పడాం…పడాం… !

-చంద్ర లత

ఎడిత్ పియెఫ్( 1915-1963) ఫ్రెంచ్ గాయని,నటి, గేయరచయిత, స్వరకర్త, ఛాసో నెట్. ఫ్రెంచ్ అభూత కల్పన గా  ప్రస్తావించే ఎడిత్ పియెఫ్ , అంతర్జాతీయ ఫ్రెంచ్ తార. “పడాం… పడాం… ” అన్న పాట ఒక వాల్ట్జ్ గీతం. ఇది సంగీత జ్ఞాపకాల గురించిన పాట. ఒక స్వరం వినబడగానే, జ్ఞాపకాల తుట్టి ఎలా కదిలించబడుతుందో ఈ పాట చెపుతుంది. తన ఇరవైఏళ్ల వయస్సు నాటి గతించిన ప్రేమ జ్ఞాపకాలు ఈ స్వరం తట్టి లేపడం ఈ పాట సంధర్భం. అత్యంత జనాదారణపొందిన ఈ ఫ్రెంచ్ గీతాన్ని, ప్రపంచ యుద్ధంలో పోరాడిన “ఫ్రెంచ్  ఫారిన్ లెజియాన్” కు ఈ పాటను అంకితం ఇచ్చింది ఎడిత్ పియెఫ్.పియెఫ్ అంటే చిన్ని పిచ్చుక. అది ఎడిత్ సభానామం. పాటాడే పిచ్చుకమ్మ పాడే స్వర జ్ఞాపకాల పాట ఈ “పడాం… పడాం… !”

                                                      

గానం :  ఎడిత్ పియెఫ్. (1951) , ఫ్రెంచ్ పాట.  

రచయిత : హెన్రీ కాంటె  సంగీత స్వరకర్త: నోబర్త్ గ్లాంజ్ బర్గ్

తెలుగు సేత : చంద్ర లత (3.2.2018)

***

ఈ స్వరం, నన్ను రేయింబవళ్లు వెంటాడుతోంది.

ఈ స్వరం, ఈ పూట వ్రాసింది కాదు.

ఇది నేను వచ్చింత దూరం నాతో పాటే వచ్చింది.

నాతో పాటే ఈడ్చుకొంటూ,

వందల వేల స్వరకర్తల చుట్టూ  తిరిగేసింది.

ఏదో ఒక రోజు ఈ స్వరం, నా మతి పోగొడుతుంది.

అది ఎందుకో వంద సార్లయినా చెప్పాలనుకొన్నా.

కానీ, నన్ను అది ఆపేసింది.

ఎప్పుడూ నాకన్నా ముందే మాట్లాడేస్తుంది 

నా గొంతులో దాని గొంతు ముంచేస్తుంది. 

పడాం…పడాం…పడాం !

ఇది నావెనకే పరిగెత్తుకొంటూ వస్తుంది.

పడాం…పడాం…పడాం !

ఇది కొన్ని మాయలుకూడా చేస్తుంది. 

నీకు గుర్తుందా…?

పడాం…పడాం…పడాం !

అది నన్నుఇరకాటపు ప్రశ్నవేస్తుంది.

నీకు గుర్తుంది కదా?

పడాం…పడాం…పడాం !

ఆ రాగం నన్ను వేలెత్తి చూపుతుంది.

ఒక పట్టుబట్టే పిల్లలా నా వెనకాలే వేళ్ళాడుతుంది.

ఈ స్వరమే, ప్రతి ఒక్కటీ కంఠతా తెలుసుకుంది.

అది అంటూంది,” నీ ప్రేమలు గుర్తుంచుకో.

ఎందుకంటే, ఇక ఇది నీ వంతు.

నువ్వు ఏడవడక పోవడానికి కారణం ఏముంది?

నీ జ్ఞాపకాలు చుట్టేస్తుంటే. “

“అదే, నేను మళ్లీ చూస్తున్నా 

నా ఇరవై ఏళ్ళ జీవితపు లయను స్వరబద్దం చేస్తూ,

ఇంకా నాతో మిగిలిన వాళ్ళని.” 

ఒక మెరుపులా అవన్నీ చూస్తున్నా.

‘ఇక నేను,  నాతో పాటు ఈ ఇరవై ఏళ్ళలో మిగిలి ఉన్న వారే. 

ఆ మృదంగాన్ని మోగిస్తూనే ఉంటారు.

ఆ చేష్టల క్రమమంతా మెదులుతుంది.

నా కళ్ళ ముందు.

ఆ ప్రేమ పుట్టించే హాస్యమంతా.

ఈ స్వరం,  ఊరికినే వినబడుతూనే ఉంటుంది 

పడాం…పడాం…పడాం  !

14 జులై నాటి “నేను ప్రేమిస్తున్నాను” లా!

పడాం…పడాం…పడాం  !

కారు  చవక గా కొనేసే “ఎల్లప్పుడు” లా.

పడాం…పడాం…పడాం  !

” దయచేసి మీరు ” అంటూ మేట వేసే

 మర్యాద ముసుగేసిన మాటల్లా.

ఇంకా, ఇదంతా వీధి మూలలోంచి వచ్చింది.

నన్ను గుర్తుపట్టిందే,  అదే ఈ స్వరం.

అది నాలో కలిగించే కల్లోలాన్ని వినండి.

నా గతమంతా నా పక్కన కదం తొక్కేలా.

కొంచం విషాదాన్ని రేపటి కోసం అట్టిపెట్టాలిగా !

నా దగ్గర ఈ స్వరం ధ్వనించే పాటలెన్నో ఉన్నాయి.

ఆ స్వరమే ఒక కొయ్యగుండెలా కొట్టుకొన్నట్టుగా.

*****

References:

  1. http://lyricstranslate.com/en/padam-padam-padam-padam.html-7
  2. http://lyricstranslate.com/en/padam-padam-padam-padam.html-7#ixzz54nsedoa5
  3. https://www.youtube.com/watch?v=OjY9IDlhFUk
  4. జులై 14  : ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం 
  1. “చూడలా గులాబిలా! లా వి యెనా రోజా !” ఎడిత్ పియెఫ్ . తెలుగుసేత: చంద్ర లత, “కవిత ” మాస పత్రిక, 54 వ సంచిక.


(డా. చంద్ర లత, తెలుగు రచయిత. కథనశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.