కొత్త అడుగులు-1

 –శిలాలోలిత

ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్తకవయిత్రులను పరిచయం చేయాలన్న నా ఆలోచనకు రూపకల్పనే ఈ కాలమ్. ఇటీవల కాలంలో స్త్రీల రచనల సంఖ్య బాగా పెరిగింది. యం.ఫిల్, పీహెచ్.డి లను నేను కవయిత్రుల మీదే పరిశోధనను ఇష్టంగా చేశాను. స్త్రీలపై వారి రచనలపై అనేక వ్యాసాలు, ముందు మాటలు, ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాను. నాకు తృప్తిని కలిగించే విషయాలివి. నారి సారించి పేరుతో విమర్శా వ్యాసాల పుస్తకం వేశాను. రీసెర్చ్ గ్రంధరూపంలో వచ్చాక కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు (యం.ఫిల్), (కవయిత్రల కవితా మార్గం ప్రచురించిన తర్వాత అవి యూనివర్సిటీలకు రిఫరెన్స్ బుక్స్ గా తీసుకున్నారు చెర్రీ గారు అప్పట్లో రెండు స్త్రీవాద విమర్శా పుస్తకాలుగా పేర్కొనడం నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. పంజరాన్నీ నేనే పక్షినీ నేనే, ఎంతెంత దూరం గాజు నది కవితాసంపుటిలకు తీసుకొచ్చాను.

ఈమధ్య వర్తమాన లేఖ అనే పుస్తకం ప్రచురించాను. భూమిక (స్త్రీవాద పత్రిక) లో నాలుగేళ్ళ పాటు వచ్చిన కాలమ్ ఇది. అబ్బూరి ఛాయాదేవి మొదలుకొని కె.బి. లక్ష్మీ వరకు 51 మంది రచయిత్రులతో నేను రాసుకున్న లేఖలవి. మళ్ళీ వాళ్ళందరినీ కొత్తగా పరిచయం చేయడం వారి సాహిత్య కృషిని వివరించడం. వారితో నాకున్న ఆత్మీయ స్నేహాల గురించి రాసానందులో. ఇక ఇప్పుడు రాస్తున్న కవియిత్రులను, రచనా రీతులను పరిచయం చేయడం మొదలు పెడుతున్నాను.

రాయలసీమ కన్న మరో రత్నం – కందిమళ్ళ లక్ష్మి

ఆమె ఒక దేహం

లక్ష్మీ కందిమళ్ళ ఆ దేహానికున్న పేరు.

ఆమెకు ఒక మనసు

స్పందన ప్రతిస్పందనల రూపమది.

ఆమె లోపలి మనసుకొక ఘర్షణ

ఆ యుద్ధంలో గెలిచి నిలిచిన అక్షరాలే

మన ముందిలా ఈరోజు కవిత్వమై పలకరిస్తున్నాయి. ఆమె హృదయమొక విండ్ కేవ్ లాంటిది. ఎటునుంచి వస్తుందో తెలీని గాలి. అందర్నీ ఆవరించినట్లుగానే బతుకు గుహ గుండా ప్రయాణిస్తున్న ఆమెకు అన్నింటా తోడుగా గాలి స్పర్శతో సాగిపోతుండటం గమనిస్తాం.

తన గురించిన తండ్లాట తానెక్కడుందన్న విచక్షణ, నాకు నేనుగా ఎప్పటికైనా మిగుల్తానా అన్న పరివేదన అతలాకుతలం చేస్తుంది. చాలా చోట్ల వెల్లడించలేని ఆశక్తత ఆవరించుకున్న భావ వాతావరణం కనిపిస్తుంది. ఆవేదన తాలూకా ఛాయలు ప్రతిఫలిస్తూనే ఉంటాయి.

చాన్నాళ్ల క్రితం అద్భుతమైన రచయిత్రి సి.సుజాత రెప్పచాటు ఉప్పెన అనే కథల పుస్తకాన్ని తీసుకొని వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా రెప్పచాటు రాగం గా లక్ష్మి తన కవిత్వాన్ని తీసుకొస్తోంది.

శబ్దం ఏమాత్రం చెయ్యనీ, అన్నింటిని కనురెప్పల లోనే కుదించుకుని, నీటి సంద్రాలను సైతం వెనక్కి గుండె ద్వారా పంపిస్తూ నిశ్శబ్ద చిత్రాల్లా స్త్రీల జీవితాలు కొనసాగుతున్నాయి అనడానికి వీరు ఎంచుకున్న పేర్లు కనిపిస్తున్నాయి. ఆమె ఉప్పెన అంది. ఈమె రాగం అంది. సరళంగా మెత్తగా చెప్పడానికి ప్రయత్నించింది. ఇరువురి స్వభావాల్లో వున్న ఆ భేదం వల్ల కూడా పేరుని ఎంచుకొని ఉండొచ్చు.

