ప్రమద
తొలి విప్లవాల అంగారవల్లి రషీద్ జహాన్
– జగద్ధాత్రి
“నీ నుదుటపైన ఈ కొంగు చాలా అందంగా ఉంది కానీ
నీవీ కొంగును ఒక పతాక చేసి ఉంటే ఇంకా బాగుండేది” అస్రరూల్ హక్ మజాజ్
ఎవరిగురించి ఈ మాటలు అనుకుంటున్నారా? అలా తన జీవితాన్నే తిరుగుబాటు బావుటాగా ఎగురవేసిన ఒక అత్యుత్తమ మహిళను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆమె డాక్టర్ రషీద్ జహాన్. జీవించినది పూర్తిగా ఐదు పదులు కూడా కాకున్నా ఐదు జన్మలకు సరిపోయేంత ప్రగతిశీలక కార్యాచరణలు చేపట్టిన తొలి ముస్లిం లేడీ డాక్టర్. మత చాందసాలను తండ్రి సహాయం తో ఎదిరించి చదువుకుని డాక్టర్ అయి , రచయిత్రి గా , నాటక కర్త గా, అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యురాలిగా , కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ గా , బహు ముఖీనమైన ప్రగతిశీలక పాత్ర పోషించిన రషీద్ జహాన్ ‘అంగారెవాలీ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధురాలు. అంగారే అంటే నిప్పు కణికలు , ఈ మాటకి ఈమెకి సంబంధమేమిటి అంటారా , తెలుసుకుందాం రండి ఈ అభ్యుదయ మహిళా దీపశిఖను గూర్చి. డాక్టర్ రక్ష౦దా జలీల్ ఈమెను గురించి రాసిన ‘ఏ రెబెల్ అండ్ హర్ కాజ్’ (ఒక తిరుగుబాటుదారు ఆమె కార్యాచరణ కారణం) అనే ఈ పుస్తకం నుండి చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక ధీర వనితను గురించి.
కొందరి జీవితాలంతే ఎంతో గొప్ప తనం కీర్తి యశస్సు గుర్తింపు కి అర్హత ఉండి కూడా అంత పరిమాణం లో అవి లభ్యం కావు, అంటారు డాక్టర్ రక్షoదా జలీల్ రషీద్ జహాన్ ను గురించి. కానీ చరిత్ర మరువని చెరగని సత్యాలివి. సమసమాజ నిర్మాణానికి విప్లవాత్మక మైన ఆలోచనలతో నడుస్తూ నడిపించిన వారిని గురించి మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. తన పరిశోధనలో భాగంగా ఈ మరువరాని మహిళ జీవితాన్ని , ఆమె తన 47 ఏళ్ల జీవితం లో సాధించిన పనులను , మరికొన్ని ఆమె రచనలను ఆంగ్లం లో మనకు అందించిన వారు రక్ష౦దా. ‘రషీద్ జహాన్ అదృష్టవంతురాలు ఆమె జీవిత చరిత్రను రాసిన రక్షoదా జలీల్ ఆమెను గూర్చి ఎంతో సహానుభూతితోనూ , అవగాహన తోనూ ఒక స్ఫూర్తిదాయక మైన మహిళను గురించి అద్భుతంగా రాశారు’ అంటారు సల్మాన్ హైదర్ ( రషీద్ జహాన్ సోదరి పుత్రుడు).
తనకు ఈ జీవిత చరిత్ర రచించడం లో సహాయమందించిన వారు తన తల్లి మెహజబీన్ అని ఆమెకు రషీద్ జహాన్ ఆమె భర్త మహ్ముదుజ్జఫర్ కూడా బాగా పరిచయమున్న వారని పేర్కొంటారు రక్షాందా. చిన్నపటినుండి రషీద్ ను ఆమె భర్తను ఎరిగి ఉండటం వలన ఆమెను గురించిన వివరాలు ఆమె తన చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రభావితం చేసేదో అన్నీ జ్ణాపకాలను తన తల్లి అందించి ఉoడక పోతే ఈ పుస్తకాన్ని రాయలేక పోయి ఉండేదాన్ని అంటారు రక్ష౦దా. ఇక ఇంత స్ఫూర్తిదాయకమైన మహిళను గురించి రచయిత్రి ఏమి చెప్పారో తెలుసుకుందాం .
