భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2
-వసుధారాణి రూపెనగుంట్ల
భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ భాషలో మొదట ఎన్నుకున్న నవల ఉపేంద్ర కిషోర్ దాస్ రచించిన ‘ మరాహవా చాంద్ ‘ తెలుగులో రాలిపోయిన చందమామ.పేరులోనే విషాదం ,ఉదాత్తత నింపుకున్న నవల. సత్యభామ అనే యువతి తెలిసో , తెలియకో పెళ్లి అన్న బంధంలోకి వెళ్లటం.ఆ బంధం బంధనంగా మారటం. సామాన్య పల్లెటూరి యువతి కథలో ఆడ,మగ న్యాయాల్లో వ్యత్యాసాలు.పురుషాధిక్య సమాజంలోని వెర్రితలలు,సున్నితమైన ప్రేమ, విలువలు,పాటించిన విలువల తాలూకూ సంఘర్షణలు వంద పేజీల నవలకు వీరలక్ష్మీదేవిగారు వ్రాసిన మూడు పేజీల విశ్లేషణ ఆలోచింప చేస్తుంది.విశ్లేషణ చివరిలో నవలలోని కవితాత్మక వర్ణనల గురించి విస్మరించకుండా వివరించటం ఒక బాధ్యతాయుతమైన విశ్లేషణకారులు మాత్రమే చేయగరు.వీరలక్ష్మి గారు అదిచేశారు. అందువలన ఈ నవల ఇప్పుడు నేను చదవవలసిన జాబితాలో చేరి పోయింది.
ఒరియా విభాగములో రెండవ నవల కాళిందీచరణ పాణిగ్రాహి రచించిన ‘మట్టిమనుషులు ‘. మనుషుల్లా జీవించే మనుషులు కనపడితే అమితానందం పొందాల్సిన పరిస్థితులకు మానవత్వం సమాజంలో కొరవడింది అని ఒక ప్రమాదఘంటిక మెదడులో మోగినట్లు అనిపించింది ఈ విశ్లేషణ చదివినప్పుడు.శామపధాను ఈ నవలలో కథానాయకుడు.కటకం జిల్లాలో విరూపానది ఒడ్డున ఉన్న పిసరంత ఊరిలో కాస్తంత నేల ,రవ్వంత ఇల్లు మాత్రమే కలిగిన బీదరైతు.అతని రుజువర్తన అతనిని ఆ ఊరికి కథానాయకుని చేసింది. ఈ నవలకి వీరలక్ష్మీదేవి గారి అద్భుతమైన సమీక్ష చదువుతున్నంత సేపూ రైతు బిడ్డని కావటం వల్లనేమో ,మట్టి,మానవత్వం పరిమళాలు ఆఘ్రాణిస్తూ చదివాను.ఈ నవలలో కల విలువలకు,నిర్మలత్వానికి,నిరాడంబరానికి,ఉన్నతమైన మానవజీవితానికీ కదిలిపోతాం.
యాజ్ఞసేని ప్రతిభారాయ్ రచించిన” ద్రౌపది “అంతరంగం తెలిపే నవల. ఈ నవలని గురించిన ఎరుక నాకు ఇంతవరకూ లేకపోవటాన్ని తలుచుకుని చాలా చింతించాను.భారతీయ నవలాదర్శనం మహాయజ్ఞాన్ని ఇలా సాహితీప్రియుల కళ్యాణార్ధం నిర్వహించిన వీరలక్ష్మీదేవిగారికి నమోవాకములు చెప్పుకుంటూ కొంచెం సుదీర్ఘంగా ఉన్న సమీక్షను చదువుతుంటే, ద్రౌపది సంధించిన సమాధానం లేని ప్రశ్నల దగ్గర ఆగిపోయింది నా పఠనం.ప్రతిభారాయ్ 320 పేజీల ఈ నవలలో కృష్ణుడు, ద్రౌపది మధ్యగల సఖీ సఖా సంబంధాన్ని ఒక్క చిన్నమాట ఎబ్బెట్టుగా లేకుండా తీసుకువచ్చిన వైనం ఆవిడలోని పరిపక్వత,మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆ తర్వాత సరాసరి తెలుగులో వచ్చిన ద్రౌపది నవలలో ప్రతిభారాయ్ ప్రభావం ఉంది అంటూనే ఈ సఖీ సఖా అనుబంధాన్ని ఉన్నతంగా చూపలేకపోవటాన్ని వీరలక్ష్మి గారు ఉదహరించటం మరువలేదు.
