జ్ఞాపకాలసందడి -1

-డి.కామేశ్వరి 

1952 లో పెళ్లయింది. ఒరిస్సాలో కటక్ లో మా ఆయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు. ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది. మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ లో పనిచేసేవారు. ఆయన ముందువెళ్ళి అన్ని ఏర్పాట్లుచేసుకున్నాక పంపమని చెప్పివెళ్ళారు. వైజాగ్ లో మెడిసిన్ చదివే మరిదిని తోడిచ్చిపంపారు. అర్థరాత్రి  కటక్ లో స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకున్నారు ఆయన. ఆ రోజుల్లో మనిషిలాగే రిక్షాలు, టాంగాలూ (గుఱ్ఱంబండి తలుపులుండేవి ) మొదటిసారి చూడ్డం, ఎక్కడం.  సామాను పైనపెడతారు. కొత్తగా వుంది అనుభవం.

సరే గిరిధర్ సాహు కాలనీ  కొత్త ఏరియాలో ఇల్లు. అది ఎలావుందంటే పెద్ద పొడవాటి సందు.  ఇటు అటు పది ఇళ్లు వరసగా రైల్ పెట్టెల మాదిరి వుంది. లోపల లోపల, నాలుగువైపులా గదులు.  మధ్య ఖాళీస్థలం స్క్వేర్ గ. వంటగది భోజనం గది ఒకవైపు, బాత్రూం టాయిలెట్, నుయ్యి వెనకవైపు, ముందువైపు డ్రాయింగ్ రూమ్ ఒకపక్క రెండుబెడ్రూం లు ఒక వైపు మొత్తం ఆరుగదులు అద్దె 40 రూపాయలు. ఏమిటో ఒరిస్సా బాక్వర్డ్ అనేవారు, ఊరు, ఇల్లు ఎలాఉంటాయో అని అందరూ అంటే గుబులుగా ఉండేది. ఊరు ఒరిస్సాలో పెద్ద ఊరు అయినా పాతకాలం పట్టణం. ఇల్లు బాగుంది ఉన్నంతలో.  కొత్త భార్య కోసం నీట్ గా  సర్దేసారు ఆయన

సరే ఇంక ఆ ముచ్చట్లు పక్కన పెట్టి అసలు విషయం, భాష. ఒరియా రాదు, అక్కడ ఇంగ్లీష్ కూడా అంతంతమాత్రమే, హిందీ కూడా పెద్దగా రాదు వాళ్ళకి. రిక్షా వాళ్ళంతా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. పెళ్ళికుదిరాక ఆదివారం ఆదివారం మా నాన్నకి అభ్యంగ స్నానం అంటే చక్కగా నూనెలు రాసి మాలిష్చేసి తలంటడం. మానాన్నగారి దర్జా అలా వుండేది. మంగలి వచ్చేవాడు ఆరోజుల్లో వైజాగ్ ఆంధ్రాలో ఒరిస్సానించి మంగలి వారు పొట్టకూటి వచ్చి పనిచేసేవారు. అమ్మ దీనికి నాలుగు ఒరియా ముక్కలు నేర్పు అంది. వచ్చాను, వెళ్ళాను. కూరలు, పళ్ళు, పనిమనిషితో పనికి కావలసిన మాటలు, రోజువారీ మాటలు కొన్ని నేర్పించాడు. కొన్నాళ్ళు అవస్థపడి క్రమంగా నేర్చుకున్నా .

అప్పుడు వెళ్లిన నెలతర్వాత ఒక రోజు ఆయన లేనపుడు, పక్కింటాయన వచ్చాడు. ఏదో ఆఫీసులో క్లర్క్ అనుకుంట. తలుపు తీసా.

“ఐ వాంట్ యువర్ staircase అన్నాడు” ఉపాధ్ఘాతం ఏమిలేకుండా, డైరెక్ట్ గ.

ముందు నాకర్ధం కాలేదు. “staircase అంటే మెట్లుకదా అవి కావాలంటాడేమిటి ఆరోజుల్లో నాకొచ్చిన ఇంగ్లీష్ అంతంతమాత్రమే గదా, అయినా మా ఇంట్లో staircase లేదు అన్నా . డాబావుండేది కాని మెట్లు లేవు ఇంటికి.

నన్ను అనుమానంగా చూస్తూ , “వుంది నేను చూసా” అన్నాడు.

ఒరియా ఇంగ్లీష్ లో “నో” అన్నాను నేను.

డాబామీదకి చూపిస్తూ 
“నిన్న మీ హస్బెండ్ మీదకి వెళ్లడం చూసా” అంటూ నా పక్కనించి దారి చేసుకుని లోపలికి వచ్చేసి
ఓపెన్ స్పేస్ లో గోడకి నిలబెట్టిన నిచ్చెన చూపిస్తూ “దేర్ ఇట్ఈజ్” దొంగని పట్టినంత సంబరంగా అన్నాడు. 

ఓరి నీ దుంపతెగా!  ladder ని staircase అంటూ నేను అబద్ధం చెప్పినట్టు చూసాడు

“దాన్ని ladder అంటారు staircase అంటే మెట్లు అన్నాను.

అపుడు వాడన్నమాట వింటే ఏమంటారో మీరు …

“ఓ తెలుగు లో ladder అంటారా ఐ డోన్ట్ నో తెలుగు” అని నిచ్చెన చంకన పెట్టుకుని పోయాడు.

ఆ రోజుల్లో sslc చదివితే గుమస్తా ఉద్యోగాలు వచ్చేవి. ఒరియామీడియం లో చదివినవాడు.

మా వారు వచ్చాక చెపితే ముందు నవ్వి నవ్వి తరువాత తిట్టారు “ఆ వెధవకి ఎందుకిచ్చావ్ ” అని.

ఇంతసోది ఎందుకు ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి అనచ్చు మీరు ఆరోజులు బాక్గ్రౌండ్ తెలియాలిగదా ఈ తరానికి-  

*****

Please follow and like us:

One thought on “జ్ఞాపకాలసందడి -1”

Leave a Reply

Your email address will not be published.