షర్మిలాం“తరంగం”
-షర్మిల కోనేరు
” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు …
నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న మాటలు తప్ప ఏమీ గుర్తులేవు .
అంతెందుకు మా వూరి లైబ్రరీలో వున్న సాహిత్యాన్నంతా ఒక్కో పుస్తకం చొప్పున పరపరా నమిలేసే దాన్ని .
ఇప్పుడు స్క్రీన్లు చూస్తే అమ్మానాన్నలు గగ్గోలు పెట్టినట్టు పుస్తకాలు చదవనని ఒట్టేయమనేది మా నాయనమ్మ .
” ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఇంకో మాటా చెప్తానమ్మా ” అని మనసులో అనుకుంటూ ఆ మాట ఏనాడూ నిలబెట్టుకోలేదు .
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే నాకు సంస్కృతంలాగే నేను చదివిన పుస్తకాలు మాత్రం గుర్తున్నయ్యి గానీ ఆ కధలు గుర్తులేవు .
కాకపోతే హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు ” చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ !” అన్నట్టు ఆ సారం తల్కెక్కింది .
ఆ తల్కెక్కిన సారం కొందరికి తిక్కలాగా కూడా కనిపిస్తుందనుకోండి.
ఇక నేను మాత్రం దేముడు మనిషిరూపంలో వస్తాడని అనేకన్నా మనుషులే దైవం అనుకుంటాను .
జీవితపు ప్రతి మలుపులోనూ నన్ను ప్రేమించి , కోప్పడి , సలహాలిచ్చి నన్ను ముందుకు నడిపించిన మనుషులు దేముళ్లు కాక ఏమవుతారు .
పుట్టిన పసికందుని గుండెలకు హత్తుకుని పెంచి పెద్దచేసిన నాయనమ్మ , తాత , అడుగు కింద పెట్టకుండా భుజాలమీద ఎక్కించుకు తిప్పిన మన్నాన్న మాతృపితృ దేవతలైతే , చదువు చెప్పి బళ్లో చేర్పించిన మస్తాన్ వలీ మాస్టారు ఆచార్య దేముడు కాదా ?
ఇంటర్ లెక్కల్లో ఫెయిల్ అయ్యి ఇక చదవనని భీష్మించుకున్నప్పుడు , ఆ దారిన వెళ్తూ ” మా ఇంటిదగ్గర ట్యూషన్ చెప్పే మాస్టర్ వున్నారు , నువ్వు ఇంటర్ సప్లిమెంటరీకి కట్టు” అని సలహా చెప్పిన ముఖపరిచయిస్తురాలు అంబ సాక్షాత్తూ ఆ అంబిక కాదూ !
తన పుణ్యమే డిగ్రీ పీజీ వరకూ చదువు .
” మా పత్రికలో ఖాళీ వుంది పరీక్ష రాయమని ” ప్రోత్సహించిన చంద్రశేఖరం గారు నా పాలిట శివుడే .
వుద్యోగంలో నేను అవమానాల పాలైనప్పుడు నన్ను ఇంకా ఎక్కువ జీతమిచ్చి వుద్యోగమిచ్చిన ఎడిటర్ ఏబీకే ఏ దేముడికి తక్కువ !?
హైదరాబాద్ లో నన్ను ట్రైనింగ్ లో ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకున్న మా పెద్దమ్మ నిజంగా పెద్దింటమ్మవారే !
ఎప్పుడూ మా నాయనమ్మ అంటుండేది ” నీ ధర్మమే నిన్ను కాపాడుతుందని అడుక్కునే వారిలో దేముడు వుంటాడని ,దానం చేయాలని చెప్పింది . ఇక చూస్కోండి మా ఇంటికి ఎవరు అడుక్కోడానికి వచ్చినా బస్తాలో వున్న బియ్యం పెద్ద తెపాళా నిండా మోసుకెళ్లి పోసేదాన్ని .
ఆ రోజుల్లో రోజుకో పదిమంది అడుక్కోడానికి వచ్చేవారు .
బస్తాలో బియ్యం ఇంత తొందరగా ఎట్లా తరిగిపోతన్నాయ్యో మా నాయనమ్మక అర్ధం కాలేదు .
తీరా ఒక రోజు తాత చూసి ” ఇది బియ్యం తోడి వచ్చినాళ్లందరికీ పోస్తంటే బియ్యం తరగక ఏంచేస్తయ్ ” అన్నారు .
” నాయనమ్మ అడుక్కునే వాళ్లు దేముళ్లని చెప్పింది , అందుకే !” అని జవాబు చెప్తున్న నన్ను మా నాయనమ్మ కావిలించుకుని ముద్దాడింది .
అందుకేనేమో చిన్నప్పటినుంచి మనుషుల్లో దేముడిని వెతకడం అలవాటైంది .
అలాంటి ఓ రెండు సంఘటనలు ఇవి .
నేనో రోజు మా అత్తారింటి నుంచి పసి పిల్లని ఎత్తుకుని పుట్టింటికి బయల్దేరాను .
బస్టాండ్ కి వెళ్లాక చూసుకుంటే పర్స్ లేదు . ఆటో అతనికి ఇవ్వడానికి డబ్బుల్లేవు .
మళ్లీ వెనక్కి తీసికెళ్లమని డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాను .
అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా , పుట్టింటికి ఆనందంగా బయల్దేరారు వెనక్కి రావొద్దు నా డబ్బులు మీరు తిరిగి వచ్చాక తీసుకుంటాను అన్నాడు . అంంతేకాదు బస్ టికెట్ డబ్బులు కూడా ఇచ్చి దగ్గరుండి బస్ ఎక్కించాడు .
బస్ దిగే సరికి సూట్ కేస్ హాండిల్ వూడి పోయింది .
ఒకపక్క పిల్ల , బస్ దగ్గరకి వచ్చిన రిక్షా అతను ఆ సూట్ కేస్ భుజం మీద పెట్టుకుని రిక్షా ఎక్కించుకుని ఇంటిదగ్గర దిగబెట్టాడు .
దేముడు ఎక్కడో కాదు … సాయం చేసే మనసుల్లో వుంటాడనిపించింది .
మనతో సంబంధం లేకున్నా మనకి మంచి చేయాలని తాపత్రయ పడతారు కొందరు .
అలా తారసపడే ఆ మంచి మనసున్న దేముళ్లకు శతకోటి వందనాలు .
****
షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.
మీకు నచ్చినందుకు సంతోషం విజయ గారు 😊
చాలాబాగుంది మీ అనుభరసారం..
సరిగ్గా చెప్పారు షర్మిల.
సాయం చేసేవాళ్ళు ఎదురైతే
సాక్షాత్తు ఆ దైవం కనిపించినట్టే.
చాలా బాగుంది