పునాది రాళ్ళు-2 

-డా|| గోగు శ్యామల 

”దళిత స్త్రీల జీవిత అనుభవాల ఆధారంగా తెలంగాణా  రాష్ట్రంలోని కులాల చరిత్రను అధ్యయనం చేయడం ” అనే శీర్షికన జరిగిన నా పరిశోధన కోసం ఈ   ఐదుగురు స్త్రీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాను ? వారితో  నాకున్న సంబంధం ఏమిటీ ? మరో వైపు ఈ స్త్రీల కుటుంబం, కమ్యూనిటీ నేపథ్యాల ద్వారా కులవ్యవస్థను  పరిశీలించడం కూడా ప్రాధానంగా జరిగింది.

ఈ ఐదుగురు స్త్రీలు దళిత కమ్మూనిటీలలోని వివిధ కిన్ బంధు సమాజాలకు  చెందినవారు అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ప్రస్ఫుటంగా కనబడడం కోసమే ఈ అధ్యయనంలో వీరి కమ్మూనిటి పేర్లను దళిత అని ఏకశిలాసదృశంగా  ఉపయోగించకుండా వారి బందు కమ్మూనిటీ లేదా సమాజాల పేర్లను వాడడం జరిగింది. ఇలా వాడడం వలన దళిత సమాజంలోని వైవిధ్యతను, వీటి మధ్య నేలుకొని ఉన్న కళారూపాల, సంప్రదాయాల, సాంస్కృతిక, ఆర్థిక,  చారిత్రిక, ధార్మిక సంబంధాలను పొడసూపుతుంది.

మరో ముఖ్యమైన అంశమేదంటే ‘దళిత’ పదంలోని పరిమితులనూ మరియూ ఆధునిక దళిత ఉద్యమంలోని ఈ ఐదుగురు స్త్రీలను వివిధ బంధు బలగం సమూహాల నుండి ఎంపిక చేసుకోవడం ద్వారా ఆదునిక దళిత ఉద్యమ నిర్మాణాన్ని ప్రతిభింభింప చేయవచ్చు అనేది ఒకటి అయితే. ‘దళిత ‘ పదం నిర్వచనం చుట్టూ నెలకొని ఉన్న రాజకీయాలను విమర్శనాత్మకంగా చూడడం  మరొకటి.

అవి ప్రధానంగా దళిత పదం  దేశంలో కులవ్యవస్థ కారణంగా మాల మాదిగలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా  అణిచి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని తెలుపుతూ వారి కిన్ సమూహాలు కుల వ్యవస్థ యొక్క బాధితులనే అస్తిత్వాన్ని గుర్తింపును  అంతర్జాతీయంగా ‘దళిత’ పదం ఒనగూర్చ గలిగింది. కానీ అంతర్గత ఐక్యతను చేయగలిగిన సామర్థ్యం దళిత నిర్వచనం నుండి ఆశించలేం. మాల మాదిగలకు సంబదించిన చరిత్ర , సంస్కృతి, కళాతత్వ శాస్త్రం, సౌందర్య శాస్త్రం, ప్రకృతి ఉత్పత్తి తాలూకు పరిజ్ఞానం తదితర అంశాలను ఈపదం నిర్వచనం పరిగణనలోకి తీసుకోలేక పోతుంది. నిరంతరం దళితులను  సామిజిక ఆర్ధిక ఉత్పత్తి శక్తులుగా కాకుండా కేవలం కులం బాధితులుగా మాత్రమే నిలబెడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దళిత పదం వర్తమాన రాజకీయాల్లో( క్లెయిమ్) కోరుకున్న పదమే కానీ చారిత్రాత్మకంగా వచ్చిన పేరుకాదు. తెలంగాణా ఆంద్రప్రదేశ్ లలో మాల మాదిగ డక్కలి చిందు, మాస్టిన్, బైండ్ల, మెహతర్ మొదలైన 59కమ్మూనిటి పేర్లు మాత్రం చరిత్రాత్మకమైనవి అని చెప్పాలి.  

