యాత్రా గీతం
(మెక్సికో-కాన్ కూన్)
-డా||కె.గీత
భాగం-1
ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా! ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో ఉన్న కానుకూన్ వెళ్లి రావాలని అనుకున్నాం. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా నుంచి మెక్సికో తూర్పు తీరానికి ప్రయాణం అంటే విమానాల్లో దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం. అంతే కాదు, కాలమానంలో మూడు గంటలు ముందుకి వెళ్తాం.
ఈ ప్రయాణం దాదాపు రెండు మూడు సార్లు అనుకునీ వాయిదా వేసాం. ఇక మొన్న నవంబరులో థాంక్స్ గివింగ్ సెలవులకి పదిరోజుల ముందు ఉద్యోగాలతో బాగా అలిసిపోతున్న మాకు ఆటవిడుపుగా ఈ ప్రయాణానికి వెళ్లొద్దామని తలపు కలిగింది. అనుకున్నదే తడవుగా ముందులాగే కాస్ట్ కో వెకేషన్ పాకేజీ బుక్ చేసుకున్నాం. సముద్ర తీర ప్రాంతమైన కాన్ కూన్ కి ఆగస్టు నుంచి నవంబరు వరకు వర్షాలు పడే కాలం కాబట్టి అన్ సీజన్ వల్ల ప్రయాణం కాస్త చవకలో అవుతుందనేది మరొక కారణం.
కాస్ట్ కో పాకేజీ టూరు బుక్ చేసుకునే ముందు విడిగా ఫ్లయిట్లు, హోటళ్ల ఖరీదులు వేరే సైట్లలో చూసి ఇదే అన్నిటికన్నా ఉత్తమమైనదని ఖరారు చేసుకున్నాం.
మా పాకేజీ విడిగా ఫ్లయిట్లు, హోటళ్ల కీ అయ్యే ఖరీదుతో ఇంచుమించు సమానమే అయినా కొన్ని అదనపు ఆకర్షణలు ఉన్నాయి.
అవేవిటంటేడైరక్టు ఫ్లయిట్లు ఉంటాయి. మల్టిపుల్ ఫ్లయిట్లు ఉన్నా, ప్లయిట్ల మధ్య మారే సమయం తక్కువగా ఉండి సమయం వృథా కాదు. (కానీ ఇలా తక్కువ సమయం ఉండడం వల్ల వచ్చిన చిక్కేవిటో తరువాత ఫ్లయిట్ మారినప్పుడు చెప్తాను!)
మనకు నచ్చిన రేటులో హోటలు పాకేజీ దొరుకుతుంది.
ఇక అన్నిటినీ మించి ఇది “ఆల్ ఇంక్లూజివ్” పాకేజీ. ఇది గొప్ప అదనపు ఆకర్షణ. ఆల్ ఇంక్లూజివ్ అంటే మూడు పూటలా భోజనం, రిసార్టు వసతులు ఇత్యాదులన్నీ ఇందులోనే భాగాలన్నమాట. దేనికీ విడిగా డబ్బులు కట్టనవసరం లేదు. పిల్లలతో ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ప్రతీ పూటా భోజనానికి వెతుక్కోకుండా ఇలా బుక్ చేసుకోవడం చాలా మంచి ఆలోచన.
కాస్ట్ కో లో ఇతర పాకేజీల కంటే ఎక్కువైనా, మేం “పాలెస్ హోటల్స్ పాకేజీ “తీసుకున్నాం. పాలెస్ హోటల్స్ బీచ్ పాలెస్, సన్ పాలెస్, మూన్ పాలెస్ అని మూడున్నాయి. అందులో “బీచ్ పాలెస్” సముద్రతీరంలో ఉండడం వల్ల పిల్లలతో సర్దాగా ఉంటుందని అది ఎంపిక చేసుకున్నాం. కానీ తీరా వెళ్లేక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా దూరమే. అదొక్కటే కాస్త ఇబ్బంది అనిపించింది.
దూరాలను బట్టి చూస్తే సన్ పాలెస్ బెస్ట్. ఇక మూన్ పాలెస్ కేవలం కపుల్స్ కి మాత్రమే కాబట్టి పిల్లలతో ఉన్న మాకు అవకాశం లేదు.
సరే, టూరు బుక్ చేసుకోవడం పూర్తయింది. ప్రయాణంతో కలిపి మొత్తం ఏడు రోజులు. కాన్ కూన్ లో వారమంతా ఉంటాం.
కానీ అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలిగా. ఆన్ లైనులో కానుకూన్ కి సంబధించిన అనేక వీడియోలు చూసేం.
కాన్ కూన్ లో అభద్రత ఎక్కువగా ఉంటుందని , హోటల్స్ అన్నీ ఉన్న “హోటల్ జోన్” దాటి బయట తిరగడం క్షేమం కాదనీ తెల్సుకుని ఆలోచనలో పడ్డాం.