డాక్టర్ రషీద్ జహాన్ జీవిత వివరాలు(1905-1952) : రషీద్ జహాన్ బహుముఖీనమైన స్త్రీ. ఆమె డాక్టర్, కమ్యూనిస్ట్ పార్టీ (CPI) అంకితమైన సభ్యురాలు , అభ్యుదయ రచయితల సంఘం ( PWA ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ) కి వయవస్థాపక సభ్యురాలు. అంతేకాక PWA కి అత్యంత సోదర సంబంధమున్న ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (IPTA) లో క్రియాశీలక సభ్యురాలు, మహిళాభ్యుదయ వాది, ఉర్దు లో కథలు , నాటికలు రచించిన రచయిత్రి. ఇరవయ్యవ శతాబ్ది తొలి దశాబ్దం లో 1905 ఆగస్ట్ 25 న జన్మించింది రషీద్ జహాన్. ఆమె తల్లి తండ్రులు షేక్ అబ్దుల్లా, వహీదా బేగమ్ ల రెండవ కూతురు. ఆమె తర్వాత మరి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. తన తండ్రి తల్లి కలిసి స్థాపించిన బాలికల పాఠశాలలోనే ఆమె తొలి విద్యాభ్యాసం చేసింది. రషీద్ జహాన్ పుట్టుకకి వారి తల్లి తండ్రులు ఆలిఘర్లో స్థాపించిన బాలికల పాఠశాలకి విడదీయరాని అనుబందముంది. ఆమెతో బాటే ఆ పాఠశాల కూడా పెరిగింది. ఆ స్కూల్ లోనే తమ పిల్లలందరిని చదివించారు ఆమె తల్లి తండ్రులు. నాటి మత ఛాందసాలను ఎదిరించి స్త్రీ విద్యాభివృద్ధి కంకణం కట్టుకున్న తండ్రి షేక్ అబ్దుల్లా రషీద్ జహాన్ ను చదివించారు. రషీద్ లక్నో కాలేజ్కి వెళ్ళాక ముందే పర్దాను వదిలిపెట్టింది. అందుకు ఆమెకు తల్లితండ్రుల సహకారం ఉంది.
పదహారేళ్ళ ప్రాయం లో తల్లి తండ్రుల సంరక్షణ నుండి విడివడి లక్నో లో ఉన్న ఇసాబెల్ల తోబర్న్ (IT) కాలేజ్ లో చదవడానికి వెళ్లింది. ఇక్కడ ఆమెలోని మేధో వికాసం ఆరంభమైంది. సైన్స్ విద్యార్ధి అయినప్పటికీ డికెన్స్, కీట్స్, షెల్లీ, థామస్ హార్డీ లాంటి ఆంగ్ల రచయితలను, టాల్ స్టాయ్ , పుష్కిన్ వంటి ప్రఖ్యాత రషియన్ రచయితలను, బాల్జాక్ , ముపాసా వంటి వారి రచనలను చదువుకుంది. కాలేజ్ రోజుల్లోనే ఆమె తన తొలి కథ ‘వెన్ టాం – టాం బీట్స్’ ఆంగ్లం లో రచించింది. సెలవుల్లో ఇంటికి ఆలిఘర్ వెళ్ళినా క్షణం విశ్రాంతి లేకుండా తన తండ్రికి చాలా పనులలో సహాయం చేసేది రషీద్. నిరంతరం చైతన్య వంతంగా ఉత్సాహం తో ఆనందంతో విహార యాత్రలతో విలసిల్లేది షేక్ అబ్దుల్లా ఇల్లు.
లక్నో కాలేజ్ నుండి సైన్స్ లో ఇంటర్ పూర్తి చేసి ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదవడానికి వెళ్లింది రషీదా అని స్నేహితులు ఇంట్లో వారు పిలుచుకునే రషీద్. ఆలీఘర్ లో బాలికలకి విద్య లభించినప్పటికీ వృత్తి వున్నత విద్యను అభ్యసించే అవకాశం రషీద్ లాంటి కొందరికే వీలుపడింది.