నిజానికి, నేనెప్పుడో పూర్తి చెయ్యాల్సిన మాటలివి. కానీ అనుకోని కారణాలవల్ల ఆలస్యమైపోయింది. ఆమెకు ఎంత సహనముందో నాకర్థమైంది.

మన సమాజం ఇంకా మారలేదనడానికి నిదర్శనం. స్త్రీల రచనలను ఇంకా గౌరవించడం, ప్రసిద్ధమైనవని గుర్తించకపోవడం, స్త్రీలకత రచనా శక్తి లేదనే స్థిరీకృత అభిప్రాయాలకు ఏమాత్రం తూటు పడలేదు. స్త్రీలు రాసే రచనలన్నీ ఇంటికే పరిమితమనీ, జ్ఞానం తక్కువున్న వాళ్ళనీ, రాజకీయాల గురించి రాయలేరనీ, అవగాహన లోపించిన వారనీ, ఎంతసేపూ ప్రేమలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, కుటుంబం, విరహాలు ఎట్సెట్రాలు మాత్రమే రాస్తారని వాళ్ళ వ్యక్తిగత జీవితాలే ఇవన్నీ అదే బలమైన గండ్రగొడ్డలిని తయారుచేసుకుని విమర్శపేరుతో స్త్రీలను మొగ్గ దశ నుండే నరకడానికి ప్రయత్నిస్తున్న తీరు అందరికీ తెలిసిన విషయమే. స్త్రీలుగా రాయడమంటే ఒక పెద్ద సర్కస్ ఫీట్ చేయడమే. ఆమెకెన్నో అడ్డంకులు, అవరోధాలు, సమయంవుండదు. కుటుంబాలలో అందరికీ ప్రోత్సాహం లభించదు. కమలాదాస్ లాంటి మలయాళీ ప్రముఖ రచయిత్రే రాయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తమిళ రచయిత్రి కూడా సల్మా కుటుంబ హింసను తట్టుకోలేక టాయిలెట్ పేపర్ల మీద రహస్యంగా నవల రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి.

తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా పరిణయం లో

పొలతి నమ్మగరాదు పురుషులనెప్పుడు

కృష్ణ సర్పములైయుండ్రు’ – అని స్టేట్ మెంట్ ఆ రోజుల్లోనే ఇచ్చేసింది. పక్కన కృష్ణ షర్పం పడుకుని వుందని తెల్సాక స్త్రీల మానసిక స్థితి ఎలా ఉంటుందో వూహించగలం.

ఐతే మనం గుర్తించవలసిన అంగం కూడాఉంది. ఇలాంటి అభిప్రాయాలతో అందరూ అని కాక, కొందరు స్త్రీలు కూడా సాటి మనిషే, శక్తి ఉన్న ప్రాణే అని గ్రహింపుకొచ్చి వాళ్ళను గౌరవించే స్థితికి చేరుకున్నందుకు సంతోష పడదాం. పాత భావాలతో 80% అలాంటివాళ్ళుంటే 20% మాత్రమే మారిన అవగాహనవున్న కవులు, రచయితలు కన్పిస్తారు.

ఏదేమైనా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా స్త్రీలుగా జీవిస్తూనే తమపై కనబడని కుట్రలన్నింటినీ బాహాటంగా వెల్లడించడం, స్త్రీ పురుషులిద్దరూ సమాన ప్రాణులే అనే సిద్ధాంతంతో ఈ కాలపు రచనలు వెలువడుతున్నాయి. స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక బారికేడ్స్ని దాటుకుంటూ వస్తున్నారు. నేను యం.ఫిల్’, ‘పిహెచ్.డీలు స్త్రీల కవిత్వం మీదే ఇష్టంగా చేయడం వల్ల ఎక్కడ కవయిత్రులు కొత్తగా వచ్చినా నా మనసు నిండుతుంది. వాళ్ళను చూసి సంతోషమన్పిస్తుంది. నిజానికి లక్ష్మితో నాకు పరిచయం లేదు. ఈ అక్షరాలే పరిచయం చేశాయి. ఆమె కవిత్వశక్తే రాయిస్తుంది. ఎంత తపన పడ్తే, పెనుగులాడ్తే తప్ప స్త్రీలు రాయలేరు. అంతటి అనామకుల పరిస్థితుల్లో రాస్తున్న వారి వారి ఒక్క అక్షరమైనా చాలు. వాళ్ల పట్ల గౌరవం కలుగుతుంది నాకు.

