మా కథ
దొమితిలా మాట
-ఎన్. వేణుగోపాల్
ఇప్పుడు నేను చెప్పేదేదో నా సొంత గొడవగా ఎప్పుడూ ఎవరూ వ్యాఖ్యానించొద్దని నా కోరిక. నా జీవితమంతా జనానిది. నాకేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది ఈ సంగతే. ప్రజల కోసం నేను చేసిందానికన్నా చాలా ఎక్కువ చేసిన వాళ్లున్నారని నాకు తెలుసు. ఐతే వాళ్లలో కొందరు చనిపోయారు, మరికొందరి సంగతి బయటికి తెలిసే అవకాశం లేకుండానే పోయింది.
అందుకే నేనిక్కడ నా సొంతగొడవను మాత్రమే చెప్పదలచుకోలేదంటున్నాను. బొలీవియాలో ఎన్నో సంవత్సరాల పోరాటంలో మేం పొందిన అనుభవాలను నేనిక్కడ పొందుపరచదలచుకున్నాను. మా అనుభవాలు కొత్త తరానికి, కొత్త జనానికి ఏదో ఓ రకంగా ఉపయోగపడతాయనే ఆశతోనే ఈ చిన్న మెత్తు కానుకను మీ ముందు పెడుతున్నాను.
అంతర్జాతీయ మహిళా సంవత్సరపు సమావేశంలో నేను పాల్గొనడం ఫలితంగానే ఈ పుస్తకం తయారైందని కూడా నేను అనుకుంటున్నాను. తలచినవన్నీ మాట్లాడుకోవడానికీ, ఆలోచనలు ఇచ్చి పుచ్చుకోవడానికీ మాకక్కడ అతి తక్కువ సమయమే దొరికింది. ఐతే ఈ పుస్తకం ద్వారా ఇప్పుడు అవకాశం చిక్కిందనుకుంటున్నాను.
చివరిగా నేనింకో విషయం స్పష్టంగా చెప్పాల్సి ఉంది. నా ప్రజలు తమ విముక్తికోసం పోరుకు తలపడుతున్నారు. వాళ్లే లేకపోతే నా ఉనికే లేదు. వాళ్ల గురించి నా ఈ అనుభవాల కథనం పేద జనానికీ, డబ్బులేని నిరుపేద జనానికీ అందాలని నా కోరిక. వాళ్లకిప్పుడో దారి కావాలి. వాళ్ల భావిజీవితంలో పనికొచ్చే ఒక ఆదర్శం కావాలి. అందుకోసమే, వాళ్లకోసమే నా మాటలు అక్షరాల్లో కెక్కడానికి నేనొప్పుకున్నాను. ఇది ఏ రకం కాగితాల మీద అచ్చవుతున్నదనేది అంత ముఖ్యం కాదుగాని మేధావులనూ, ఇలాంటి వాటి మీద కూడ వ్యాపారం చేసుకునే వాళ్లనూ దాటి శ్రామిక వర్గానికి ఉపయోగపడాలన్నది ముఖ్యం.
గని
దక్షిణ అమెరికా మధ్య భాగంలోని ఒక దేశం బొలీవియాజ బొలీవియా జనాభా యాభై లక్షలు. ఐతే ఇందులో బొలీవియన్ల సంఖ్య చాలా తక్కువ. మిగిలిన అందరు దక్షిణ అమెరికన్ ప్రజలలాగానే మేమూ స్పానిష్ భాషే మాట్లాడుతాం. మా పూర్వీకులకు మాత్రం వాళ్ల సొంత భాషలు చాలా ఉండేవి. వాట్లో ముఖ్యమైనవి కెచువా, ఐమారా అనే రెండు భాషలు. ఇప్పటికీ చాలామంది రైతులూ, గని పనివాళ్లూ ఈ భాషలో మాట్లాడతారు. కొన్ని పట్నాల్లో కూడా ఇంకా ఈ భాషలు కొంతవరకు మాట్లాడతారు. కొచబాంబా, పొటోసి పట్టణాల్లో కెచువా మాట్లాడే వాళ్లూ, లాపాజ్ లో ఐమారా మాట్లాడే వాళ్లూ ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈ సంస్కృతులకు చెందిన ఎన్నో సంప్రదాయాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. వీళ్ల నేతపనీ, సంగీత నృత్యాలూ విదేశాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించడం లేదూ?!
