కథా మధురం-3
కె. రామలక్ష్మి గారి కథ : స్వేచ్ఛ నుంచి పంజరం లోకి
-జగద్ధాత్రి
తెలుగు పాఠకులకి చిరపరిచితమైన పేరు కె. రామలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కొత్త తరం కి కాస్త తెలపాలన్న ఆలోచనతో చిన్ని పరిచయం.
కె. రామలక్ష్మి , రామలక్ష్మి ఆరుద్ర అనే పేరులతో 1951 నుండి రచనలు చేస్తున్న ప్రసిద్ధ రచయిత్రి. డిసెంబర్ 31 , 1930 న కోటనందూరు లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. పట్టభద్రులు. ఆంగ్ల,
ఆంధ్ర, సాహిత్యం , ప్రాచీనాంధ్ర సాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉప సంపాదకులుగా పని చేశారు. అనువాదాలు చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. 1954 లో ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు, సాహిత్య చరిత్ర కారులు ఆరుద్ర తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు.
ప్రస్తుతం హైదారాబాద్ లో నివాసముంటున్నారు. స్త్రీవాద భావజాలం తో ఎన్నో కథలు రాశారు. ఆమె కథల్లో ఎక్కువగా ఇతివృత్తం వివిద పార్స్వాలలో స్త్రీల జీవితాతోలను గురించి ఉంటుంది.
కె. రామలక్ష్మి రచనలు: ఆమె రచించిన నవలలు :విడదీసే రైలుబళ్ళు (1954),
అవతలిగట్టు,మెరుపుతీగె,తొణికిన స్వర్గం (1961), మానని గాయం,
అణిముత్యం, పెళ్ళి (2013, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు,
కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ
కధా సంకలనాలు: నీదే నాహృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ, నా కూతురు
ఫెమినిస్టు(2016)
ఆరుద్ర సినీ గీతాలను కూడా సంకలనం చేశారు.
స్వేచ్ఛ నుండి పంజరం కథ ఇండియా టుడే లో24.3. 1998 లో ప్రచురితమైంది. స్వేచ్ఛ ఏదైనా ఆర్ధిక స్వేచ్ఛ , నచ్చినట్టు బతికే స్వేచ్ఛ ,ఇలాంటి స్వేచ్ఛని ఈ తరం ఎలా అర్ధం చేసుకుంటోంది అన్నది ఇతివృత్తం. ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు ఉన్నత విద్యలూ, పదవులూ పొంది ఎలా తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నారన్నది ఆలోచించాల్సిన విషయం. అలాంటి ఇద్దరు అమ్మాయిలను గురించిన కథ.
ఉద్యోగం వచ్చి ఆర్ధిక స్వేచ్చ లభించగానే, పెళ్లి అక్కర్లేకుండా ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఉండడం లాంటి అసహజ పరిణామాలు చోటు చేసుకుంటున్న సమాజం లో వెర్రి తలలు వేస్తున్న ఈ విచ్చలవిడి తనానికి ఒక గుణపాఠం ఈ కథ. నాణానికి అవతలి వైపు కూడా చూడాలి జీవితం లో అని చెప్పే కథ. మూడు తరాల స్త్రీల మనోభావాలు, వారిలో మానసిక పరిపక్వతను చర్చించే కథ. తప్పక చదవండి ఇదిగో ఇలా…..కథలోకి .
స్వేచ్ఛ నుంచి పంజరంలోకి
పరిమితులు లేని స్వేచ్ఛ ఓ అందమైన ఊహ. ఆ పరిమితులనే ‘పంజరం’ అనుకోవడం వట్టి అపోహ
ఉస్సురనుకుంటూ ఇంట్లో వచ్చిపడింది ఈ సుజాత, ‘కాలేజీలో పిల్లలకు పాఠం చెప్పడం ఓ ఎత్తు, బస్సులో పడి ఇంటికి చేరడం ఓ ఎత్తు’ అనుకుంటూ కుర్చీలో జేరబడి కళ్ళు మూసుకుంది.
“అదేమిటే అలా తోటకూర కాడలాగా పొడి పోయావు. నీ క్లాసులో ఓ ఇరవైమంది ఉంటారా? దానికేనా ఇలా ఆపసోపాలూ?” కాస్త సాగతీస్తూ, సుజాత అత్తగారు కోడలి వరస చూసి అడిగారు.
“బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేశారా మీరు? అందులోనూ సాయంత్రం పూట. అత్తయ్యా అదో సాహస యాత్ర అనుకోండి. అబ్బబ్బ. శరీర హింస భరించవచ్చునేమోగాని ఈ “మొగ కుర్రాళ్ళు అమ్మాయిలని హేళన చేస్తూ పాడే సినిమా పాటలూ, మాటలూ వినడం చాలా కష్టం. చాలా బాధాకరం కూడా. కొందరమ్మాయిలు మొగ్గల్లా ముడుచుకుపోయి ముళ్ళకంప చుట్టూ చుట్టుకున్నట్టు కనిపిస్తారు. కొందరు ‘షటప్!’ అనో, ‘నోరముయ్ అనో కోపం ప్రదర్శించినా కుర్రకారుది గజచర్మం అయిపోయింది. ఇంకా రెచ్చిపోతారు. అబ్బ, రోజూ ఇదే తంతు. వాళ్ళకెందుకు వీసుగెయ్యదో.. అత్తయ్యా! సక్కు రాలేదా?” అడిగింది.
“అదెందుకింత తొందరగా వస్తుందే! అదేం స్నేహమో. ఆ రాజేశ్వరి పర్మిషన్ తీసుకుగాని బయలుదేరి రాదేమో.” కాస్త కోపంగా అంటున్న అత్తగారిని నవ్వుతూ చూసింది సుజాత.
“అయినా సుజాతా! నువ్వు కాస్త కనరకపోతే అదింక మన మాట వినదు. ఇప్పటికే వినడం లేదనుకో” అంటూన్న అత్తగారితో మాట్లాడుతూనే వంటింటి కేసి నడిచింది సుజాత కాస్త కాఫీ తాగుదామనీ. చూడండి అత్తయ్యా. దాని చదువయింది. చక్కని సంబంధం చూసి పెళ్ళి చేసి పంపేస్తాం. ఇంక ఇలా ఒకచోట అంటీ పెట్టుకుని మనం ఉండక్కర్లేదు. మీ అబ్బాయికి ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికి పోవచ్చు హాయిగా. ‘నీ చదువు కోనం’ అంటూ అన్నామనుకోండి ‘అదిగో నాకోసం త్యాగాలు చెయ్యమనలేదు’ అంటూ విరుచుకు పడుతుంది. ఈ కాలం పిల్లల పట్ల మనమే జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం అది ఏమంటుందో.” నెమ్మదిగా అత్తగారితో ” అంటూ ఉండగానే సుడిగాలిలాగా రానేవచ్చింది శకుంతల. “ఏమిటి మమ్మీ నాగురించి నావెనక చర్చించు కుంటున్నారా?’’’’’ నవ్వుతూ అడిగి నానమ్మ ఇస్తున్న కాఫీ అందుకుంది శకుంతల.
“ఏం లేదే. పరీక్షలు రాసేశావా! ఇంకేముంది! మంచి పెళ్ళి కొడుకుని చూడాలని…” ఇంకా ఆమె మాట పూర్తికాకుండానే “వాట్! చదువయితే పెళ్ళీ చేనుకోవాలా? మమ్మీ నేను పెళ్ళి చేసుకోను. ముందే చెప్తున్నా. తరువాత నేను విరుచుకు పడ్డానని అరిచి ప్రయోజనం లేదు. రాజేశ్వరీ, నేనూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చాం . వేధవ పెళ్ళి వెధవ మగాళ్ళు! పెళ్ళంటే ఏముంది? తిండి, నిద్ర, బిడ్డా, పాప, చాకిరీ…చాకిరీ… అంతేగా? మేం ఇద్దరం పెళ్ళి చేసుకోం. వ్యక్తుల్లాగా బతుకుతాం.” గంభీరంగా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. శకుంతల.
అత్తాకోడలూ ముఖంముఖం చూసుకున్నారు కొన్ని క్షణాలు. తరువాత సుజాతే ముందుగా కోలుకుంది. “అత్తయ్యా మీరూరుకోండి. చూస్తాంగా” అంది.
“అయినా కూడా ఆ పిల్లతో స్నేహం నాకు నచ్చడం లేదే! అదేమిటి అలా ఇద్దరూ నడుం నడుం పట్టుకు తిరగడం? చూసేవాళ్ళేమనుకుంటారు? స్నేహితులు ఉండవలసిందే. మరీ ఇలా బరితెగించినట్టుంటే ‘ఎవరు పెంచారో’ అని నన్నూ, నిన్నే కదా లోకం అనేది. కాస్త ఆలోచించు. అలా పట్టించుకోకుండా ఉంటే..”
