నవ్వుల నేస్తానికి  ఆత్మీయ నివాళి      

-రేణుక అయోల 

 
ప్రముఖ పత్రికలు ” విపుల, చతుర ” సంపాదకురాలు  డా . కె  భాగ్యలక్ష్మి  గారు హఠాత్తుగా ఇంకలేరు  అన్న వార్త ని ఆ రాత్రి   ఎవరూ  జీర్ణయించుకో లేకపోయారు. రచయిత్రులందరూ  మూగపోయారు.  రెండు రోజులు ఎవరు తేరుకోలేకపోయారు.  
ఎవరిని కదిలించినా  నిన్న మాట్లాడారు  అనో,  అయ్యో  మంచిస్నేహితురాలు  అనో.  వాపోయారు.  నేను అయితే  అస్సలు నమ్మలేదు. ఎందుకంటే  రెండు రోజుల ముందే నాతో మాట్లాడి నాకు  ధైర్యం చెప్పారు ..
ఎవరిని కదిలించినా  మంచి   స్నేహితురాలు  అన్నారే  గాని ఎవరు కూడా  ఒక్కమాట నెగటివ్ గా చెప్పలేదు…  రాసిన కథలకన్నా లెక్కలేనన్ని  సభల్లో  మాట్లాడినా మాటలకన్నా  స్నేహం  ఒక్కటే ఆవిడని  అందరికి  ఆప్తురాలిగా చేసింది.  అందుకే : “స్నేహమేరా జీవితం  స్నేహమేరా  శాశ్వతం” అంటూ సినిమాలో పాటలుపాడినా , ఏదైనా కష్టం వస్తే  స్నేహితులే ఆదుకుంటారు అంటారు , స్నేహంకోసం ప్రాణాలు ఇచ్చారు అంటారు. ఇది అక్షరసత్యం  అని నిరూపించారు  కె.బి. లక్ష్మి.  అన్నిటికన్నా ముఖ్యంగా  స్నేహితులందరి మధ్య   అప్పటిదాకా మాట్లాడి “అత్తి  వరదస్వామి  దర్శనం  కోసం హైరానా పడి రద్దీ జనాల మధ్య  కూడా హుషారుగా ఉండి, ఇడ్లీ హఠాత్తుగా తింటూ రైల్లో బెర్తుమీదే అందరి కళ్ళముందు  మూసిన కన్ను తెరవక  తిరిగి రానంత దూరాలకి  వెళ్ళిపోయిన కె.బి.లక్ష్మి గారిని మరచి పోవడం ఎలా?
 నాలుగు రోజులు అయ్యాక  సర్దుకుని  “యెంత పుణ్యాత్మురాలు   పువ్వులా  ఎగిరిపోయింది  అనుకున్నారు”. అదే వయసులో వున్న వాళ్ళు  కొద్దిగా బెంగపడ్డారు. ఏది ఏమైనా తనకు
నచ్చినట్టుగా  బతికి,  అందరితో హాయిగా ఉంటూ , తనకోసం  ఇంతమంది   రచయిత్రులు  కదిలిరావడం  చూసే అవకాశం ఉంటే  హాయిగా గలగలా నవ్వేసేవారేమో!  అంతిమ యాత్రలో  ప్రముఖ  కవయిత్రులు రచయిత్రులు  పాల్గొని వీడ్కోలు  చెప్పారు. 
  
కొందరి రచయిత్రుల మాటల్లో …… 
 
“ఆవిడ ఒక ప్రముఖ పత్రికకి సంపాదకురాలు అనుకుంటూ భయపడుతున్న నన్ను కె.బి.లక్ష్మి తాము చొరవగా పరిచయం చేసుకుని, కలిసినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు.”  ( జి సుబ్బ లక్ష్మి  రచయిత్రి )
 