నా గుండెల్లో ఇండియన్ (రెడ్ ఇండియన్-అను) రక్తం ప్రవహిస్తున్నందుకు నేనెంతో గర్వపడతాను. నేనొక గని పనివాడి భార్యనని చెప్పుకోవడం కూడా నాకు గర్వకారణమే. ప్రతివాళ్లూ తమ ఉనికిని, తమకున్న వాటిని, తమ సంస్కృతిని, భాషను, జీవన విధానాన్ని చూచుకొని గర్వపడాలని నేననుకుంటాను. మన సమాజానికి వీసమెత్తు కూడా మేలుచేయని ఇతర ప్రజల్ని మనమెందుకు అనుకరించాలి? విదేశీ ప్రభావాల్ని ఎందుకు అంగీకరించాలి?
మా దేశంలో ముఖ్యంగా తగరం, వెండి, బంగారం, జింక్, ఇనుము మొదలైన ఖనిజాలు ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. చమురు, ఖనిజ వాయువు కూడా మా దగ్గర ముఖ్యమైన వనరులే. తూర్పు ప్రాంతంలో పశుసంపద పెంపకానికి అనువైన విశాలమైన గడ్డి భూములున్నాయి. మా దేశంలో అడవులున్నాయి, పళ్లున్నాయి, ఎన్నెన్నో వ్యవసాయోత్పత్తులున్నాయి.
పైపైన చూస్తే ఈ సంపదంతా బొలీవియన్ ప్రజల చేతుల్లో ఉన్నట్టే కనబడుతుంది. ఉదాహరణకు పెద్ద గనులన్నీ ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి. జాతీయం అయ్యాయి. మేం “తగరం దొరలు’ అని పిలిచే పాటినో, హాషీల్డ్, అరమాయోల దగ్గరి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల దేశంలోకెల్లా పేరొందిన ధనికులు. ప్రపంచంలోకెల్లా కోటీశ్వరులైన ఐదుగురిలో పాటినో ఒకడని అంటారు. వీళ్లందరూ పుట్టుకతో బొలీవియన్లే కాని తమ జనానికి ద్రోహం చేసిన కుళ్లు మనుసుల బొలీవియన్లు వీళ్లు. మా తగరాన్నంతా విదేశాలకు తెగనమ్మేసి వాళ్లు మమ్మల్ని దారిద్ర్యంలోకి నెట్టేశారు. వాళ్ల పెట్టుబడులన్నీ విదేశీ బ్యాంకుల్లో, పరిశ్రమల్లో, హోటళ్లలో… ఇంకా అలాంటి సవాలక్ష సంస్థల్లో ఉన్నాయి. వాళ్ల గనులు జాతీయం చేసే సమయానికి వాళ్లు బొలీవియాలో మిగిలించిన సంపద చాలా తక్కువ ఉంది. ఆ తక్కువకు కూడ వాళ్లకు నష్టపరిహారం ముట్టింది. ఈ రకంగా ఓ కొత్త ధనికవర్గం పుట్టుకొచ్చింది. జనం జాతీయకరణ ఫలితాలేమీ అనుభవించలేకపోయారు.
బొలీవియా జనాభాలో అత్యధికులు రైతాంగమే. నూటికి డెబ్బైమంది పల్లెలోనే వాళ్ల మా గని కార్మికులకన్నా కనాకష్టంగా దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్నారు. నిజానికి మా పరిస్థితే ఎంత ఘోరంగా ఉందంటే సొంత ఇల్లు లేక స్వదేశంలోనే దేశదిమ్మరులుగా తిరుగుతూ, పనిచేసినంత కాలం కంపెనీ అద్దికిచ్చే ఇళ్లలో బతుకు వెళ్లదీస్తున్నాం.
అంత సంపన్నమైన ముడిసరుకులున్న బొలీవియాలో అందరు నిరుపేద జనం ఎందుకున్నారు? అక్కడ జీవన ప్రయానం అంత తక్కువగా – లాటిన్ అమెరికన్ దేశాలకన్నాకూడా తక్కువగా ఎందుకు ఉంది?