ప్రతిభారాయ్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి అవార్డు ఈ నవలకి లభించటం ఇంకో విశేషం.అలాగే అనువాదకురాలు జయశ్రీగారు సంసృతప్రభావపు తెలుగుతో వస్తువు తాలూకు వైభవాన్ని చెక్కుచెదరనీయకుండా కాపాడుతూ చేసిన అనువాదం బాగుందని వీరలక్ష్మి గారు అనువాదకురాలిని ప్రశంసించటం విస్మరించలేదు.
మొత్తం మీద యాజ్ఞసేని చాలా ప్రశ్నలని,కొన్ని సమాధానాలని,కొన్ని సిద్ధాంతాలని,కొన్ని కొత్త కోణాలని మనకు చూపుతుంది.”మనిషిని అసహ్యించుకుని దైవాన్ని ఆరాధించలేము “ద్రౌపది ఈ మాట మనసుకు పట్టేసే మాట.తప్పక చదవాల్సిన జాబితాలో చేరిపోయిన నవల ఇది.
ఒరియా నవలలు సరళతతో కూడిన నడకతో, జీవితం పట్ల,విలువల పట్ల ఒక నిబద్ధతతో ఉన్న రచనలు అనిపించింది నాకు.
గుజరాతీ నవలల విభాగానికి వచ్చి మొదటి నవలైన “జీవితమే ఒక నాటకం “ సమీక్ష చదువుతుంటే నాకు అనిపించింది భారతదేశం వ్యవసాయ ప్రధానదేశం. మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలల్లోనూ వ్యవసాయం ,రైతులు ,పల్లెటూరి జీవనం ,కాస్త అటో ఇటుగా వాళ్ళ కష్టాలు,సంతోషాలూ ఒకేలా ఉన్నాయి అని.కన్నడ,మరాఠీ,మలయాళ,ఒరియా ఈ భాషలన్నింటిలో ఈ పుస్తకంలో వచ్చిన వ్యాసాలలో వీరలక్ష్మి గారు ప్రతిభాషలోనూ రైతుకు సంబంధించిన కథనం ఉన్న ఒక్క నవలనైనా తీసుకోవటాన్ని బట్టి అసలైన భారతీయ జీవనం ఎక్కడ ఉందో అవగతం అవుతుంది.
‘మానవినీ భావాయీ’ ఈ గుజరాతీ నవలకు 1985 లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది.రచయిత పన్నాలాల్ పటేల్. వయోభారముతో వృద్దుడైన కాళా అనే రైతు తిరిగి తన జీవితాన్నంతటినీ నెమరువేసుకునే ఇతివృత్తముతో సాగిన నవల.
ఆకలి విలువ ,కరువు యొక్క వికృత రూపం చూపిన నవల.వీరలక్ష్మీదేవి గారి మాటలలో ఈ నవల యొక్క సంగ్రహసారం ఇది :-“ నవల పూర్తి చేసేసరికి మన హృదయం బరువెక్కుతుంది.జీవితంలో ఆకలి,మృత్యువు వీటితో సమానంగా ప్రేమలేని సంసారం తాలూకు వేదనను ఈ నవల మన కళ్ళ ముందు చూపెడుతుంది.”
కుందనికా కపాడియా ఆధునిక గుజరాతీ సాహిత్యంలో స్త్రీవాదసాహిత్యానికి దృవతార గా నిలిచిన” విముక్తి “ నవలా రచయిత్రి. వేలాది మంది స్త్రీలు ఈ నవలను చదివి తమ కథగానే భావించారట.స్త్రీలు తమను బంధించి ఉంచిన అనేకానేక వత్తిళ్ళని ,సమస్యలను తెలుసుకుని పోరాడవలసిన అవసరాన్ని,ఆ పోరాటవిధానాన్ని చెపుతూనే దానికి తాత్వికమైన నమ్మకాన్ని జోడించిన నవలగా వీరలక్ష్మిగారు ఈ నవలని అభివర్ణించారు.
