వెనుతిరగని వెన్నెల (భాగం-2)
-డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
జరిగిన కథ: సమీర రాజీ కూతురు. ఉదయిని, రాజీ చిన్ననాటి స్నేహితులు. అమెరికాలో అదే ప్రాంతంలో ఉంటున్న ఉదయినిని తప్పక కలవమని రాజీ కూతురికి చెప్తుంది. ఉదయిని స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడుపుతూ ఉంటుంది. ఉదయినిని, వాళ్ళ ఇంటిని చూసేక చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని ఉదయిని తో చెప్తుంది.
*********
“ఏమైంది సమీరా?” అనునయంగా అడిగింది ఉదయిని దగ్గరికి వచ్చి.
“ఏం చెప్పమంటారు ఆంటీ, ఒక కారణం అంటూ చెప్పలేనన్ని ఉన్నాయి. నేనివేళ్టి ఆడపిల్లని. నేనేదీ సహించాల్సిన అవసరం నాకు లేదు. అన్నిటికీ అతను చెప్పిన మాటే వినాలంటాడు. అతని ఇష్టాఇష్టాలు నాకు ముందే తెలిసి ఉండడానికి అతను నాకు ఇంతకు ముందు పరిచయస్తుడు కాదు. అతని బాగోగులు నేను ఆలోచించడానికి అతను నాకు స్నేహితుడు కాడు, అతనేం చేసినా ప్రేమగా ఓర్చుకోవడానికి అతణ్ణి నేను ప్రేమించలేదు. ఇవన్నీ లేకుండా ‘అతను నీకు తాళి కట్టిన భర్త’ అనే చింతకాయ పచ్చడి డైలాగులు చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు. ” అని గబగబా అని
“సోరీ ఆంటీ, మీ సమయం అంతా తినేస్తున్నానా?” అంది సమీర.
“మళ్లీ మళ్లీ ‘మీ సమయం’ అంటూ వేరు పరచకు సమీరా! నీ జీవితం గురించి తెలియకుండా నేనెటువంటి సలహాలూ ఇచ్చి నిన్ను ఇబ్బంది పెట్టనులే, ముందీ పాలు పూర్తిగా తాగు…”
“ఆ.. అన్నట్లు నీకిష్టమని నేను దొండకాయ వేపుడు చేసి పెట్టేను.” అంది ఉదయిని.
“దొండకాయ వేపుడు నాకిష్టమని మీకెలా తెల్సు?” ఆశ్చర్యంగా అంది సమీర.
“అదేమరి, కనిపెట్టా” అని చిర్నవ్వు నవ్వింది.
“అబ్బా, మీ చెదరని చిర్నవ్వు నాకు కాస్త ప్రసాదించండి ఆంటీ, సమస్యలన్నీ గట్టెక్కేస్తాను.” అంది సమీర.
“ఊ, అసలేమైంది?” సాలోచనగా అడుగుతున్న ఉదయిని వైపు చూసి,
“ఎక్కణ్ణించి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదాంటీ” అంది సమీర.
“అతను నీకు ముందు పరిచయం లేడన్నావు కదా” అంది ఉదయిని.
“ఊ.. ఈ పెళ్లి సంబంధం మొదలైందగ్గర్నుంచి చెప్తాను” అని వెనక్కు జారబడింది సమీర.
“నాన్న మ్యారేజి బ్యూరో ద్వారా వీళ్ల పెళ్ళి సంబంధం తెల్సుకుని, ఫోటోలు పరస్పరం నచ్చాక
అతన్ని నేను మొదట స్కైప్ లో చూసేను.
మేమిద్దరం యూ ఎస్ లోనే ఉన్నాం. అతను ఇల్లినాయిస్ లో. నేను టెక్సాస్ లో.
పది నిమిషాల స్కైప్ లో మేం మాట్లాడుకున్నది ఇద్దరి చదువుల గురించే. మీకు తెలుసు కదా, నేను బాగా ఏంబిషియస్.
అతను నన్ను రెండో ఎమ్మెస్ ఎందుకు చదువుతున్నావని అడిగేడు.
నేను అతన్ని ఎమ్మెస్ ఎందుకు చెయ్యలేదని అడిగేను. అతను ఉద్యోగం బాధలేవో చెప్పేడు.
నేను మరో సెమిస్టర్ లో ఎమ్మెస్ పూర్తి కావాల్సి ఉంది, ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదని చెప్పేను.
అతను ఇంకా సెటిలవ్వడానికి సమ్యం తీసుకోదలచుకోవట్లేదని అన్నాడు.
ఇక మంచి సంబంధం … అదీ ఇదీ అని మా ఇంట్లో ప్రెజర్సు…..
ఇలా కాదు గానీ మీకు మా పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి” అంది సమీర.
***
“మీ నాన్న కి ఎంత గర్వం… నిన్ను పొగడడం తప్ప వేరే పనిలేనట్లుంది” అన్నాడు సాయి రిసెప్షన్లో స్టేజీ మీద తమని ఆశీర్వదిస్తూ వస్తున్న వాళ్ల వైపు నవ్వుతూ చూస్తూ.