ఎందుకంటే బొలీవియా నుంచి సంపద అంతా బయటికి ప్రవహిస్తోంది. బొలీవియాలో ఎంతోమంది ధనికులున్నారు కాని వాళ్లు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెడతారు. మా సంపదంతా కొందరు అత్యాశపరులైన పెట్టుబడిదార్లకు అతి తక్కువ నెలకు అందుతోంది. వాళ్లకు మా దేశానికీ కుదిరే ఒప్పందాలు మాకేమీ లాభకరమైనవి కావు. నిజానికి బొవీలియాను ప్రకృతి అనుగ్రహించింది. బొలీవియా ప్రపంచంలో కెల్లా ధనికదేశంగా మారవచ్చును. జనాభా కూడా తక్కువే. ఐనప్పటికీ బొలీవియా సంపద మాకు దక్కలేదు. బొలీవియా అతి సంపన్న దేశం. కాని బొలీవియన్ ప్రజలు కేవలం బిచ్చగాళ్లు’ అని ఎవరో అన్నమాట అక్షరాల నిజం. ఎందుకంటే మా దేశ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని కొన్ని బహుళజాతి సంస్థలు బొలీవియాను పాలిస్తున్నాయి. కొందరు బొలీవియన్లు ఈ అవకాశాన్ని వాడుకుని కొన్ని డాలర్లకు అమ్ముడుబోయారు. విదేశీయులతో రాజకీయాలు నడుపుతున్నారు. వాళ్ల యుక్తులన్నిటికీ వత్తాసు పలుకుతున్నారు. వాళ్ల సమస్యంతా తమకోసం తామెంత ఎక్కువ సంపాదించుకోగలమనేదే, కార్మికులను ఎంత ఎక్కువ దోపిడీ చేయగలిగితే వాళ్లంత సంతోషంగా ఉండగలరు. కార్మికులు ఆకలితో, రోగంతో చచ్చిపోయిన వాళ్లకేమీ పట్టదు.
నేను గని ప్రాంతంలో నివసించడం వల్ల నాకు తెలిసిందంతా గని పనివాళ్ల గురించే.
బొలీవియా ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఆదాయంలో అరవైశాతం గనుల నుంచే వస్తుంది మిగిలిన ఆదాయంలో కొంత చమురు నుంచి, కొంత ఇతర దోపిడీ వనరుల నుంచి వస్తుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని గనుల్లో దాదాపు ముప్పై ఐదు వేల మంది పనిచేస్తున్నారు. ప్రైవేట్ గనులో మరొక ముపై ఐదు వేల మంది పని చేస్తారు. మొత్తం మీద బొలీవియాలో డెబ్బై వేల మంది గని పని వాళ్లున్నారన్నమాట.
జాతీయం చేసిన గనుల వ్యవహారాలను బొలీవియా గనుల కార్పొరేషన్ చూస్తుంది. దాన్ని మేం కొమీబొల్ అంటాం. దాని ప్రధాన కార్యాలయం లోపాజ్ లో ఉంది. దేశంలోని ప్రతి గని ప్రాంతంలో ఒక్కోస్థానిక కార్యాలయం ఉంటుంది. ఉదాహరణకు మేం ఉండేచోట ఒక మేనేజర్ ఉంటాడు. ఈ మేనేజర్ పాలనా పరిథిలోకి వచ్చే ప్రాంతం సైగ్లో -20, కటావి, సాకావన్. పాటీనో, మిరాఫ్లోర్స్. బొలీవియాలోని పేద్ద గని కేంద్రం ఇదే. ఈ కేంద్రానికి గొప్ప విప్లవానుభవం ఉంది. ఇక్కడ వివిధ ప్రభుత్వాలు ఎన్నో హత్యాకాండలకు తలపడ్డాయి.
గనులకు బయట కంపెనీ సాంకేతికులు, ఉద్యోగులు కొట్లలోను, కొలుముల్లోనూ, మిల్లులోనూ, ఖనిజ పరిశుద్ధి కేంద్రాల్లోనూ, కంపెనీ దుకాణాల్లోనూ, కంపెనీవారి సంఘ సేవా శాఖల్లోనూ పని చేస్తారు.
