కనక నారాయణీయం

-పుట్టపర్తి నాగపద్మిని 

”అనగనగనగా…….చీమలు దూరని చిట్టడవి…కాకులు దూరని కారడవి…అందులో…” ఊపిరి బిగబట్టుకుని వినే చిన్నారి కళ్ళల్లో…ఒకటే ఉత్కంఠ!! ఆ చీమలు దూరని చిట్టడవిలో…ఏముందో, ఎటువంటి క్రూర మృగం మనమీదకి వచ్చి పడుతుందోనని..భయం!! వినాలనే తహతహ!! ఎవరో రాజకుమారుడు వచ్చి మనల్ని రక్షిస్తాడనే ధైర్యం కూడా!!

      మా బాల్యం కూడా ఇటువంటి కారడవుల కథలతో పాటూ హాస్యం ఉట్టిపడే తెనాలి రామకృష్ణుడూ, తాతాచార్యుల కథాశ్రవణంతో  ఉత్కంఠభరితంగానే సాగింది. ఎండాకాలం సెలవుల్లో, ఆ కథల లోకంలో మమ్మల్ని విహరింపజేసింది, మా అవ్వ, అంటే ఇప్పటిపిలుపుల్లో అమమ్మ, (మా   రాయలసీమలో అమ్మమ్మనూ, నాన్నమ్మనూ కూడా ‘అవ్వ ‘’ అనే పిలుస్తాం. ‘’తాత’’ కూడా అంతే) శ్రీమతి ధన్నవాడ కిడాంబి శేషమ్మగారు.  

      మా పిన్నమ్మ (అమ్మ సొంత చెల్లెలు) అలమేలమ్మ కూతురు,  నా వయసుకు దగ్గరైన మంజుల కూడా మా అవ్వతో హైదరాబాద్ నుండీ కడపకు వచ్చినప్పుడు, మా అవ్వ ఇటువంటి కథలు రాత్రిపూట చెబుతుండేది. రాత్రివేళ, చిలవలుపలవలుగా పొడిగిస్తూ రోజుల తరబడి  మా అవ్వ చెప్పేకథలంటే చెవులేమిటి, ఏమి కోసుకోవాలన్నా మేం రెడీ!! అంతటి వర్ణనా చాతురి ఆమెది!!

  అంతకంటే కాస్త ముందు, అంటే 1960 వరకూ మేము  మోచంపేట, నరసరామయ్య అడ్వొకేట్ వీధిలో ఒక మట్టి ఇంట్లో బాడుగకు ఉండేవాళ్ళం. అక్కడ కరెంట్ కూడా లేదు. ఇంట్లో బుడ్డీ దీపాలు, లాంద్రా దీపాలే!! వాటిని ముగ్గు పిండితో బాగా రుద్ది రుద్ది, మెరుపు తెప్పించే పని నేనూ చేసేదాన్ని, అప్పుడప్పుడూ!! ఇంట్లో, కరుణాదేవి, తరులతాదేవి, తులజాదేవి, ముగ్గురక్కయ్యలూ, మా అన్నయ్య అరవిందుడూ, నేను ఆఖరిదాన్ని. అయ్య శ్రీరామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండితులుగా ఉద్యోగం.  

        అటుతరువాత, మోచంపేట నరసరామయ్య వీధినుండీ, శివాలయం వీధిలో గుడిపాటవ్వ ఇంట్లో బాడుగకు వచ్చేనాటికి నాకు ఏడెనిమిదేళ్ళు. నేను పైన చెప్పిన కథాశ్రవణం జ్ఞాపకాలు, 1960 నుండీ 1965 ప్రాంతాల వరకూ నాటివి. ఆ తరువాత, మా అవ్వ చెప్పే కథలు వినేవాళ్ళలో మా చెల్లెలు అనూరాధ, అక్కయ్యల పిల్లలు దశలవారీగా  కృష్ణ ప్రసాద్, రవీ, శ్రీనిధీ, శ్రీకాంతూ చేరారు.  