ఈ పుస్తకానికి జి. వెంకటకృష్ణ, యశస్వీ, సతీష్ లు మంచి ముందుమాటలు రాశారు. సహృదయతను ఆ అక్షరాలు పట్టిచ్చాయి.

నేను చెప్పాలనుకున్న కవితలు చాలా వరకూ ఉదహరించారు. అందుకే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ఊపిరి… అనే కవిత కన్నీళ్ళొలికించింది. చాలా విషాదవంతమైన కవిత. తనను ఎంతో హింసించినా, చేతుల్ని విరిచేసినా, కొంచెం నమ్మకంతో చిగురించొచ్చు అనుకుంది. కానీ. ఆమె ఊపిరి ఆగిపోయేవరకు తెలియలేదట. పేర్లతో సహా పీకేసారని…. అనడంతో కవిత అయిపోతుంది ఎప్పటికప్పుడు స్త్రీ తననుతాను పునర్నిర్మించుకోవాలని ప్రయత్నిస్తూనే వున్నా, పెనుగులాడుతూనే వున్నా, మొదలంటూ నరికేస్తున్నారన్న నిజాన్ని చిన్న కవితలో, చిన్న మాటల్లో ప్రతిభావంతంగా చెప్పింది. ఒక నిస్పృహ తనునెల్లా వెంటాడిన సందర్భంలో ఇంతే అనే నిరాశను వ్యక్తీకరిస్తూ రాసింది. చాలా చిన్న చిన్న మాటల్లో లోతైన భావాల్ని చెప్పడం ఈమె ప్రత్యేకత. సమాజాన్ని, స్త్రీల స్థితినీ గమనించడానికి లోతైన చూపుగల రాయలసీమ కవయిత్రి. భావ గాఢత వున్న కవితలే ఎక్కువగా ఉన్నాయి. సహజీవన సౌందర్యంలోని పరిమళాన్ని తెలుపుతూ నీకై కవిత రాసింది. చాలా అలవోకగ జీవన సత్యాల్ని అలా విత్తనాలు జల్లుకుంటూ పోయినట్లుగా చెబ్తుంటుది. మౌనం అలవాటైంది…. జ్ఞాపకాలతో జతకట్టా.. అని అలాగే స్త్రీల జీవితాన్ని గురించి సందిగ్ధావస్థకవితలో ఆకాంక్షల కారాగారాలు, అసంకల్పిత ఆరాధనలు, వెలుగు దారులకై వెతుకులాటలు.

లక్ష్మి ప్రకృతినెంతో ప్రేమిస్తుంది. పూలన్నా, పచ్చని మొక్కలన్నా, గాలి తెమ్మరలన్నా, చిగురించే ఆశలన్నా ఇష్టం కావడంతో చాలా చోట్ల పదేపదే కలవరిస్తుంటుంది. అప్పుడప్పుడూ పసిపాపలా మరింతగా తెలివి మీరిన చైతన్యంతో –

ఆమెలోని వైవిధ్యానికి కొత్త టెక్నిక్ తో రాసిన తీరు ఒకతో కవితను ఉదహరించవచ్చు.

బుద్ధి చెప్పేవాడు గుద్దితే నేమయ్యా అని మన వేమన అన్నట్లుగా, లక్ష్మి పట్ల వాత్సల్యంతోనే చెప్పే నాలుగు మాటలు. భాషలో చాలావరకూ ఇంకా కొత్తదనాన్ని నింపుకోవాలి. ఇప్పుడున్న కవిత్వ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకూ వాడివాడి అరిగిపోయిన మాటలెన్నో మళ్లీ కన్పించాయి. కవిత్వం ఎప్పటికప్పుడు కొత్తదనాన్నీ, వ్యక్తీకరణతో విలక్షణతను పాటిస్తే బాగుంటుంది. ఈ సారి వేయబోయే పుస్తకంలో ఈ చిన్న పాటి జాగ్రత్త తీసుకోవాలి.

ఆలోచనా శక్తితో బలమూ, బరువూ వున్నాయి. ఊహాశక్తిలో బావ గాఢతా ఉంది. ఎటొచ్చి భాష విషయంలోనే పాత పదాల ఉపమానాల పోలికల సంకెళ్ళు తగ్గించుకుంటే బాగుంటుందనిపించింది. క్లుప్తత నిండిన లక్షణం ఎక్కువగా ఉంది.

