రమణీయం: అరవై ఏళ్ళ వేడుక

-సి.రమణ 

మన భారతదేశంలో ఉన్నన్ని పండుగలు, పర్వాలు, వ్యక్తిగతంగా జరుపుకునే వేడుకలు, ఉత్సవాలు మరి ఏ ఇతర దేశాలలోను ఉండవని విశ్వసిస్తాను. మంచిదే, పండుగలు, వేడుకలు జరుపుకునే ఉత్సాహం, దానికి కావలసిన వనరులు, మన దగ్గర ఉంటే, ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా…… ఎంత బాగుంటుందో. మనం కూడా పండుగ వస్తుందంటే, పండుగ పనులతో, పండుగ గురించిన కబుర్లతో, ఎవరి స్థాయికి తగినట్లు వారు, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఒక సంతోషకర భావనలో ఉంటాము; కొన్నిరోజులపాటు.  

మనం పుట్టినప్పటినుండి చేసుకునే పండుగలు వేరు, షష్టిపూర్తి అనే పండుగ వేరు. ఇది కొంచం భిన్నమైనది, ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా జరిగే వేడుకలు, ఎప్పటికప్పుడు, మన వయసుకు అనుగుణంగా జరుగుతుంటాయి. చిన్నప్పుడు పుట్టినరోజు పండుగలు, మనవి, మన స్నేహితులవి, పరీక్షలు రాసి, ఉత్తీర్ణులైన సందర్భంలో, ఉత్సాహాలు, కోలాహలాలు కొన్నాళ్ళు. తరువాత, మనకి పెళ్ళైన సమయానికి, కొంచం అటూ ఇటుగా, మన స్నేహితుల పెళ్ళిళ్ళు, ఆ తరువాత జరుపుకునే వేడుకలు కూడా ముందూ, వెనుకగా, అదే సమయంలో జరగడం చూస్తూనే ఉంటాం. చివరాఖరికి షష్తిపూర్తి ఉత్సవాల ఆహ్వానాలు అందుకుంటున్నప్పుడు గాని గుర్తుకురాదు; మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం, దగ్గర పడుతున్నాం షష్తిపూర్తికి ఆని.        

60 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో, జరుపుకునే వేడుక, షష్తిపూర్తి అని మనందరకూ తెలుసు. మన జీవిత కాలంలో 60 తెలుగు సంవత్సరాలు పూర్తయి మరలా 61 సంవత్సరం నుండి రెండో మారు మనం పుట్టిననాటి తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది. కాబట్టి, ఇది మరో జన్మ, కొత్త జన్మ అన్నట్లుగా ఉత్సవాలు చేసుకుంటాము. పూర్వం ఆయుష్కామన అనే యజ్ఞం చేసేవారు. దానికో పద్ధతుంది. అదెలాగంటే, తెల్లని నూతన వస్త్రము పరచి, దాని మీద తూర్పు దిక్కుగా పన్నెండు గీతలు గీసి, అడ్డంగా ఐదు గీతలు గీసి అరవై గదులు వచ్చేలా చేస్తారు. తూర్పు దిక్కున బియ్యం పోసి, కలశం అమర్చి, ప్రభవనుంచి, క్షయ వరకు అరవై సంవత్సరాల అధిదేవతలను, ఆవాహన చేస్తారు. దక్షిణాయన, ఉత్తరాయణ దేవతలను ఆరు  ఋతువులను, 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను, తిధులను, వారములను, వారదేవతలను ఆవాహన చేస్తారు. వీరికి అధిదేవతలైన అగ్ని, జలము, భూమి, విష్ణువు, ఇంద్రుడు, ప్రజాపతులను ఆవాహన చేస్తారు. మరియు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ ఇంకా ఏకాదశ రుద్రులను, ఇరవైఏడు నక్షత్ర దేవతలను, పదకొండు యోగ మరియు కరణ మొదలైన అందరి దేవి, దేవతా స్వరూపాలను, మృత్యుంజయుని ఆవాహన చేసి, పురోహితుల సహాయంతో, వేదయుక్తంగా యజ్ఞ కార్యక్రమం జరిపిస్తారు. తదుపరి బంధు మిత్రులకు విందు భోజనాలు, బ్రాహ్మణులకు దక్షిణలతో, ఉత్సవాలు ముగించేవారు. ఐతే కొద్దికాలంగా, పండగలు, ఉత్సవాల తీరుతెన్నులు మార్చేస్తున్నారు మనవాళ్ళు. 

