నారి సారించిన నవల 

-కాత్యాయనీ విద్మహే   

2

20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను బట్టి చిన్నప్పటి నుండి ఆమె ఆంధ్రసాహిత్యం  మీద ప్రేమతో పుస్తకాలు బాగా చదివేదని సమకాలంలో ఎక్కువగా వస్తున్న నవలలను మరీ ఇష్టంగా చదువుతూ, పూర్వకాలంలో రచనలు చేసిన స్త్రీల నుండి స్ఫూర్తిని పొంది రచనా రంగంలోకి ప్రవేశించిందని తెలుస్తున్నది. అప్పటికే తాను వ్రాసిన ‘ప్రియాన్వేషణం’ అనే నవలను ప్రచురించిన శ్రీ లీలావతీ సమాజం వారే ఇప్పుడీ నవలను ప్రచురించినట్లు కృతజ్ఞతతో పేర్కొన్నది.  సేతుపిండారీ నవల లో ఎడమవైపు పేజీలో లీలావతీ నవలలు అని ఉండటం చూడవచ్చు.  

  1812 ఆశ్వీజమాసంలో నవలలో కథ ప్రారంభం అవుతుంది. గిరిజాపురం నుండి ఇందూరు నగరానికి ఒక యువకుడి ప్రయాణ ప్రస్తావన తో నవల ప్రారంభం అవుతుంది.  గిరిజాపురం నుండి వెళ్ళేమార్గం సింధియా హోల్కార్ రాజ్య సరిహద్దులలోని అడవి అన్న సూచన ఉంది. సింధియా , పీష్వా,హోల్కార్ లమధ్య వంశపారంపర్యంగా కొనసాగివస్తున్న కలహాల నేపథ్యంలో ,స్థానిక పాల కుల మద్దతుతో థగ్గులు పిండారీలు  అనే బందిపోటు దొంగల గుంపులు సాగిస్తున్న అరాచకాలను ఇతివృత్తంగా చేసి వ్రాసిన నవల ఇది. అందువల్ల ఇది అనువాద నవల కావచ్చుననిపిస్తుంది. కానీ రచయిత్రి తన విజ్ఞప్తిలో ఆ విషయమేమీ ప్రస్తావించలేదు.కథ మాత్రం ఇందూరు లో మొదలై నైజాం రాష్ట్రం లోని ఎలిచాపురం నుండి వింధ్యపర్వత అటవీ ప్రాంతాలగుండా మహారాష్ట్రలోని అమరావతికి అక్కడి నుండి కృష్ణానది మీదుగా గుంటూరు, కడప, కర్నూలు,మళ్ళీ నైజాం రాష్ట్రానికి అక్కడి నుండి నాగపూర్ వైపుగా అటవీ ప్రాంతాలలో ప్రవర్తిస్తూ ముగుస్తుంది.థగ్గులు, పిండారీల దాడులు, దోపిడీలు, హింస, స్త్రీల మీద అత్యాచారాలు -దోచుకొన్నసంపద పంపిణీలు, వాటిలో తమవంతు వాటాలు ఉన్నందువల్ల  నేరాలను అరికట్టే ఉద్దేశమే లేని పాలకవర్గాల స్వభావం ఈ నవలలో విమర్శకు గురి అయ్యాయి. సహదేవరావు థగ్గుల గుంపులో వాడు. అతని మరదలు లక్ష్మీబాయి. ఆమెను పెళ్లాడాలన్నది అతని కోరిక. ఆమె ప్రేమించింది రానోజిని. సహదేవరావు ఆమెను ఎత్తుకెళ్ళటం, ఆమె అతని నిర్బంధం నుండి తప్పించుకొని బిల్లులను కూడగట్టి అతనిమీదికి దాడి చేయటం, వాళ్ళ బారిన బడ్డ రానోజిని రక్షించుకొనటం నవల కథలోని ఒక పాయ. సహదేవరావు బందీ అయిన మిత్రవర్మ అనే వ్యాపారి కూతురు ప్రియంవద ధిక్కారం, తెగువ ఇందులో మరొక పాయ. పిండారీల నాయకుడు సేతుమర్ధనుడి పేరు మీద ఈ నవల పేరు సేతు పిండారీ అయింది.రానోజి, మగవేషంలో ఉన్న లక్ష్మీబాయి సహదేవరావు నుండి సేతు పిండారీని కాపాడటం ఒక అంశం.ప్రియంవద ఏమైందో , సేతుపిండారీ ఎందుకు నవలే తివృత్తానికి కేంద్రం అయ్యాడో చెప్పే కథాభాగం బహుశా రెండోభాగంలో ఉండివుంటుంది. నవలలో ప్రథమభాగం మాత్రమే ఇప్పటికి లభిస్తున్నది.శ్రీనివాసమ్మ  చరిత్రపరిజ్ఞానం, చారిత్రక దృష్టి, భౌగోళిక విజ్ఞానం, అడవుల గురించిన అవగాహన ఈ నవలలో చక్కగా వ్యక్తం అయ్యాయి. 

