్లు.

 ” నేనీ పని చేయలేనా? అయితే, నేను ఎడిత్ పియెఫ్ ను అవ్వడంలో అర్థం  ఏముంది ?” అన్న ధీమాను ప్రకటించిన ఆమె ధైర్యానికి ఫ్రెంచ్ ప్రజలే కాదు, మనమూ ముగ్దులం అవ్వవలసిందే. 

     1936 లో ఎడిత్ పాడిన ,” హిట్లర్ ను సహించలేను నేను ! / నాజీలు మరిచి పోయారా  /మొదటి ప్రపంచ యుద్ధంలో /వారిని తరిమి తరిమి కొట్టింది / మనమే ననీ!”అన్న  పాటను రేడియో ప్రజెంటర్ ఒకరు, నాజీ నియంత్రణ  కాలంలో  పొరపాటున ప్రసారం చేసారు. అది ఎడిత్ ప్రాణాన్ని పణంగా పెట్టిన పొరపాటు.

    జార్గె లాకోం సినిమా , “మౌంట్ మార్టే ఆన్ ది రివర్ సియాన్ “కు జాజ్ స్వరకల్పన చేసింది ఎడిత్. అయితే , ఈ సినిమా, 1946 వరకూ విడుదలకు నోచుకోలేదు. 

     ఈ  సంధర్భాలలో, నాజీ ప్రభుత్వం పియెఫ్ ను  నిర్భందించకుండా వదిలివేసింది.   నాజీలలో ఆమె పాటకున్న అపార అభిమానమే ,ఆమె పట్ల చూసీ చూడనట్లు పోవడానికి కారణం.  

 సరిగ్గా యుద్ధం మొదలవ్వడానికి ముందు, యూదు సంగీత కారుడు, మైఖేల్  ఎమార్ తో ఎడిత్ కు వృత్తి పరమైన ఒడంబడిక కుదిరింది. అతని పాట “ది అకార్డియన్ ప్లేయర్ “ఎడిత్ ప్రముఖ గీతాల్లో ఒకటి. మైఖేల్ ఎమార్ ని అజ్ఞాత జీవితంలోకి పంపడానికి, అతను సురక్షితంగా ఉండడానికి ,ఎడిత్ సహాయపడింది. అలాగే, పియానో వాయిద్యకారుడు, నోబర్ట్ గ్లాంజ్ బర్గ్ ను తప్పించడంలో ఆమె ప్రధాన పాత్ర వహించింది.    యుద్ధసమయంలో, మేడం బిల్లీ  వేశ్యా గృహం  పై అంతస్తులో ఎడిత్ నివసించేది.మేడం బిల్లీ గృహానికి ఎందరో నాజీ అధికారులు వచ్చే వారు. మేడం బిల్లీ సెక్రటరీ, ఆండీ బిగార్డ్ తిరుగుబాటు దారు.స్వేచ్చావాది. ఎడిత్ అభిమానులకు ఉత్తరాలు రాసి పెడుతున్నాననే నెపంతో, ఆమె ఇంటి నుంచే తిరుగుబాటుదార్లకు సమాచారం చేరవేసే వాడు.

జర్మన్లలో, నాజీలలో ఎడిత్ కు అభిమానులు ఉండడం తో, జర్మన్ ఆక్రమిత ఫ్రాన్స్ లోనూ, బెర్లిన్ తదితర ప్రాంతాలలోనూ ప్రదర్షనల ఆహ్వానాలు పొందింది. ఆండీ బిగార్డ్ ఆమెతో పాటూ ప్రయాణించే వాడు. ఈ ప్రదర్షనలే యుద్ధాంతరం ఎడిత్ ను తీవ్ర వివాదంలో పడేసాయి. 

అవే, ఎడిత్ కు అఖండఖ్యాతినీ తెచ్చి పెట్టాయి.  