స్త్రీని ప్రధానంగా అణిచివుంచే ఇల్లు,చాకిరీ అనే వాటి నుంచి విముక్తి చెందిన స్త్రీ కథగా వసుధ కథ, చదువుకుని,కళాత్మకంగా ఉండి కూడా సంసారంలో అణిగిపోయిన స్త్రీలుగా లలిత,వాసంతి కథలు కుందనిక ఈ నవలలో చెప్పారు.మంచి కవిత్వం రాసే అమ్మాయి ఎనా మరియు వసంతరుతువులో సుగంథం లాంటి స్త్రీ ఆలోప , వీరి జీవితంలో వీరు ఎదుర్కొనే వత్తిళ్ళు తెలుపుతూ రచయిత్రి ఒక్కో స్త్రీ ఒక్కో సమస్యలో రగిలిపోతున్న విధానాన్ని,పరిష్కారాన్ని చూపారు. స్త్రీవాదాన్ని ఒకానొక ప్రకృతి తత్వంగా మార్చిన ఘనత కుందనికా కపాడియాదేనని ఈ నవల చెపుతోంది అంటూ వీరలక్ష్మీదేవిగారు తన అపార పఠనానుభవ సారాన్ని మనకు అందిస్తారు.
“వక్రరేఖ” నిండా మూడు పేజీలు లేని ఈ నవల సమీక్ష నన్ను కుదిపి వేసింది.ఇస్మత్ చుగ్తాయి రచయిత్రి .పరిచయంలో ఉన్న ఈవిడ చిత్రాన్ని చూస్తూ ఉండిపోయాను కొంచెం సేపు.దాదాపు అరవై ఏళ్లక్రితం రాసిన నవలయొక్క సమీక్షే ఇంత తీవ్రమైన ప్రభావాన్ని ఇప్పుడు చదువుతున్న నాపై ఇంత చూపితే .ఈవిడ అందించిన తీవ్రమైన స్త్రీ స్వాతంత్ర కాంక్ష అప్పుడు ఎలాంటి ప్రభావం చూపి ఉంటుందో కదా అనిపించింది.
కథ షమ్మన్ అనే బాలిక బాల్యం నుంచి ఓ పరిపూర్ణ స్త్రీ గా ఎదిగే వరకూ ఆమె చవిచూసిన ప్రేమ రాహిత్యం, భావోద్వేగాలూ,ప్రేమలూ, చేదు అనుభవాలు వీటితో నిండిపోయింది.నవల తప్పక చదవాల్సిన అగత్యాన్నికల్పించారు వీరలక్ష్మీదేవిగారు ఈ సమీక్షతో. అనువాదాల అవసరం కూడా తెలిసి వచ్చింది.ముద్దసాని రాంరెడ్డి గారు ఈ నవలను అనువాదం చేయటం వలన ఈ నవలా దర్శన భాగ్యం కలిగింది మనకు.
ఏడుగురు అక్క చెల్లెళ్లలో ఒక్కరైన అస్సాంకి తీసుకు వెళ్లారు వీరలక్ష్మీదేవిగారు తరువాతి భాషతో , అస్సాం బుల్లి రాష్ట్రాల్లో ఒకటి మన భారతదేశ చిత్ర పటంలో.బోలెడు వైవిధ్య మైనది కూడా అస్సామీ సంగీతంతో కొంత పరిచయం ఉంది నాకు కానీ సాహిత్యం అంతగా తెలీదు. ఇందిరాగోస్వామి పేరు మాత్రం విన్నాను.భారతీయ నవలాదర్శనం వలన ఈ భాగ్యం లభించింది.
వీరేంద్రకుమార్ భట్టాచార్య నాగా అశాంతి నేపధ్యంగా రాసిన “ఇయరు యింగం “ తెలుగులోకి “జనవాహిని “పేరుతో అనువదించబడిన నవల. ఈ నవలలో కథా కాలం రెండవ ప్రపంచయుద్ధం.ఆదివాసీలైన నాగాజాతీయుల మనోభావాలు,వారి స్వతంత్రతతో పాటు వారి పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలతో పాటు రచయిత మూడు మార్గాలని వారి కొరకు సూచించారు.
ఆదివాసీలను ప్రపంచానికి దూరంగా ఉంచుతూ వారిని మిగిలిన సమాజాలలో కలవనివ్వకుండా చేస్తూ ఉంచే మార్గం ఒకటి.
ఆదివాసీలు చదువుకుని తమ ప్రాంతాలను,సంప్రదాయ,సంస్కృతులను వదిలి ఉద్యోగస్థులై పట్టణాలకు వెళ్లిపోయే మార్గం రెండవది.
