ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)

             – పాలపర్తి ఇంద్రాణి

ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో 

గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు. 

పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు. 

 రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు. 

 ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు. 

కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు. 

పరుగెత్తలేక ఆగినాడు. 

 

తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా 

ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు. 

 ముసలివాడు ఒంటరి. 

 సీతాకోక చిలుకుంటే కాలక్షేపం అవుతుందని,

దిగులంతా పోతుందని తలపోస్తూ తోట నిలచినాడు. 

అమాయకపు కళ్ళతో సీతాకోక చిలుక ఒకటి 

మెల్లిగ రానే వచ్చింది. 

 హాయి తీపి తేనె వాసనల వెంట జాడీలోకి వెళ్ళింది. పూలెందుకు ఇలా ఉన్నవని తికమక పడి వాలింది.

జాడీ అంత కలయతిరిగి పువ్వు పువ్వు చూసింది.  

ముసలివాడు పాచిక పారిందని మురిసినాడు. 

 అందమైన ప్రాణి తోడు దొరికిందని పొంగినాడు.

 కండ చక్కెర గొంతుకతో మాటమంతి ఆడినాడు.

  సీతాకోక చిలుకకు తల్లి లేదు,తండ్రి లేడు.

కొత్త మిత్రుని మెత్త మెత్తని మాటలు విని 

 ఎంతో సంతసించింది.

ఇంకా ఇంకా మాటలలో మునిగి తేలి పోయింది.

ముసలి వాడు మెల్లిగా మూత మూసివేసాడని,

తిరిగి తాను తోటలోకి ఎగిరి వెళ్ళలేనని 

తెలుసుకోక పోయింది.

ముసలివాడు జాడీని పొట్ట మీద పెట్టుకుని 

రంగురంగు అందాలను కళ్ళతోన జుర్రుతూ 

నిద్రలోకి జారినాడు,గురక పెట్టసాగినాడు.

సీతాకోక తోటలోకి తిరిగి ఎగిరి పోదామని చూస్తేను 

 ఏమిటిది అడ్డు పడుతోందని పడుతోందని 

 చిట్టి లేత రెక్కలతో మూత కొట్టి కొట్టి ఏడుపొచ్చి 

అలిసి పోయి రెక్క విరిగి ఊపిరాగి 

ప్రాణాలను విడిచింది.

మర్నాడు నిద్ర లేచి ముసలివాడు కళ్ళు తెరచి 

వెక్కి వెక్కి ఏడ్చినాడు.

ఈ పాపం తనదేనని కుమిలి కుమిలి పోయినాడు.

వలవలవల ఏడుస్తూ తోటలోన 

 ఒక మూలన పూడ్చి పెట్టి వచ్చినాడు.

ముసలివాడు ఒంటరి. 

ఒకప్పుడు సీతాకోకల వేటగాడు. 

 రంగు పూల తేనె జాడీ 

తిరిగి మరల తోటలోన ఉంచి

మాటు వేసినాడు

ఎప్పటివలె.

ఆహా,కడు టక్కరి!

*****

  
 
  
  

 

Please follow and like us:

One thought on “ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)”

  1. So nice . ముసలి తనం ముగ్దత్వనికి కోరుకుంటుంది . లేని దానికోసం తాపత్రయం.ఉన్న ఇక మూడునల్.

Leave a Reply

Your email address will not be published.