కంప్యూటర్ భాషగా తెలుగు-1
ఉపోద్ఘాతం– కంప్యూటర్ వ్యవస్థ
-డా|| కె. గీత
తెలుగుభాష కంప్యూటర్ల మీద వాడుకలోకి 1991-92 ప్రాంతంలో వచ్చింది. అప్పటివరకు ఇంగ్లీషు మాత్రమే అన్ని టెక్నాలజీలకీ మొదటి మాధ్యమమైనట్టే కంప్యూటర్ రంగంలోనూ ఇంగ్లీషుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అవి WWW (World Wide Web) కొత్తగా ప్రపంచానికి పరిచయమైన రోజులు. “కంప్యూటర్లకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే ‘వరల్డ్ వైడ్ వెబ్’ అంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి.”
డెస్క్ కంప్యూటర్ల స్థానే పర్సనల్ లాప్ టాపులు, వాటిని కూడా తలదన్నిన టాబ్లెట్లు, అన్నిటినీ మించిన స్మార్ట్ ఫోనులు గత దశాబ్దిగా కొనసాగిన పెనుమార్పులు.
స్మార్ట్ ఫోనులు కమ్యూనికేషను రంగంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.
దానితో బాటే వెంటవెంటే పుట్టుకొచ్చి మనుషుల మధ్య కమ్యూనికేషనుని రికార్డు స్థాయికి తీసుకెళ్లిన ఫేసుబుక్కు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలు.
టెక్నాలజీ అధికశాతం మందికి అందుబాటులోకి వచ్చిన ఇప్పటి రోజుల్లో ప్రాంతీయ భాషలకు గిరాకీ ఇందువల్లే ఏర్పడింది. మనిషికీ మనిషికీ మధ్య సంభాషణలో మాటకి బదులు రాత (టెక్స్ట్) కి ప్రాధాన్యం పుట్టుకురావడం వల్ల, డిమాండ్ ని అనుసరించే ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఇప్పటి కాలానికి తప్పనిసరి మొదటి తక్షణ అవసరం సులభ సాధ్యమైన కీబోర్డు లేదా టైపింగు సాధనం అయికూచుంది.
మరో అడుగు ముందుకేసి వాయిస్ అసిస్టెంట్ (దీనిని “మాటమార” అనొచ్చేమో) తో పనులు సాధించగలిగే టెక్నాలజీ భవిష్యదవసరంగా ఆవిష్కరించబడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, యాపిల్, అమెజాన్, మైక్రో సాఫ్ట్ వంటివి
తెలుగుభాష వైపు మొగ్గుచూపడానికి రోజురోజుకీ అధికమవుతున్న తెలుగు వాడుకరుల సంఖ్యే ముఖ్యకారణం.
“ఈ రోజుల్లో కంప్యూటర్ల చేత మనం చేయించలేని పనులు లేవు. కంప్యూటర్ల సహాయం లేకుండా రైల్వే రిజర్వేషన్లు జరగవు, విమానాలు నడవవు, రాకెట్లు ఎగరవు, బేంకులో డబ్బు ధరావరతు కాదు, కార్లు నడవవు, కర్మాగారాలు నడవవు, టెలిఫోనులు పని చెయ్యవు, ఆఖరికి కంప్యూటర్ల సహాయం లేకుండా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా జరగవు. కంప్యూటర్లు ఆగిపోతే ఆధునిక సమాజం ఆగిపోతుంది.”
మరి ఇంతగా కంప్యూటర్ వ్యవస్థ మీద ఆధార పడిపోయిన మనం తెలుగు భాషలో లావాదేవీల కోసం అర్రులు చాచడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఇంటర్నెట్టు సమాచార ప్రచార రంగంలో ఒక విప్లవాన్నే తెచ్చింది. ఇంచుమించు గత రెండు దశాబ్దాలుగా ప్రచార సాధనంగా ఇంటర్నెట్టు విస్తృతిపొందుతూ వస్తూంది. ప్రత్యేకించి ఇంటర్నెట్లో తెలుగు వాడుక గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. తెలుగు సైట్లు, పోర్టల్స్, ఈ-పత్రికలు, బ్లాగులు, యాప్ లు గణనీయంగా పెరిగాయి.
తెలుగులో కంప్యూటరు పరిజ్ఞానాన్ని కలిగించే వెబ్సైట్లు, వీడియోలు, బ్లాగులు అనేకం దర్శనమివ్వడం గత దశాబ్దిలో జరిగిన గొప్ప పరిణామం.
