వెనుతిరగని వెన్నెల (భాగం-3)
-డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
జరిగిన కథ: అమెరికా లో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో.
ఉదయిని చెప్పిన తన్మయి కథ
“తెలివెన్నెల వేకువ లో తానమాడీ
అడవి దారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి.. కోన తిరిగి గుసగుసలాడి..
గల గల మువ్వల నవ్వుల నాట్యమాడీ..
తిరనాళ్లకు తరలొచ్చె కన్నెపిల్లలా
మెరుపులతో మెరిసిందీ వానకారూ
నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతీ
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ…”
రేడియోలో శ్రీరంగం గోపాల రత్నం గారి గొంతు లో అలల్లా కదిలివస్తూంది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట.
మొదటి సారి ఓణీ వేసుకుని డాబా మీదికి పరుగెత్తింది తన్మయి.
ఉదయపు తొలి పొగ మంచు తెరల్లోని తెల్లదనం ఓణీ రంగులో కలిసిపోయి తనూ ఒక నీహారికై ఆకాశంలో నుంచి అప్పుడే ఉద్భవించినట్లనిపించింది తనకి. పొగ మంచులో ఎవరూ తనని చూడలేరన్న ధీమాతో రెండు చేతులూ
చాచి, ఆకాశం వైపుకి తల ఎత్తి గుండ్రంగా గింగిరాలు తిరిగింది. తనని జీవితమంతా ఆ పరవశం చుట్టుకుని ఉండాలన్నట్లు మురిసిపోయింది.
ఆ రోజు వాకిట్లో వంగి ముగ్గేస్తున్న తన్మయికి ఆ అద్భుత క్షణాలు మరలా గుర్తుకు వచ్చాయి.
“తెలి వెన్నెల వేకువలో…” లోపల్లోపల కూనిరాగం తీస్తూ ఈనెలు వేస్తూంది తన్మయంగా.
“అమ్మాయిగోరూ, బలేగా ఏసేస్తారమ్మా మీరు ముగ్గులు, నాకూ నేర్చించడమ్మా” అంది అటుగా వెళ్తూ చివరింటి పని మనిషి.
బదులుగా చిన్నగా నవ్వి, తీక్షణంగా సగం వేసిన ముగ్గు వైపు చూస్తూ “నీకు నేర్పించడం మాట అటుంచు, నేనిక్కడ ఒక చుక్క మర్చిపోయినట్లున్నాను” అంది తన్మయి.
అంతలోనే “అయినా ఫర్వాలేదులే, ఇవేళ ఈ చుక్కలతోనే కొత్త ముగ్గు కలుపుతాను చూడు” అని చకచకా కలపడం మొదలుపెట్టింది.
ఓణీ వేసుకున్న కొత్త రోజులేమో, అయిదు నిమిషాల కొకసారి పమిట సర్దుకుంటూ, ఆ సర్దుకునే సందట్లో ఒత్తైన జుట్టు వెనక నించి ముందుకు మాటిమాటికీ పడ్తూ, అలా పడే జుట్టుని ఎగదోసుకునే క్రమంలో చేతి వేళ్లకంటుకున్న ముగ్గు ముఖాన అంటుకుంటూ…. ముగ్గుల అవధానం చేస్తున్న తన్మయిని చూసి పకపకా నవ్వింది వనజ.
“వనా, అలా నవ్వక పోతే కాస్త ఈ జుట్టు గట్టిగా కట్టొచ్చుగా” అంది తన్మయి చిరు కోపం నటిస్తూ.
“ఏవిటి అమ్మాయిలకు ముగ్గులు తెమిలేయా, ఇంకా లేదా?” బయటికి వస్తూ నవ్వుతూ అడిగింది తన్మయి తల్లి జ్యోతి.
“మన ఇంటి దగ్గిర అయిపోవచ్చిందమ్మా, వనజ వాళ్లింటి దగ్గిర ఇప్పుడెళ్ళి వేయాలి” అంది తన్మయి కళ్ళు ఆర్పుతూ, వెలిగిస్తూ సంశయంగా పర్మిషన్ కోసమన్నట్లు.
“ఊ…నెలగంట పెట్టేక మీకిద్దరికీ ఇది అలవాటేగా, వెళ్ళి త్వరగా వచ్చేయి” అంది జ్యోతి.
“వనా, నువ్వు నాకంటే పెద్దదానివి కదా, ఇంకా నన్ను ముగ్గు పెట్టమని అడుగుతావేంటీ?” అంది తన్మయి పక్కన నడుస్తూ.
“ముగ్గులు బాగా పెట్టడానికి వయసుతో సంబంధంలేదు, అయినా నీలా అందంగా ఈను వెయ్యడం నాకు రాదోయ్, పైగా ఎక్కడైనా ఒక చుక్క తప్పిందంటే నీలా తెలివిగా ఆలోచించి ఏదో రకంగా ముగ్గుని సునాయాసంగా కలపడం నాకు రాదు తల్లీ” అంది వనజ.