1916 లోనే వేమూర్ ఆండాళ్ళమ్మ వ్రాసిన ‘ కమలిని’ నవల వచ్చింది. ఆనంద ముద్రణాలయాధిపతులైన ఆర్. వెంకటేశ్వర్ అండ్ కంపెనీ ప్రచురించింది. రామారాయణింగార్ ఆంగ్లంలో ముందుమాట వ్రాసాడు.  కాళహస్తి జమిందార్. పానగల్ రాజాగా ప్రసిద్ధుడు. జస్టిస్ పార్టీ నాయకుడు. అన్నిటినీ మించి అణచివేయబడ్డ వర్గాల సాధికారతకుగట్టి మద్దతుదారు. అందు వల్లనే కావచ్చు, కమలిని నవలకు ఆయన ముందుమాట వ్రాసాడు. సాహిత్య రచనా సామర్ధ్యం అనేది పురుషులకు మాత్రమే పరిమితమైనది అనుకోరాదని అంటాడాయన. భారతీయ సాహిత్య ప్రపంచంలో  స్త్రీల సాహిత్య సంప్రదాయాన్ని ప్రస్తావించటమే కాక స్వర్ణమ్మ అనే మహిళ నవలలు వ్రాసిన విషయాన్ని ప్రస్తావించి ఆమె నవల ఇందిర పాఠ్య గ్రంధంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆండాళ్ళమ్మ రావుబహద్దూర్ ఆళ్వారుచెట్టి భార్య అని, నవలలో కథను చక్కగా కూర్చిందని, సరళ సుందరమైన భాష, జాతీయాలు నవలలో ఉన్నాయని పేర్కొన్నాడు.  ప్రత్యేకించి అడవి దృశ్యాల చిత్రణలో ఆమె నైపుణ్యం కనబడుతుందని భర్తతో కలిసి కొచ్చిన్ అడవులలో గడిపిన అనుభవాన్ని బాగా వాడుకొన్నదని మెచ్చుకున్నాడు. భారత మహిళలు ఆమె మార్గంలో సాహిత్య వ్యవసాయం చెయ్యాలని సూచించాడు. భూమిక పేరుతో వ్రాసిన ముందుమాటలో రచయిత్రి ఆ నవల పూర్తి చేయటంలో లభించిన ప్రొత్సాహాన్ని గురించి చెప్పి తన రచనలోని తప్పులను పాటింపక ఒప్పులను గ్రహించి ప్రోత్సహించవలసినదిగా పాఠకులను కోరింది. 

పారిజాతపునగర రాజపుత్రుడు మనోహరుడు ఎన్నో ప్రయాసలకు ఓర్చి  కమలిని ని పెళ్ళాడి తన నగరానికి తీసుకుకొని వెళ్తుండగా వాళ్ళను చంప నియోగించబడిన వీరేశం వచ్చి వాళ్ళతో స్నేహం నటిస్తూ తిరగటం, వాళ్ళ మధ్య ప్రేమను చూసి చంపటానికి మనసు రాక విడదీయాలని అనుకొనటం ,ఆ ప్రకారంచేయటం, కమలినిని రక్షించిన గోవిందమ్మ తనఇంట్లో ఆశ్రయమియ్యటం, అక్కడ పశువులను కాస్తూ ,ఇంటి పనులు చేస్తూ కాలం గడపటం, ఆమె కొరకు వెతికి వేదనపడిన మనోహరుడికి తాను ప్రేమించిన పురుషుడిని వెతుక్కొంటూ వెళ్తున్న ఒక యువతి తటస్థపడటం తదితర ఘటనలతో సాగి చివరకు కమలినీ మనోహరులు కలుసుకొనటంతో ముగుస్తుంది ఈ నవల. సందర్భం కల్పించుకొని మరీ బాల్యవివాహాలు, వృద్ధవివాహాలు మొదలైన సాంఘిక దురాచారాలపై స్త్రీల నిరసన స్వరాన్ని నమోదుచేయటం ఈ నవలలో విశేషం. 