బొత్తిగా కంప్యూటరు గురించి తెలియని వారి కోసం కంప్యూటరు అంటే ఏవిటో, అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూద్దాం.
“కంప్యూటర్ స్వయంగా తనంతట తాను పనిచేయ్యగలగడమే కాకుండా ఇంటర్నెట్ తో అనుసంధానం కాగలిగిన ఒక యంత్రం”
ఒకప్పుడు మనలోచాలా మందికి కంప్యూటర్ ని చూసిన దగ్గర నించి అసలదెందుకో అర్థం కావడానికే చాలా సంవత్సరాలు పట్టేది. కానీ ఈ రోజుల్లో కంప్యూటరు వాడుక ప్రతిఒక్కరికీ సర్వసామాన్యం అయింది.
ఇక అతిమామూలు మాటల్లో చెప్పాలంటే పర్సనల్ కంప్యూటర్ల విషయానికి వస్తే మన ఎదురుగా కనబడేది ఒక తెర, ఒక కీ-బోర్డు. కీ-బోర్డులోనే అంతర్భాగంగానో, పక్కనో ఒక మౌసు.
విషయాలు టైపు చేసేందుకు కీ-బోర్డు , పేజీలలో ఎటెళ్ళాలన్నా కదిపేందుకు (క్లిక్కు) మౌసు , విషయాలు చూపేందుకు తెర, ఇక మాట్లాడేందుకు, వినేందుకు కీ-బోర్డు పక్కనెక్కడో అంతర్భాగంగా ఉన్న మైకు, స్పీకర్. ఇక ఫోటోలు తీసుకుందుకు, వీడియో చాట్లకు కెమెరా అదనాలు.
ఇవి అన్ని డివైస్ లలోనూ అంటే డెస్క్ టాప్ లు, లాప్ టాప్ లు, టాబ్ లెట్లు , స్మార్ట్ ఫోన్లలలో ఉండే భాగాలు. కొన్ని డివైస్ లలో పైకి కనబడతాయి. కొన్నిటిలో కనబడవు, అంతే తేడా. ఇందులో స్మార్ట్ ఫోన్ మాములు ఫోనుగా మాత్రమే కాకుండా కంప్యూటర్లు చెయ్యగలిగిన దాదాపు అన్ని పనులూ చెయ్యగలుగుతుంది.
ఇలా హార్డ్ వేర్ అంశాలే కాక, కంటికి కనబడని సాఫ్ట్ వేర్ ( హార్డ్ వేర్ తో పని చేయించేవి) అంశాలు కోకొల్లలు.
ఒకప్పుడు కంప్యూటర్ ఒక చోట స్థిరంగా ఉండే యంత్రంగా ఉండేది. దానితో పనిచేయించగలిగే సాంకేతికనిపుణులకు తప్ప సామాన్యులకు అవసరం పడేది కాదు.
మహా అయితే కంప్యూటర్ లో అంతర్గతంగా ఫోటోలు, టైపు చేసిన డాక్యుమెంటు ఫైళ్లు మొ.న వి దాచుకోవడానికి ఉపయోగపడేది.
కంప్యూటర్ ఇంటర్నెట్ తో అనుసంధానం అయి పనిచెయ్యడం, నెట్ వర్క్ అనే అంశం ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటినుంచి కంప్యూటరు ఉపయోగాలే మారిపోయాయి. అందులో ప్రధానమైనది బయటి ప్రపంచంతో లేదా మరో కంప్యూటరుతో అనుసంధానం కావడం, పనిచేయడం.
అందువల్ల సమాచారాన్ని ఇతరులతో సులభసాధ్యంగా, అతివేగంగా పంచుకోగలిగే అవకాశం కలగడం వల్ల కంప్యూటరు సామాన్యులకు కూడా ఉపయోగకరమయ్యింది.
ఇటీవలి కాలంలో “క్లౌడు” వల్ల పర్సనల్ కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని మరోచోట సర్వర్లలో దాచడానికీ, ఇంటర్నెట్ తో అనుసంధానం అయ్యి అవసరార్థం ఎప్పుడంటే అప్పుడు సమాచారాన్ని వాడుకోవడానికీ అవకాశం కలిగింది.