ఈ రెండింటికీ మధ్యే మార్గం చూపించటమే ఈ నవలలో గొప్పదనం అంటూ వీరలక్ష్మీదేవి గారు కథానాయకుడు ద్వారా రచయిత చూపిన మూడవ మార్గాన్ని ఇలా విశదీకరిస్తారు. “ఆదివాసులు ఎప్పటికీ స్వతంత్రులే,వారు వారి వారి స్వాతంత్ర్యాన్ని వదులుకొనవసరం లేదు.కానీ వారు చదువుకోవాలి.వైద్య సౌకర్యాలు ,ఆధునిక సాంకేతిక సౌకర్యాలు తెలుసుకోవాలి. మూఢవిశ్వాసాలనుంచి వాటివల్ల కలిగే విపరీతాల నుంచి బయటికి రావాలి. ఇది ప్రభుత్వం వల్ల సాధ్యం కాకపోవచ్చు.విద్యావంతులైన ఆదివాసీయువకులే శాంతితో,ఓర్పుతో,తమ జాతిపట్ల ప్రేమతో ఈ పని ఆరంభించాలి.” ఒక స్థిరమైన ప్రణాళికతో ఆచరణ చేయవలసిన మార్గం ఇది.
1987 లో తెలుగులోకి అనువదించబడిన ఈ నవలను అనువాదం సరిగా లేకపోవటం వలన చదవటం కష్టం అయింది అంటూ వీరలక్ష్మి గారు నవలలో ఉన్న వాక్యాలను యథాతధంగా ఉదాహరణకి పెట్టిన వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.” ప్రబల వాయువుచే మోసుకొని రాబడిన సగం తీసిన తలుపు గుండా లోనికి ప్రవేశించిన తేమగాలి సుగంధాన్ని ఆమె ఆఘ్రాణించింది”.ఇటువంటి నవలని సరళతతో కూడిన సమీక్షగా మార్చి అస్సాం నాగా జాతీయుల మనోభావాలను మన ముందు ఉంచిన మార్గదర్శి వీరలక్ష్మీదేవి గారికి అభివందనం.
“విషాదకామరూప” ఇందిరాగోస్వామి రచించిన నవల. ఈవిడ అస్సామీ రచయితల్లో అగ్రశ్రేణి రచయిత్రి,కవి, విదుషీమణి ,సంపాదకురాలు.ఈమె ప్రధానంగా స్త్రీసమస్యల మీదా,అస్సామీ భాషా సంస్కృతుల మీద రాస్తూ వచ్చారు.
పంతొమ్మిదో శతాబ్దం మొదటిపాదమునుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దాకా సుమారు వందాపాతికేళ్ళు అస్సాంలోని కామరూపజిల్లాలో జరిగిన కథే ఈ నవల ఇతివృత్తం .
సుమారు వంద ఏళ్లనాటి సమాజంలో స్త్రీల దుస్థితిని ఈ నవలలో రచయిత్రి ఉన్నదున్నట్టు రాశారు.దురాచారాలు,అనాచారాలు దేశమంతటా ఒకేలా ఉన్నాయని మనకు ఈ నవల చదివితే అర్ధమవుతుంది అంటూ వీరలక్ష్మీదేవిగారు క్లిష్టమైన అనువాదంగా ఈ నవల గురించి చెప్పారు. అస్సామీ పదాలను విరివిగా వాడటం వలన చదవడంలో శ్రమకు గురి అయ్యానని ఆవిడ రాశారు.
మొత్తం మీద విషాదకామరూప పతనమవుతున్న భూస్వామ్యసంస్కృతి అవశేషాలు ఎంత విషాదభరితంగా ఉన్నాయో తెలిపే నవల. ఇలా ఎక్కడో ఈశాన్యం లో ఉన్న అస్సాం లో ఓ మారు మూల జిల్లాలో వంద ఏళ్ళనాటి భూస్వామ్యసంస్కృతిని దర్శించగలగటం భారతీయ నవలాదర్శనం వలన సంభవం అయ్యింది.
భారతీయ నవలాదర్శనంలో అస్సామీ తరువాత విభాగం “ సింధీ” నవల. సింధీ అన్న రెండు అక్షరాలని వేలుతో స్పృశిస్తూ ఉండిపోయాను కొంచెం సేపు, ఏమో తెలీని ఒక భావోద్వేగం నన్ను ఆవరించింది.తప్పిపోయిన బిడ్డ గుర్తొచ్చిన తల్లి తాలూకు నొప్పి అది.మన జాతీయగీతంలో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా పాడుకుంటాం కదా.సింధు నది ఉపనదులు మన పంజాబ్ ని సస్యశ్యామలం చేస్తున్నాయి.