     బాల్యం నుండీ,అడుగులు ముందుకు పడుతుంటే, కౌమారదశలోనూ  (1966 ప్రాంతాలు) ఆమె నుండీ జానపద కథలు కూడా వినేవాళ్ళం. కథలేవైనా, నాటకీయంగా, గొంతులో  మార్పులూ, హావభావాలూ, కొండొకచో అభినయం కూడా జోడించేదేమో, ఆహా…..ఆమె మాకందరికీ ఒక రకంగా గరిమనాభిగా ఉండేది. 

       ఆ విధంగా, మా అవ్వ శేషమ్మ గారి ద్వారా నాలో తిష్ట వేసుకున్న   కథలంటే చెవికోసుకునే గుణం,  దగ్గరలోని, రెడ్ క్రాస్ లైబ్రరీకి లాక్కుపోయేది, ప్రతి సాయంత్రమూ!! అక్కడుండే  టాల్ స్టాయ్ కథలు, బాగ్దాద్ కథలూ, అల్లా ఉద్దీన్, అద్భుతదీపం, ఆలీబాబా నలభై దొంగలూ, చందమామ,  బాలమిత్ర వంటి పుస్తకాలన్నీ నాకు ఆరాధ్యాలు అప్పట్లో!!

  ఈ మధ్య కాలంలోనే  నేను సీతారామయ్యగారనే బ్రాహ్మణోపాధ్యాయుని నిర్వహణలో నడిచే వీధిబడిలో ఐదవ తరగతి ముగించుకుని, మోచంపేటలో, అయ్య పని చేసే  శ్రీరామ కృష్ణా హైస్కూల్ లో ఆరవ తరగతిలో చేరిపోయాను.

   ఇటు ఆరవ తరగతిలో ప్రవేశం, దక్షిణభారత ప్రచార సభ నిర్వహించే హిందీ పరీక్షలు వ్రాసేందుకు, దగ్గరలోని హిందీ ప్రేమీ మండలిలో సాయంత్రాలు నడిచే క్లాసుల్లో ప్రవేశమూ ఒకేసారి జరిగిపోయాయి. దీనికి అయ్యకు తులసీదాసు రామచరిత మానస్ దాదాపు కంఠస్థమవటమూ, హిందీ పట్ల ఉన్న అపారమైన ప్రేమా కారణాలు. మా మూడో అక్కయ్య తులజాదేవి అప్పటికే యీ పరీక్షల చివరి మెట్టు దగ్గర కాబోలు ఉన్నది.      

        మెల్లిమెల్లిగా,  నేను దక్షిణ భారత ప్రచార సభ నిర్వహించే హిందీ పరీక్షల మెట్లు, ఒక్కొక్కటిగా ఎక్కుతూ వస్తున్నాను.  ప్రవేశిక, మధ్యమ, రాష్ట్రభాష, ప్రవేశిక, విశారద (రెండు భాగాలు) ప్రవీణ (మూడు భాగాలు) ఇలా ప్రతి ఆరునెలలకూ ఒక పరీక్షగా నిర్వహింపబడే ఆ పరీక్షల్లోని పాఠ్యాంశాలలో  సుప్రసిద్ధ కవి జీవితాలూ, వారి సాహిత్య పరిమళాలతో బాటు, దేశ భక్తులైన సర్దార్ పటేల్, మహాత్మాగాంధీ వంటి మహనీయుల జీవిత గాధలు కూడా పాఠ్యాంశాలుగా ఉండేవి. అప్పుడప్పుడే స్పష్టమౌతూ వచ్చింది, కథలంటే, కేవలం పౌరాణికాలూ, చారిత్రకాలూ, జానపదాలే కాదు,  వివిధరంగాలలో ఉన్నత స్థానాలకెదిగిన మహనీయుల జీవితాలు కూడా ఇతరులలో స్ఫూర్తిని ద్విగుణీకృతం చేసే మహత్తర సందేశాత్మకాలైన గొప్ప కథలేనని!!  