అలీఘర్ తో అనుబంధం తను ఉన్నత విద్యకోసం వెళ్ళినప్పటికీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది ఆమెకి. అది ఆమె పుట్టిల్లే కాదు ఆ స్కూల్ ఆమె జీవితం లో ఒక విడదీయరాని బంధం గా పెనవేసుకుపోయింది.
ఎక్కడ చదువుకుంటున్నా సెలవలకి ఆలీఘర్ పాఠశాలకి రావడం అక్కడ తన తండ్రి రక్షణలో చదువుకుంటున్న బాలికలను కలవడం ఆమె ఎప్పుడూ మానలేదు. క్రాఫ్ చేయబడిన పొట్టి జుట్టు తో, సాదా నేత చీరలు గానీ , లేదా పొడవు కుర్తాలు కానీ ధరించి, ఏ విధమైన ముస్తాబు , నగలు లేకుండా నిరాడంబరంగా ఉన్న ఆమెని అందరూ ఆరాధనాపూర్వకంగా చూసేవారు. ఎటువంటి వారితోనైనా , మగవారితో కూడా యే అరమరికలూ లేకుండా సహృదయం తో కలిసిపోయే ఈమె ఒక సంచారిణీ జ్ఞాన దీపశిఖ అయి ప్రకాశించేది.
రషీద్ జహాన్ ‘అంగారెవాలీ’ : ఇది ఈ పుస్తకంలోని రెండవ పుటకు శీర్షిక. ఈమెను అంగారెవాలీ అని ఎందుకనేవారు? తెలుసుకుందాం . లక్నోలో మేధో వికాసం పొందిన రషీద్ కొందరు యువ మేధావులు , రాజకీయాలను గూర్చి బాగా ఎరిగిన వారూ అయిన కొందరిని కలవడం జరిగింది. వీరు సజ్జద్ జహీర్ , అహ్మద్ ఆలీ , సాహిబ్ జాదా మహ్ముదుజ్జఫర్ (ఇతనినే ఆమె 1934లో వివాహం చేసుకుంది) వీరు నలుగురూ కలిసి 1933 లో వెలువరించిన ఉర్దు రచనా సంకలనం ‘అంగారే’. అభ్యుదయ ప్రగతిశీలక భావనలున్న రచనలు ఉండటం వలన, మతాచారాలను ప్రశ్నించే విధంగా ఉండటం వలన ఈ పుస్తకాన్ని నిషేధించారు. డిసెంబర్ 1933 లో వెలువడిన ఈ పుస్తకం లో ఈ నాలుగురివి కలిపి పది రచనాలున్నాయి. అవి సజ్జద్ జహీర్ రాసిన ఐదు కథలు, నీంద్ నహీ ఆతీ(నిదుర రావడం లేదు), జన్నత్ కి బాషారత్ (స్వర్గపు ఆనంద వార్తలు), గర్మియోంకి ఏక్ రాత్ (ఒక వేసవి రాత్రి), దులారి (ఇది ఒకమ్మాయిని గురించి, ఈ కథకి నా తెలుగు అనువాదం ప్రజాశక్తి ఆదివారం పత్రికలో ప్రచురితమైంది ), ఫిర్ యే హంగామా (మళ్ళీ ఈ సంక్షోభం), అహ్మద్ ఆలీ కధలు రెండు , బాదల్ నహీ ఆతే ( మబ్బులు రావడం లేదు), మహావతోంకి ఏక్ రాత్ (ఒక చలి వర్షపు రాత్రి), రషీద్ వి ఒక కథ డిల్లీ కి సైర్ ( డిల్లీ ప్రయాణం), ఒక నాటిక పర్దే కె పీఛే( తెర వెనుక ) , మరొక్క కథమహ్ముదుజ్జఫర్ రచన జవాన్ మర్ది ( మగతనం).