పక్కన హుషారుగా నడుస్తూన్న తన్మయి వైపు పరికించి చూసి “అన్నట్లు ఏమంటున్నాడు మీ బావ” అంది మళ్లీ.
అంతలోనే ఎరుపెక్కిన బుగ్గలలో సిగ్గుని దాచుకుంటూ “అతనేదో దూరపు చుట్టం, బావేం కాదులే” అంది తన్మయి.
“అదేలే, ఎంత దూరపు చుట్టమైనా వరసకి బావేగా” అంది మళ్లీ కొంటెగా వనజ.
“చీపో.. వనా, నువ్వెప్పుడూ ఇంతే” అని, ఊరికే ఉత్తరం రాసేడు అంది నెమ్మదిగా తన్మయి.
“ఆ..ఏవిటేమిటీ, ఉత్తరాల వరకూ వచ్చిందన్నమాట.” అని గట్టిగా నవ్వింది వనజ
“ఉష్…ఎవరైనా వింటారు….అరవకు అంది” ఒక్క ఉదుటున వనజ దగ్గరకంటా వచ్చి నోరు మూస్తూ.
“ఏం రాసేడు? ఏం రాసేడు?” అని ఉత్సుకతగా అడుగుతున్న వనజకి “అదేదో క్షేమ సమాచారాల ఉత్తరం. అంతే. అంతకు మించి విషయం ఏం లేదు.” అంది తన్మయి తడబడుతూ.
తన్మయి తడబాటు చూసి “సర్లే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు” అంది మళ్లీ నవ్వుతూ వనజ.
ఆ రాత్రి అందరూ నిద్రపోయినా తన్మయికి నిద్ర పట్టలేదు.
లేచెళ్లి పుస్తకాల అరలో లెక్కల టెక్స్ట్ పుస్తకంలో దాచిన ఉత్తరాన్ని తీసి తెచ్చి, హాలులో జీరో బల్బు గుడ్డి వెల్తురులో చదవడం మొదలు పెట్టింది.
అక్షరాలన్నీ తప్పులే. తన పేరులో కూడా “మ” ఒత్తుకు బదులు “య” ఒత్తు రాసేడు.
తన్మయికి అందమైన అతని ముఖం గుర్తుకు వచ్చింది. పాలుగారే తెలుపు రంగు, అందంగా కొసదేరిన ముక్కు, చక్కని ఉంగరాలు జుట్టు, ఆ పైన గొప్ప అందమైన ఎర్రని పెదవులు. అతన్ని చూసి ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా?
తన్మయి తన్మయత్వంలో తేలిపోతూ తమ పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.
***
“త్వరగా పడుకో పిల్లా, పొద్దున్నే ధవళేశ్వరం వెళ్లడానికి రెండు బస్సులు మారాలి” అంది నరసమ్మ.
చదువుతున్న “వెన్నెల్లో ఆడపిల్ల” పుస్తకం మూసి దిండు కింద పెట్టి, వెనక్కి తిరిగి “ మధ్యలో ఏంటి అమ్మమ్మా” అంది విసుగ్గా తన్మయి.
“అసలీ ధవళేశ్వరం ఏవిటో, వాళ్ళెవరి పెళ్ళికో అమ్మమ్మ కూడా తను వెళ్లడవేమిటో” అనుకుంది లోపల్లోపల.
కొత్త ఊరు చూస్తున్నానన్న సంతోషం ఒక వైపు ఉన్నా, ఇలా కాలేజీ నుంచి వచ్చిన దగ్గర్నించి పడుకునే వరకు పుస్తకాలు చదువుకోవడానికి వీలు పడదని విసుగ్గా ఉంది తన్మయికి.
“త్వరగా పడుకో అంటున్నాను” అంది మళ్లీ నరసమ్మ.
“అలాగే అమ్మమ్మా, పొద్దున్న వేణ్నీళ్లు కాచేక లేపు, నీతో బాటూ లేపకు” అంది తన్మయి కళ్లుమూసుకుంటూ.
పొద్దున్న కళ్ళముందు ఇంకా చీకటి కనిపిస్తూండగా “అప్పుడే లేపేసేవా, వేణ్ణీళ్లు కాచేక….” అనబోతున్న తన్మయితో.
“వెళ్ళి పొయ్యి రాజెయ్యి, నేను కిరసనాయిలు తెస్తాను. అయినా రేపో మాపో పెళ్లి కాబోయే పిల్లవి పనులన్నీ నేర్చుకోవద్దూ. ఈ మొద్దు నిద్ర ఏవిటీ …రాగం తీసి” వీధి వైపు గది గొళ్ళెం తీసింది నరసమ్మ.