వీరలక్ష్మీదేవిగారు సింధీ విభాగంలో” నా జీవితపు వెండి బంగరు పుటలు “ అనే ఒకే ఒక్క నవలను ఎంచుకున్నారు. బహుశా ఆవిడకూడా నాలాంటి భావోద్వేగానికే గురయి వుంటారు.ఒక రచయితల సదస్సుకు వెళ్ళినప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం నన్ను ఆకర్షించింది కొని తెచ్చుకున్నాను అని రాశారు.
ఈ నవల ఓ సింధీ రచయిత్రి ఆత్మకథ. ఆవిడ పేరు పోపటి రామచంద్ హీరానందాణి .ఆమె సింధీ భాషలో రచయిత్రి,కవయిత్రి,సాహిత్యవేత్త,అనువాదకురాలు కూడా.ఏడుగురు సహోదరులు ,తండ్రి హఠాత్తుగా మరణించటం ,దేశవిభజన ,విభజనలో సింధు పాకిస్థాన్ లోకి వెళ్లిపోవడం.ఆ సందర్భంలో పారిపోయి బరోడాకి రావటం ఎనభై ఆరు పేజీల నవల ఆపకుండా చదివిస్తుందని వీరలక్ష్మిగారు అంటారు.ఆ సందర్భంలో రచయిత్రి “సజీవంగా ఉండి మరణాన్ని చూశానని” చెప్పటం విభజన తాలూకూ విషాదాన్ని తెలుపుతుంది.
సింధీ భాషాకోసం, జాతి కోసం రచయిత్రి చాలా ఉద్యమాలు చేశారు.నశించి పోతున్న సింధూ సంసృతికోసం,భాషాకోసం,ఒక జీవితమంతా పోరాడిన హీరానందాణి స్వీయకథ చదవటం ఒక సంపన్నమైన అనుభవమే కాక హృదయాన్ని కదిలించే అనుభూతుల సమాహారం కూడా ,అంటూ వీరలక్ష్మి గారు ఈ సమీక్షని ముగించారు.తెన్నేటి రాజశ్రీ మీనలోచని చక్కని అనువాదాన్ని చేశారని ప్రశంసించారు కూడా.
సింధీ భాష,సంసృతి,చరిత్ర తెలుసుకోవటం కోసం ,జాతీయగీతంలో సింధు అనుకోవటమే కాకుండా ఈ నవలని చదవాలని నేను గట్టిగా సంకల్పించుకున్నాను .
తరువాతి విభాగం తెలుగు నవలలు వీరలక్ష్మి గారు ఇన్ని తెలుగు నవలల నుంచి ఏమి ఎంచుకున్నారా? అన్న చిన్న ఉత్సుకత కలిగింది నాకు.ఎందుకంటే ఇతర భారతీయ భాషలనవలలే కాదు, చాలా తెలుగు నవలలు నేను చదవలేదు.అయితే ఈ విభాగంలోని మొదటి నవల అడవిబాపిరాజు గారి “తుఫాను” ఇదివరలో చదివి ఉన్నాను. నేను చదివిన నవలని నేను ఎలా అర్థం చేసుకున్నాను వీరలక్ష్మీదేవి గారి విశ్లేషణ ఎలా వుందో చదువుదామని చూస్తే, పుస్తకం చదవటానికి కూడా కొంత స్థాయి అవసరం అని అర్ధం అయ్యింది. ఆ స్థాయి ఎలా వస్తుంది? చిన్న మెలిక సాహిత్యం చదువుతూ ఉంటేనే కలుగుతుంది.బోలెడు చదివినాక కానీ దేన్నయినా ఎలా చదవాలో,ఎలా చూడాలో తెలియదు అనిపించింది.
వీరలక్ష్మి గారు :- తొలుత ఈ నవలని తొమ్మిదవ తరగతి చదువుతుండగా చదివాను ,మళ్లీ ఇప్పుడు చదువుతున్నామళ్ళీ అప్పటి లాగే సున్నితమైన సంవేదనలకు లోనయ్యాను .