గనిలోపల గని కార్మికులు పనిచేస్తారు. ప్రతి ఉదయమూ వాళ్లు గని లోలోతుల్లో దీగిపోతారు. ఆ లోతులు చాల అనారోగ్యకరమైనవి. అక్కడ తగినంత గాలి ఉండదు. కొపాజిరా అనే ఖనిజ జలంతో ఉత్పత్తి అయ్యే వాయువులూ, దుర్గంధమూ అక్కడ నిండి ఉంటాయి. అలాంటి చోట ఖనిజం తవ్వుతూ వాళ్లు ఎనిమిది గంటలు ఉండాలి,
పూర్వం, గని కొత్త రోజుల్లో ఒక పొర తవ్వగానే మంచి తగరం దొరికేది. ఈ ఇరవై ఏళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడిక తగరం ఎక్కువగా దొరకడం లేదు. కనుక ఇప్పుడు దిమ్మలు పగులగొట్టే పద్ధతి మొదలు పెట్టారు. ఈ పద్ధతిలో గనిలోని కొండ భాగంలోకి డైనమైట్ ను అమర్చి పేల్చేస్తారు. గని పనివాళ్లు ఈ పగిలిపోయిన రాళ్లన్నిట్నీ పిరి మరకూ, ఆ తర్వాత మిల్లుకూ చేరుస్తారు. అక్కడ ఈ రాళ్లలోంచి ఖనిజం వెలికి తీయబడుతుంది. ఎన్నో టన్నుల రాళ్ల నుంచి చాలా తక్కువ టన్నుల మంచి ఖనిజం దొరుకుతుంది. ఈ పద్ధతిలో పని చాలా కష్టంగా ఉంటుంది. ఇది ప్రమాదకరం కూడ. అక్కడ ప్రతిదీ పేలిపోతుంది. ప్రతిదీ ముక్కలు ముక్కలై గాలిలో ఎగురుతుంది. అప్పుడక్కడ ఎంత దుమ్ము పేరుకుపోతుందంటే మనముందు గజం దూరం వరకు కూడా మనకు కనబడదు. అక్కడ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఒకసారి పేలిపోయిం తర్వాత ఇక డైనమైటంతా పేలిపోయిందనుకుని కార్మికులు దాని దగ్గరికెళ్తారు. అప్పుడు అకస్మాత్తుగా మరొకసారి పేలుడు జరుగుతుంది. అక్కడకెళ్లిన జనం ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగురుతారు, అందుకే, అక్కడ పనిచేస్తే డబ్బు ఎక్కువ వచ్చినా నా భర్తను అక్కడికి వెళ్లనివ్వలేదు.
మామూలు కార్మికులు కాక ఇంకా చాలా రకాల కార్మికులున్నారు. వాళ్లలో కొందరిని ‘వెనెరిస్టా’లంటారు. వీళ్లు తమంత తామే పనిచేసి సంపాదించిన ఖనిజాన్ని కంపెనీకి అమ్ముతారు. వీళ్లు ముగ్గురు, నలుగురు కలిసి ఒక బృందంగా ఒక నాయకుని కింద పనిచేస్తారు. మొత్తం వెనెరిస్టాల సంఖ్య రెండువేలుంటుంది. వీళ్లు గజమో, గజమున్నరో వెడల్పుతో రాతి అడుగు వచ్చేవరకూ, అంటే దాదాపు పదిహేను గజాల లోతు గొయ్యి తవ్వుతారు. తాళ్లతో ఈ గోతుల్లోకి దిగిపోయి, అక్కడ చిన్న సొరంగాలు తవ్వుకొని వాట్లో ఇరుకుతారు. అక్కడ రాళ్ల సందుల్లోని ఖనిజాన్ని గీకుతారు. అక్కడ రక్షణేమీ ఉండదు. గాలీ వెలుతురూ ఉండవు. అది అత్యంత హీనమైన పని. ఈ పని చేసే వాళ్లలో ఎక్కువ మంది కంపెనీ నుంచి తీసేయబడిన వాళ్లే. వీళ్లకు సిలికోసిస్ జబ్బు ఉందనే పేరుమీద కంపెనీ వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. నిజానికి సిలికోసిస్ జబ్బు గనుల్లో పనిచేస్తేనే వస్తుంది. ఇక బయట పని దొరకని ఈ కార్మికులందరూ వెనెరిస్టాలుగా మారుతారు. లలాగువాకు బతుకుదెరువుకై వచ్చి వెనెరిస్టాలుగా మారిన రైతులు కూడా కొందరున్నారు. వెనెరిస్టాలు ఈరైతులు రోజుకు పది “పిసో’లో ‘అరడాలరో’ ఇచ్చి పని చేయించుకుంటారు.