శీతాకాలపు చల్లని వాకిట్లో రాత్రి మంచుకి తడిసి సగం, అంతకు ముందు రోజు ఆర్పిన కట్టె పుల్లలు కావడం వల్ల ఆరని నీళ్ల వల్ల సగం ఆ కట్టె పుల్లలు అంటుకోవని రూఢి గా తెలిసిపోయింది తన్మయికి.
“అయినా కొత్త కట్టెలు తెచ్చి పొయ్యిలో పెడితే ఈ ముసలామె సొమ్మేం పోయిందో” అని లోపల్లోపల గొణుగుతూ, కళ్ళు నులుముకుంటూ… తపేలాతో నీళ్ళు తెచ్చి కట్టెల పొయ్యి మీద పెట్టి, పొయ్యిలో బూడిదంతా బయటికి లాగి శుభ్రం చెయ్యడం మొదలు పెట్టింది.
“అయ్యో రాత, ముందు నీళ్లెట్టుకుంటారా పొయ్యి మీద?” అని రాగం తీసింది అప్పుడే వచ్చిన నరసమ్మ.
ముందురోజు కాలిన వైపే కట్టెల్ని ఒక దానికొసకొకటి నిలబడేట్లు పెట్టి, కిందొక కాగితం, కాస్త కొబ్బరి పొట్టు, ఆ లోపల కిరసనాయిల్లో ముంచిన చిన్న గుడ్డ పేలికతో గప్పున వెలిగించింది పొయ్యిని తన్మయి.
“తెల్లారగట్ల నిద్రలేవడం కష్టంగా ఉంటుంది కానీ లేచాక ఎంతో బావుంటుంది కదా అమ్మమ్మా!” అంది తన్మయి
అరచేతులకు వేడి కాగుతూ.
ఎక్కడో ఒక చోట విన్పిస్తున్న కోడి కూత, రాత్రి విరిసిన చంద్రకాంత పూల పరిమళం, చుట్టూ ఇంకా చిక్కగా అలుముకున్న చీకటిని తానొక్కతే పారద్రోలగలదన్నట్లు గర్వంగా ఎగిసిపడుతున్న కట్టెల పొయ్యి సెగలు.
తెలీని తమకంతో బుగ్గలని రెండు వెచ్చని అరచేతుల మధ్య దాచుకుంది తన్మయి.
మనవరాలి వైపు ప్రేమగా చూస్తూ, పక్కనే వేడి కాగేందుకు పీట లాక్కుని కూచుని “నా బంగారు తల్లివి, నీకెలాటి మొగుడొస్తాడో” అంది మెటికలు విరిచి నరసమ్మ.
ఆ సాయంత్రం ధవళేశ్వరం పెళ్లిలో అటూ ఇటూ తిరుగుతున్న ఎవరో కుర్రాడు తన వైపే చాలా సార్లు చూస్తున్నట్లనిపించింది హఠాత్తుగా తన్మయికి.
చుట్టూ పరికించి చూసింది. అతను కనిపించలేదు. అంతా తన భ్రాంతి అని నవ్వుకుంది.
శ్రద్ధగా పెళ్లి తంతు చూస్తూ “జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారు అమ్మమ్మా” అని అమ్మమ్మ చెవిలో అరిచింది ఒక పక్క గట్టిగా మంగళ వాయిద్యాలు మోగుతూండగా.
“నీకూ తెలుస్తాదిలే త్వరలో” అంది నవ్వుతూ నరసమ్మ.
సిగ్గుతో తల వంచుకుని అంతలోనే అప్రయత్నంగా పెళ్ళి కొడుకు తరఫు వాళ్ల బంధువుల వైపు చూసింది తన్మయి.
తన వైపే ఎప్పటి నుంచో చూస్తున్న అతను చప్పున కళ్ళని తిప్పుకోవడం గమనించింది.
“ఎవరితను ఇంత అందంగా ఉన్నాడు!” అనుకోకుండా ఉండలేకపోయింది. బహుశా: ఇరవై ఏళ్లుంటాయేమో.
అమ్మమ్మని అడగడానికి భయం వేసింది.
అయినా అతను తనని కాకుండా వెనక ఇంకెవరినైనా చూస్తున్నాడేమో, అనిపించి వెనుతిరిగి చూసింది మళ్లీ. వెనకంతా పెద్ద వాళ్ళే ఉన్నారు, తన ఈడు వాళ్ళెవరూ లేరు.
అతను తన వైపే చూస్తున్నాడని రూఢయ్యేసరికి అప్రయత్నంగా తన్మయి ముఖంలో నవ్వు విరిసింది.