1917 లో రెండు నవలలు వచ్చాయి. ఒకటి కాంచనపల్లి కనకాంబ ( కంచనపల్లి కనకమ్మ అని కూడా అంటారు)వ్రాసిన ‘అమృతవల్లి’, రెండవది వేంకట చెల్లాయమ్మ వ్రాసిన ‘విద్యావతి’.  అమృతవల్లి నవలను ఎం ఆర్ కృష్ణారావు అండ్ కంపెనీ ప్రచురించింది. మన్నేపల్లి రామకృష్ణరావు వ్రాసిన సంపాదకీయ విజ్ఞప్తి వలన ఈ నవల తమిళంలో పండిత నటేశ శాస్త్రి వ్రాసిన దిక్కులేని ఇద్దరు పిల్లలు( The two orphans on the terrible adventure ) నవలకు అనువాదం అని, మద్రాసులో దొరతనం వారి బ్రాహ్మణ వితంతు శరణాలయంలో స్కూల్ ఫైనల్ పరీక్షకు చదువుకొంటున్న కనకాంబ  ఈ నవల వ్రాసిందని, ఆమె విజ్ఞాన చంద్రికామండలి వారి విద్వత్పరీక్షలో బహుమతి పొందిందని తెలుస్తుంది. భాషాంతరీ కరణం రసవంతంగానూ, భావగర్భితంగానూ సుబోధకంగానూ వుండి మాతృకలో కల్పనా చాతుర్యాన్ని వెల్లడిస్తున్నదని మెచ్చుకొన్నాడు.

అమృతవల్లి పచ్చయప్ప మొదిలియార్ రెండవ భార్య. ఆమె కు కూడా ఇది రెండవ పెళ్లి. అప్పటికి ఆమెకు ఒక కొడుకు. అంబికాపతి. పచ్చయ్యప్ప వలన కలిగిన కూతురు బాలలత. ఈ నవల ప్రారంభం ఒక తాత ఇద్దరు చిన్న బాలికలతో ఉరాచి కి రావటంతో మొదలవుతుంది. ఆ పిల్లలలో పెద్దదాని పేరు రాధ . చిన్నదానిపేరు అలమేలు . అలము ముద్దు పేరు. వచ్చిన నాటి రాత్రే అగ్నిప్రమాదం లో గుడిసె అంటుకొని తాత  మరణించటం , పిల్లలు దిక్కులేనివాళ్ళై వూరు విడిచి వెళ్ళటం దారిలో ఒక స్త్రీ మోసానికి గురై దొంగలుగా పోలీసులకు పట్టుబడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టబడటం జడ్జీ వారు నిరపరాధులను గ్రహించి వసతిగృహంగల ఒక పాఠశాలకు పంపటం, అక్కడకు వచ్చిన ధనికురాలు కనకవల్లి రాధను పెంపకానికి తీసుకువెళ్తాననటం, చెల్లెలిని వదిలి రానని రాధ బదులియ్యటం కనకవల్లి అహంకరించి మాట్లాడటం, కనకవల్లి తో పాటు వచ్చిన ధనకోటి ఆ అక్కచెల్లెళ్లకు మంచి చదువు చెప్పించి ప్రయాజకులను చేయాలని భావించి వజ్రాలు పొదిగిన వడ్డాణం చేయించుకొనటానికి సిద్ధం చేసుకొన్న 25,000 రూపాయలను అందుకు ఉపయోగిద్దామని భర్తకు చెప్పటం, భార్య సద్బుద్ధికి అతను సంతోషించటం, ఆఇద్దరినీ కోయంబత్తూరులో ఉన్న కళాశాలకు పంపటం వరకు ఈ నవలేతివృత్తంలో ప్రధమఘట్టం. చదువు సంగీతాలతో పదేళ్లు గడిచాక అక్కడికి చదువు కోసం వచ్చి ఆత్మీయురాలైన బాలలతతో రాధ ఉరాచికి, అలము కామాక్షీ మొదిలియార్ ఇంట పిల్లలకు చదువుచెప్పటానికి కళ్లికోటకు పోవటంతో అనేక మలుపులతో కథాగమనం వేగవంతమవుతుంది.