ఇంకోరకం కార్మికులను లొకటేరియోలంటారు. వీళ్లు కూడా తమంత తామే పనిచేసి ఖనిజాన్ని కంపెనీకి అమ్ముకునే వాళ్లే. ఐతే కంపెనీ వీళ్లకు పారలు, పలుగులూ, డైనమైట్లు ఏమీ ఇవ్వదు. ప్రతిదీ, అక్షరాలా ప్రతిదీ వాళ్లే కొనుక్కోవాలి. ఇదివరకు కొంచమే గని ప్రాంతాల్నీ కంపెనీ వాళ్లకు చూపుతుంది. అక్కడ ఎక్కువో, తక్కువోగాని కొంత ఖనిజం మిగిలి ఉంటుంది. వాళ్లు తెచ్చే ఖనిజపు నాణ్యతను బట్టి కంపెనీ లొకటేరియోలకు డబ్బు చెల్లిస్తుంది. ఐతే ఆయా ప్రాంతాలను వాడుకోవడానికి గల హక్కుల్లో నలభై శాతాన్నికలిపి అట్టి పెట్టుకుంటుందనుకుంటాను.
మిగిలిన వాళ్లు లామేరోలు. వీళ్ల పని ఖనిజాన్ని మురికి నీటి నుంచి వేరుచేయుట మిల్లులో కంపెనీవాళ్లు ఖనిజాన్ని ముద్ద చేసినప్పుడు ఒక రకమైన ద్రవం బయటికొస్తుంది. ఈ ద్రవం ప్రవహించేటప్పుడు, ఆ బురద, మడ్డినీటిలో తగరం తునకలూ, ఖనిజము మిగిలిపోతాయి. లామెరోలు ఈ తగరాన్ని ఏరి, శుభ్రం చేసి, చిక్క బరిచి కంపెనీకి ఇస్తారు. లామెరోల ఆదాయం లొకటేరియోల కన్నా తక్కువే ఉంటుంది లోకటేరియోలకు పని చేయడానికి ఏదో ఓ చోటు ఉంటుంది గానీ లామెరోలకు అలాంటిదేమీ లేదు. ఒక్కోసారి వాళ్లెంత కష్టపడ్డా ఏమీ దొరకదు.
*****
పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. రచనలు: ‘సమాచార సామ్రాజ్యవాదం’, ‘కల్లోల కాలంలో మేధావులు – బాలగోపాల్ ఉదాహరణ’, ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’, ‘కథా సందర్భం’, ‘కడలి తరగ’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, ‘పోస్ట్మాడర్నిజం’, ‘నవలా సమయం’, ‘రాబందు నీడ’, ‘కళ్లముందటి చరిత్ర’, ‘పరిచయాలు’, ‘తెలంగాణ – సమైక్యాంధ్ర భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు’, ‘శ్రీశ్రీ అన్వేషణ’, ‘లేచి నిలిచిన తెలంగాణ’, ‘ప్రతి అక్షరం ప్రజాద్రోహం – శ్రీకృష్ణ కమిటీ నివేదిక’, ‘రాబందు వాలిన నేల’, ‘ఊరి దారి- గ్రామ అధ్యయన పరిచయం’, ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ్ర మహారభస’, ‘కవిత్వంతో ములాఖాత్’, 20కి పైగా అనువాదాలు. సంపాదకత్వం: ‘Fifty Years of Andhrapradesh 1956-2006’, ‘Telangana, The State of Affairs’, ’24గంటలు’, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర సంరంభం’, ‘జన హృదయం జనార్దన్’, ‘సమగ్ర తెలంగాణ’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.