రమణీయం
కదులుతున్న కల
-సి.వి.రమణ
టివి లో చెన్నై గురించి వార్తలు చూస్తున్నాము. అక్కడి తీవ్రమైన నీటి ఎద్దడిని, ప్రజల కడగండ్లను వివరిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలకుఖర్చు చేస్తూ, అభివృద్ధి పధకాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా ……. చెట్లు ఎండి, మొక్కలు మాడి, పసువులు, పక్షులు ఆఖరికి మనుషులు కూడా విలవిలలాడుతున్నారు; నీటికరువువలన కలిగే ఇక్కట్లుతో. కరువు, కరువు అంటాం కాని, ఈ కరువు ఎందుకొచ్చింది? నివారణ ఏమిటి? మనము ఏమి చెయ్యగలం, అని ఆలోచించం. రాజకీయనాయకులు ఏమీ చెయ్యటం లేదని, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోతాం. మనమే ఎందుకు పూనుకోకూడదు?
చెన్నై దుస్థితి మనకు రాకముందే మేలుకోవాలి; ఎలా? ఏమి చెయ్యాలి? మదిలో మెదిలొందొక మెరుపు. రానున్నది వర్షాకాలం. వాన నీరు ఒడిసి పట్టాలి. ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి, ప్రణాళిక సిద్ధం చేసుకొన్నాను. ఈ నెల కిట్టీ పార్టీలో ప్రస్తావించాను, పడుతున్న వర్షాన్ని పట్టుకుందాం అని. ఆ!! మన వల్ల ఏం అవుతుంది అన్నారు అందరూ ముక్త కంఠంతో. ముందు ఒక అడుగువేస్తేనే కదా తరువాత అడుగు పడేది. కలిగే సౌకర్యాన్ని, కలగబోయే లాభాలని వివరించాను. ఆఖరికి అందరం కలిసి తీర్మానించాం – ప్రతి ఇంటికీ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని, అపార్ట్మెంట్లతో సహా, ఇంటింటికీ మొక్కలు నాటాలని. అన్ని ఇళ్ళకూ, అపార్ట్మెంట్లకూ బోర్‌వెల్స్ వున్నాయి. దానికి నాలుగు అడుగుల దూరంలో సమాంతరంగా ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకుంటే, బోర్ లో నీటిమట్టం పెరుగుతుంది. ఇంకుడుగుంత వున్న ఇళ్ళకి, ఇంటిపన్నులో రాయితీ కూడా వుంటుంది.
స్త్రీలు తలచుకుంటే సాధ్యం కానిదేముంది? పండుగులా పనులు ప్రారంభించారు. గుత్తేదారుని (Contractor) పిలిపించారు. ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలో అడిగి తెలుసుకున్నారు. మా కాలనీవాసులందరూ వాళ్ళవాళ్ళ ఇంటి, అపార్ట్మెంట్ స్థల విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకు ఎంత వాన నీరు పడవచ్చు, దానిలో ఎంత ఆదా చేయగలరు (కొంత వృధాగా పోక తప్పదు) అనే విషయాన్ని సుమారుగా అంచనా వేసారు. పడిన వర్షం నీరు ఇంకుడుగుంతవైపు పారేలాగా భూమి పల్లంగా ఉంటే, ఎక్కువ నీరు ఆదా అవుతుంది. ఇంకుడుగుంత కోసం కేటాయించుకున్న స్థలంలో అంతకు ముందు అక్కడ బండలు పరిచిగాని సిమెంట్ చేసిగాని ఉంటే, అది తీసివేసి నేల త్రవ్వవలసి ఉంటుంది. సాధారణంగా ఇంకుడుగుంత నాలుగు అడుగులు వెడల్పు, నాలుగు అడుగులు పొడుగు, ఆరడగుల లోతు తియ్యవలసి వుంటుంది. పొడవు, వెడల్పులలో మన సౌలభ్యాన్ని బట్టి మార్పులు చేసుకోవచ్చు. లోతు పెంచుకోవచ్చు, కాని తగ్గరాదు. ఇంకుడుగుంతను ఇసుక, కంకరలతో ఒక పద్ధతి ప్రకారం నింపవలసిఉంటుంది. ఇసుక, కంకర, కూలీ వగైరా వాటికి అయ్యే ఖర్చులు అంచనా వేయించారు. మా మిత్రులంతా కలిసి గుత్తేదారుతో బేరమాడి బయానా ఇవ్వటం జరిగింది.
ఇహ మొక్కల పని మిగిలింది. కాలనీ మొత్తానికి ఏఏ మొక్కలు, ఎన్నెన్ని కావాలో, వాటిని ఎలా తేవాలో, మరో సమావేశం పెట్టి ఆలోచనలు చేసాము. రంగురంగుల పూలు పూసే టబీబియా, బహూనియా, గుల్మొహార్ వంటి చెట్లు, సువాసనలు వెదచల్లే ఆకాశమల్లి, పొగడ చెట్లు తేవాలని అనుకున్నాము. కొందరు ఔషధ మొక్కలు కూడా వుండాలన్నారు. కానుగ, వేప వంటి ఔషధ మొక్కలు గూడా మా జాబితాలో చేర్చుకున్నాము. అటవీశాఖను సంప్రదించి, వారి వుద్యానవనానికి స్వయంగా వెళ్ళి, కావలసిన మొక్కలన్నీ ఎంచుకుని, మరీ తెచ్చుకున్నాము. ఇప్పుడు మొక్కలు పెట్టటం కోసం గుంటలు త్రవ్వటం మొదలెట్టాలి. దానికోసం పిల్లలు, పెద్దలు ముందుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికిన వనమహోత్సవాలు జరుగుతున్నాయా అన్నట్లు సందడే సందడి. ఇళ్ళముందు, రహదారి పక్క, పార్కుల్లో, ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే, అక్కడ మొక్కలు నాటేసాము. ఇంటింటికీ ఇంకుడుగుంతలు, ఇంటి చుట్టూ మొక్కలు మహా ముచ్చటగా అమిరాయి నెల రోజుల్లో. కాలనీ అంతా కళకళలాడే చెట్లు, కిలకిల లాడే పిట్టలతో కనువిందు చేసే దృశ్యం, కదలాడింది కంటిముందు.
*****
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.
You did a great job Ma’am! Keep it up!
Thank you Sasisri garu.
బాగుంది మీ నీటి మీద యుద్ధం!
శుభాకాంక్షలు,
అందరూ మీ లాగా నడుం కట్టి ముందుకు వస్తే బాగుంటుంది.
నీటి గుంతలే కాదు. నీటి వాడకం మీద మెళకువలుమీద అవగాహన కూడా పెంచాలి.
Thanks Anil garu