షర్మిలాం“తరంగం” -2

-షర్మిల కోనేరు


నాకయితే అమ్మాయిలు డ్రైవ్ చేస్తే సుకుమారంగా సుతిమెత్తగా భద్రంగా అనిపిస్తుంది . నీకు అంత స్త్రీ పక్షపాతమా అంటారేమో !
ఆడాళ్లు బళ్లను కూడా ఇంటిని నడిపినట్టు ప్రేమతో బాధ్యతతో నడుపుతారో ఏమో అందుకే అలా అనిపిస్తుంది.
ఇంకోటి నేను మొదటిసారి నా స్కూటీ నేనే నడుపుతూ వెళ్తున్నప్పుడు ప్రపంచాన్ని కూడా దీనిమీద చుట్టేసి రాగలనన్నంత ధీమా వచ్చింది .
నేను చిన్నప్పటినుంచి బళ్లు మగాళ్లే నడపడం చూశా …
ఎడ్ల బళ్లను మగాళ్లు హెయ్! హెయ్ అని అదిలించుకుంటా, గుర్రబ్బళ్లు నడిపేవాళ్లు చర్నాకోల్ చళ్ మనిపిస్తూ గుర్రాల్ని పరిగెత్తిచ్చడమే చూశాను .
ఆడాళ్లు ఆ బళ్ల వెనుక కట్టిన గూళ్లల్లో తెరల వెనుక కూర్చుని ప్రయాణం చేసేవారు .
ఏమాటకామాటే చెప్పుకోవాలి సినిమా వాళ్లు మాత్రం ఈ విషయంలో నయం .
బళ్లు నడిపే ఆడాళ్లని చూపించే వారు .
షోలే సినిమాలో హేమామాలినీ రంగురంగుల బట్టలేసుకుని గుర్రాన్ని “చల్ బసంతీ ! ” అంటా గుర్రబ్బండి నడుపుతుంటే చూడ ముచ్చటగా వుండేది .
రిక్షా రాజీగా జయచిత్ర రిక్షా తొక్కుతూ వుంటే విచిత్రం అనిపించేది .
కానీ బయట ఏనాడూ రయ్యిన బళ్లు నడిపే వాళ్లను నేను చూడలేదు .
ఒకేలా వుంటే కాల మహిమ ఏముంది ,. సైకిళ్లు వచ్చాక ఆడపిల్లలు చదువుకోవడానికి పొరుగూరు లో వున్న స్కూళ్లకి సైకిల్ ప్రయాణాలు మొదలెట్టారు . పిల్లలంతా రంగు రంగుల పరికిణీలు జాకెట్లు వేసుకుని సైకిళ్లమీద పొలంగట్ల పక్కనుంచి స్కూల్ కి వెళ్తుంటే సీతాకోకచిలుకల గుంపు ఎగురుతున్నట్టు ఆహ్లాదంగా వుండేది .
అలా మొదలైన ప్రయాణం ఇప్పటికి రాకెట్ స్పీడ్ అందుకుంది .
నేను వుద్యోగంలో చేరిన కొత్తలో నవత పరిచయమైంది .
ఒక రోజు తన ఇంటికి రమ్మంటే వెళ్లి అక్కడినుంచి ఆఫీస్ కి తన టీ వీ ఎస్. మోపెడ్ మీద ఇద్దరం వెళ్లాం.
మొదటిసారి ఒక ఆడపిల్ల బండి డ్రైవ్ చేస్తే తన వెనకాల కూర్చుని ప్రయాణించడం . నాకు చాలా నచ్చింది .
తను అలా కబుర్లు చెప్తూ బండి అలవోకగా నడిపేస్తుంటే ఏదో స్వేచ్చావాయువులు గుండెలనిండా పీలుస్తున్న అనుభూతి .
ఆ తర్వాత కొన్నాళ్లకి నేను సన్నీ కొనుక్కున్నాను .
నేర్పమని మా ఆయన్ని బతిమాలేదాన్ని . సరిగ్గా ఒక్కరోజు నేర్పి తరవాత పొద్దున్న లేపినా లేవకుండా మురిపించుకుంటుంటే ఒళ్లు మండి కాళ్లు కింద పెడుతూ బేలన్స్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేశాను .
ప్రాక్టీస్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందున్న ట్రీగార్డ్ ని ఢీకొట్టేశాను .
మొత్తానికి మూడునాలుగు రోజుల్లో ఆఫీస్ కి సన్నీ వేసుకుని వెళ్లాను .
ఆ తరవాత స్కూటీ నుంచి స్కూటర్ వరకూ తోలాను .
ఆటో గేర్ వాహనాలు ఆడాళ్ల జీవితాల్లో ఒక విప్లవం .
నిజంగా నాకు బండి నడపడం రాకపోతే ఆ నైట్ డ్యూటీ లు చేయలేక పోయేదాన్నేమో .
సరిగ్గా సెకండ్ షో వదిలే టైం కి అయ్యే షిఫ్ట్ వేయించుకుని 10 కిలోమీటర్లున్న ఇంటికి వెళ్లేదాన్ని.
ఆ సమయంలో ఆకతాయిలు ఏమీ చేయలేదా అని అడుగుతారేమో !
ఎవడైనా వెంబడిస్తున్నాడన్న అనుమానం రాగానే ముందు బండి స్లో చేసి వాడు దగ్గరగా వచ్చాక ” ఏంటి బాబూ ! నీ ప్రోబ్లం ?” అనడిగేదాన్ని .
తరవాత మహేష్ బాబు దూకుడులో పొలీస్ అన్నట్టు ” ప్రెస్ ” అనేదాన్ని . బండెనకాల వున్న ప్రెస్ స్టిక్కర్ చూపిస్తూ నేను ” ప్రెస్ ” అనగానే మాట్టాడకుండా వెళ్లి పోయేవారు .
అయినా మా విశాఖపట్నం వాళ్లు మంచాళ్లు…
నా 20 ఏళ్ల రాత్రిప్రయాణాల్లో చేదు అనుభవాలేమీ లేవు .
కాకపోతే కాస్త లేట్ అయ్యి చలికాలం, వర్షాకాలాల్లో నిర్మానుష్యంగా వున్న్నప్పుడు మారువేషం వేసుకుని బండెక్కేదాన్ని.
జాకెట్ వేసుకుని మొహమంతా కవరయ్యే హెల్మెట్ పెట్టుకుని తయారవుతుంటే ” మేడం మారువేషం వేస్తున్నారా “! అని నా కొల్లీగ్స్ నవ్వేవారు .
ఇది 25 ఏళ్ల నాటి మాట .
ఇప్పుడు అమ్మాయిలు కార్లు, స్కూటర్లు , చివరికి బుల్లెట్ మోటర్ సైకిళ్లు కూడా అవలీలగా నడిపేస్తుంటే ” కాలమ్ము మారిందోయ్ … దేశమ్ము మారిందోయ్ ” అని కూనిరాగాలు తీయాలనిపిస్తుంది.
అన్నట్టు అన్నే దివ్య అనే ఆంధ్రా అమ్మాయి ఏకంగా పైలెట్ అయ్యి బోయింగ్ విమానమే నడిపేస్తోంది .
నిజంగా కాక్ పిట్ లో ఆమ్మాయిలు కూర్చుని విమానాన్ని నడిపేస్తుంటే వావ్ అనిపించదూ !
మామూలు విమానాలే కాదు ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి మిగ్ -21 యుద్ధవిమానాన్నే నడిపేస్తోంది భావనా కాంత్ అనే అమ్మాయి . అలాగే అవనీ చతుర్వేదీ కూడా యుద్ధ విమాన పైలెట్ గా చేరింది . ఇక అమ్మాయిలు కూడా శత్రువుల పైన బాంబుల్ని కురిపించేస్తామంటున్నారు .
అయినా అంతరిక్షం లోనే విహరించి వచ్చిన ఆడాళ్లకి బళ్లు , కార్లు , బస్ లు , విమానాలు నడపడం ఓ లెక్కా .

****

Please follow and like us:

2 thoughts on “షర్మిలాం“తరంగం”-2”

  1. చాలా బాగుందండి షర్మిల
    చదువుతుంటే గర్వాంగా ఉంది

Leave a Reply

Your email address will not be published.