ఈ నవలను నేను చదివినప్పుడు కొంచెం అర్ధమయినట్లు,కానట్లు కొన్నిచోట్ల వర్ణనలు చాలా ఎక్కువగా ఉన్నట్లు,అసలు మనుషులు ఇలా ఇంత కళాత్మకంగా జీవించటం సంభవమా?లాంటి బోలెడు ప్రశ్నలు తోచాయి.నాలాంటి సాధారణ పాఠకులకి సమాధానంగా వీరలక్ష్మిగారు బాపిరాజు గారి తరఫున ఇలా చెప్పారు
“లలిత కళలు, వాటిని ఆస్వాదించటంలోని అందం, ఉన్నతమైన అభిరుచులతో జీవితాన్ని నింపుకోవటం బాపిరాజుగారి నవలల్లో అడుగడుగునా కనిపిస్తుంది.ఆయన వర్ణనలు కథని మించి పోతే పోయాయి.భారతీయ నవలలో అడవి బాపిరాజుగారు రాసిన నవలల్లాంటివి మరెవ్వరూ రాయలేదని,రాయలేరని అనిపిస్తుంది.తెలుగు నవలకు బాపిరాజుగారు అద్దిన నీటిరంగుల్ని మరొక్కసారి సహృదయంతో చదివి గమనించగలరు అని.”ఎంత మంచి సిఫార్సు ఇది బాపిరాజు గారి నవలలకు.
తరువాత నవల శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి “గణపతి”, తరువాతి విశ్లేషణ శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి ఆత్మకథ ‘అనుభవాలు జ్ఞాపకాలు”.ఈ రెండూ నవలలు చాలా మంది చదివే ఉంటారు.ఐనప్పటికీ వీరలక్ష్మీదేవిగారు భారతీయ నవలాదర్శనంలో పొందుపరచటానికి కారణం నవతరం తెలుసుకోవడానికి అనుకుంటాను. అలాగే మాలతీ చందూర్ గారి ‘సద్యోగం’,అరవిందగారి ‘అవతలిగట్టు’ నవలలు తప్పక చదవాల్సిన నవలలు అనిపించింది.
మధురాంతకం మహేంద్రగారు రాసిన ‘స్వర్ణసీమకు స్వాగతం’ తెలుగు విభాగంలో ఆఖరి నవల. ఐతే ఈ నవల, దాని సమీక్ష నన్ను వీటి గురించి తప్పక రాసేలా చేశాయి.రాయటం కాదు మూడుపేజీల సమీక్షనీ ఇక్కడ పెట్టేయాలనిపించింది.వీలైతే నాకు దొరికితే నవలను కూడా , కొన్ని రచనలకి ఊరికేనే పేరు, ప్రఖ్యాతి వస్తాయి అంత అర్హత లేకున్నా అన్నీ ఉన్న ఇలాంటి నవలలు ఒక్కోసారి ఎందుకనో అందరి చెంతకీ చేరవు, పేరు బడవు.
అతిపిన్న వయస్సులోనే ఈ లోకం నుంచి నిష్క్రమించిన మధురాంతకం మహేంద్ర రాసిన చిన్న నవల ఈ ‘ స్వర్ణసిమకు స్వాగతం’. రాయలసీమలోని పేద రైతుల కష్టాలు ,నీటిఎద్దడి ప్రధాన వస్తువుగా తీసుకుని రాసిన కథ. ఐతే కథనం వినూత్నంగా ఉంటుంది . కుప్పం బస్టాండు నుంచి ఎదురుచూడగా చూడగా ఎప్పటికో బయలుదేరిన బస్సు. అందులో కథానాయకుడు తిమ్మ రాయప్ప. అతని చుట్టూ అదే బస్సుకోసం, అదే బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల రూపంలో మరికొన్ని పాత్రలు.ప్రయాణం లోనే వారి వారి జీవనము,వ్యక్తిత్వము తెలిపే విధంగా కథనం.ఎక్కడా ఆగకుండా చదివించేలా ఉంటుంది.