ఆంగ్ల సాహిత్యం లో అప్పటికే విస్తృతి చెందుతున్న నూతన అభివ్యక్తి చైతన్య స్రవంతి పద్ధతిలో ఈ రచనలన్నీ రాయబడ్డాయి. ఇందులోని కథలు మతాన్ని, పురుష స్వామ్య వ్యవస్థలో స్త్రీల పరిస్థితిని, వర్గ వివక్షని , లింగ వివక్షని అన్నిటిని ప్రశ్నిస్తాయి. పార్దేకే పీఛే నాటిక ఆనాటి ముస్లిం సమాజం లో స్త్రీల దుస్థితిని ఇద్దరు స్త్రీల సంభాషణ ద్వారా చెప్పిస్తుంది రచయిత్రి. అప్పటివరకూ ఎవ్వరూ గళమెత్తి ప్రశ్నించని ఈ విషయాలను రచనల్లోకి తీసుకు వచ్చేసరికి మత గురువులు మౌల్వీలు, మత వాదులు అభ్యంతర పరిచారు. చివరికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది.
అంగారే లో ఢిల్లీకి సైర్ అనే అతి చిన్న కథలో వ్యంగ్యాత్మకంగా ఆమె ఒక భర్త తన భార్యను ఢిల్లీకి తీసుకెళ్లి ఏమీ చూపించకుండా ప్లాట్ ఫారం పైనే కూర్చో బెట్టి తిరిగి తీసుకొచ్చేయడాన్ని ఒక మహిళ అందరికీ విసుగుతో కూడిన మురిపెంతో చెప్పడాన్ని చిత్రిస్తుంది రషీద్. అలాగే పర్దేకే పీచే లో ఇద్దరు ముస్లిం వనితలు తమ లైంగిక జీవితాన్ని చర్చించుకుంటారు. దేహం ఏమై పోయినా భర్తకు కావాల్సినప్పుడు అప్ప జెప్పాల్సిందే అనే బాధ , అతన్ని మరి వేరెవరి మోజులోనూ పడకుండా కాపాడుకునే భయం వీరి సంభాషణ ద్వారా చెప్పిస్తారు రషీద్. ఇది చాలా సంచలనాత్మకమైపోయింది. అలాగే మర్డ్ ఔర్ ఔరత్ అనే సంభాషణ లాంటి కథలో కూడా స్త్రీ ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని గురించి చర్చిస్తారు( ఈ రచన తెలుగు అనువాదం నేను చేసింది సారంగ ఈ పత్రిక లో ప్రచురితమైంది) ఔరత్ అనే ఏకాంకిక లో కూడా ముస్లిం స్త్రీ జీవితం పైన గల ఆంక్షలను గురించి ప్రశ్నిస్తారు రషీద్.
ముస్లిం వనిత అయి ఉండీ ధైర్యంగా లైంగిక పరమైన విషయాలను , మత ఛాందసాన్ని ప్రశ్నించే విషయాలను రాసినందుకు రషీద్ జహాన్ ను ఆనాటి సమాజం రకరకాలుగా చూసింది. అభ్యుదయ వాదులు ఆమెను మహిళాభ్యుదయానికి మార్గదర్శిగా చూస్తే , ఛాందస వాదులు ఆమెను ఒక బరితెగించిన స్త్రీగా, తిరుగుబాటుదారుగా పరిగణించేవారు. పర్దాను, ఆచారాలను పాటించక ఆడది చదువుకుంటే ఇలాగే బరితెగించిపోతుంది అన్నట్టు చూసేవారు. ఒక లేడీ డాక్టర్ గా , బాగా ఉన్నత విద్యను అభ్యసించిన మహిళగా ఆమె లింగ వివక్షను గురించి స్త్రీల లైంగిక సమస్యలను గురించి రాయడం ఆమెను సాహిత్య విప్లవానికి ప్రతీకగా నిలిపాయి. మార్క్సిజం ప్రపంచ వ్యాప్తి, అంగారే నిషేధం ఈ రెండూ రషీద్ ను కమ్యూనిజం వైపు నడిపించాయి. నిమ్న వర్గాల