గీత శ్రావణం, సంగీతం (కవితలు)
-నాగరాజు రామస్వామి
గీత శ్రావణం
ఉదయాకాశం తడి తడిగా
నన్ను పెనవేసుకున్నప్పుడల్లా
రాత్రంతా నానిన అక్షరం
నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది.
చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు
తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు
నా చిరు చీకటి చూరు లోంచి.
శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు!
ముసురు ముసుగుల వెనుక
సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ!
ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం!
చీకటి బతుకులలో కిరణమై నదించాలని
తొందరిస్తున్న తొలిపొద్దు ఘంటారావం!
గాలిలో
చల చల్లని సరిగమలేవో తేలుతుంటవి.
కొంగుచాటు గుండెలో ఒదిగిపోతూ
తడిసి ముద్దైన మబ్బు బిడ్డ
సన సన్నని మేఘ రాగాలు తీస్తుంటాడు.
నెత్తిన బరువెక్కుతున్న గడ్డి మోపుతో
వంగుతున్న వానకారు నడుముతో
చలికి వణుకుతున్న వాన పాటై
నడచి వస్తుంటుంది రైతు కూతురు.
ఒంటి బరువును ఒంటి కాలి మీద నిలిపి
చల్లని జల్లుల పిల్లనగోవికి పులకిస్తున్న గొర్రె పిల్లల
జలద గీతాలకు జలదరిస్తుంటాడు
గంగ గొంగళిని కప్పుకొన్న గొల్ల.
బడికి సెలవిచ్చిన వర్ష గీతాల కేరింతలతో
తడిసిన పుస్తకమై ఇంటికి వచ్చిన తనయుని
నీరు గారే తలనీలాలను తన చీర కొంగుతో
తుండు గుడ్డయి తుడుస్తుంటుంది
వాత్సల్యాల తల్లి.
మూసుకొచ్చిన ముసుర్లలో
కొండ మీది కోవెల జేగంటలు మోగించి
గుట్టల గుహలలో వనభోజనాలు ముగించి
ఇంటికి తిరిగొస్తున్న పల్లె పదాలు
జలబిందు నాదాలై ధ్వనిస్తుంటవి.
నీటి ముత్యాలు పొదిగిన
పసుపు పచ్చని చింతపూ ముక్కెరను
ముక్కున పెట్టుకున్న చెట్టు కొమ్మల కువకువల్లో
వాన వీణలు మోగుతుంటవి.
అద్దాల కిటికీ అవతల ముద్ద బంతి
వర్షోత్సవానికి ముస్తాబవుతుంటుంది,
నేను
నాటి పల్లె స్మృతుల పునశ్చరణ ధారల
శ్రావ్య శ్రావణ మేఘాన్నై
వర్షార్ద్ర వాక్యాలను అల్లుకుంటుంటాను.
*************
సంగీతం (అనువాద కవిత )
( Music )
by Chinese modern poetess Zhang Zhen ,
Translation -Bob Holman and Xiangyang Chen
చలి కమ్మిన అపరాత్రి,
సద్దుమణగిన నిర్జన వీధి;
గుడ్డి వెలుతురులో తూలిపడుతూ
సంగీత విభావరీ సభ నుండి బయటపడ్డాను.
నా నిశ్వాస
వంగిన దీప స్తంభాలను తాకి వెనుతిరిగింది
కుక్క కరిచిన నా నీడలా.
ఆ అగమ్య
నీలి జిగురుల తుహిన తుషార శశిహీన రేయిలో
చిక్కుకున్న నేను
దిక్కుతోచక జపించాను నిస్తబ్ధ స్తుతి గీతాలను.
నేను పాడిన శృతి తప్పిన ప్రతి పాటా తిరిగొచ్చి
నా పెదవుల వెనుక విరిగి పడగానే
పైకి లేచాయి నా బిగిసిన రోమాలు
తార స్థాయి తీవ్ర స్వరాల్లా.
రాగాలు తీస్తూ రాత్రంతా రోదిస్తూనే వున్నాను
ఉదయ కిరణాలు కరిగించిన హిమధూళి లోంచి
హరిత మైదానాలను మోస్తున్న నగరం శిరసెత్తే దాకా;
ఆ వేకువలో
ప్రతిఒక్క గరిక పరక మీద మెరుస్తున్నది
ఒక్కో శుద్ధ స్వర మౌక్తికం !
*****
పల్లె సొబగులను పరిణత వాణిలో పొదిగిన వైనం అనన్య సామాన్యం. దశాబ్దాల క్రిందటి జ్ఞాపకాల వెన్నెల తునకల్నిఅక్షర కళికలుగా రూపించడం,చూపించడం మీకే సాధ్యం.గీత శ్రావణం మధురోహల మంచుపూలవాన.
సంగీతస్వరలహరి రేపిన అలజడి అనువాద కవిత ముగింపు మంచుముత్యాలతో అందగించింది