యుద్ధాంతరం ప్రభుత్వ విచారణ లో , ఎడిత్ పియెఫ్ తన సుప్రసిద్ధ 118 సంఖ్యను మొదటి సారి ప్రకటించింది.118 మంది ఫ్రెంచ్ యుద్ధఖైదీలను, ఎడిత్ ఎంత నాటకీయంగా నాజీ నిర్బంధంలో నుంచి  తప్పించిందో లోకవిదితమయ్యింది.

యుద్ధ కాలంలో నాజీల పర్యవేక్షణలో ఎడిత్ చేసిన పర్యటనలలో ప్రతి ప్రదర్షన తరువాత, ఆ ప్రదర్షనకు గుర్తుగా,అక్కడి యుద్ధఖైదీలతో ఒక గ్రూప్ ఫోటో తీసుకొంటానని నాజీ అధికారులను కోరింది ఎడిత్. తిరిగి ప్యారిస్ వచ్చాక,ఆ గ్రూప్ ఫోటోలలోని వ్యక్తుల ఫోటోలతో మారు పాస్ పోర్ట్ లు తయారు చేసే వారు. ఎడిత్ వెళ్ళిన చో టి కే మళ్ళీ వెళ్ళేది. అప్పుడు, ఎడిత్ ఆటోగ్రాఫ్ చేసే నెపంతో,రహస్యంగా ఫ్రెంచ్ ఖైదీలకు  మారు పాస్ పోర్ట్,తప్పించుకోవడానికి ప్రణాళిక, మ్యాప్,దారిని చూపే కంపాస్,అవసరార్ధం కొంత డబ్బులను అందించే వారు. అలా, తప్పించిన వారిసంఖ్యే 118. జర్మన్లలో,నాజీలలో తనకున్న ప్రాచుర్యాన్ని ఎడిత్ ఇలా వినియోగించిందని అంటారు. 

   ఆండీ బిగార్డ్ ఆమెతో పాటు ఆ అభేధ్య ప్రాంతాలకు వెళ్ళేవాడు. అలా తిరుగుబాటు దారుల కరపత్రాలను,సందేశాలను నిషేదిత ప్రాంతాలలోకి చేరవేయగలిగారు. ఆండీ బిగార్డ్ తో పాటు, ఆ క్రమంలో తప్పించుకొన్న సుమారు 20 మంది స్వయంగా వచ్చి, ప్రభుత్వ విచారణలో ఎడిత్ మాటలకు మద్దతు నిచ్చారు. ఎడిత్ తీవ్ర అపవాదుల నుంచి తేరుకొంది. మరోసారి, ఫ్రెంచ్ వారి హృదయాలను దోచుకొంది.

         ఫ్రెంచ్ సైనిక బృందం “ఫ్రెంచ్ ఫారిన్ లీజెన్  కి అంకితమిచ్చిన  పాట 

లేదు, లేనే లేదు./ లేదు, నేను దేనికీ పశ్చాత్తాప పడేది లేదు/ ” , యుద్ధానంతర  పునర్నిర్మాణంలో ప్రేరణా గీతం అయ్యింది.మళ్లీ నేను శూన్యం వద్ద మొదలుపెడతాను.”  అంటూ .(ఇంగ్లీషు పాఠాంతరం )

***

గానం : ఎడిత్ పియెఫ్  (1960)

రచన:  మైఖైల్ వాకైర్ ( 1956 )  సంగీత స్వరకర్త: ఛార్ల్ డ్యుమాంట్

తెలుగు సేత : చంద్ర లత

“లేదు, లేనే లేదు.

లేదు, నేను దేనికీ పశ్చాత్తాప పడేది లేదు. 

జరిగిపోయిన పొరపాట్లన్నీ

నేను బలంగా ఉండడం ఎలాగో నేర్పాయి.

లేదు, లేనే లేదు.

లేదు, నేను దేనికీ పశ్చాత్తాప పడేది లేదు. 

ఆ విషాదం మిగల లేదు.

అది కరిగిపోయింది.

నా జ్ఞాపకాలన్నీ

ఇక నాకు అక్కరలేదు.