“పట్టించుకున్నట్టుంటే, మరీ వద్దన్న పనే చేసే వయసు మరేం కంగారుపడకండి. చూద్దాం ఏం చేస్తుందో, సాయంత్రం అన్నమా, రొట్టెలా?” అడిగింది అత్తగారిని సుజాత.
“ఏదో ఒహటి. సుజాతా! మొన్న రెండు రోజులు నువ్వలా క్యాంప్ వెళ్ళినప్పుడాపిల్ల ఇక్కడే ఉంది. ఒట్టి మగరాయుడి బుద్ధులు. మన మీద ఇలా విరుచుకుపడుతుందా సక్కు దానిదగ్గర కుక్కిన పేనులా ఉండడం చూస్తే చాలా” అసహ్యం వేసింది..” ఇంకా ఏదో చెప్పబోతున్న అత్తగారిని ఆపి, “రండి ఏదో కాస్త తిని, టీవీలో సినిమా ఉందట చూద్దాం” అని మాట మార్చింది సుజాత. కొద్ది నెలలుగా కూతురిలో వస్తున్న మార్పులు, మొండితనం గమనించక పోలేదు సుజాత. కానీ, చాలా సున్నితంగా చెప్పినా అపార్థం చేసుకునే వయను. ఇప్పుడొస్తున్న ధోరణులకు నాయకత్వం వహించి, చాలా ముందుకి పోయింది’ అని అందరూ తెలుసుకోవాలన్న తపన. కూడనిది, వద్దన్నది చేసి తీరాలన్న కసి. అదే తమ విజయం అన్న గర్వం శకుంతలని పట్టి ఆడిస్తూ ఉంది. భావనలో ఏకత్వం కలిగిన రాజేశ్వరి కూడా నుజాతకి తెలుసు. “ఛ ఆడతనం, మగతనం కాదు మనం గుర్తించవలసింది, వ్యక్తిత్వం ఆంటీ. ఈ విషయాల్లో నేనూ, సక్కూ ఒకటి. చూడండి ఓ రోజు మీకు మేం నిరూపిస్తాం” అంది ఒకసారి రాజేశ్వరి.
“ఏం నిరూపిస్తారు?” కుతూహలంగా అడిగింది సుజాత “మేం రైట్ అని. నాకు ఉద్యోగం రెడీ. సక్కుకి కూడా వచ్చేస్తుంది” అంది గర్వంగా.
“ఆర్థికంగా సొంత కాళ్ళమీద నిలబడడం మంచిదే రాజీ, అది ధైర్యాన్నిస్తుంది” అంది సుజాత.
“అంతే కాదాంటీ. అది మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఉండనిస్తుంది. ఈ సమాజం ముఖం మీద ఒక్క తన్ను తన్ని, జాతికి చూపిస్తాం” చాలా గర్వంగా అంది.
“అం టే, నువ్వు పెళ్ళి చేసుకోవా?”
“ఛ..ఛ… కోరి బానిసత్వం కొనుక్కుంటారా ఎవరైనా? ఇద్దరూ స్వేచ్ఛాజీవులుగా బతకవచ్చు” అంది.
ఒకసారి అంతకుముందే కూతురూ, రాజేశ్వరీ చాలా మురిసిపోయి, పొంగిపోయి, ఉత్తేజపడిపోయి ఫైర్ అనే ఓ సినిమా గురించి తనని ఊదర గొట్టడం జ్ఞాపకానికి వచ్చింది సుజాతకి. మనసు కాస్త భారమైంది కూడా. వీళ్ళేటుపోతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు అనుకుంది. వీరి స్పందనకి అర్థంఏమిటి? అంతం ఏమిటి? అనుకుంది.
* * *
“మమ్మీ ఉద్యోగం వచ్చింది. నేనూ, రాజీ ఓ ఫ్లాట్ తీసుకుంటాం. స్వతంత్ర జీవితం ప్రారంభిస్తాం’ అంది చాలా గర్వంగా, చాలా ఆనందంగా సక్కు.
“నాన్నగారికి చెప్పవా?”
పెద్ద జోక్ విన్నట్టు నవ్వి “నేనేం పాపాయినా” అంది.
“కాదు. అందుకే బాధ్యత తెలియాలి అని నా ఉద్దేశం” అంది నెమ్మదిగానే సుజాత.