    ఆ తరువాత తరువాత, నాకర్థమైంది –  మా ఇంట్లోనే కొలువుదీరిన ఆ చతుర్దశభాషా గహన వీధీ విహారి, పద్య, గద్యానువాద, విమర్శనాది శతాధిక గ్రంధకర్త, సంగీత, సాహిత్య, నాట్యకళాభినివేశయుతమైన తన   హృద్వేదికపై సాక్షాత్తూ ఇందుశేఖరుడే, గజ్జె కట్టి, ఆడేలా వివశుణ్ణి చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి జీవితగాధ, నా మనసులో సదా శేఫాలికా సుమార్చనతో, పదిలపరచుకునేంత గొప్ప కథగా రూపుదిద్దుకుంటున్నదని!!

దానితో పాటూ, మరో సత్యమూ క్రమ క్రమంగా అవగతమైంది. పదునాల్గుభాషలలో ఆ పదునైన ప్రౌఢిమకు కారణం, వారి వెనుక వెన్నెముకై నిలచిన అర్ధాంగి, మా అమ్మ కనకమ్మేనని!!  పండరీభాగవతం, జనప్రియ రామాయణం, శ్రీనివాస ప్రబంధమూ వంటి పండిత ప్రశంసలందుకున్న గంభీర కావ్య సృష్టికి వన్నెలిచ్చింది కనకమ్మ అనే ఆ పదారువన్నె బంగారమేనని !! విజృంభణే తన శైలిగా చెలరేగే ఆ వరద గోదారివంటి మనస్తత్వాన్ని తన మౌనాదేశాల ఆనకట్టతో సాహితీ కేదారాల్లోకి మళ్ళించి, శతాధిక కావ్య సస్యాలను భారత భారతికందించిన పుణ్యం – ఆ అవంతీ సుందరిదేనని!!     

మా అమ్మ కనకమ్మగారికి 1975లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కారాన్ని అందిస్తున్నవేళ, మా అమ్మా, అయ్యా – ఇరువురినీ వేదికపైకి ఆహ్వానించి, జంటగానే సత్కరించటం, మరపురాని స్మృతి  పరీమళం!! అందుకే వారిరువురి ద్వయ గాధను ( శ్రీ వైష్ణవ ఉపాసనా క్రమంలో ద్వయ మంత్రానికి చాలా ప్రధాన్యత ఉంది..ఆ వివరాలు ముందు ముందు) ప్రియ నెచ్చెలి రసజ్ఞ పాఠకులతో పంచుకునే అవకాశమీవిధంగా నాకు రావటం, మహద్భాగ్యంగా భావిస్తూ, నా బాల్యం నుండీ, ఆ కథ ఏ విధంగా రూపుదిద్దుకున్నదో, వివరించే సఫల ప్రయత్నం  దశల వారీగా చేస్తానని, ”గీత ” గారి సాక్షిగా మాటిస్తూ…పుట్టపర్తి నాగపద్మిని

*****

Please follow and like us:

2 thoughts on “కనక నారాయణీయం”

  1. పుట్టపర్తి వారు మా అమ్మ తరఫు రక్త సంబంధీకులు..తాతయ్య అవుతారు.. శ్రీమతి నగపద్మిని గారు..పిన్ని గారు నాకు..మీ కథనం నా బాల్యాన్ని గుర్తుచేసింది.కాక పోతే నేను ఎడిగేసరికి కొన్ని సౌకర్యాలు వచ్చాయి కానీ ఆ బుడ్డీ దీపాల చిమినీలు మా అమ్మగారు అలా ముగ్గు పిండితోనే శుభ్రపరిచేవారు..రాయలసీమ సామాజిక పరిస్థితులను చక్కగా వివరించారు…💐

    1. sravantI, cAlA kRtajnatalu. mI spandana nakentO sphrootiniccindi.ika mundu kooDA, edurucoostAnu. nA kanakanArAyaNeeyam dhArAvAhikanu necceli dwArA sahRdaya pAThakulaku andistunna DA. gItA kaLagAriki dhanyavAdalu. puTtaparti nAgapadmini

Leave a Reply

Your email address will not be published.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.