మంచీచెడు రెండూ 

నిప్పుల్లో పడేసాను.

లేదు, లేనే లేదు.

లేదు, నేను దేనికీ పశ్చాత్తాప పడేది లేదు. 

జరిగిపోయిన పొరపాట్లన్నీ

నేను బలంగా ఉండడం ఎలాగో నేర్పాయి.

నా గుండెలోతుల్లో ఓ భావన మెదులోంది.

ఒక చిన్న విత్తనం నాటుకొంది.

ఇది చాలా కొత్తది

నాకు తెలిసినది కాదు. 

ఆ కొత్త విత్తనం 

నీ పై నాకు పెరుగుతోన్న ప్రేమభావన “

***

ప్రపంచానికి లా వి యెనా రోజా వంటి గొప్ప ప్రేమ గీతాన్ని అందించిన ఎడిత్, జీవితమంతా ప్రేమ కోసం పరితపించింది.  తాగుబోతు  తండ్రి, మత్తుమందుల బానిసయిన తల్లి, అమ్మమ్మ  నిరాదరణల మధ్య , నార్మండీ స్త్రీలు పంచిన ప్రేమ లాంటి నిష్కపటమైన ప్రేమను  పొందడానికి జీవితమంతా వెతుకులాడింది.

 లేవు .పశ్చాతాపాలేమీ లేవు అని అన్నప్పటికీ, ” నేను ఎవరికీ పిల్లల కథలు (ఫెయిరీ టేల్స్) చదవ లేదు “అని అంటుంది ఒక సంధర్భంలో. 

ఎంతగానో ప్రేమించిన ఫ్రెంచ్ బాక్సర్  మార్సెల్  సెర్డాన్ ఆకస్మిక మరణం ఆమెను కుంగదీసింది. మత్తుపదార్థాలకు,తాగుడుకు బానిస అయ్యింది.ఏ సహచర్యం ఆమెకు స్వాంతన ఇవ్వలేక పోయింది. అనేక సహచర్యాలు ,రెండు వివాహాలు, ప్రాణాపాయ రోడ్ యాక్సిడెంట్ల మధ్య, ఎడిత్ మళ్ళీ మళ్ళీ జన్మించింది. చివరికి, లివర్ క్యాన్సర్ ఆమెను 47 వ ఏటనే కబళించింది.  

ఆమె విశృంఖల జీవితాన్ని ప్రస్తావించి, ఎడిత్ మతస్తురాయినా, మత పెద్ద ఆమెకు అంతిమ సంస్కారాలు చేయడానికి నిరాకరించాడు.  అందుకే, ఆమె ఆఖరిమాటలకు అంత ప్రాధాన్యత ఉన్నది. ప్రతి పదంలోనూ ఆమె జీవితం ఉన్నది.  

 నవతరానికి ఇచ్చే సందేశమేమిటంటే అంటుంది, ” ప్రేమ, ప్రేమ, మరింత ప్రేమ ”  

 ***

“ఏ పేరుతో పిలిస్తేనేం, గులాబీ గులాబీ కాకుండా పోతుందా?” అన్నాడు షేక్స్ పియర్.

 విరిసిన గులాబీ ని ప్రేమ భావన కు ప్రతీకగా భావిస్తారు పాశ్చ్యాత్యులు. ఆ దరిమిలా,వారి నుంచి ఆ ప్రతీకను అంది పుచ్చుకొన్న మనమూ.

గులాబీ అందచందాలతో పాటు,ఆహ్లాదమైన పరిమళాలద్దే మధురభావాలగని. గులాబీ వన్నెను స్రీత్వానికి ప్రతీకగా భావించడం కద్దు. 