కానీ నాన్ రిఫండబుల్ టిక్కెట్లు కొనుక్కున్నాం కాబట్టి వెళ్ళి చూసొద్దామనే నిర్ణయించుకున్నాం.
ఇక దేశం దాటి వెళ్లడానికి వీసా నిబంధనల గురించి ఆన్ లైనులో చదివాం. అమెరికా వీసా ఉన్న వారు ఎవరైనా వెళ్ళి రావొచ్చని సారాంశం.
దాని ప్రకారం ధైర్యంగా దేశం దాటి వెళ్తున్నా, మళ్లీ వచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకైనా మంచిదని తత్సంబధిత డాక్యుమెంట్లు అన్నీ పెట్టుకున్నాం. అదీగాక ఇంతకు ముందు మెక్సికో క్రూయిజ్ నుంచి తిరిగి వచ్చేటపుడు రెండు గంటలు వేచి ఉండాల్సి రావడం, ఆ కాస్సేపట్లో పడ్డ టెన్షనుకి సంబంధించిన చేదు అనుభవం మాకు బాగా గుర్తుంది.
పిల్లలకు వారమంతా సెలవులు ఉన్నాయి కానీ మాకు లేవు. అయినా “స్వేచ్ఛగా ఎగరాలనుకున్న విహంగాలకు సెలవులు తక్కువా” అనుకుని మేమిద్దరం ఆఫీసులకు సెలవు పెట్టేసేం.
ఇక ఎప్పటిలానే పెట్టేబేడా సర్దాల్సిన బాధ్యత నాది, మోసే బాధ్యత మిగతా అందరిదీ.
ఇప్పుడు వరు టెంత్ కి వచ్చి పెద్దా పేరక్క అయింది కాబట్టి తన సర్దుళ్ళు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇక ఎటొచ్చీ సిరితోనే మా కాలమంతా పొద్దుపోయేది. తనవన్నీ అక్క లాగే స్వయంగా సర్దుకుంటానని తనూ పేచీ పెట్టింది. సరేనని వదిలేస్తే బట్టలన్నీ పక్కన పడేసి నచ్చిన బొమ్మలు సూట్ కేసు నిండా సర్దేసింది. తీసేస్తే ఏడుపు. మొత్తానికి సిరి నిద్రపోయే వరకు ఆగి అప్పుడు సర్దవలసి వచ్చింది. ఇక దారంతా తన సూట్కేసు తనే పట్టుకుంటానని పేచీ. సరే, నాలుగు చక్రాల మీద దొర్లించడమే కదా అని వదిలేస్తే, ఇక తల కిందికి వంచి పెట్టె ఎవరికీ తగిలేదీ చూసుకోకుండా రయ్యిన దూసుకెళ్లిపోతుంది. మేమెవరైనా పట్టుకుంటామంటే ఏడుపు. మాకు కాస్సేపు నవ్వు, కాస్సేపు కోపమూ వస్తుండేవి. కోపం వస్తే “మమ్మీ! డాడీ! మీరు కాస్త దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదలండి, లేదా పది అంకెలు లెక్కపెట్టండి కోపం పోతుంది!” అని చెప్తుంది. ఇక కోపం ఎక్కడిది?
ఇక మెక్సికో మరో దేశమైనా, అమెరికాకు దగ్గర్లో ఉంటుంది కాబట్టి ఫయిట్లు లోకల్ ఫయిట్లే. ఇంటర్నేషల్ ఫయిట్లలా పెద్ద సూట్ కేసులు ఫ్రీగా పట్టుకెళ్లనివ్వరు కాబట్టి ఒక్కొక్కళ్ళం చిన్న కేబిన్ బ్యాగేజి, ఒక్కో లాప్ టాప్ బాగ్ తగిలించుకున్నాం.
సిరి ఇంట్లో ఉన్నంత సేపు వీపుకి బొమ్మల బ్యాగు తగిలించుకుని తిరిగి బయలుదేరే ముందు ఇంట్లో వదిలేసింది.
దార్లో బాగు కోసం ఏం పేచీ పెడ్తుందో అని భయపడ్డాం. కానీ ఐ -పాడ్ ఉండడం వల్ల బ్యాగు సంగతి మర్చిపోయింది.