ధు:ఖాలు, లింగ , వర్గ వివక్ష సమస్యలు రషీద్ పోరాటానికి ముఖ్యాంశాలుగా నిలిచాయి. ప్రగతిశీలక సాహిత్యానికి ఆరంభం పలికారు అంగారే లోని నలుగురు రచయితలు. మధ్య తరగతి, దిగువ తరగతుల మనుషుల మనోభావాలకు , బాధలకు గొంతునిచ్చాయి అంగారే లోని రచనలు. ఈ పుస్తకాన్ని నిషేధించిన తర్వాత కూడా చాలా చర్చ జరిగింది. కొందరు ఈ పుస్తకాన్ని నిషేధించడం పట్ల వ్యతిరేకతను, మరికొందరు సముఖతను వెలిబుచ్చారు. ఇటీవల స్నేహాల్ సింఘ్వి అనే టెక్సాస్ యూనివర్సిటీ ఆంగ్ల ప్రొఫెసర్ 2014 లో దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ వారు ప్రచురించారు. మరో ఆంగ్లానువాదం విభా ఎస్ చౌహాన్, ఖాలిద్ ఆల్వి చేసినది కూడా ప్రచురితమైంది. హింది అనువాదం లో కూడా ఈ పుస్తకం ప్రచురణ జరిగింది. డాక్టర్ విభా ఎస్. చౌహాన్ (జాకీర్ హుసేన్ ఢిల్లీ కాలేజ్ లో ఆంగ్ల ప్రొఫెసర్), డాక్టర్. ఖలీల్ దల్వి (జాకీర్ హుసేన్ ఢిల్లీ కాలేజ్ లోనే ఉర్దు ఆచార్యులు) వీరిరువురు కలిసి చేసిన ఆంగ్లానువాద కూడా లభిస్తోంది ఇప్పుడు. నిషేధించబడిన తర్వాత మళ్ళీ ఈ పుస్తకం ఉర్దు లో 1995 లో ప్రచురణ చేశారు. అభ్యుదయ రచయితల సంఘానికి ఆరంభం చేసిన తొలి పుస్తకం ఈ అంగారే. ప్రగతిశీలక ధృక్పధానికి, అభ్యుదయ పథానికి, తొలి పతాక ఎగర వేసిన ఈ పుస్తకం చారిత్రాత్మకమైనది. రాసిన భావాలకు , విప్లవాత్మక ప్రగతిశీలక భావాలకు నిలబడినందుకు , జీవితాంతం అభ్యుదయ పథగామిగా నిలిచినందుకు రషీద్ జహాన్ ను అందరూ అంగారెవాలీ అని పిలిచేవారు. ఆమె ఒక నిప్పు కణిక, ఒక కర దీపిక, ఎగురవేసిన ఎర్ర బావుటా.
కామ్రేడ్ రషీద్ జహాన్: తొలి ముస్లిం మహిళా డాక్టర్ గా , అంగారెవాలీ గా పేరొందిన రషీద్ కమ్యూనిస్ట్ పార్టీలో సంపూర్ణ సభ్యురాలిగా 1933 లో చేరారు. 1934 లో ప్రావిన్షియల్ మెడికల్ సర్వీసెస్ లో పని చేస్తూ, మహ్ముదుజ్జఫర్ ను వివాహం చేసుకున్నారు. మహమూద్ ‘చింగారి’(నిప్పురవ్వ) అనే పత్రికను ఆరంభించారు. రషీద్ జహాన్ కూడా ఈ పత్రికకు రచనలు చేసేవారు, మహమూద్ లేనప్పుడు సంపాదకత్వం కూడా వహించేవారు. మహమూద్, రషీద్ ఒక సంచలనాత్మకమైన జంటగా పేరొందారు. అమృత్ సర్ లో ఈ దంపతులను అభ్యుదయ కర దీపికలుగా భావించేవారు. ఆనాడు MAO కాలేజ్ లో యువ ఆంగ్లోపన్యాసకుడైన ఫైజ్ అహ్మెద్ ఫైజ్ రషీద్ జహాన్ ను కలిసిన పిమ్మటే అభ్యుదయ రచయితల సంఘం లో చేరడానికి స్ఫూర్తిని పొందారు. సాహిత్యం సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా పయనించారు ప్రగతిశీలక రచయితలందరు.