ఉదాహరణకి కంప్యూటరుని/స్మార్ట్ ఫోనుని ఇవేళ ఫోటోలు తీసుకోవడం, దాచుకోవడమే కాకుండా, వెంటనే పంచుకోవడానికి కూడా వాడుతున్నాం. ఇక ఈ-మెయిళ్లు పంపడానికి, అందుకోవడానికి, దగ్గర ఉన్న ఏ సమాచారాన్నయినా ఇతరులతో వెంటనే సోషల్ మీడియా ప్లాటుఫారాలలో పంచుకోవడానికి, తెలిసిన విషయాలను, సమాచారాన్ని బ్లాగులు, వెబ్సైట్లు , ఈ-పత్రికలు వంటి చోట ముద్రించుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆన్లైను రేడియోలు, పాడ్ కాస్ట్ లు వినడానికి, ఆన్లైను ఛానెళ్లు, యూట్యూబు వంటి మాధ్యమాలలో చూడడానికి, వస్తువులు కొనుగోళ్లు, అమ్మకాలు, ఒకటేమిటి పూర్తి స్థాయి కమ్యూనికేషను మొ.న వాటి కోసం కంప్యూటరు ఉపయోగ పడుతూ ఉంది.
ఇక ఇలా కంప్యూటరు, దాని సేవలు వాడేవారు అధికం అవుతూ ఉండేసరికి అందరి దృష్టీ దీనిమీదే కేంద్రీకృతమయ్యింది. కంప్యూటరు పరంగా విప్లవాత్మకంగా సౌలభ్యాలు, సౌఖ్యతలు పెంచడానికి కొత్త మోడళ్లు పుట్టుకురావడమే కాకుండా కొత్త విషయాలెన్నో అందుబాటులోకి అతివేగంగా వస్తున్నాయి.
ఇంటర్నెట్టు ని తెలుగులో “అంతర్జాలం” అంటున్నాం. దీని గురించి కొద్దిగా చెప్పాలంటే ఇంటర్నెట్టు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను లేదా ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. దూరంతో సంబంధం లేకుండా సమాచారాలు పంచుకుంటాయి. ఇలా ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు ఒకేసారి అనుసంధానంలో ఉండగలుగుతారు.
వ్యక్తులు, సంస్థలే కాకుండా, ప్రభుత్వ పరిపాలన దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎన్నో విషయాలు ఒక చోట కూర్చునే తెలుసుకోవచ్చు.
ఇంత వేగవంతమైన ప్రపంచంలో ఇప్పుడు వేగవంతమైన ఇంటర్నెట్టు ప్రధానంగా మారింది.
అయితే ఇది అందరికీ అందుబాటులోకి చవకగా రావడానికి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.
*****
References:-
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I & ll
https://eemaata.com/em/issues/200903/1057.html
https://eemaata.com/em/issues/200905/1112.html?allinonepage=1
ASSESSMENT AND DEVELOPMENT OF POS TAG SET FOR TELUGU- G.Uma Maheshwara Rao
https://www.aclweb.org/anthology/I08-7012
The Rice Transliteration Standard for Telugu
http://www.learningtelugu.org/the-rice-transliteration-standard-for-telugu.html
Unicode to Anu
http://eemaata.com/font2unicode/Encoder/unicode2font.php5
kolichala.com/unicode2font/?
Anu to Unicode
Anu2uni.harivillu.org
Centre For Applied Linguistics and Translations Studies
Language Technology Laboratory
-Morphological Analyzer, Spell checker
http://caltslab.uohyd.ac.in/caltslab/tools.php
బాలవ్యాకరణం search tool
http://caltslab.uohyd.ac.in/BV-TEL/home.html
ఆంగ్లం – తెలుగు నిఘంటువు
http://caltslab.uohyd.ac.in/Dict-Search-MainPage.html
Telugu Spell checker plug-in
http://caltslab.uohyd.ac.in/calts-plugins/
Internet Society
https://www.internetsociety.org/
వేమూరి వేంకటేశ్వరరావు, కంప్యూటరు పని చేసే విధానం, లోలకం
http://lolakam.blogspot.com/2013/08/5.html
కంప్యూటర్ ఎరా
https://computerera.co.in/telugu/
గణనయంత్రం
https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%A3%E0%B0%A8%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82
ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం
http://poddu.net/2008/03/%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D/
కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
http://te.vikaspedia.in/education/it-literacy/c15c02c2ac4dc2fc42c1fc30c4d-c2a-c2ac4dc30c3ec27c2ec3fc15-c05c02c36c3ec32c41
యూని కోడ్ అంటే ఏమిటి ?
http://te.vikaspedia.in/education/it-literacy/unicode.pdf
కంప్యూటర్ – చరిత్ర
https://gkseva.blogspot.com/2014/12/blog-post_81.html