అమృతవల్లి కుట్ర వలన బాల్యంలోనే పచ్చయ్యప్ప మొదిలియార్ నుండి వేరుచేయబడిన అతని మొదటి భార్య అంబుజం పిల్లలు అలంకారం, రంగం-  రాధ, అలము అని తెలుస్తుంది. కావేరీ నదిలో తోసివేయబడ్డ ఆ పిల్లలను కాపాడిన వృద్ధుడు అంత్యకాలం సమీపిస్తున్నదని, తన తరువాత ఆ పిల్లలు దిక్కులేనివాళ్ళు కాగూడదని ఉరాచి కి తీసుకొని వచ్చి ఆ రాత్రే నిప్పు అంటుకున్న గుడిసెలో తగలబడిపోవటం వెనుక, అతనితో పాటు పచ్చయప్ప మొదిలియార్ ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్న అరుణ్ నాథ్ హత్యచేయబడటం వెనుక ఉన్న మర్మాన్ని కనిపెట్టాలని అతనిని పెళ్లాడవలసిన కుంతల , అమృతవల్లి పిల్లలకు టీచరు అయిన కుంతల ఎదురుచూపులు ఈ క్రమంలో కథ ఉత్కంఠ కలిగిస్తూ సాగిపోతుంది. వైద్యానికి దూరదేశం వెళ్లిన పచ్చయప్ప తిరిగి వస్తూ కామాక్షీ మొదిలియారు ఇంట  అలమును చూచి తన భార్య అంబుజం పోలికలు గుర్తించటంతో తీగె లాగితే డొంకంతా కదిలినట్లు అన్ని విషయాలు బయటపడతాయి. పచ్చయప్ప మొదిలియార్ ఆస్తిపాస్తులన్నీ తనకూతురు బాలలతకు మాత్రమే చెందాలని అతని మొదటి భార్య పిల్లలను చంపించటానికి గుడిసెకు నిప్పు అంటించటంతో సహా అమృతలత చేసిన ప్రయత్నాలు, పిల్లల సంగతి తెలిసిన అరుణ్ నాథ్ ను చంపటం అంతిమంగా భర్తముందు నేరస్థురాలిగా ఆమెను నిలిపాయి. కుంతల ఆమెను చంపి పగ తీర్చుకొనటంతో నవల ముగింపుకు వస్తుంది. అమృతవల్లి మొదటి భర్త కొడుకు అంబికాపతిని అలమేలు, పచ్చయ్యప్ప మేనత్త కూతురు భాగీరధి కొడుకు పశుపతిని రాధ, పినాకపాణి ని బాలలత పెళ్లాడటం చివరి ఘట్టం. సాహసోపేతంగా సమస్యలను ఎదుర్కొని జీవితాన్ని గెలిచిన రాధ, అలము స్త్రీలకు ఆదర్శనమూనా. ప్రేమించి పెళ్లాడబోయిన యువకుడి దుర్మరణానికి కారకులైన వ్యక్తిని గుర్తించి ప్రతీకారం తీర్చు కొనేవరకూ పట్టుదలతో బతికిన  కుంతల మరొక ఆదర్శ నమూనా. స్త్రీలు ఎలాఉండకూడదో చూపటానికి ఎంచుకొన్న నమూనా అమృతవల్లి. ఆమె పేరే ఈ నవలకు శీర్షిక కావటం కొంత విచిత్రం గానే కనబడుతుంది. ఏమైనా “ ఈ యద్భుత కథ చదువ మొదలిడినా తుదివరకు చదువ వలయునను నుత్సాహమును జనింపచేసి హృదయాకర్షకముగ నుండును.” అని సంపాదకీయ విజ్ఞప్తిలో సుబోధినీ గ్రంథమాల ఎడిటర్ మన్నేపల్లి రామకృష్ణరావు వ్రాసిన మాటలు మాత్రం అక్షర సత్యాలు. 