రషీద్ మహమూద్ ల దాంపత్యం : ఈ జంట ను గురించి సజ్జద్ జహీర్ తన రోష్నాయి అనే రచనలో ప్రస్తావిస్తాడు. అలంకరణ, అందం ఏమీ పట్టకుండా, ఎప్పుడు కార్యాచరణలో మునిగి ఉండే రషీద్, చేసే పని ఏదైనా ఒక పద్ధతిలో ఆచరించే వ్యక్తిగా ఇద్దరూ వేర్వేరు స్వభావాలు కలవారైనప్పటికీ ఇరువురిని కలిపి ఉంచే బంధం స్వచ్చమైన ప్రేమ, సమసమాజ నిర్మాణ దీక్ష. పాదరసం లా ప్రవహించే స్వభావం రషీద్ అయితే , నిమ్మళంగా గంభీరంగా ప్రవహించే నది లాంటివాడు మహమూద్. ఉద్విగ్న పూరితమైన మహిళ రషీద్ , ఆలోచనాపరుడు మహమూద్. ఇలా సాగిన దాంపత్యం ఎంతో ఆదర్శనీయంగా ఉండేది.
అద్భుతమైన ఆదర్శవంతమైన అనురాగపూరితమైన జంటగా ఈ దంపతులను కొందరు వీరి చే స్ఫూర్తి పొందిన వారు తమ ఆత్మకధల్లో కూడా వీరిని తమకు ఆదర్శ మూర్తులుగా ప్రస్తావించారు. రషీద్ జహాన్ దాతృత్వ గుణం గురించి హామీదా సైదుజ్జఫర్ ఇలా చెప్తారు. ఒకసారి మహమూద్ కుర్తా వేసుకున్న రషీద్ ను ఆ కుర్తా తనకు చాలా నప్పిందని అన్న కైఫి కి మరుసటి రోజు ఆమె ఆ కుర్తాను పంపించింది. ఎంతో గర్వం తో ఆ కుర్తాను ధరి౦చాను అంటారు కైఫి ఆజ్మీ. తన నాటకాల్లో వేసేవారు ఎందుకు ఎప్పుడు మాసిన, చినిగిన దుస్తులు వేసుకుంటారని రఘువంశీని (IPTA) ని అడిగినప్పుడు తనదగ్గర అవి మాత్రమే ఉన్నాయని సమాధానమిస్తారు. వెంటనే రషీద్ తనవి, మహమూద్ వి బట్టలు మంచివి ఖరీదైనవి, చివరికి మహమూద్ పెళ్లినాటి దుస్తులతో సహా అన్నీ వారికిచ్చేసిందట. లక్నోలో ని కళాకారులు ఆ దుస్తులను చాలా గొప్పగా నాటకాల్లో వేసుకునేవారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు రషీద్ దాతృత్వ గుణాన్ని , మహమూద్ రషీద్ ల ప్రేమైక జీవనాన్ని తెలిపే వి ఉన్నాయి.
కాంగ్రెస్ తో కొన్నాళ్లున్నప్పటికీ , వామపక్ష భావ జాలం కలిగిన వీరిరువూరు ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. ముందు తమ పార్టీలో చెరినందుకు వీరిని గర్వ కారణంగా భావించిన నెహ్రూ జి కూడా వీరి విప్లవ భావజాలం చూసి తప్పక కాంగ్రెస్ నుండి తొలగించారు. లక్నో తిరిగి వచ్చిన తావత మహమూద్ భారత కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతను స్వీకరించారు. రషీద్ జహాన్ డాక్టరుగా తన ప్రాక్టీసు కొనసాగించారు. ఒక వైపు వైద్యం , ఒక వైపు పార్టీ కార్యక్రమాలుతో, రచనలతో ఎల్లప్పుడూ రషీద్ మునిగి ఉండేవారు. అంగారే తర్వాత ఆమె ‘ఔరత్ ఔర్ డీగర్ అఫ్సానే వ డ్రామే’ (స్త్రీ , ఇతర కథలు , నాటికలు) పుస్తకాన్ని ప్రచురించారు. ఆమెను షోల ఏ జవ్వాల (అగ్నిశిఖ) గా పేర్కొంటారు ఆమె చెల్లెలు ఖుర్షీద్ జహాన్ తన అక్కను గురించి రాస్తూ.
