రమణీయం-మన కోసం మనం
–సి.వి.రమణ
ఇల్లు అలకంగానే పండుగా కాదు, పందిరి వేయంగానే పెళ్ళీ కాదు, అన్నట్లు, మొక్క నాటంగానే వృక్షమూ కాదని మాకు వారం రోజులలోనే తెలిసిపోయింది. వాతావరణ శాఖ వెలువరిస్తున్న సూచనలను గమనిస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, అండమాన్ దాటేశాయి, కేరళ తీరం చేరుకుంటున్నాయి అంటున్నారు. మబ్బులు వచ్చినట్లే వచ్చి, వెనక్కు వెళ్తున్నాయి. కొన్నిసార్లు, మెరుపులు కూడా మెరుస్తున్నాయి. ఫెళ ఫెళ మనే శబ్దార్భాటం చూస్తే, ఇహనో, ఇప్పుడో వర్షం పడుతుందనిపిస్తుంది. కాని చుక్క రాలడం లేదు. వరుణ దేవుడు కరుణించినా, ఎల్-నినో అనే రాక్షసుడు అడ్డుపడుతున్నాడట.
ఈ లోగా మేము మొక్కలు నాటడం అయిపోయింది. నాటగానే పోసిన నీరు వలన, మూడు రోజులవరకు మొక్కలన్నీ బాగున్నాయి. తరువాత, నెమ్మదిగా ఒక్కొక్కటీ తలలు వేలాడేసాయి. మా గుండెల్లో, గుబులు మొదలయ్యింది. కింకర్తవ్యం? వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసాము. మనం మొక్కలను మొదటి రెండు సంవత్సరాలు రక్షిస్తే, అవి మనలను బ్రతికినంతకాలం సంరక్షిస్తాయి. అందుకే, అందరం మొక్కల్ని పెంచడం అనేది దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా చెయ్యాలనుకున్నాము. చిన్న చర్చలు, సూచనల మధ్య మొక్కలను బ్రతికించడం ప్రధమ కర్తవ్యం కాబట్టి, నీటి కోసం అధికారులను కలవాలని నిర్ణయించుకున్నాం.
ముందుగా నలుగురు సభ్యులు వెళ్ళి, నగర నీటి పంపిణీ అధికారులను కలిసి, మొక్కలకు నీరు కావాలని అడిగారు. మనుషులు తాగటానికే లేవు, మీ మొక్కలకు ఇవ్వటం కుదరదు అని మర్యాదగా చెప్పి, తరిమినంత పనిచేసారు. మా ప్రాంతపు కార్పొరేటర్ తనకు తెలుసని, అతన్ని కలుద్దామని ఒక సభ్యుడు అన్నాడు. అతన్ని కలిసి, మేము చేసిన కార్యక్రమాలు చెప్పి, నీటి పంపిణి గురించి అడిగారు. ఆయన, మా కార్యక్రమాలను ఎంతగానో మెచ్చుకుని, నిజానికి మేము చెయ్యవలసిన పనులు మీరు చేస్తున్నారు. మీకు నీరు ఇవ్వటం, మొక్కలను బతికించడం, మా బాధ్యత అన్నారు. అంతే, మా వాళ్ళ ఆనందం ఇంతా అంతా కాదు. రెండు రోజులు గడిచినా, నీటి జాడ లేదు. ఎదురు చూపులు చూడటం, నీళ్ళు రాకపోవడం ఇంకెన్నాళ్ళు అని, ఆవేదన చెంది దిగులుగా మరల మరలా ఫోన్లు చేసాము, నివేదనలు పంపాము. ఒక రోజు నీళ్ళ టాంక్ డ్రైవర్ సెలవు, మరో రోజు నీరు నింపే పనివారు వెరే పనిలో నిమగ్నులయ్యారు; ఇంకో రోజు Tanker Engine చెడిపోయ్యింది అని సమాధానాలు వచ్చాయి. మా అందరికీ అర్ధమయ్యింది – వారికి Tanker తో నీరు పంపే ఉద్దేశం లేదని, కాబట్టి పంపరని.
ఇదికాదు, మన మార్గం. మనకోసం మనమే, ఎదైనా, ఏమైనా చేద్దాం అనుకుని అత్వవసరంగా సమావేశమై, ఆరుగురు ముఖ్య సభ్యులుగా “మనకోసం మనం (M.K.M.group)” అనే పేరుతో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము. సభ్యులందరూ సమానమే, ఎవరికీ, ఏ పదవులూ ఉండవు. మనకోసం మనం, అందరికోసం అందరం అనే నినాదంతో పనులు ప్రారంభించాం. కొత్తగా నీటిని పొందటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కనుక, ఉన్న నీటిని ఆదా చేయటం ఎలా అనేదే రగులుతున్న సమస్య. సమస్య ఉన్నది అంటే, పరిష్కారం ఉన్నట్లేగా. పరిష్కార మార్గాలేమిటంటే, అందరికీ నీటి పొదుపు గురించి కలిగే లాభాల గురించి వివరించాలి. నీటిని ఎలా ఆదా చెయ్యవచ్చో, కరపత్రాలు తయారు చేసి ఇంటింటికీ పంచాలి. నీటిని ఆదా చేసి, సేకరించి, మొక్కలకు పొయ్యాలి. ఏ, ఏ, పనులు, ఎవరెవరు చేయాలో ఆలోచించుకున్నాము.