“చూడు మమ్మీ. బాధ్యత, సంప్రదాయం… ఏమనుకుంటారు? ఇలాంటివి చెప్పకు. నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా పెళ్ళి సంసారం సంప్రదాయం, సమాజం అంటూ ఊబిలో కూరుకుపోయావు. నిన్నెవరూ రక్షించలేరు మమ్మీ” అంది జాలిగా.
“మరి రాజేశ్వరి?”
“అదిప్పుడింట్లో లేదు. దానికి ఇంట్లో ఊపిరాడదు.”
“చూడు సుజా, దానితో వాదనేంటి? అబ్బాయిని పిలిపించు” అంది అత్తగారు.
“నానమ్మా, నాన్న వచ్చి నా కాళ్ళూ చేతులూ కట్టేసి పడేస్తారా.” వేళాకోళంగా అడిగింది. “
“లేదే, పిచ్చి ముదిరిపోకుండా పిచ్చాన్పత్రిలో ఓ ఆర్నెల్లు పడేస్తాడని… ఏమిటా వాగుడు? ఆ ఉద్యోగం ఇంటినుంచి వెళ్ళి ఏడవలేవా?” ఆవేశంగా, కోపంగా అరిచారు పెద్దావిడ.
“ఊరుకోండత్తయ్యా. ఎందుకంత కోపం? దాన్ని ఆ స్వేచ్ఛ అనుభవించనివ్వండి. మనం అడ్డుకోవడం దేనికి” అని అత్తగారితో అని, “ఎప్పుడు వెళదామని” అని అడిగింది సుజాత.
“ఈ వీకెండే. కడిగి శుభ్రం చేస్తా” అంది సక్కు.
“అదేం రాజేశ్వరి?” కుతూహలంగా అడిగింది సుజాత.
“దానికి ఓవర్ టైమ్ ఉంది.” ముభావంగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది శకుంతల.
ఇన్నాళ్ళూ కనబడని రెక్కలు విస్తరించినట్లు, తాను గాలిలో తేలిపోతూ స్వేచ్ఛాజీవనానికి ప్రయాణం అవుతున్నట్లు, ఆ ఆనందం పట్టలేక కళ్ళు వర్షిస్తున్నట్లు అనిపించింది శకుంతలకి. “అబ్బ! • ఇష్టమైనట్లు బతకాలనుకోవడంలో ఇంత ఆనందముంటుంది” అని పదే పదే అనుకోసాగింది.
* * *
శకుంతల వెళ్ళీ మూడు నెలలకు పైగా అయింది. సుజాత ప్రాణం పీకుతోందీ, ఓసారి కూతుర్ని చూడాలని. కానీ, నిగ్రహించుకుంది. ముసలావిడకి ఇదంతా బాధగా ఉంది. “అందరూ వెళుతున్నారు. నన్నూ తీర్థయాత్రలకు పంపవే కాస్త మనసు స్థిమితపడుతుంది, ఈ పిల్ల చేసిన పాడుపనికీ, పెళ్ళీ చేసి అత్తారింటికి పంపవలసిన పిల్ల. పోనీ ఈ ఉద్యోగం పై ఊళ్ళో ఏడవకూడదూ? పదిమందికీ సమాధానం చెప్పుకోవలసిన బాధ లేకుండా ఉండేది?” కళ్ళొత్తుకుంటూ అంది ఆవిడ.
అత్తగారిని ఓదార్చడం ఎలాగో అర్థం కాలేదు సుజాతకి. “తీర్థయాత్రలు చేసిరండి. సక్కు మీరొచ్చేసరికి ఇంట్లో ఉంటుందేమో” అంటూ నవ్వి ఆమెకి ప్రయాణం ఏర్పాట్లు చేసింది సుజాత. భర్తకి ఉత్తరం రాసింది, “పోనీవే, దాని ధోరణిలో దాన్నీ పోనీ. తప్పని తిరిగి వస్తేమటుకు వెనక్కి పంపకు. సాధారణంగా ఆవేశంతో పెద్దలు చేసే తప్పే అది” అని ధైర్యం చెప్తూ ఉత్తరం రాశాడు.