    1917 లోనే వచ్చిన ‘విద్యావతి’ నవల వ్రాసిన  వేంకట చెల్లాయమ్మ రామచంద్రాపురానికి చెందిన రచయిత్రి. రాయవరములోని  శ్రీ మేరీ ముద్రాక్షర శాల లో ఈ నవల ప్రచురించబడింది. విద్యావతి అయిన స్త్రీ  దుర్వ్యసనాలకు లోనై చెడుదారులలో వెళ్తున్న భర్తను ఎలా కాపాడుకోగలుగుతుందో చెప్పటం ఈ నవల ఉద్దేశం. బిఎ పాసయిన యువకుడు మాధవుడు  గంజాయి వ్యసనానికి లోనై తల్లిదండ్రులకు కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకు ఖేద కారకుడు కావటం, ప్రాణహాని సంభవించబోయే సమయంలో పురుషవేషంలో అతనిని కనిపెట్టి వెన్నంటి వస్తున్న భార్య అతనిని కాపాడటం, పరివర్తనకు లోనై మాధవుడు పై చదువులకు భార్యతో కలిసి మద్రాసు ప్రయాణం కావటం ఇందులోని కథావిషయం. 1880 లనాటికే  విస్తరిస్తున్న సారా వ్యాపారం గురించి తెలిసి జ్యోతిబాపూలే ,కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్తలు నిరసిస్తూ వచ్చారు, గురజాడ కన్యాశుల్కం నాటకంలో సారాయి దుకాణపు దృశ్యాన్ని కల్పించి ‘తెల్లోడి’ సారా విధానంపై ఒక చురక వేసాడు. నిజానికి దానితో సమాంతరంగా భారతదేశపు సంపన్న వర్గం గంజాయి, నల్లమందు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి మరింత ఎదుగుతున్న ప్పటికీ దానిని ఒక నైతిక విషయంగా కూడా ఎవరూ సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన దాఖలాలు కనిపించవు. అటువంటి సమయంలో  చెల్లాయమ్మ గంజాయిని ఒక సమస్యగా చేసి నవల వ్రాయటం విశేషమే. గంజాయికి అలవాటుపడటం, అది కల్పించే డబ్బు అవసరాలు కొత్తవాళ్లను ఆ అలవాటుకు పురికొల్పేలా చేయటం , ఇంట్లోవాళ్ళ కళ్లుగప్పే ప్రవర్తనకు కారణం కావటం -ఇవన్నీ మనిషివ్యక్తిత్వాన్ని వ్యతిరేకముఖంగా ప్రభావితం చేయటం సాధారణం. మాధవుడి పాత్ర చిత్రణ లో చెల్లాయమ్మ దీనిని బాగానే ప్రతిఫలించగలిగింది. మగవాళ్ళు ఇలాంటి అలవాట్లకు లోనైనప్పుడు వాటి ఫలితాలు స్త్రీలపై ఎంతవత్తిడిని కలిగిస్తాయో చూపించటం చెల్లాయమ్మ చేసిన మరొక పని. మాధవుడి తల్లికి  ఊళ్లోని స్త్రీలకూ రెండు సార్లు ఆమె కల్పించిన సంభాషణల సన్నివేశాలు అందుకు నిదర్శనం. స్త్రీల మధ్య ఒక స్నేహ సానుభూతవాతావరణాన్ని, అత్తాకోడళ్ల మధ్య స్నేహాన్ని, ప్రేమను సహజ విషయాలుగా చిత్రించటం ద్వారా చెల్లాయమ్మ ఈ నవలలో స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న తరతరాల భావనను తిప్పికొట్టి పురుష దౌర్జన్యాలకు వాళ్లెప్పుడూ బాధితులే అని చూపగలిగింది. అయితే నవల ముగింపులో మాత్రం ఆ పురుషులను మంచికి మార్చుకొనటం అన్నది స్త్రీల బాధ్యత అని, పురుషులు ఎన్ని చేసినా, తమకు ఎంత బాధకలిగినా ఏమీ అనకుండా పతివ్రతలై వున్నప్పుడే   స్త్రీలు అంతిమంగా విజయులవుతారని వాచ్యంగానే చెప్పింది.    

జాతీయోద్యమంలో క్రియాశీల భాగస్వామి అయిన మాగంటి అన్నపూర్ణ 1917 లో వ్రాసిన సీతారామము నవల దొరికినట్లతే ఆమె వ్యక్తిత్వం ఈ పాతివ్రత్య భావనాలకన్నా భిన్నంగా ఏమన్నా  నిర్మితమయిందేమో తెలుసుకొనటానికి వీలుండేది. 1918 లోనే ‘రూపవతి’ అనే నవల వ్రాసి అట్లూరి వేంకట సీతమ్మ రచనారంగ ప్రవేశం చేసింది.కానీ ఆ నవల 1926 లో గానీ అచ్చు కాలేదు. ఉభయభాషాప్రవీణ ఆమె విద్యార్హత. కవితా విశారద ఆమె బిరుదు.  చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు వ్రాసిన రాజస్థాన కథావళి లోని మోకలరాణా చరిత్ర ఆధారంగా రసపుత్ర రాజవంశానికి చెందిన రూపవతి ని నాయికగా చేసి సీతమ్మ ఈ నవల వ్రాసింది. 1/16 క్రౌన్ సైజులో 212 పుటలతో వచ్చిన ఈ చారిత్రక నవల, 1933 లో సవరణలతో  మళ్ళీ ప్రచురించబడింది. మద్రాసు రాష్ట్ర పాఠ్య పుస్తకాల కమిటీ ఆమోదాన్ని పొంది విద్యార్థులకు అధ్యయన విషయం అయింది. ఆమె రాధామాధవము అనే 313 పుటల సాంఘిక నవలను కూడా వ్రాసింది. కానీ రెండూ ఇప్పుడు అలభ్యాలే. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.