కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ
–వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
ఆగస్టు 25 వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవాడ ఐలాపురం హోటల్ సమావేశ మందిరంలో కవిత్వ వర్షం కురిసింది. రూపెనగుంట్ల వసుధారాణి రాసిన కేవలం నువ్వే పుస్తకావిష్కరణ సందర్భంగా వక్తలు చేసిన ప్రసంగాల పూలవాన అది.
ఆ సభకు అధ్యక్షత వహించిన నేను ఆమె రాసిన కవిత్వానికి నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రాచీన కవుల పేర్లు చెప్తూ కాళిదాసు తర్వాత మరో కవి ఇంతవరకూ లేడు అని చేతివేళ్లలో చిటికెన వేలుతో లెక్క మొదలుపెట్టి అది కాళిదాసు అయితే రెండోది ఇంకెవరూ సమానకవి లేరు కనుక అనామిక అయింది అనే చమత్కార శ్లోకం ఉంది. కానీ అది సరికాదు అదే స్థాయి కవి రవీంద్రనాథ్ ఠాగూర్. అతనిప్రభావానికి లోను కాని భారతీయ కవి లేడు. తనదైన స్వంతముద్ర ఏర్పరుచుకోవచ్చు. అయినా ఆ ప్రభావం గొప్పది. ఆ పరంపర సమున్నతమైనది. అటువంటి పరంపరకు వారసురాలు వసుధారాణి అని చెప్పేను.
పుస్తకాన్ని వసుధారాణి గారి భర్త వెన్నెలగంటి శ్రీనివాసమూర్తి గారు( విశాఖపట్నం జిల్లా జడ్జ్) ఆవిష్కరించి మొదటి ప్రతి వారి కుమార్తె అచ్యుతుని లక్మీమేఘన అల్లుడు ప్రద్యుమ్న లకు అందించారు.
శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ వసుధారాణి ఏడుగురు తనఅక్కయ్యలను దేవతలుగా భావించే చెల్లెలని మరొకరు అక్కమహాదేవి లాంటి చెల్లెలు డాక్టర్ ప్రమోద అనీ మరో ముగ్గురు విశ్వవిద్యాలయ, కళాశాలల మాష్టరమ్మలకు అనుంగు శిష్యురాలనీ ఆవిధంగా ఆమె కవిత్వపుదారిని వెలుగులతో నింపుకున్నారని చమత్కారిం చారు. కేవలం నువ్వే లో నువ్వు బహుశా విల్లిపుత్తూరు స్వామే కావచ్చని సూచించి వదిలారు.ఇంకా విష్ణుసహస్రనామపు “త్వం” అంటే నువ్వు ను కూడా స్మరించారు
ఇప్పుడిప్పుడే సాహిత్య ఆకాశం వైపు విభ్రాంతి గా చూస్తున్న కవి సాహితీ విమర్శకుడు పుప్పాల శ్రీరామ్ పుస్తకం శ్రద్ధగా చదివి తనదైన ధోరణిలో విశ్లేషించారు. శ్రీరామ్ విశ్లేషణ లో కొంత సంక్లిష్టత సందిగ్ధత ఉన్నాయి. సాహిత్యవిద్యార్ధి కాబట్టి నేర్చుకునే దశలో ఇవి తప్పవు. మొత్తంమీద ఆకట్టుకునే ప్రసంగం చేశారు
కుందుర్తి స్వరాజ్యపద్మజ (వసుధారాణి అక్కయ్య) చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇందులో నువ్వు గురించి ఆమె తన ఉద్దేశం వివరించారు. పోతన గారి ఎవ్వనిచేజనించు పద్యం చదివి ఇందులో పెంజీకటికవ్వల ఎవరున్నారు అన్న అన్వేషణ, సాధన ఈ కవితల వెనకాల ఉందని చెప్పారు. చక్కటి ఉచ్ఛారణ, వెలుగులీనే ఆమె బహిరంతరసౌందర్యాల కలయిక శ్రోతలను ముగ్ధులను చేసింది.