ఈ మధ్య 60 సంవత్సరాలు నిండిన పుట్టిన రోజు వేడుకలు బాగా జరుగుతున్నాయి. కొన్నిటికి మేము వెళ్లటం కూడా జరిగింది. వేడుకలు, పండుగలు, ఆర్భాటాలతో జరపడం మనకు ఆనవాయితీ అయిపోయింది. కొందరు పెద్ద పెద్ద హోటళ్లలో, ఆడవాళ్ల నగల ధగధగలు, మగవాళ్ల ముందు గ్లాసుల గలగల మధ్య ఘనంగా జరుపుకుంటారు. కొందరు మేం చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తాం అని కూర్చీల్లో కూర్చోబెట్టి సూత్రధారణ, పూలదండల మార్పిడి, పట్టు చీరల రెపరెపలు, ఫొటో సెషన్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు, పాద పూజలు, భారీగా భోజనాలు, తిరుగు బహుమతులతో ముగిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, “ఆర్భాటాలు తప్ప మనకు ఇంకేమీ పట్టవా?” అని సందేహం కలుగుతున్నది. 6 ఏళ్ల పిల్లవాడు, 60 సంవత్సరాల తాత కూడా పుట్టిన రోజును పండుగలానే జరుపుకుంటున్నారు. ఇంతకంటే భిన్నంగా ఆలోచించలేమా? విభిన్నముగా చేయలేమా అని ఆలోచిస్తే నా మనసుకు తట్టిన ఆలోచనలు ఇలా.

60 సంవత్సరాలు జీవించడం పండుగే, నిజమే! ఎప్పుడు? మనం పుట్టింది ఎందుకో తెలిసినప్పుడు. ఏం సాధించామని పండుగ చేసుకోవాలి? మనకి మనమే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. చదువులు, ఉద్యోగాలు, పెళ్లి, పిల్లలు, వాళ్లని చదివించటం, వృద్ధిలోకి తీసుకురావడం. ఇది అందరూ చేసే పనేగా? దానిలో కొత్తేముంది? ప్రత్యేకతేముంది? మనలో ఎంతమంది తమ పిల్లలను, మానవతా విలువలతో, సమాజ శ్రేయస్సుకి, పనికి వచ్చే దృక్పధంతో  పెంచుతున్నారు? 

అలాగే మనం 60 సంవత్సరాలు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాము అంటే అది మన గొప్పేం కాదు. ఎంతోమంది సహాయ సహకారాలతో మనం ఎదిగాము. మన తల్లిదండ్రుల తరువాత, మన గురువులు, మన సోదరీ సోదరులు, బంధువులు, మిత్రులు, మన సమాజం, మనం ఈ రోజున ఈ స్థితిలో వుండటానికి కారకులు. మనల్ని విద్యావంతులుగా అడుగు, అడుగునా తీర్చిదిద్దిన మన గురువులందరికీ ఎంత ఋణపడి వున్నామో! మన కష్ట సుఖాలలో తోడు, నీడగా, మంచి చెడులలో అండగా నిలబడ్డ ఎందరో బంధువులు, మిత్రులు, మరి వారందరికీ బదులు ఏమి ఇవ్వగలము.  పంచభుతాల సాక్షిగా మనలను కాపాడిన ఈ ప్రకృతి కేమిచ్చి ఋణం తీర్చుకొంటాము?