రచయిత్రిగా రషీద్ జహాన్ తర్వాతి ఎందరికో ముఖ్యంగా రచయిత్రులు, ఇస్మాత్ చూగ్తాయి, ఖుర్రూతలైన్ హైదర్ వంటి వారికి సజీవ స్ఫూర్తిగా నిలిచారు. ఛాందస మూఢచారాలను ప్రశ్నిస్తూ స్త్రీని పర్దా బంధ విముక్త ను గావించేందుకు ఆమె కృషి ఆమె రచనల్లో ప్రస్ఫుట మౌతుంది. ఈమె రచనలు కూడా డాక్టర్ రక్ష౦దా ఈ పుస్తకం లో ఆంగ్లానువాదాన్ని అందించారు.
1952 , జులై 2 న బాంబే వదిలి ఈ జంట మాస్కో వెళ్లారు. అప్పటికే గర్భాశయ కేన్సర్ తో బాధ పడుతోన్న ఆమెకు మాస్కోలో పార్టీ వారు సాధ్యమైనంత మేరకు క్రెమ్ లిన్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. అయినా లాభం లేక పోయింది మూడు వారాల తర్వాత జూలై 29 నా రషీద్ జహాన్ ఈ లోకాన్ని విడిచారు. జీవితమే కాదు మరణాన్ని కూడా ధీరత్వంతో ఆహ్వానించింది రషీద్. అక్కడి రషియా డాక్టర్లతో అనువాదకురాలు కామ్రేడ్ తాన్య ద్వారా చెప్పిన మాటలు కదిలించివేస్తాయి. ‘ నన్ను పేషెంట్ గానే కాదు , ఒక స్నేహితురాలిగా, వారి సహ ఉద్యోగిగా చూడమను. నా చికిత్స విషయం లో వారికి పరిపూర్ణ స్వేచ్చ ఇస్తున్నాను. నా మీద ఏమి ప్రయోగాలు చేసినా సరే. నేను మరణించాక వైద్య అవసరమై పోస్ట్ మార్టేమ్ చెయ్యడానికి కూడా అనుమతిస్తున్నాను”. జూలై 16 న ఇక లాభం లేదని ఆమె జీవించి ఉండే అవకాశమే లేదని డాక్టర్ల బృందం ఖరారు చేశారు. ఆరోజునుండి ఆమె ఆరోగ్యం క్షీణించి చివరికి జులై 29 న ప్రాణం వదిలారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఇన్ని కార్యకలాపాలు చేసి ఎందరి మదిలోనో వెలిగే దీప శిఖగా ప్రభవించిన రషీద్ జహాన్ భౌతిక దేహాన్ని విడిచారు. 1954 లో మహమూద్ జాఫర్ తన ‘క్వెస్ట్ ఫర్ లైఫ్’ (జీవన శోధన ) లో ఆమెను గురించి ఇలా రాశారు. ‘ప్రతి ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. ఎంతో కష్టం మీద నేను నా భార్య రషీద్ జహాన్ బాంబే విడిచి మాస్కోకి విమానం ఎక్కా౦. నా ఆకాంక్ష ఆమెకు , నాకు ఒక కొత్త జీవితం దొరుకుతుందని , కానీ అక్కడికి చేరిన మూడు వారాలలోనే ఒక వేసవి తెల్లవారు ఝామున రషీద్ వెళ్లిపోయింది. ఈ పుస్తకానికి ఆరంభం ఇదే” ఈ పుస్తకం లో రషీద్ మరణం తర్వాత మరో ఐదు నెలలు మాస్కో లో ఉన్న మహమూద్ సోవియెట్ యాత్రానుభవాలను నమోదు చేస్తారు.మాస్కో సిమెట్రీ లో రషీద్ జహాన్ ను ఖననం చేశారు. ఆమె సమాధి పైన ఇలా రాసి ఉంటుంది “కమ్యూనిస్ట్ డాక్టర్ అండ్ రైటర్”. ఇక్కడ ఈ భారత ఖండం పైన జన్మించి భావితరాలకు విద్యా అభ్యుదయం అన్నిటా ఆదర్శంగా నిలిచిన ఈ దివ్య దీప్తి ప్రదాత డాక్టర్ రషీద్ జహాన్ జీవిత సజీవ రూపం ఇది.
