యశోబుద్ధ
–సి.బి.రావు
కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వ్రాసిన, ఈ కాల్పనిక కథను నవలగా మలిచారు రచయిత్రి ఓల్గా. 2500 సంవత్సారాల క్రితం జరిగిన కథకు సరైన ఆధారాలు లభించటం దుర్లభమే. అయినా రచయిత్రి ఊహించి వ్రాసిన యశోధర పాఠకులను ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది.
కపిలవస్తు, కౌలీయ గ్రామాల మధ్యనున్న దేవాలయం లో సిద్ధార్థుని యశోధర యాదృచ్ఛికంగా చూడటం జరిగి, తొలిచూపులోనే ఆకర్షితురాలవుతుంది. అతని ప్రవర అడిగి, తన ప్రవర చెప్తుంది. యశోధర రూపం గౌతముడి మదిలో చెరగని రూపులా నిలిచి, అతన్ని నిద్రపోనివ్వదు. అతని పెంపుడు తల్లి మహా ప్రజాపతి గౌతమి, సిద్ధార్థుని లో మార్పు గమనించి, కారణం తెలుసుకొని, ఆనందభరితమౌతుంది. శుద్ధోధనుడికి సిద్ధార్థ మనస్థితిని తెలుపుతుంది.
శుద్ధోధనుడు కౌలీయ గ్రామ భూస్వామి ఐన బింబాసనుడి వద్దకు వార్తాహరుడిని పంపి, గౌతమి, తాను యశోధర ను చూడటానికై వెళ్తారు. వీరికి మంచి అతిధి మర్యాదలు జరుగుతవి కాని సిద్ధార్థ ను అల్లుడిగా చేసుకోవటానికి షరతు పెడ్తాడు బింబాసనుడు. సిద్ధార్హుడు యుద్ధం జరిగితే తన కుటుంబాన్ని, రాజ్యాన్ని రక్షించుకోవలసిన అవసరముంది కనుక తను పెట్టే యోధ పరీక్షలో నెగ్గాక మాత్రమే యశోధరతో వివాహం అని చెప్తాడు.
అయితే యుద్ధం లో గెలిచి యశోధర ను బహుమతిగా పొందటం సిద్ధార్థ కు, యశోధరకు రుచించదు. తాను వస్తువును కానని ఈ పోటీ తనకిష్టం లేదని తండ్రితో చెప్తుంది యశోధర. తనకు ఎదురు చెప్పి నందుకు బింబాసనుడు నివ్వెరపోయినా చేసేది లేక, పోటీ లేకుండానే వివాహానికి అంగీకరిస్తాడు. ఆ రోజు సాయంత్రం యశోధర దేవాలయం ముంగిట సిద్ధార్థుని కలుస్తుంది. సిద్ధార్థుడంటాడు ఆమెతో ” కూర్చో. నా గురించి నీకు చెప్పాలి. మానవుని వేదనలకు, రోగాలకు ఇంకా అసంతృప్తి కి కారణం అంతుబట్టటం లేదు. నన్ను నేను తెలుసుకోవాలనే జిజ్ఞాస లో ఉన్నాను. ఈ అన్వేషణలో వివాహమయ్యాక నేను నిన్ను విడువవచ్చేమో.” బదులుగా యశోధర అంటుంది. “ఈ అన్వేషణ నాలోను ఉంది. కాని స్త్రీ అవటం వలన నాకు కొన్ని పరిధులున్నాయి. మీ జ్ఞాన సముపార్జనకు నేను ఎన్నడూ అవరోధం కాబోను.” కొద్దిరోజుల తర్వాత బంధు మిత్రుల సమక్షం లో వారి వివాహం వైభవంగా జరుగుతుంది.
సిద్ధార్థ, యశోధరల మధ్య ఉన్న చక్కటి అవగాహన వలన వారి వివాహ జీవితం అన్యోన్యంగా సాగి, రాహుల్ కు జన్మనిస్తుంది యశోధర. అయితే సిద్ధార్థుని మనసులోని అంతులేని జిజ్ఞాస అతనికి అశాంతిని కలుగచేస్తుంది. యశోధర సిద్ధార్థునితో అంటుంది “మీ వేదన అర్థవంతమైనది. సమస్త మానవాళికి హితం ఒనగూరే మీ తపస్సుకై బయలుదేరండి. వెళ్లే సమయాన నాకు చెప్పవలసిన అవసరం లేదు.” రాహుల్ 7 రోజుల బిడ్డగా ఉన్న రోజున, తలీ బిడ్డలు నిద్రించే సమయాన గౌతముడు భార్య, కొడుకులను, సామ్రాజ్య వైభోగాలను విడిచి మహానిష్క్రమణం చేస్తాడు.
