కొత్తకథ

-సి.బి.రావు

కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు 1) అరుణ పప్పు 2) అపర్ణ తోట 3) ఝాన్సి పాపుదేసి 4) కుప్పిలి పద్మ 5) కడలి సత్యనారాయణ 6) మెర్చీ మార్గరెట్ 7) మిథున ప్రభ 8) రిషిత గాలంకి 9) వనజ తాతినేని. ఇంకా లబ్ద ప్రతిష్టులైన పలు రచయితల కథలూ ఉన్నాయి. Writers Meet Workshops ద్వారా పలువురు కొత్త రచయితలను పరిచయం చేస్తున్న సంపాదకులు అభినందనీయులు. 

పూవై పుట్టి – వనజ తాతినేని

సాధారణం గా తమ కథలు తిరిగివచ్చాయని  చెప్పుకోవటానికి రచయితలు ఇష్టపడరు. తమ కథలు చిత్రికపట్టి మరల, మరల వ్రాసామని  రచయితలు చెప్పరు. తమ కథ నేపధ్యాన్ని కూడా వెల్లడించరు. తమ కథలు గురించి మాత్రమే మాట్లాడటానికి ఇష్టపడతారు. అయితే వనజ తాతినేని  తన రచనల గురించిన విషయాలు దాచరు. సహ రచయితల కథలను అందరూ చదివేలా పరిచయం చేస్తూ, టపాలు వెలువరిస్తారు. మంచి కథ, ఎవరు వ్రాసినా, తగిన మెప్పు రావాలని తాపత్రయ పడతారు. పలు పత్రికలు తిప్పిపంపిన, పలుమార్లు తిరగరాసిన కథ పూవై పుట్టి ఈ కథా సంపుటిలో చోటుచేసుకుంది.  తిరిగొచ్చిన కథలు చెడ్డవా? ఒక పత్రిక తిరగకొట్టిన కథను ఇంకో పత్రిక వారు వేసుకుంటారు. కాబట్టి, తిరిగొచ్చిన కథలలో కూడా అణిముత్యాలుండవచ్చు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలను భారతి మాస పత్రికవారు తిరుగుటపాలో పంపలేదా? 1940 ల నాటి కవిత్వ తత్వానికి, చాలా ముందున్న ఆ  విప్లవ గీతాలు, భారతి సంపాదకులకు మింగుడు పడలేదు. ఆ తరువాత 1950 లో ప్రచురితమైన మహాప్రస్థానం జగన్నాథరధ చక్రమై అప్పటి కవితాధోరణులను తిరగరాసి మరో ప్రభంజనం సృష్టించలేదా? పూవై పుట్టి లాంటి ప్రయోగాత్మక కథలకు చోటిచ్చి, కొత్త కథ 2019 సంపుటం, ఒక సాహిత్య ప్రయోజనానికి తనవంతు దోహదపడింది.  

      

ఈ కథకు తను ఎంచుకున్న నేపధ్యం సరికొత్తది. ఒక రచయిత్రి తన మరణానంతరం, తన గురించి బంధు మిత్రులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని, స్వర్గ పాలకుల వద్ద ప్రత్యేక సెలవు తీసుకుని, భూలోకానికి వచ్చి ఏమి చేసిందో, చూసిందో తెలియచెప్పేదే ఈ కథ. కమల పాఠకులు కథ  లో ఎంత లీనం అవుతారంటే, కథా నాయిక మనస్తత్వం, జీవితం రచయిత్రిదే అని నమ్మేంతగా. కాని చదువరి, రచయిత వ్యక్తిగత విషయాలకు, కథలోని పాత్రల స్వభావాలకు లంకె పెట్టనప్పుడే రచయితకు మనఃశాంతి లభిస్తుంది. తన కవిత్వంతో జాతీయ, అంతర్జాతీయ అభిమానులు ఏర్పడతారు కమలకు. సాహిత్యరంగంలో ఎన్నో పురస్కారాలు, సన్మానాల తర్వాత 42 ఏళ్ళకే స్వీయకథ వ్రాసి ప్రచురిస్తుంది; బంధువులు వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా. జాతీయ, అంతర్జాతీయ సమ్మేళణాలకు ఆహ్వానం అందుకుంటుంది. సాహిత్య అకాడెమి లో ఉన్నత పదవికి ఎంపికవుతుంది. కమల భర్త మరణించాక, 65 ఏళ్ళ వయసులో, తనకంటే వయసులో చిన్నవాడైన ముస్లిం పండితుడు సాదిక్ ఆలి ప్రేమలో పడి, అతని ప్రోద్బలంపై ఇస్లాం మతం స్వీకరించటం కమల అభిమానులను సంభ్రమాస్చర్యాలకు గురిచేస్తుంది. అయినా లోకానికి వెరవకుండా తన మనసు చెప్పినట్లు చేస్తుంది కమల. బంధువులు ఈ మతమార్పిడిని ఆమోదించకుండా, ఆమెను వెలివేసారు. ఆ తరుణం లోను ఎన్నో కవితలు వ్రాసింది తన హృదయఘోషను వెల్లడిస్తూ.