చెప్పాల్సింది చాలా ఉన్నప్పటికీ ఎంతో కుదించి ఈ కొన్ని మాటల్లో చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఇలాంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మక జీవితాన్ని మనకి విపులంగా పరిచయం చేసిన డాక్టర్ రక్షoదా జలీల్ కి కృతజ్ఞతలు. అంగారే తెలుగు లోకి అనువాదిస్తున్నాను త్వరలో వెలుగు చూస్తుందని ఆశిస్తున్నాను. రషీద్ జహాన్ ఇతర రచనలు కూడా తెలుగులోకి చేయాలని సంకల్పిస్తున్నాను. ఇటీవల ప్రసిద్ధ రచయిత్రి వోల్గా రచించిన “గమనమే గమ్యం” నవల ఆవిష్కరణ విశాఖ లో జరిగినప్పుడు ఆ పుస్తకం చదివినప్పుడు అందులో డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ గురించి చదివాక ఆమె జీవితానికి రషీద్ జహాన్ జీవితానికి కొంత పోలిక ఉన్నత్త్లు అనిపించింది . ఈ విషయం అక్కడ ప్రస్తావించాను కూడా. చరిత్రలో మరుగున పడిపోయిన ఎందరో ఇలాంటి మహానుభావులను , స్ఫూర్తి దాతలను మనం ఇలా తెలుసు కోవడం ఎంతైనా అవసరమనిపించింది. అందుకే రషీద్ జహాన్ లాంటి సూర్యుని చూపేందుకు మరొక రచయిత్రి రక్షoదా వెలిగించిన దివిటీని ఒక చిన్న దివ్వెగా మీముందు వెలిగించేందుకు ప్రయత్నించిన నా యత్నాన్ని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. వీలైతే ఆసక్తి ఉంటే ఈ పుస్తకాన్ని చదవండి ఇంకా విపులంగా రషీద్ జహాన్ గురించి తెలుసుకోండి. ‘ ఏ రెబెల్ అండ్ హర్ కాజ్ ‘ (2014),రచయిత్రి డాక్టర్ రక్ష౦దా జలీల్. ఈమె ఇంకా మరింతమంది మంచి ఉర్దు సమకాలీన రచనలను రచయితలను కూడా ఆంగ్లం లో అనువదించి అందించారు. స్వయంగా తను కూడా రచయిత్రి.ఆమె తొలి కధా సంకలనం ‘ రిలీస్ అండ్ అదర్ స్టోరీస్’ 2011 , ఇంకా ఎన్నో వ్యాసాలు నిరంతరం సాహిత్య కృషి చేస్తూ సాదత్ హాసన్ మంటో లాంటి ఇంకా మరెందరినో మనకి ఆంగ్లం లో అందిస్తున్న రక్ష౦దా కృషి ఇంకా దిగ్విజయంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.
*****
పూసర్ల జగద్ధాత్రి ఎం.ఏ.(ఇంగ్లీష్) ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఎం.ఏ (ఫిలాసఫీ), (సోషియాలజీ), ఎం.ఎస్ సీ (సైకాలజీ), ఎం .ఎడ్. కూడా చేసారు. రచయిత్రి, అనువాదకురాలు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేస్తారు. ‘సహచరణం’ కవితా సంపుటి 2014 లో వెలువరించారు. సహచరణం కి పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం2015, అజోవిభో కందాళo ‘సరిలేరు నీకెవ్వరు’ పురస్కారం 2017 జనవరిలో లభించింది. విశాలాక్షి , చినుకు మాస పత్రికల్లో శీర్షికలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రికల్లో వ్యాసాలు, ఆంగ్ల పత్రిక హన్స్ ఇండియా లో ఆంగ్ల వ్యాసాలు, శీర్షికలు రాస్తున్నారు.