“మా నాన్న నన్ను పొగడుతున్నాడనా, నిన్ను పొగడట్లేదనా?” చురక అంటించి తనూ ఎటో చూస్తూ నవ్వింది సమీర.
“చూడు బాబూ, సమీర మా ఒక్కగానొక్క కూతురు. అమ్మాయైనా అబ్బాయైనా తనే అన్నట్లు పెంచాం. తన చదువు కోసమే మేం ఈ సిటీ కి వచ్చాం. నాకున్న ఈ అపార్ట్ మెంట్లు, పొలాలు… మా యావదాస్తులూ తనవే. ఇవన్నీ నా కష్టార్జితాలు. మీరిద్దరూ ఇంతకు మూడింతలు సంపాదించి పిల్లా పాపల్తో హాయిగా ఉండాల్నేదే నా ఆకాంక్ష.” అన్నాడు ధనుంజయ.
సమీర ఏదో అనేలోగా
పక్కనే కూచున్న సాయి, సమీరకు మాత్రమే వినిపించేలా “మీ నాన్నకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువే” అన్నాడు.
మొదటి రాత్రి అంటూ అంతా చేసే హంగామా అసలు నచ్చలేదు సమీరకి.
“ఏవిటి, మాట్లాడితే ‘మీ నాన్న’ అంటూ….. ఒకటే లెక్చర్లు దంచుతున్నవు? మైండ్ యువర్ టంగ్”
సీరియస్ గా అంది దగ్గిరికి వచ్చిన సాయితో.
అతను ఇవేమీ వినిపించుకునే స్థితిలో లేనట్లు అడ్డదిడ్డంగా విజృంభించేసరికి అవాక్కైంది సమీర.
మర్నాడు భోజనాల దగ్గిర
“అత్తగారికి సహాయం చెయ్యాలని తెలీదా? వచ్చి టేబుల్ దగ్గిర కూచున్నావు?” అవహేళన నవ్వుతో అన్నాడు సాయి.
“నాకు మీ ఇంటి సంగతి తెలియదు, మా ఇంట్లో నేనెప్పుడూ ఇలానే చేస్తాను” అంది ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ అందరికీ వినపడేలా.
“అమ్మాయికి పద్ధతులేవీ నేర్పించలేదు. మనమే అన్నీ నేర్పించుకోవాలి ఖర్మ” అని వెనకే వంటింట్లోంచి వినబడింది.
“అసలు వీళ్ల నాన్ననిన్నంతా ఏమేం గొప్పలు పోయేడో తెలుసా అమ్మా, మా అమ్మాయి చదువుల సరస్వతి, ఆమె ఎక్కడ అడుగు పెట్టినా కనకపు వర్షం … అదీ ఇదీ అని ఒకటే కూతుర్ని పొగడడమే ఎంత సేపూ… “ అంటూ వెనకే తందాన తాన అంటూ పెద్దగా చప్పుడూ చేస్తూ చికెన్ బోన్ ని పరపరా నములుతూ అన్నాడు సాయి.
అలా శబ్దం చేస్తూ నమలడం చికాకు పుట్టించింది సమీరకి. అతని మాటలు అంతకంటే కంపరం పుట్టిస్తున్నాయి.
మరో గంట లో అక్కణ్ణించి బయటపడి ఒక ఉదుటున ఆటో ఎక్కి ఇంటికి వచ్చి పడింది సమీర.
” ఏవిటి సమీరా, అబ్బాయేడీ….” వెనక్కి చూస్తూ రాజీ అంటున్న మాటలు వినిపించుకుండా తన గదిలోకి విసవిసా నడిచింది సమీర.
నిక్కరు, టీషర్టు వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్న కూతురి దగ్గరకు వెళ్లి
“కొత్త పెళ్లి కూతురివి, ఇంకా చుట్టాలు కూడా వెళ్లలేదు. చీర కట్టుకోమ్మా…” బతిమలాడుతూ వెనకే వచ్చింది రాజీ.
కొత్తగా మాట్లాడుతున్న అమ్మని చూసి తల తిప్పుకుంది సమీర.
మరో గంట తర్వాత కూడా అలానే పడుకున్న సమీర దగ్గిరికి వచ్చి తల మీద చెయ్యి వేసింది రాజీ.
“అమ్మా, డైనింగ్ టేబుల్ దగ్గిర వండినవన్నీ తెచ్చి పెట్టే బాధ్యత పెళ్లైన అమ్మాయిదా, వాళ్ళింట్లో వాళ్ళదా?” రాజీని వాటేసుకుంటూ అడిగింది సమీర.
“ఈ డైనింగు టేబుల్ గురించెందుకు అంటూ… ఏదో అర్థమైనట్లు తల పంకించి …..లేమ్మా… ఇలా అన్నిటికీ మనింట్లో లాగా మారాం చెయ్యకూడదు. చూడు బయట హాల్లో సాయి కూచున్నాడు.” అంది రాజీ.