శకుంతల శకుంతలలాగే నాజూకైనది. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు అద్దంలా ఉంచి ఆఫీసుకి బయలుదేరడం కష్టం అనిపించసాగింది. “నువ్వూ షేర్ చెయ్యి రాజీ” అంటే, గట్టిగా వాటేసుకుని, ఓ ముద్దు పెట్టి, “ఇదే నా షేర్. నా పని ఒత్తిడి నీకు తెలుసు?” అని నవ్వేసి పోయి పడుకుంటుంది. రాత్రీ పగలూ- సెలవులన్నీ ఒక్కలాగే జరిగిపోతున్నాయి శకుంతలకి.
“రావే సాక్స్!” ముద్దుగా పిలిచి గట్టిగా కౌగిలించుకొని పడుకొనే రాజేశ్వరిని కాదనలేక, తనకు గగనమైపోతున్న స్వేచ్చని వదులుకోలేక, ఎలా చెప్పాలో తెలియక అలగడం ప్రారంభించింది శకుంతల.
“ఇంటిపనీ, ఉద్యోగం కష్టంగా ఉందా నక్కూ! పోనీ ఉద్యోగం మానేయ్. నా సంపాదన హాయిగా మనకి సరిపోతుంది” అంది ఓరోజు రాజేశ్వరి.
పక్కనే పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడింది శకుంతల. “ఎందుకంత భయం? నిన్ను పోషించలేననా? నిన్ను ఆనందంగా ఉంచలేననా” జీతం రోజున నీకు చక్కని డ్రస్ తెస్తు న్నానా లేదా? ఇంకేం కావాలే సక్కూ నీకు?” దగ్గరగా తీసుకుంటూ అడిగింది రాజేశ్వరి.”
“అంటే నేను సాదా సీదా గృహిణిగా వంటా వార్పూ చేస్తూ, నీ రాక కోసం అలంకరించుకొని నీకు పెళ్ళాంలాగా ఉండిపోమనా? నాన్సెన్స్ ‘నువ్వూ, నేనూ సమం’ అని కదా మనం బతకదల్చింది. నా సాంగత్యం సరే, నీ సహకారం ఏదీ? ఇప్పుడు నా ఆర్థిక స్వాతంత్ర్యానికే నామం పెట్టాలని చూస్తున్నావే.” వస్తున్న దుఃఖాన్ని దీగమింగుకుంటూ అంది శకుంతల క్షణంపాటు నివ్వెరపడినా, “సారీ సాక్స్, నేను అలా అనుకోలేదు. కానీ, ఎవరికో ఒకరం లొంగి ఉండక తప్పదేమో. ఆనందం పంచుకోవాలంటే, అలక్ష్యం చేయడం కంటే, అన్నీ అందించి సహకరించడం కావాలికదా! నువ్వు..”
రాజేశ్వరి మాట పూర్తికాకుండానే చేతిలో గ్లాను ఆమె మీదికి విసిరింది శకుంతల. అంతే రాజేశ్వరి శకుంతల చెంపలు వాయించింది. ఒక్క క్షణం ముద్దులతో ముంచెత్తి ఆనందించింది. శకుంతల విదిలించు కుంది “నే పెందరాడే వస్తాలే మాట్లాడుకుందాం” అంటూ వెళ్ళిపోయింది రాజేశ్వరి. ఆమె సాయంత్రం తిరిగి వచ్చేదాకా శకుంతల ఆగలేదు. పెట్టె సర్దుకుని ఆటోలో ఇంటికి చక్కా వచ్చింది.