బ్రతికుండగానే ఆత్మను సమాధి చేసి

పవిత్రత ముసుగేసుకునే ప్రపంచానికేమి తెలుసు ప్రణయబాధ,

కురిసీ కురవక మరలివెళ్ళే మేఘాలను చూస్తూ

ఇసుక తుఫానుగా మారిన ఎడారి యెడబాటు కథ

హృదయాలను కెలకకండి ఆలోచనలను త్రుంచ ప్రయత్నం చెయ్యకండి.

భూతద్దాలతో అంతరంగాలను శోధించే పని మొదలెట్టకండి.

బడబాగ్నులు దాచుకున్న మహాసముద్రం వాళ్ళు

యేదో ఒకనాడు దావానలంలా చుట్టేస్తారు వాళ్ళు

అయితే, Love Jihad పేరుతో అతను తనను దగా చేసాడని తెలుసుకుని ఖిన్నురాలవుతుంది. దుఃఖ విషంతో క్రుంగి, క్రుంగి చనిపోతుంది. అయితే ఇదంతా లిఖించని కథలా, 42 ఏళ్ళ వయస్సులో వ్రాసుకున్న ఆమె ఆత్మకథలో చోటు చేసుకోలేదు. తన భర్త మరణించినప్పుడు, పెట్టుకున్న సహాయకురాలు మున్నీ తన కథను ఎంతో శ్రద్ధగా, తన పాఠకురాలు పద్మకు చెప్తుంది. “ఆమె ఆత్మకథ భాగం -2 రావలసిన అవసరం ఉంది. రచయితలూ మనలాంటి మనుషులే. వారికీ వారి వారి విశ్వాసాలు, దేవుని పై భక్తీ ఉంటాయి”, అంటుంది పద్మ. తనని సరిగా అర్థంచేసుకున్న మున్నీ, పద్మలు తనను ఒక అరుదైన పువ్వుగా భావిస్తున్నారని తెలుసుకుని, సంతోషంతో ఉబ్బితబ్బిబై తిరిగి స్వర్గలోకానికి ప్రయాణం ప్రారంభిస్తుంది కమల.   

పూవై పుట్టి కథలో కథానాయికకు, ఆమె ప్రియుడికి ఎలాంటి పేర్లు ఇవ్వలేదు. అయితే పాఠకుల సౌలభ్యం కోసం ఆ పాత్రలకు ఊహాజనితమైన పేర్లుంచి ఈ సమీక్ష వ్రాయటం జరిగింది. కథలో శిల్పం లాంటి విషయాలు పక్కన పెడితే, కథ చెప్పిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది, తుదిదాకా ఏకబిగిన చదివేలా చేస్తుంది. ఆసక్తికరమైన ఒక ప్రయోగం ఈ కథ. 

 

కొత్తకథ 2019 సంపాదకులు కె.సురేష్, మహమ్మద్ ఖదీర్‌బాబు

1/8 డెమో పరిమాణం లో పుటలు 248

ధర రూ.149/-

నవోదయా, కాచిగూడ మరియు ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యం.  

amazon.in లో అచ్చు పుస్తకం మరియు కిండిల్ ఇ పుస్తకంగా లభ్యమవుతుంది.   

*****

Please follow and like us:

6 thoughts on “పుస్తకసమీక్ష-కొత్తకథ”

    1. కొత్తకథ 2019 లో చాల మంచి కథలున్నాయి. అన్ని కథలు, నెచ్చెలి మహిళల మాస పత్రిక లో పరిచయం చేయటం వీలు కాదు. ఇందులో వచ్చిన, స్త్రీల కథల పరిచయం, వచ్చే నెలలో చేయాలి.

  1. రచయితకు తన రచనను చదివే పాఠకుడు దొరకడమే అదృష్టం అంటారు.ఈ కథ మీ పరిచయానికి తగినదవడం కూడా వొక ప్రమోషన్ సర్ ..ధన్యవాదాలు. నెచ్చెలి కి ధన్యవాదాలు.

    1. @వనజ తాతినేని: మీ కథ చదువుతున్నప్పుడే, భిన్నంగా అనిపించి, పాఠకులకు పరిచయం చేయాలనిపించింది. మీ నుంచి, మరిన్ని మంచి కథలు వస్తాయని, పాఠకులు ఆశించవచ్చు.

Leave a Reply

Your email address will not be published.