సాయి ఏం చెప్పాడో ఏమో , అప్పుడే బయటి నుంచి వచ్చిన ధనుంజయ లోపలికి వచ్చి “ఏంటమ్మా, ఇలా చెప్పా పెట్టకుండా రావొచ్చా, అంతగా అయితే నాకు ముందు కాల్ చెయ్యొచ్చుగా.” అన్నాడు.
తిరిగి వాళ్లింటికి వెళ్తున్నపుడు “ఇంకెప్పుడైనా ఇలా చెప్ప పెట్టకుండా మీ ఇంటికి వెళ్ళేవంటే ఇక నువ్వు జన్మలో మీ ఇంటి గడప తొక్కవు. మా ఇంట్లో ఈ విషయాన్ని సర్ది చెప్పుకునేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది.” అన్నాడు సాయి.
ఆ మర్నాడు తిరుపతి ప్రయాణంలో “ఒక్క వారం ఓపిక పట్టు తల్లీ, అమెరికా వెళ్ళిపోతే ఇవన్నీ సర్దుకుంటాయి. పెళ్లయిన కొత్తలో ఇవన్నీ సహజం. అసలు దేనికి సమాధానం చెప్పకు.” అనునయంగా అంది రాజీ చెమ్మగిల్లిన కళ్ళతో.
ఇద్దరూ యూ. ఎస్ కి వస్తూనే “నాకు కాలిఫోర్నియాలో జాబ్ వచ్చింది. నువ్వు నీ లాస్ట్ సెమిస్టర్ ని అక్కడే ఏదైనా యూనివర్శిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయినా నువ్వు చదివి ఇప్పుడెవరిని ఉద్ధరించాలి? నా సిన్సియర్ ఎడ్వైజ్ ఏవిటంటే, ఇక నువ్వు చదువు మానేసి శుభ్రంగా పద్ధతులు నేర్చుకో.
వచ్చే నెల మా అమ్మ వస్తూంది ఎలాగూ.” అన్నాడు సాయి.
“సమీరా, ఇప్పటి వరకు నువ్వు మా అమ్మాయివి మాత్రమే, ఇప్పుడు నువ్వు మరో ఇంటి అమ్మాయివి కూడా, మొదట్లో అవతలి వాళ్ల పద్ధతులు మనకు కొత్తగా అనిపిస్తాయి. కొంచెం ఓపిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇంత చదువుకున్నదానివి. నీకు అతన్ని, అతని కుటుంబాన్ని చదివి చూడమని వేరేగా చెప్పాలా? నువ్వు అక్కడ ఉదయినిని తప్పక కలువు……” అమ్మ మాటలు చెవిలో మార్మోగుతున్నాయి సమీరకి.
***
నిర్లిప్తంగా బయటి వెల్తుర్ని చూస్తూ “మీ దగ్గిరకి రావడానికి కూడా నేను చాలా రోజులు తాత్సారం చేసేను ఆంటీ… ఆలోచిస్తూనే ఉన్నాను. విడాకుల కంటే వేరే మార్గం తోచడం లేదు. మీరు మా అమ్మకు స్నేహితులు.. మిమ్మల్ని చూసేక నాకు మీతో ఇవన్నీ చెప్పాలన్న స్నేహ భావన కలిగింది. అతని దగ్గిర నాకిలా మనసు విప్పి మాట్లాడాలనే భావనే కలుగ లేదు.” అని నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ అంది సమీర.
“ఊ….. ఇప్పుడతని తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారా?” సాలోచనగా అంది ఉదయిని.
“లేరాంటీ, వాళ్ళు నెల కిందటే వచ్చారు. కానీ డెలివరీ సమయమని ముందు ఈస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గిరికి వెళ్లేరు. అయినా అతనొక కీలుబొమ్మ. ఫోను లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తాయి.” అని నిట్టూర్చి
“అమ్మ చెప్పినట్లు అతణ్ణి, అతని కుటుంబాన్ని చదివి చూడడానికి నేను ఈ ఆర్నెల్లు సమయం తీసుకున్నాను. కానీ ఎంత తరచి చూసినా ఇతనితో నా భావి జీవితం ఇంక ఇలాగే ఉండబోతుందన్న భయం పట్టుకుంది నన్ను. ఇంతలో ఈ పాపాయి….” అని పొట్ట తడుముకుని
“తనని కూడా ఇలాంటి వ్యక్తుల మధ్య పెంచడం నాకిష్టం లేదు.” దృఢంగా అంది సమీర.
వెలుగు నీడలు దోబూచులాడుతున్నఅద్దాల వైపు చూస్తూ “జీవితాలు ఎంతో విచిత్రమైనవి సమీరా, అంత సులభంగా దేనినీ అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు మనకు అంతా అర్థమైనట్లున్నా నిర్ణయం తీసుకునే సమయానికి ఏవీ అర్థం కాదు.” అని
మౌనంగా కూచున్న సమీర దగ్గరికి వచ్చి అనునయంగా భుజమ్మీద చెయ్యి వేసి,
“నీకు ‘తన్మయి’ కథ చెప్తాను. నీ విధిని నువ్వు నిర్వచించుకునే క్రమంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి
ఉపయోగపడ్తుందేమో” అంది ఉదయిని.
*****
(ఇంకా ఉంది)