ఏదీ కాని టైములో కాలింగ్ బెల్ మోగడంతో, కాస్త జ్వరంగా ఉన్న సుజాత లేచి వచ్చి తలుపు తీని కూతుర్ని చూసి బిక్కముఖం ” వేసింది. “రావచ్చా మమ్మీ?” ఏడుస్తూ అడిగింది. “ఇది నీ ఇల్లు. అలా అడుగుతావేం! రా. ఇష్టముంటే చెప్పు ఏమైందని. లేకుంటే ఊరుకో, రా” అంది సుజాత. చాలాసేపు తల్లి కౌగిట ఇమిడిపోయి ఏడ్చింది. ముఖం తుడుచుకొని “మమ్మీ, ‘ఇల్లు పంజరం, సమాజాన్ని ధిక్కరించి పంజరం చీల్చుకు బయట పడితే, ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం’ అంది రాజేశ్వరి. కానీ, అదేంకాదు మమ్మీ. అదేం కానే కాదు. మా స్నేహం చెడింది. నన్నో బానిసగా చేసేసింది మమ్మీ. నేను భరించలేను ఏడుస్తూనే అంటున్న కూతుర్ని ఓదార్చి, “నమాజం, సంప్రదాయం, పెళ్ళి, బాంధవ్యాలు ఇవన్నీ నీమీద కసితో పెట్టిన ఆంక్షలు కావు సక్కూ! నీ రక్షణ కోసమే ఏర్పడ్డ కనపడని పంజరాలే. కానీ, అవి నిన్నేం బంధించి పడేయవే! వివాహ వ్యవస్థలో లోపాలుంటే నువ్వు వాటిని సర్దుకోవచ్చు. భరించలేకపోతే తెగతెంపులు చేసుకోవచ్చు. నమాజం ఎవరు? మనకు మనమే కదా! నువ్వెవ్వరికీ జవాబు చెప్పక్కర్లేదు. నీ కష్టం నువ్వు పరిష్కరించుకోగలవు. ఎందుకో తెలుసా? ఇవన్నీ తెరచి ఉన్న పంజరాలు. ఇంతకంటే స్వేచ్ఛ నీకు ఎక్కడ దొరుకుతుంది? పిచ్చి దానా! నేనూ, మీనాన్న అరుచు కోవడం వినలేదా? నా ఒంట్లో బాగులేకపోతే నన్ను మోసుకెళ్ళి బాత్రూమ్ కి సైతం తీసుకెళ్ళలేదా? స్త్రీపురుషులు పెళ్ళి చేసుకున్నంతమాత్రాన, కనబడని తాళ్ళు వాళ్ళని కట్టిపడేశాయనుకోవడం పొరపాటు సక్కూ! అంతకంటే ఉన్నతమైనవీ, నున్నితమైనవీ వారిని కట్టి ఉంచుతాయి. ప్రకృతి విరుద్ధమైన చేష్టలు ఎవరు పట్టించుకోకపోయినా, తప్పనిపిస్తాయి. ఇందుకే నీకు తెలియదు. ఫైర్ సినిమా అది. ఇద్దరాడాళ్ళు ఎప్పటికీ దంపతులనిపించుకోరన్నది, దానిలో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక కదా తెలిసేది? ఒకవేళ అలా బతకాలనుకున్నా అదెన్నాళ్ళు సాగుతుంది?
పెళ్ళి అంటే సెక్సు ఒక్కటే కాదు, కలిసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకడం, ఏరోజుకారోజు కొత్తగా బతకడం. తెలుసా? ఏడవకు.”
శకుంతల తల్లి ముఖంలోకి తీక్షణంగా క్షణం పాటు చూసింది. ఆమె పెదవులు నవ్వనా వద్దా అన్నట్లు కొంచెంగా విచ్చుకున్నాయి.
తల్లినొక్కసారి గట్టిగా కౌగలించుకుంటూ, “నానమ్మా” అని కేకేసింది. “వస్తారురేపు. ఒకటీ రెండూ కాదు. మూడు నెలలు తీర్థయాత్రలు.” నవ్వింది సుజాత.
“నామీద కోపంతోనే?” బాధగా అడిగింది శకుంతల.
“లేదు, నువ్వు తిరిగి రావాలన్న కోరికతో, పద కాఫీ తాగుదాం” అంటూ వంటింట్లోకి దారితీసింది సుజాత. ఉప్పెనలా ముంచెత్తుతుందన్న భయం, తుపాను కంటే తక్కువగా సమసిపోవడం ఆమెకి సంతోషం కలిగించింది. “ఇదే కాబోలు ‘కాలమే చెప్తుంది’ అన్నదాని అర్థం” అనుకుంది నుజాత.
*****
పూసర్ల జగద్ధాత్రి ఎం.ఏ.(ఇంగ్లీష్) ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఎం.ఏ (ఫిలాసఫీ), (సోషియాలజీ), ఎం.ఎస్ సీ (సైకాలజీ), ఎం .ఎడ్. కూడా చేసారు. రచయిత్రి, అనువాదకురాలు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేస్తారు. ‘సహచరణం’ కవితా సంపుటి 2014 లో వెలువరించారు. సహచరణం కి పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం2015, అజోవిభో కందాళo ‘సరిలేరు నీకెవ్వరు’ పురస్కారం 2017 జనవరిలో లభించింది. విశాలాక్షి , చినుకు మాస పత్రికల్లో శీర్షికలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు, ఆంగ్ల పత్రిక హన్స్ ఇండియా లో ఆంగ్ల వ్యాసాలు, శీర్షికలు రాస్తున్నారు.