 
“కలో నిజమో తెలియని అయోమయం స్థితిలో  కలిసి యూరోప్ టూర్ వెళ్లాం ఒకే రూమ్ షేరు చేసుకున్నాం గల గలా మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పేది.  నిన్న కాంచీపురం వెళుతూ ఎన్నో జీవితానుభవాలు చెప్పింది ఇంకా ఎన్నో టూర్లు plan చేసుకున్నాం.  అందరితో కలిసి వరదస్వామిని దర్శనం చేసుకుంది తిరిగి ట్రైన్ లో వచ్చేటప్పుడు ఎంతోసేపు అందరితో కబుర్లు చెప్పింది. కళ్ళముందు జరిగిన సంఘటన నమ్మశక్యం కానిది. స్నేహ శీలి positive nature, నొప్పించక, తానొప్పక..బతికిన మనిషి. మరిచిపోలేని మనిషి.”  ( కస్తూ రి  అలివేణి  రచయిత్రి )
 
 “పొద్దుటినుండి ఎవరికీ తిండి లేదు. పాపం రాజ్యలక్ష్మి గారు హడావిడిగా అందరికీ ఇడ్లీలు పాక్ చేయించారు. ప్లేట్లు కూడా లేవు కవర్ లోనే ఇడ్లీ తినాల్సి వచ్చింది. నా దగ్గర అన్నీ ఉంటాయి అని లోపల్నించి స్టీల్ స్పూన్ తీసింది. తింటూ ఏమిటి ఈ సాంబారు ఉప్పగా వుంది అంది. లేదే అన్నాం మేం. అంతలో నాకేదో అలర్జీ లాగా వస్తోంది. ఏదన్నా అలర్జీ టాబ్లెట్ ఉంటే ఇవ్వండి అంటూనే బర్త్ మీదకు ఒరిగి పోయింది. తలకింద దిండు పెట్టి సరిచేసాం. అందరం కంగారుగా చుట్టూ చేరి లక్ష్మీ, లక్ష్మీ అంటున్నాం. టీసీ వచ్చాడు. పాపం ఫస్ట్ ఎయిడ్ లాగా చేసాడు. అందరూ నానారకాలుగా ఉపశమనం కోసం ఏదో చేస్తున్నాం. బోగీ లో ఒక డాక్టరు ఉంటే ఆయన కూడా వచ్చాడు . కానీ తాను మూసిన కన్ను తెరవలేదు. పగలంతా అలా హాయిగా గడిపి అంత అనాయాసంగా పోవటమా? పూలవోలే రాలిపోదము అన్నట్టు. అదీ లక్షణంగా స్వామీ దర్శనం చేసుకుని. యెంత పుణ్యాత్మురాలో !పొద్దున్నే సమస్యాపూరణం ఇలా ఇచ్చారు .

“శవమ లేచి రమ్ము సంతసమున”

గలగలమని దినము నంత గడపి నాము| 
అత్రి వరదు గాంచి నమిత భక్తి | 
దేహ మొదలి ,యేల దివికి వెడలినావు? 
“శవమ లేచి రమ్ము సంతసమున”

మనమాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయారు లక్ష్మిగారు.” ( కుసుమ ఉప్పల పాటి )

*****

Please follow and like us:

One thought on “కె.బి లక్ష్మి స్మృతిలో –”

  1. ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయింది లక్ష్మి. చివరి చూపుకి కూడా నోచుకోలేనంత దూరంలో (అమెరికా లో ) ఉండగా ఈ వార్త విని నమ్మలేకపోయాను…ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను రేణుకా . లక్ష్మి గురించి మీరు రాసింది అక్షరాలా నిజం. తను చుట్టుపక్కల ఉంటే అందరూ తమ సమస్యలు మరిచిపోయేవారు.నవ్వుతూ, నవ్విస్తూ బతికింది . అంత ఆత్మీయంగా , ఏమాత్రం హిపోక్రసీ లేకుండా స్నేహం చేసేవాళ్ళు చాలా అరుదు. తను లేని లోటు చాలా కాలం వరకూ బాధపెడుతుంది .

Leave a Reply

Your email address will not be published.