విభిన్నతను, క్లిష్టతను, అస్తిత్వ ఆత్మ గౌరవ దృక్కోణాలను సంక్షిప్తంగా తెలిపే ప్రయత్నం  జరిగింది. జనాభా లెక్కల ప్రకారం యాబై ఆరు కమ్మూనిటీల పేర్లు ఉనికిలో ఉన్నాకానీ, ఇక్కడా నాలుగు కమ్మూనిటీలకు మాత్రమే  పరిమితం కావడంను గమనించాలి. ఇందులో భాగంగానే, మాదిగ, మాల, మెహతర్ మరియూ చిందు అని వారి పేర్లపక్కన పేర్కొనడం జరిగింది. అంతేకాక  అందరి కమ్యూనిటీల పేర్లను ఒక్క పదంలో కలిపి సమిష్టిగా ఒక పేరుగా ఉపయోగించాలనే ఉదేశ్యంతో “మాదిగ మాల సాటిలైట్ కమ్యూనిటీస్ “( మా మా స్ )అని ఉపయోగించడం  జరిగింది. ఈ పదాన్నిచరిత్రలో మునుపటి హైదరాబాద్ రాష్ట్రం లో నడిచిన దళిత ఉద్యమాన్ని నాటి నాయకత్వo మామాల పోరాటం అని వాడిందనేది గమనించాలి. ఇలా పెట్టడానికి బలమైన కారణమే ఉంది. సుదీర్ఘ కాల ఉద్యమంలో దళితులు అనె నిర్వచనంలో కేవలం మాల మాదిగలే అధికంగా  కనిపిస్తారు. వీరి బందు కమ్యూనిటీలుగా ఉన్న యాభై ఏడు కమ్మూనిటీలు దళిత నిర్వచనాన్నిసొంతం చేసుకోవడం కాని, రాజకీయ లబ్ది పొందడం కానీ అంతగా కనపడదు. కారంచేడు చుండూరు ఉద్యమాల తరువాత ఎక్కువగా మాల మాదిగలు రాజకీయ గుర్తింపును చైతన్యాన్ని పొందారు. కానీ కిన్ బందు సమూహాలు  వారి సమస్యలు అంతగా వెలుగులోకి రాలేదనే చెప్పాలి . ఇక పోతే 25 సంవత్సరాల దండోరా ఉద్యమం చేసిన వర్గీకరణ పోరాటం బందు సమూహాలను కొంతవరకు కలుపుకరాగలిగింది. వీరు దండోరా ఉద్యమంలో భాగమువుతూనే తమ రాజకీయ అస్తిత్వాలతో, సొంత సంస్థలతో, మరియూ డిమాండ్లతో ముందుకు రావడం జరిగింది. చిందుహక్కుల సంగం, బయిండ్ల హక్కుల పోరాట సమితి డక్కలి హక్కుల పోరాట సంగం మొదలైనవి  ఈ కోవకు చెందినవే. వీటన్నిటితో గత సంచిక లో పేర్కొన్నప్రకారం అంబేద్కర్, కిమ్బెర్లీ క్రింష్వా, షర్మిళా రేగేల సిద్ధాంతాలను ఈ ఐదుగురి జీవిత పోరాటనుబవాలకు వర్తింపచేసి విశ్లేషించడం జరిగింది. 

మొదటి కథ :  చిట్యాల చిన్న రాజవ్వ ఈమెను కుదురుపాక రాజవ్వ అని కూడా అంటారు. ఈమె మాదిగ కమ్మూనిటికి  చెందినామె.1975 నుండి 80 వరకు మార్కిస్టు లెనినిస్ట్ పోరాటాల్లో కరీంనగర్ ప్రాంతంలో భూమికోసం జరిగిన పోరాటంలో కీలకంగా పాల్గొన్నది.  గ్రామీణ తెలంగాణాలో కరడు కట్టిన అగ్రకుల పురుష భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవాలు ఈమే కథలో పొందుపర్చడం జరిగింది.  

 రెండవ కథ: చందన్ కోటి హాజమ్మ,  ఈమె కూడా మాదిగామెనే. జోగిని వ్యవస్థ బాధితురాలిగా, ఎన్జీవో సంగం నాయకురాలిగా మహబూబ్ నగర్ జోగిని వ్యవస్థకు, మత, కుల పితృ స్వామ్య ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడి చట్టాలను, ప్రభావితం చేయించిన జీవితానుభవాలు ఈమె కథలో చోటుచేసుకుంటాయి.  

 మూడవ  కథ: టి యన్  సదాలక్ష్మి, ఈమె  మెహతర్ కమ్మూనిటీకి చెందినామె. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, దేవాదాయ శాఖామంత్రిగా, 1969 తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా,  మాదిగ దండోరా ఉద్యమానికి పునాదులేసిన అనుభవాలు, మంత్రిగా చట్టాలను చేసిన అనుభవాలు ఈమె జీవిత కథలో భాగమై తాయి.   

నాలుగవ కథ: జెట్టి ఈశ్వరీ బాయి, ఈమె మాల కమ్యూనిటికి చెందినామె. అఖిల భారత  షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ మరియూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షణ భారత దేశపు నాయకురాలిగా , ఎం ఎల్ ఎ గా, 1969 తెలంగాణ రాష్ట్ర పోరాట నాయకురాలిగా గడించిన అనుభవాలు ఈమె జీవిత కథలో పొందుపర్చడమైంది.   

ఐదవ కథ: పిళ్లెట్ల  చిందు ఎల్లమ్మ, ఈమె చిందు కమ్మూనిటీకి చెందినామే. చిందు యక్షగాన మేళం లో మేటి కళాకారిణిగా దేశవ్యాపితంగా పేరెల్లి తెలంగాణ గ్రామ కలసామ్రాజ్యపు  చరిత్ర లో స్థిరపడిన లెజెండ్ జీవిత కథ ఈమెది 

  ఈ ఐదుగురు స్త్రీల జీవితానుభవాలను పునర్ రచన  చేయడం నేటి అవసరం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.