చలం చెప్పినట్టు కవిత్వాన్ని తూచేరాళ్లు మరీ ఎక్కవైపోయిన ఈనాటి సాహిత్యవాతావరణం పట్ల నిస్పృహ తో ఒకింత ఆవేదనతో భానుప్రకాష్ I.A. S గారు(కమీషనర్, గనులశాఖ,)విలువైన ప్రసంగం చేశారు. సాహిత్యం లోకి రాజకీయాలు ప్రవేశించిన తర్వాత నిజమైన సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని గందరగోళపు వాతావరణాన్ని ప్రశ్నించారు. ఒకవైపు సాహిత్యవిద్యార్ధిని అని చెప్తూనే స్పష్టమైన భావాలు ప్రకటించారు
రొంపిచెర్లభార్గవి గారి గీతాలాపనతో సభ కొంత సంగీతపు పరిమళాన్ని ఆస్వాదించి తిరిగి వాడ్రేవు చినవీరభద్రుడు ఇవ్వబోయే ఆలోచనామృతానికి సన్నద్ధమైంది
చిన వీర భద్రుడు నలభైనిమిషాల ప్రసంగం చేశాడు. చైనా, జపాన్, పారశీక కవులను తీసుకొచ్చి వేదికముందు ప్రత్యక్షం చేశాడు వేలపేజీలసాహిత్యం, కవిత్వం రాసినవీరంతా ఆ తర్వాత రాసిన ఎపిగ్రామ్స్ గురించి చెప్పాడు. నువ్వు అన్నది ఒక దిగంతరేఖతప్ప మరేదీ కాదు. ఇది ప్రేమకవిత్వం కాదు భక్తి కవిత్వం అసలే కాదు.ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఒక సాధన. అంటూ పారశీకకవుల తో సమానమైన కవిత్వం ఇది అంటూ వసుధను వారి సరసన చేర్చాడు. వీరెవరి కవిత్వాలూ తెలియకుండా ఈమె తనంతతాను గా ఇటువంటి అత్యద్భుతమైన ఎపిగ్రామ్స్(ప్రగాఢ భావగర్భితాలైన చిరు కవితలు)రాయడం తనను విభ్రాంతపరచిందన్నాడు. చినవీరభద్రుడి ప్రసంగం వినవలసినదే గాని ఇక్కడ వివరించగలిగినది కాదు.
అతని ప్రసంగం తర్వాత సభంతా ప్రఫుల్లమూ ఉత్సాహభరితమూ అయింది. ముందురోజు మధ్యాహ్నం నుంచి అందరిహృదయాలూ జగద్ధాత్రి గారి ఆత్మహత్య వల్ల వికలమైపోయి ఉన్నాయి. సాహిత్యం కొంత తేర్చింది. ఈ విలువైన కవిత్వాల గురించి మాట్లాడుకున్న మాటలను ఆమె అంకితం చేస్తూ సభ ఆమె ఆత్మశాంతికి మౌన సమర్పణ చేసింది
వసుధారాణి గారి అబ్బాయి సాయిగోపాల్ అమెరికాలో పిహెచ్ డి చేస్తున్న బాలుడు అమ్మ సభలో ఆడియో సీడీ ద్వారా తన ప్రసంగం వినిపించాడు. అమ్మను చూసుకుని గర్వస్తున్నానన్నాడు.
వసుధారాణి గారి కుటుంబశ్రేయోభిలాషి రిటైర్డ్ సబ్ కలెక్టర్ నటరాజన్ గారు శుభాకాంక్షలు తెలిపారు.వసుధారాణి గారి మానవీయత గురించి ఉద్వేగభరితంగా చెప్పారు.
కవయిత్రి నాలుగునిముషాల పాటు చేసిన స్పందనాప్రసంగంతో తనకు తెలిసినదే రాసాను తప్ప తెలియనిదాన్ని చెప్పలేదన్నారు. ఇక పైన కూడా తనలోపలి సవ్వడిని విన్నప్పుజే రాస్తానని చెప్పారు. సభ ముగిసినా శ్రోతలంతా కబుర్లతో ఫోటోలతో విందారగించి కానుక గా ఇచ్చిన ‘కేవలం నువ్వే ‘పుస్తకం తో మరెంతోసేపు ఆ మందిరాన్ని ఉత్సవ భరితం చేశారు మామిడితోరణంతో అరటిచెట్లఅలంకరణలతో కళకళలాడిన హోటల్ మీటింగ్ హాల్ మునుపెన్నడూ లేని అందాన్ని సంతరించుకుంది. అందుకే అది సృష్టించిన పండగ వాతావరణం లో వసుధారాణి కవిత్వం పండుగ చేసుకుంది
సభకు విజయవాడ లోని ప్రముఖ సాహితీవేత్తలే కాక పొరుగూళ్లనుంచి కూడా మిత్రులు రావడం మరొక అదనపు అందం.
*****
వాడ్రేవు వీరలక్ష్మీదేవి తూర్పు గోదావరి జిల్లా శరభవరం గ్రామంలో పుట్టారు. రాజమండ్రి లో చదువుకుని కాకినాడలో కళాశాల అధ్యాపకురాలిగా సుదీర్ఘ కాలం పనిచేసారు. సత్యాన్వేషి చలం అనే అంశం మీద ఆంధ్రాయూనివర్శిటీ లో పరిశోధన కు బంగారుపతకం పొందారు.
మూడు కథాసంకలనాలు, రెండు శీర్షికా సంకలనాలు, రెండు సాహిత్యవ్యాస సంకలనాలు, అరవై భారతీయనవల మీద సమీక్షా వ్యాస సంకలనం ప్రచురించారు. నండూరి సుబ్బారావు గారి మీద కేంద్రసాహిత్య అకాడెమీకి మోనోగ్రాఫ్ రాశారు. ప్రస్తుతం సారంగ అంతర్జాల పత్రిక లో కొన్ని శేఫాలికలు పేరుతో సాహిత్యప్రశంసాత్మక వ్యాసాలు రాస్తున్నారు