సిద్ధార్థుడు మానవుని బాధలకు కారణం తెలుసుకునే జిజ్ఞాసలో, ఇద్దరు మునులవద్దకు వెళ్లి శిష్యరికం చేస్తాడు; కాని వారి సమాధానాలు రుచించక, బుద్ధగయ వెళ్లి తపస్సు చేసి జ్ఞానోదయం పొందుతాడు. పలు చోట్ల తన సిద్ధాంతాల గురించి ఉపన్యసించి, ప్రజలకు జ్ఞానసముపార్జన చేస్తాడు. సిద్ధార్థుడు బుద్దుడవుతాడు. పలువురు శిష్యపరంపరతో గ్రామాలలో పర్యటన చేస్తున్న సమయంలో కపిలవస్తు నుంచి వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్తాడు. మహాప్రజాపతి తనను కూడా బుద్ధుని శిష్యురాలుగా చేసుకోమన్న కోరికను అంగీకరించడు. తరువాత కాలంలో, స్త్రీలకు ప్రవేశం ఇవ్వాలా, వద్దా అన్న విషయంలో బుద్ధుడు మధనపడి స్త్రీలు కూడా బుద్ధిజీవులు కనుక, వారి జ్ఞానార్జనకు ఆధ్యాత్మిక చింతన అవసరమని తన శిష్యులతో చెప్తాడు. యశోధర కూడా బౌద్ధమతాన్ని స్వీకరించి, శిక్షణ పొంది ఉన్నత పదవికి అర్హత సంపాదిస్తుంది. ఒక గ్రామంలో మహమ్మారికి గురైన ప్రజలకు సేవ చేస్తూ తన 78 వ సంవత్సరంలో చనిపోతుంది. ఆ తరువాత రెండేళ్లకు, గౌతమ బుద్ధుడి నిర్యాణం జరుగుతుంది.
ఈ పుస్తకంలో యశోధర పాత్ర చిత్రణ చాలా హృద్యంగా ఉంది. సిద్ధార్థుడికి ఆమెకు మధ్య జరిగే సంభాషణలు ఆమె మేధోతనాన్ని తెలియచేస్తాయి. యశోధర పుస్తకం లోని భాష కూడా ఎంతో దీప్తివంతంగా ఉంది. మచ్చుకు ఒక ఉదాహరణ ఇస్తాను.
” సిద్ధార్థుడి మనసు కొంత స్థిమిత పడింది. అక్కడి నుంచి తోటలోకి వెళ్లి మరింతగా మనసుని శాంతింపచేసుకొన్నాడు. ఎందుకో, అతనికి అంతా చక్కపడే రోజు దగ్గరలో ఉన్నట్లనిపించింది. తల ఎత్తి ఆకాశం వైపు చూసాడు. నక్షత్ర మండలం దేదీప్యమానంగా ఉంది. విశ్వాంతరాళ రహస్యాలకు దారి చూపే దీపాల వలే తారలు గోచరిస్తున్నాయి. ఈ సృష్టి ఎంత అద్భుతం! అనుకున్నాడు సిద్ధార్థుడు. . క్రమం తప్పని సూర్యోదయ, అస్తమాన విన్యాసాలు, కాల నియమంతో పూచే పువ్వులు, కాచే కాయలు, పండే పంటలు, వీచే గాలులు, కురిసే వానలు, ఇదంతా ఒక మహా గమనం. ఆగని, విసుగులేని విరామం లేని విశ్వ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో మానవుడు అల్పజీవియా? లేక మానవుని కోసమే ఇదంతా జరుగుతున్నదా? ఆద్యంతాల లీల మానవుని మేధస్సుకి ఎన్నడైనా బోధపడుతుందా? ఇంత విశ్వ సౌందర్యానికి దూరంగా అంధులై, అతిహీనమైన, అల్పమైన విషయాలకు దుఃఖంలో మునుగుతున్నారెందుకు? ఆ దుఃఖం ఈ విశ్వంలో భాగమా? మానవులు కల్పించుకున్నదా? సృష్టి రహస్యాల శోధనలో ఎంతో రాత్రి గడిచిపోయింది. వేకువ రేకలేక్కడో దిగంతాల కావల నిద్రలేచి, ఒళ్లు విరుచుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి.”
యశోధర పుస్తకం చదవటం పూర్తిచేసాక, అందులోని ఆలోచనలు, సిద్ధాంతాలు, యశోధర, సిద్ధార్థుని మధ్య జరిగిన చర్చలు, మనలను వెంటాడుతాయి, ఆలోచింపచేస్తాయి.
*****
సి.బి.రావు విశ్రాంత స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా అధికారి. హైదరాబాదు నివాసం. పక్షులన్నా, పర్యాటకమన్నా చాల ఇష్టం. ఛాయాగ్రహణం వీరి అభిరుచి. పలు వెబ్ సైట్ల లో పుస్తక సమీక్షలు చేసారు. దీప్తిధార బ్లాగులో పర్యాటక వ్యాసాలు ప్రచురించారు. వీరి మరో బ్లాగు పారదర్శి లో భిన్న అంశాల పై వ్యాసాలు వెలువరించారు.