ఇక కాన్ కూన్ అసలు నవంబరులో ఎందుకు వెళ్లాలనుకున్నామంటే యూఎస్ ఏ లో ఇది చలి కాలం. కాబట్టి సెలవుల్లో చక్కగా వెచ్చగా ఉండే ఊరికి వెళ్తే బావుంటుందన్న ఆలోచన ఒక కారణం. ఇక రెండోది అక్కడికి దగ్గర్లోనే ఆధునిక ప్రపంచ వింతలు ఎనిమిదిట్లో ఒకటైన చిచెన్ ఇట్జా ఉంది. అది చూసి రావడం అసలు కారణం. ఇక పిల్లలకి హవాయి వెళ్లొచ్చినప్పటి నుంచీ వెచ్చని సముద్రం లో ఆడుకోవడం బాగా ఇష్టంగా మారింది. కాన్ కూన్ వైట్ సేండ్ బీచ్ లకు ప్రసిద్ధి. ఇంకేవిటి? తగినన్ని కారణాలున్నాయి అక్కడికి వెళ్లడానికి.
అక్కడికి వెళ్లాక తెలిసింది ఇంకా చాలా విశేషాలు చూడడానికి ఉన్నాయని.
భాగం-2
కాన్ కూన్ నగరం మెక్సికో దేశానికి ఆగ్నేయ దిక్కున ఉన్న “క్వింటానా రూ” రాష్ట్రం యూకతాన్ ద్వీపకల్పం లో ఉంది.
స్థానిక మాయా భాషలో కాన్ కూన్ అంటే “పాముల పుట్ట” అని అర్థమట.
ఈ చుట్టుపక్కలే ప్రపంచంలో అత్యంత పురాతన మైన గొప్ప సంస్కృతుల్లో ఒకటైన మాయా నాగరికత క్రీ.పూ. 2000 నుండి క్రీ.శ. 900 వరకు విలసిల్లింది.
ఇక్కడ ఇప్పటికీ సజీవంగా ఉన్న అనేక శిథిల కట్టడాలు అబ్బురమనిపిస్తాయి.
కాన్ కూన్ నగరం 18 వ శతాబ్దిలో స్పానిష్ వారి ఆక్రమణ ఫలితంగా వెలుగులోకి వచ్చింది.
ఇక 1970 వ సం.రం తరువాత ఇక్కడ రిసార్టుల నిర్మాణం ప్రారంభమయ్యేక యాత్రికుల రాకపోకలు ప్రారంభమయ్యేయి.
పై నుంచి చూస్తే సముద్రంలోకి వదులుగా వొదిలేసిన సన్నని తాడులాంటి భూభాగం మీద వరసగా స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణాలు కనువిందు చేస్తూభూలోక స్వర్గాన్ని తలపింపజేస్తాయి. ఈ ప్రాంతం పేరే “జోనా హోటాలెరా” (హోటల్ జోన్”).
ఈ జోన్ కి అటూ, ఇటూ కొసలు ప్రధాన నగరాన్ని కలిపి ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎటు ప్రయాణం చేసినా రెండు వైపులా నీళ్లతో అందమైన దృశ్యాలుకనిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా హోటలు బాల్కనీ లోంచి అనంత సాగరపుటంచు మీదుగా ప్రతీ ఉదయానికీ ఆహ్వానం పలికే ప్రశాంత సూర్యోదయం, రాత్రి పూట కెరటాల మీదదోబూచులాడుతూ సరాసరి గుండెల్లోకి దూసుకొచ్చే అందమైన చంద్రోదయాలు చూడ్డానికైనా వెళ్లాల్సిందే అనిపించింది.
ఈ హోటల్ జోన్ తప్ప మిగతా ప్రాంతమంతా చిన్న సైజు టౌనులా ఉంది.
ఇక్కడ జనాభా లో 99% ఇక్కడి టూరిజమ్మీద ఆధారపడి బతుకుతున్నవాళ్లే. స్పానిషు ప్రధాన భాషైన మెక్సికో దేశంలో ఏ మాత్రం ఇంగ్లీషు మాట్లాడగలిగేవాళ్లకయినా టూరిజం లో అవకాశాలు ఈ ప్రాంతంలో మెండుగా ఉన్నాయి. అయినా మామూలు జనానీకం పేదరికంలోనే మగ్గుతున్నట్లు నగరంలోని ఇతరప్రాంతాల్ని చూస్తే అర్థం అవుతూంది.
గత కొన్నేళ్లుగా ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించిన నేరాలు, హత్యలు పెరగడం వల్ల అమెరికా వంటి సంపన్న దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేక భద్రతలు కూడాపెంపొందించినట్లు రోడ్లపై ఎక్కడికక్కడ మిలటరీ దళాలు ఉన్నాయి.
ఇందుకు భయపడే మేం అనేక సార్లు ఈ ప్రయాణాన్ని వాయిదా వేసాం. కానీ వెళ్లొచ్చాక అంతగా భయపడాల్సిన పని లేదని అనిపించింది.
