చిత్రం-2

-గణేశ్వరరావు

ఈ చిత్రాన్ని వేసింది మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా  (ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ ను ఇండియన్ ఫ్రిడా  గా కొందరు విమర్శకులు గుర్తించారు). ఫ్రిడా మరణం తర్వాత ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.   ఆమె చిత్రాలు ‘అధివాస్తవికత’తో నిండి ఉంటాయి. ఈ ‘గాయపడ్డ లేడి’చిత్రంలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన భౌతిక, మానసిక బాధలను చూపరులతో పంచుకుంటుంది. చాలావరకు ఆమె గీసినవి స్వీయ చిత్రాలే. లేడి తల తన బొమ్మే. లేడి కుడికాలు పైకెత్తి ఉంది. అప్పటికే ఫ్రీడా నిజ జీవితంలో బస్సు ప్రమాదంలో  ఆ కాలుని పోగొట్టుకుంది. లేడి ఒంటినిండా తొమ్మిది బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. వాటిలోంచి రక్తం కారడం కనిపిస్తోంది. ఫ్రీడా కు నిజజీవితంలో తగిలిన గాయాలకు అవి గుర్తులు. ఒక వేపు తొమ్మిది చెట్లు. మరో వేపు సగం నరకబడ్డ ఒక చెట్టు, ముందు భాగంలో, నరకబడ్డ దాని కొమ్మ. దూరంగా నది, పైన ఆకాశం, తెల్లమబ్బులోంచి ఒక మెరుపు, దాని కాంతి ప్రవాహం. చిత్రానికి కేంద్ర బిందువైన ఆమె మొహం, గాయాలున్నప్పటికీ, ధైర్యంగా చూపరులకేసి చూస్తూంటుంది. ఆమె అన్ని కష్టాలలోను ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు. చిత్రంలో తొమ్మిది అంకెకిచ్చిన  ప్రాధాన్యత గమనార్హం. చిత్రంలోని లేడి-దుప్పికున్న కొమ్ములు, కింద పడ్డ కొమ్మ కున్న రెమ్మలు కూడా తొమ్మిదే! ఫ్రీడా లో మగ – ఆడ స్వభావాలు రెండూ ఉన్నాయి. ప్రాచీన కొలంబియా, బౌద్ధమత, క్రిస్టియన్ సంస్క్రుతులకు సంబంధించిన ప్రతీకలు కూడా చిత్రంలో చోటు చేసుకున్నాయి. ఫ్రీడా అద్భుత సృజనాత్మకశక్తికి ఈ ప్రతీకాత్మక చిత్రం ఒక మచ్చు తునక.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.