తిండీ తిప్పలు లేక నీరసంతో బస్సుకోసం ఎదురు చూసే తిమ్మరాయప్ప,తీవ్రజ్వరంతో ఉన్న చంటిబిడ్డను చంకన వేసుకుని బస్సుకోసం చూస్తున్న సుభద్ర,ఆవిడ వివాహిత ఐనా సరే ఆవిడని తన వలలో వేసుకోవాలని చూసే జల్సా రాయుడు వెంకటపతి,తాగుబోతులైన అత్తి నీలాలూ,సంపంగి గౌడు,విలేకరి రమణమూర్తి,భాగ్యమ్మ అనే స్త్రీ మోజులో ఆమెని వెతుక్కుంటూ వచ్చిన అప్పాజీ,జమీలు పోయి బీదరికంలో వున్నా దర్పం వదలని వసంత రాయని వారు,అతని అనుయాయి లింగాయామాత్యులు.వీరంతా సహప్రయాణికులు .వీరి మధ్య నడిచిన సంభాషణలు , వారి వారి జీవనచిత్రాలకు అద్దం పట్టినట్లు వుండే సంభాషణలు.వీరలక్ష్మీదేవిగారి విశ్లేషణ ఎక్కడా ఆగకుండా సాగింది.
నవలలోని వర్ణన మహేంద్ర ప్రత్యేకతని తెలిపేలా ఉన్నదని,శిల్పం అనితర సాధ్యమని ఈ నవలని భారతీయ భాషలలో వచ్చిన గొప్ప నవలల స్థాయిలో చేర్చవలసిన నవలగా రాశారు.తప్పకుండా చదవాల్సిన నవలల్లో , చదవకుండానే నచ్చేసిన నవలగా ఇప్పుడు ఈ నవల నా జాబితాలో నిలిచింది.
తరువాతి విభాగమైన ఆంగ్ల నవలలలో అనితా దేశాయి’ కొండమీద మంట’, ‘సముద్ర తీర గ్రామం’ రెండు నవలలూ వేటికవేగా విభిన్నంగా ఉన్నాయి.కొండమీద మంట ఇద్దరు వయసు మళ్ళిన స్త్రీల జీవితాల్ని కథావస్తువుగా తీసుకుని రాసిన నవల.వీళ్ళు కాక ఇందులో ఓ పదేళ్ల చిన్నపిల్ల.ఈ ముగ్గురితో ఈ నవలని బాహ్యవిముక్తితో పాటుగా, అంతః స్వేచ్ఛని గుర్తించడానికి చేసే ప్రయాణంలా ఉంది అంటూ వీరలక్ష్మిగారు ఇలా రాశారు “ ఈ నవల చదవటం , మళ్లీ మళ్లీ చదవటం ఒక సూర్యోదయం లాంటి అనుభవం.”
“ సముద్రతీర గ్రామం” 1993 లో వచ్చిన నవల .అప్పుడే మొదలైన ఆర్ధిక సంస్కరణలు,సరళీకృత ఆర్థికవిధానాల ప్రభావం పల్లెలలో ప్రవేశించిన తీరు తెలుసుకుని తీరాలి అనేవిధంగా అనితా దేశాయ్ వ్రాసినట్లు అనిపించింది .
శశి దేశ్ పాండే రచించిన’ ఆ దీర్ఘ మౌనం’, ప్రకాష్ టండన్ ఆత్మకథ ‘పంజాబీ శతాబ్ది’, మెడోస్ టైలర్ ఆత్మకథ ‘సురపురం’, ధనపాల్ ముఖర్జీ ‘ చిత్రగ్రీవం’ ఆంగ్ల విభాగంలోని మిగిలిన నవలలు.ఈ నవలలు,వాటి సమీక్షలు కూడా ఆసక్తిగా చదివించే విధంగా ఉన్నాయి.
వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారితో ఇలా నా సంపూర్ణ భారతదేశ సాహితీ యాత్ర రసవత్తరంగా,హృద్యంగా,కొన్నిచోట్ల ,కొన్ని భాషలతో భావోద్వేగాలతో కూడి గొప్ప అనుభవంగా నిలిచి పోయింది.ఈ పుస్తకం చదివిన తరువాత ఇందులో పొందుపరిచిన నవలలలో దొరికినన్ని నవలలు చదవాలని,కొన్నింటిని ఎలాగైనా సంపాదించి చదవాలని నాకు కలిగిన ఈ ఆసక్తి అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.అదే కనుక జరిగితే వాడ్రేవు చిన వీరభద్రుడు గారు ఈ పుస్తకం చివరలో వ్రాసినట్లుగా డిస్కవరీస్ ఆఫ్ ఇండియా అయినట్లే, జీవన మాధుర్యం,జీవనసౌశీల్యం పెంచుకోవటానికి వీలైనంత వరకూ అందరూ సాహిత్యం పట్ల అభిలాష పెంచుకోవాలనే వీరలక్ష్మీదేవిగారి లక్ష్యం నెరవేరినట్లే.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.