ఎడిత్ పియెఫ్ గులాబీవన్నె ను  ఏ అరమరికలు, భేషజాలు నిబంధనలూ ఎరుగని, సహజమైన మానవప్రేమకు  ప్రతీక గా వాడింది. సానుకూల భావనకు సూచిక గా మలుచుకొంది ఈ గులాబీ వన్నెను. “లా వి ఎనా రోజా” అన్న పదబంధం, జీవితం పట్ల ప్రేమను, గాఢానురక్తినీ ప్రభావితం చేసే నానుడిగా మారింది.  ” ప్రేమంటే? ఏదో పాటల్లో పాడుకొనే పదం కాదు. ప్రేమ ఒక సత్యం. ఒక వాస్తవం. ఒక నిజం.” అంటూంది పాటాడే చిన్నారి పిచ్చుకమ్మ , ఎడిత్ పియెఫ్.

ఫ్రెంచ్ వారి ఆశా గీతమై (The Anthem of Hope ),   ఫ్రెంచ్ వారి తరతరాల వారసత్వ సంపదగా మారింది. 

 ఈ పాటకు ఎందుకింత ఆదరణ? స్వతహాగా ఫ్రెంచ్ వారు ప్రేమస్వరూపులు అని ఎలుగెత్తి చాటి చెప్పినందుకా? 

యుద్ధం మిగిల్చిన శకలాలలో పగిలిన గుండెలను కూడదీసుకొని ముందుకు సాగడానికి ఇంధనమైన సానుకూల దృక్పథాన్ని , ముక్కలయిన మానవ విలువలను పునర్నిర్మించుకోవడానికి మూలాధారమైన  మానవప్రేమను, జీవితం పట్ల గాఢానురక్తినీ, జీవన కాంక్ష ను, చిగురింపచేస్తుంది, ఈ పాట, ‘లా వి యెనా రోజా !’

                                 

లా వి యెనా రోజా ! 

చూడలా గులాబిలా!

ఫ్రెంచ్ పాఠాంతరం ( French Version)

రచన, గానం ,అప్రకటిత సంగీత స్వరకర్త :  ఎడిత్ పియెఫ్.(1945)

 సంగీత స్వరకర్త: లూయీ గై ,  మార్గరిట్ మాన్నాట్ (మెలోడీ)

.తెలుగు సేత : చంద్ర లత

“నా కనులను వాల్చేసే ఆ తదేకమైన చూపు

అతని పెదవుల మీద  కరిగిపోయే ఆ నవ్వు,

అదీ దిద్దుళ్ళు  ఎరుగని చిత్తరువు లాంటి వ్యక్తి. 

నన్ను పొందిన వ్యక్తి.

అతను నన్ను తన బాహువుల్లోకి తీసుకొన్నప్పుడు,

నాతో మృదువుగా మాట్లాడుతున్నప్పుడు,

నేను జీవితాన్ని గులాబీ అద్దాల్లోంచి చూస్తాను.

అతను నాతో ప్రేమముచ్చట్లు చెపుతాడు.

అవి రోజువారీ మామూలు మాటలు.

అయినా, అవి నాలో ఏదో చేస్తాయి.

అతను నా గుండె లోకి అడుగుపెట్టాడు

కొంచెం సంతోషం.

అదెందుకో నాకు తెలుసు…

నాకోసమే అతను, అతనికోసమే నేను,

మా జీవితం కోసం మేము .

అతనిని గమనించగానే,

నాలో కలిగే స్పందన తెలుసు.

నాకోసమే అతను, అతనికోసమే నేను,

మా జీవితం కోసం మేము .

అతనిని గమనించగానే,

నాలో కలిగే స్పందన తెలుసు

నా గుండె లయ తప్పుతుంది  

ఎడతెగని రాత్రులు 

గొప్ప ఆనందాన్ని తెస్తాయి.  

నా గుండె లయ తప్పుతుంది.

చికాకులు అన్నీ కరిగిపోతాయి.

ఆనందం, 

నేనిక ఊపిరి వదలొచ్చునన్నంత ఆనందం.

అతను తన బాహువుల్లోకి నన్ను తీసుకొని

నాతో  మృదువుగా మాట్లాడినప్పుడు,

నేను జీవితాన్ని గులాబీవన్నె అద్దాల్లోంచి చూస్తాను.