ఎంతో మంది రైతులు కష్టించి, పంటలు పండించి ఇస్తే, ఆహారాన్ని తీసుకున్నాము. ఎవరో బట్టలు నేశారు, ఇంకెవరో చెప్పులు కుట్టారు. మరెందరో తయారు చేసిన అనేక ఉత్పత్తులను ఉపయోగించి పెద్దవాళ్ళమయ్యాము. ఇంకొందరినుంచి సేవలు పొందాము. ఇలా ఎందరెందరో, మనలను, ప్రత్యక్షంగా, పరోక్షంగా, పెంచి, పెద్ద చేసారు. బ్రతికినంతకాలం ఇవన్నీ అందుకుంటూనే ఉంటాము. వాళ్ళ ఋణం, ఎలా తీర్చుకోవడం? ఎందరి ఋణమని తీర్చుకొంటాము? ఎవరి ఋణమని తీరుస్తాము?  అసలది సాధ్యమవుతుందా? మరి ఎక్కడి ఋణమక్కడే పెట్టి, ఏ అర్హత వుందని మనం పండుగలు చేసుకుంటాము? నిజంగా హాస్యాస్పదంగా లేదూ! 

అయితే దీనికొక మార్గం కనిపిస్తుంది. 60 సంవత్సరాల పండుగ అంటే Thanks Giving అనుకుందాం. తిరిగి ఇవ్వడం. ఎవరికి తిరిగి ఇవ్వడం? మనకు ఇచ్చిన వారికే  మనం ఇవ్వాలా? ఇప్పుడు, ఎవరు, ఎక్కడ వున్నారో తెలియదు. అసలు వున్నారో, లేరో తెలియదు. అసలు, ఎవరు, ఎవరో కూడా తెలియదు. ప్రయత్నిస్తే కొంతమంది తెలియవచ్చేమో! అలా కాకుండా, ఇలా చేద్దాం. సమాజానికే ఏదైనా తిరిగి ఇద్దాము. సమాజం కోసం ఎమైన చేద్దాం. మనం సానుకూల దృక్పథంతో సమాజంలోని ఏదైనా ఒక సమస్యని తీసుకుని, మనవంతు బాధ్యతగా పరిష్కార దిశలో కృషి చేసి, ఆత్మ సంతృప్తితో షష్ఠిపూర్తి చేసుకోవచ్చు. 

ప్రకృతి నుండి చాలా, చాలా తీసుకున్నాము కదా! ప్రకృతి మాతకు మనం “రిటర్న్ గిఫ్ట్” ఎన్నో విధాలుగా ఇవ్వవచ్చు.  అవేమిటో చూద్దాం. మొక్కలు నాటడం, చెట్లని సంరక్షించడం, నీరు, విద్యుచ్ఛక్తి వృధా చేయకుండా, ప్లాస్టిక్ వాడకం మానివేసి, పేపరు వాడకం తగ్గించి, పర్యావరణానికి, హాని కలిగే పనులేమీ చెయ్యకుండా, ప్రకృతిని రక్షించుకుందాము. మనం పుట్టినప్పుడు వున్న ప్రకృతి స్థితిగతులను, మెరుగు పరచి, మన భావి తరాలకు అందించుదాము. ఎవరికి వారు పరిధులు విస్తరించుకుని, వారి వారి సంస్కారాలకనుకూలంగా, ఆలోచించి, చేతనయినంత, ప్రకృతికి మేలు చేసే పనులు చేసి, పుట్టినరోజు పండగలు చేసుకుందాము. పుడమితల్లి ఋణం తీర్చుకునే అవకాశం వస్తే వదులుకోవద్దు. అవకాశం రాకపోతే, మనమే కల్పించుకుందాము. బాధ్యతగా మన ఋణం తీర్చుకుందాము. ఇక, అన్ని పండుగలు ఆనందంగా జరుపుకుందాం.

*****

Please follow and like us:

4 thoughts on “రమణీయం: అరవై ఏళ్ళ వేడుక”

  1. నా వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    1. నా వలెనే మీరూ ఆలోచిస్తున్నందుకు, ఆచరణలో పెడుతున్నందుకు అభినందనలు. నేను చాల సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నాను. నా స్నేహితులు కొందరు అనుసరిస్తున్నారు. మనలో చాలా మందికి, మంచి ఆలోచనలే వుంటాయి, కాని ఆచరణలో వెనుకబడుతున్నారు. వాళ్ళను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్దాము. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.