లక్ష్మీ కందిమళ్ళ జీవన గమనాన్ని అర్థం చేసుకోవాలంటే, నీడను అనుసరిస్తున్నా, పిరికితనం వదిలే వరకూ కాలాన్ని తెలుసుకుంటున్న క్రమంలో స్త్రీపురుషుల తత్వాన్ని అంచనా వేస్తున్నానంటుదొకచోట నిశ్చలత్వం కవితలో.

చివరిగా లక్ష్మీ కందిమళ్ళ తన కవిత్వ ఆకాశంలో ఒక తారగా మెరిసి పోతుందనడానికి ఎటువంటి సందేహము లేదు. ప్రపంచాన్ని ఆమె చూసిన, చూస్తున్న, అర్థం చేసుకున్న, ఆవాహన చేసుకున్నా క్రమమంతా ఈ పుస్తకంలో దాగొనివుంది. ఎక్కువగా అధ్యయనం చేయాల్సిన అవసరమూ ఉంది. జీవితాన్ని తొలుచుకొని వచ్చిన మనిషే కాబట్టే, ఈ కవిత్వమింత దీపశిఖ అయ్యింది. నీ ఉజ్వల భవిష్యత్తు నా కళ్ళ ముందంతా పరుచుకొనేవుంది. ఈ అభినందనలు మనసారా జయహో కవిత్వం జయహో.

*****

1.   మధుకలశాలు

గడ్డిపువ్వుల పలకరింపులు
తొలిజాము కేరింతలు
మురిపిస్తున్న కంటి భాషలు
*
గాలికబుర్లతో
హృదయం నవ్వుతుంటే
వానవిల్లులా విరిసిన హరివిల్లు
*
చిటపట చినుకుల
సయ్యాటలతో
ఇంటి ముంగిట కొమ్మపై
కోయిలమ్మ కహూ కుహూ రాగాలు
*
చందమామ కబురుతో
విరిసిన వెన్నెల విరహాలు
అలకను తీర్చే వలపురాగాలు
*
వసంతపు వెక్కిళ్ళతో
పెదవిపై విచ్చుకున్న లాస్యాలు
నిశిలో విరిసిన మధుపాలు
*
మకరందాల “మధుకలశాలు”…

***

2. ఆమె/ఆమే

ఆమె పిచ్చిదే మరి
వసంతంకై వేచిచూస్తూనే ఉంటుంది
ఎండిన మానుకూడా చిగురిస్తుందన్న  ఆశతో

సహజమైన పరిమళంకై
పాదుతీసి నీరు పోస్తూనే ఉంటుంది
          ప్రతిరోజూ….

***

3. ఏమిటో…

ఏమిటో
అద్దంపై ఆ మరకలు
అంతలా మెరుస్తున్నాయి
కంటిలోని తడివల్లనా
లేక అద్దానికే మరకలంటాయా
మనసు నలుగుతున్న
ప్రతిసారి ఇదో సంశయం
అద్దంపై ఇంకా ఎక్కువ మరకలు కనిపిస్తూ

రెప్పలచాటు ఏదో తెలియని కదలిక
కంటిలో నలతపడ్డట్టు వింత బాధతో

వెన్నెల రాత్రులు కూడా
నిండు అమావాస్య లా కనిపిస్తుంటే
కంటిపాప బెదురు చూపులు
కంటి చుట్టూ నల్లటివలయాలు చేరిపోతూ
మరింత విసిగిస్తుంటాయి ఎంతో దుఃఖాన్ని మూటకడుతూ

ఆశల ఆకలి
మరింత
కంటిని మండిస్తూ ఉంటుంది
నిన్నలో కలిసిపోయే
కలతోచేరి

రెప్పలచూరు కింద
నిద్రిస్తున్న నిరాశను నిద్ర లేపుతుంటాయి
కన్నీళ్ళతో విడదీయని బంధాన్ని కలుపుకొని
చూపుల తీరాలను కెరటాల హోరులా హోరెత్తిస్తూ
మనసుకు భారాన్ని నింపుతుంటాయి
కలతల సుడిగుండంలోకి తోసేస్తూ..!!!!

***

లక్ష్మీ_కందిమళ్ళ 

గృహిణి
కర్నూలు
సాహిత్యాభిలాష
ప్రవృత్తి: కవిత్వం రాయడం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.