నలుగు కుర్రవాళ్ళకి ఒక్కొక్క plumber ను జత చేసాము. వారు ప్రతి ఇంటికీ వెళ్ళి ఎక్కడైనా నీరు వృధాగా పోతుందా అని పరిశీలించి, నీరు కారే, నీటి కుళాయిలను, flush tank లను బాగు చేసారు. కొన్ని ఇళ్ళలో, కొత్తవి అమర్చారు; ఇంటివారి ఖర్చుతోనే. మొత్తం 750 కుటుంబాలు. మూడు రోజుల్లో, అందరి ఇళ్ళకు వెళ్ళడం, కరపత్రాలు పంచడం, వాటిలో వ్రాసిన విధంగా, నీటి పొదుపు గురించి వివరించి, అవసరమైన చోట హితబోధ చేసి, వచ్చారు మా సభ్యులు. మోటర్ వేసి మర్చిపోతే, టాంక్ నిండి, నీరు వృధాగా పోతుంది. నీరు నిండగానే, మోటర్ ఆగిపోయే సౌకర్యం కల (Automatic Water Pump Controller) నీటి pump నే అందరం పెట్టించాలనుకున్నాము. నగర నీటి పంపిణీ సంస్థ సరఫరా చేసే నీటి తొట్టికి, Ballcock and float valve అమరిస్తే సరిపోతుంది. మనం రహదారిలో ప్రయాణించే సమయంలో, నీటి గొట్టాలు పగలడం, చిట్లడం కారణంగా, నీరు వృధాగా పోవడం, అప్పుడప్పుడూ చూస్తుంటాం. దాని సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు, గూగుల్ అన్వేషణ ద్వారా తెలుసుకున్నాము; వారికి సకాలంలో ఫిర్యాదు చెయ్యడానికి.
నదులు, అడవులు, వన్య ప్రాణులు జాతి సంపదగా ఏ విధంగా అయితే పరిగణిస్తామో, అలాగే ప్రభుత్వం సరఫరా చేసే, నీరు, విద్యుత్తు మనం జాతి సంపదగా గుర్తించుదాము. మన దగ్గర డబ్బుంది, Bills కడతాము, మనకేమి అవసరం పొదుపుచెయడం, ఇష్టానుసారంగా వాడుకుందాం, అని అనుకోకుండా, ప్రతి ఒక్కరూ, పొదుపుగా వాడుకుంటే, మళ్ళీ, మళ్ళీ అప్పుకోసం పొరుగు రాష్ట్రాలకు పరుగు తీయనక్కరలేదు. మేము కరపత్రాలు తయారుచేసి, ఇంటింటికీ పంచుతుంటే, ఇదంతా అందరికీ తెలియదనా, మీ ప్రయాసే గాని, ఏ ఉపయోగం లేదు; మీరు మీకు చేతనయినంత చేసారు; ఇంక ఆగండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి అని నసగడం మొదలెట్టారు కొందరి ఇళ్ళలో మొగవాళ్ళు. మేము విశ్రాంతి తీసుకుంటే, నాటిన మొక్కలు బ్రతికేదెలా?
మా దినసరి కార్యక్రమం ఆపలేదు; మొక్కలను బ్రతికించడమే మా ధ్యేయం. ప్రతి సభ్యుడు/సభ్యురాలు తమ ఇంటినుంచే పొదుపు ప్రారంభించారు. పనిమనుషులు, బకెట్ లోకి నీళ్ళు నింపాకే, గిన్నెలు కడగాలి. పిల్లలు పళ్ళు తోమినంతసేపు, కుళాయి వదిలివేయకుండా చూస్తున్నాము. Mug వాడడం అలవాటు చేసాము. Shower స్నానాలు ఆపి, నీరు బకెట్ లోకి నింపుకుని స్నానాలు చేసేలా చూస్తున్నాము. ఆ నీటిలో కూడా, రెండు మొగ్గులు పొదుపు చేస్తే, ఒక మొక్కను బతికించవచ్చుకదా. కూరగాయలు, బియ్యం, పప్పులు కడిగిన నీళ్ళు, ఆఖరికి సబ్బు వాడకుండా చేతులు కడిగిన నీళ్ళు కూడా, పెద్ద పాత్రలలోకి సేకరించి గరాటు సహాయంతో 10, 20 లీటర్ల డబ్బాలలోకి నింపి, మొక్కలకు పోయడం ప్రారంభించాం. సాయంకాలం, పాఠశాల నుంచి రాగానే, పిల్లలంతా, మహా ఉత్సాహంగా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అధములు పనిమొదలెట్టరు. మధ్యములు పని ప్రారంభించి, మధ్యలో ఆపేస్తారు. ఉత్తములు మాత్రమే ప్రారంభించిన పని పూర్తి చేస్తారు. మేమందరం ఉత్తములుగా ఉండటానికే నిశ్చయించుకున్నాము. “రెండు మగ్గుల నీరు పొదుపు చేద్దాం, ఒక మొక్కను బ్రతికించుకుందాం” అత్యంత తక్కువ సమయంలో, కాలనీ వాసుల గుండెల్లోకి చేరిందీ నినాదం; మా M.K.M. group కి మంచి ప్రాచుర్యాన్ని తెచ్చింది. ఆహారం, నీరు, విద్యుత్తు అన్నీ అందరికీ చెందిన సంపదగా భావించి, ఏ విధమైన వృధా జరుగకుండా చూస్తాము అని ప్రతిజ్ఞ తీసుకున్నాము. మేము అనుకున్న దాని కన్నా, అధికంగా, అందరూ స్పందించి, ఈ విషయాన్ని శ్రద్ధగా పాటించడం మొదలెట్టారు. వర్షాలు పడక ముందే, మొక్కలన్నీ నిలదొక్కుకున్నాయి, మేము అందించే నీటితో. ఎవరినీ యాచించకుండా, ఎవరి సహాయం ఆశించకుండా, మా మొక్కలకు మేమే నీరు అందించడం మా అందరికీ ఎంతో ఆనందంగా, మరెంతో తృప్తిగా అనిపించసాగింది.
*****
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.