నాకు పరిచయం అయిన కొందరిని అక్కడి భద్రతకు సంబంధించి అడిగినప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాలలోనూ నేరాలు జరుగుతున్నా ఇక్కడిసంఘటనలనే భూతద్దంలో చూపిస్తూ ఉంటారని వాపోయారు. ఒకతనైతే “అమెరికాలో ఎన్ని కాల్పులు జరగడం లేదు? అక్కడ మాత్రం భద్రత ఉందా?” అనిఎదురు ప్రశ్న వేసాడు. నిజమే అనిపించింది నాకు.
మధ్యలో ఒక రోజు మేం టూరుకి వెళ్లిన బస్సు డ్రైవరు “మీరు వచ్చిన పనిని బట్టి మీ భద్రత ఆధారపడి ఉంటుంది. మీరు కేవలం సందర్శకులైతే మీ మీదఎవరు కాల్పులు జరుపుతారు? నాకు తెలిసినంతవరకు అనేక ఇతర ప్రాంతాలతోనూ, దేశాలతోనూ పోలిస్తే సామాన్యులకు ఇది చాలా భద్రత కలిగినదే. ఇకడ్రగ్స్ మాఫియా అంటారా? అది ఎక్కడ మాత్రం లేదు? అమెరికాలో కంటే పెద్ద నేరాలు మా మెక్సికో దేశంలో జరగవు.” అన్నాడు నవ్వుతూ.
ఇక ఇలాంటి వివాదాస్పదమైన చోటికి ధైర్యంగా వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుని వచ్చాం కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించకూడదని అనుకున్నాం.
చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి లిస్టు చేసుకున్నాం. అందులో ముఖ్యమైనవి ఆధునిక ప్రపంచ ఎనిమిది వింతల్లో ఒకటైన చిచెన్ ఇట్జా పిరమిడ్ ఒకటి.
అంతే కాకుండా అక్కడ “సెనోట్లు” అనబడే భూగర్భ జలాలు తప్పనిసరిగా చూడదగినవి.
ఇక కానుకున్ ని ఆనుకుని ఉన్న “ఇస్లా మొహారీస్” ద్వీపం ఒక రోజు కార్యక్రమం గా చేరింది.
స్థానిక ఉత్పత్తులకు, ప్రజల్ని, వారి సంస్కృతిని చూసేందుకు ప్రసిద్ధి చెందిన “మార్కెట్-28” తప్పని సరి అని నేను పేచీ పెట్టేను.
సత్యకు, వరుకు ఇష్టమైన జిప్ లైన్ వంటి ఎడ్వెంచర్ టూర్లు వాళ్లు బుక్ చేసుకుందామన్నారు.
సముద్రమ్మీద సాయంత్రం పూట కనువిందు చేస్తూ తప్పనిసరిగా చూడాల్సినదని జనం మెచ్చిన టూరు “పైరేట్ షో”.
తులం, కోబా వంటి మాయా సంస్కృతిలోని శిధిల నగరాలు అన్నిటికంటే ముఖ్యమైనవి. వెరసి మొత్తం అయిదు రోజులకు సరిపడా టూర్లు సిద్ధమయ్యేయి మాకు.
ఇక మేం బయలుదేరే రోజు రానే వచ్చింది.
కాస్ట్ కో పాకేజీ టూరులో భాగంగా రెండు ప్లయిట్లు మారినా వెంట వెంటనే ఫ్లయిట్లు కావడం వల్ల మధ్యాహ్నం పన్నెండుకి బయలుదేరి, రాత్రికి చేరాల్సి ఉందిమేం.
కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ లోని డల్లాస్ కు మొదట మూడు గంటలు, డల్లాస్ నుంచి మరో రెండు గంటలు ప్రయాణం. కానీ కాన్ కూన్ సమయం మాకుమూడు గంటలు ముందు ఉండడం వల్ల మేం వెళ్లేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది.
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేసరికి మరో అరగంట.
కాంకూన్ ఎయిపోర్టు చాలా చిన్నది. నిజానికి బయటకు రావడానికి అట్టే సమయం పట్టదు.
ఇంక రెండు నిమిషాల్లో అద్దాల తలుపులు దాటి బయటకు వస్తామనగా ఉన్న టూరిజం హెల్ప్ సెంటర్ల లాంటి చోట్ల ఉన్న బాడ్జు పెట్టుకున్న ఒకమ్మాయిమమ్మల్ని “సాయమేదైనా కావాలా” అని పలకరించింది.
కాస్ట్ కో పాకేజీ లో భాగంగా మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని హోటల్ లో దించే ప్రైవేటు వ్యాను ఎక్కడ ఆగుతుందో అన్న సందేహంతో ఆమె దగ్గిర ఆగేం మేం.
అదెంత పెద్ద తప్పో మాకు తర్వాత తెలిసొచ్చింది.
*****
(ఇంకా ఉంది)