అవి రోజువారీ మామూలు మాటలు

అవే నాలో ఏదో అలజడి రేపుతాయి. 

అతను నా హృదయంలోకి ప్రవేశించాడు.

ఓ చిన్న సంతోషం, 

అదెందుకో నాకు తెలుసు,

అతను నా కోసం. 

నేను అతని కోసం. 

జీవితం కోసం

అతను నాతో చెప్పాడు, 

అతను నాతో ఒట్టేసాడు,

జీవితం కోసం.

అతనిని చూసీచూడగానే,

నా గుండెలో ప్రకంపనాలు మొదలవుతాయి.

లాలలల, లాలలల

ల, ల, ల, ల ”                       

***

English Version /    ఇంగ్లీషు పాఠాంతరం

రచన, గానం ,అప్రకటిత స్వరకర్త :  ఎడిత్ పియెఫ్. (1945) 

సహ రచయిత : డేవిడ్ మాక్

 సంగీత స్వరకర్త: లూయి గై 

.తెలుగు సేత : చంద్ర లత

“నన్ను దగ్గరగా తీసుకో.

నన్ను పొదివి పట్టుకో.

నీవు వేసే మంత్రమేమిటో…

ఇక, జీవితాన్ని గులాబివన్నెలో చూస్తాను.

నీవు నన్ను ముద్దాడినప్పుడు,

స్వర్గమే మురిసిపోతుంది.  

నేను పరవశనై, నా కనులు సోలినప్పటికీ,.

ఆ మూసిన కనురెప్పల మాటున, 

ఇక, జీవితాన్ని గులాబీవన్నెలో చూస్తాను. 

నన్ను నీ గుండెకు హత్తుకొన్నప్పుడు

నేను మరో లోకంలోకి అడుగుపెడతాను,

ఆ లోకంలో గులాబీలు వికసిస్తాయి.

ఇక ,నీవు మాట్లాడినపుడు,

పై నుంచి గంధర్వులు పాడుతారు

మామూలు మాటలు

ప్రేమగీతాలయిపోతాయి.

నీ హృదయాన్ని, నీ ఆత్మనూ నాకివ్వు

ఇక, జీవితమంతా గులాబీవన్నె అద్దుకొంటుంది. 

ప్రేమ అంటే కేవలం ఒక పదం అనుకొన్నా,

పాటల్లో పాడతారే అలాంటిదని.

వింటున్నా,నీ ముద్దులతో అది వ్యక్తపరిచావని 

నేను తప్పని తెలిసిపోయింది .

ప్రేమ ఒక సత్యం.

నన్ను దగ్గరగా తీసుకో .

నన్ను పొదివి పట్టుకో.

నీవు వేసే మంత్రమేమిటో..

ఈ జీవితాన్ని గులాబీవన్నె అద్దాలతో చూస్తున్నా.”

*****

References :

1.French Original :Edit Piaf ,la vie en Rose

https://www.youtube.com/watch?v=rzeLynj1GYM

https://www.youtube.com/watch?v=zWQY4soZycU 

(1948)

  1. French Original:  Edith Piaf No regrets

https://www.youtube.com/watch?v=fpHAsb2XQOY

3.Padam padam

https://www.youtube.com/watch?v=OjY9IDlhFUk

  1.   French Version

 http://www.frenchlyricstranslations.com/la-vie-en-rose-edith-piaf-french-lyrics-and-english-translation/

  1. English Version :

 https://www.musixmatch.com/lyrics/artist-971/La-Vie-en-rose-english-version

Writer(s): Louiguy, Edith Piaf, David Mack

  1. No, No regrets, (Non je ne regrette rien ) Edith Piaf, 1960

                     http://lyricstranslate.com/en/Je-Ne-Regrette-Rien-Je-Ne-Regrette-Rien.html#ixzz545cTi2vr

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.