ఆప్షన్

  –శిలాలోలిత

మనం వింటున్న దేమిటి?

మనం చూస్తున్న దేమిటి?

మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు?

అసలు మనుషులెందుకు తాగుతున్నారు?

తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా?

శ్రమను మర్చిపోతున్నానని ఒకరు

బాధని మర్చిపోవడానికని ఇంకొకరు

ఫ్యాషన్ కోసమని  ఒకరు

కిక్ కోసమని ఇంకొకరు

ఒళ్ళు బలిసి ఒకరు

వెరైటీ బతుకు కోసం ఇంకొకరు

అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట

వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు

ఏమిటి? ఏమిటి? ఏమిటిది?

ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది

వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి

పసిపాప అరుపులు వినిపిస్తూనే వున్నాయి

పారిపోవాలి పారిపోవాలి ఎక్కడికైనా

కానీ,

ఈభూతలమంతా వెతికినా అమ్మ గర్భం తప్ప రక్షిత ప్రదేశం కనబడటం లేదు

నిన్నగాక మొన్న శీనుని రెండు మామిడి కాయలు తింటే

కులం బలుపు, క్రూరత్వపు పరాకాష్ట అనుకున్నాం

నీలిచిత్రాలను, హింసా దృశ్యాలను చూసిచూసీ

మనిషినెంత హింసిస్తే అంత ఆనందమనుకునే

ఈ మానవ పురుగుల్ని ఏం చెయ్యాలి?

మూలాల్ని శోధించి 

మనిషితనాన్ని పూర్తిగా కోల్పోకముందే

మనమేదైనా చెయ్యాలి

జైళ్ళల్లో మేపేకంటే

శిక్ష క్షణాల్లో అమలయ్యేట్లు చెయ్యాలి

బతకాలంటే,బతుకును నిలుపుకోవాలంటే

వేరే ఆప్షన్ లేదు

చీడ పురుగుల్ని  ఏరివేయడం తప్ప

సంఘటితం కావాల్సిన తరుణమిది.

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.