భోజనాల దగ్గిర అమ్మమ్మ దగ్గిరికి వచ్చి “నాన్నమ్మ గారూ, నన్ను గుర్తు పట్టేరా, శేఖర్ నండి” అన్నాడు కూరలు వడ్డిస్తూ.
ఆ పలకరింపంతా తనకోసమే అని తన్మయికి అర్థమవుతూనే ఉంది.
“ఓ…దేవి కొడుకువా. గుర్తు పట్టలేదబ్బాయ్, ఎప్పుడో సిన్నపుడు సూసేను” అని నరసమ్మ
“ఆయ్.. ధవళేశ్వరం లోనే సెటిలయ్యేవండీ…. ” అంటూ అతను ఏదో మాట్లాడుతున్నాడన్నమాటే గానీ ఒక్కటీ బుర్రకెక్కడం లేదు తన్మయికి.
దించిన కళ్ళతో నెమ్మదిగా తింటున్న తన్మయిని చూపిస్తూ “మా జ్యోతి కూతురు, ఇంటర్ సదువుతాంది” అంది గొప్పగా చెప్పి
“కాళేజీ సదువుతున్నావా” అనడిగింది నరసమ్మ.
“లేదండి టెంత్ తర్వాత మానేసి వ్యాపారం చూసుకోమన్నారు నాన్నగారు” అన్నాడు.
కొంచెం బాధ వేసింది తన్మయికి. “అయ్యో, చదువు మానేసాడా! అయినా… తనకెందుకులే” అని అనుకుంది మళ్లీ.
ఇంటికి వచ్చిన వారం తర్వాత, పోస్ట్ మేన్ ఇంటి గుమ్మం లోకి విసిరిన ఉత్తరాలలో తన పేరు తో ఉత్తరం ఉండడం తో ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుంది తన్మయి. అటూ ఇటూ చూసి ఉత్తరం తీసుకుని డాబా మీదికి పరుగెత్తింది. దడదడా కొట్టుకుంటున్న గుండెతో ఇన్లాండ్ ఉత్తరాన్ని చింపింది. త్వరగా చింపడం వల్ల అంచులతో బాటు ఉత్తరం చివర కూడా కాస్త చిరిగిపోయింది.
కవరు మీద ఇంగ్లీషులో ఉన్న చక్కని దస్తూరీకి, లోపలి కొక్కిరి బిక్కిరి తెలుగు రాతకు సంబంధం లేదు. అయినా అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు తన్మయి.
“ప్రియమైన తన్మయికి,
ఇక్కడ నేను బాగున్నాను. అక్కడ నువ్వు బాగున్నావని తలుస్తాను.
నీకు ఇలా ఉత్తరం రాయడం తప్పయితే క్షమించు. నువ్వు నాకు నచ్చావు.
నీకు నేను నచ్చితే ఉత్తరం రాయి. ఇది నా ఫ్రెండు షాపు అడ్రసు. ఇక్కడికి ఉత్తరం వేయగలవు.
ఇట్లు
నీ బావ
శేఖర్”
అతి మామూలు ఉత్తరం లో “నువ్వు నాకు నచ్చావు”, చాలా గొప్ప వాక్యంలా తోచింది తన్మయికి. ఇక- “ప్రియమైన”,”నీ బావ” పదాల సంగతి చెప్పనే అక్కరలేదు. పదే పదే అవే గుర్తుకొస్తున్నాయి.
అద్దంలో చూసుకుంటూ, “నేను అతనికి ఎందుకు నచ్చి ఉంటాను?” అని సాలోచనగా అనుకుంది.
“బక్క పలచని శరీరం, పల్చని చెంపలు, ఒక మోస్తరు రంగని కూడా చెప్పలేని ఒంటి రంగు. కాటుక కళ్ళు చలాకీగా ఉంటాయి. జుట్టు బావుంటుంది. కానీ అతని ముందు తనేమీ అందగత్తె కాదు. అది స్పష్టం.” అనుకుంది మళ్లీ తన్మయి.
***
“పేర్లు కూడా సరిగా రాయడం రాదంటే టెంత్ పాసవ్వలేదన్నమాట” అంది ఉత్తరం మడిచి వనజ.
“ఊ..అనుకుంటా” అంది తన్మయి.
“అంతే కాదు, గమనించేవా? ఉత్తరం మీద అడ్రసు అతను రాసినది కాదు.”
“ఊ.. సర్లే వనా, అతని రాత బాలేదని ఫ్రెండుతో రాయించి ఉంటాడు.” అని ఆలోచనలో పడ్డ తన్మయి మనస్సు చదివినట్లు
“అతనికి నువ్వెందుకు నచ్చి ఉంటావో అన్న ఆలోచన మానెయ్యి, అయినా నీకేం తక్కువ. అంత:సౌందర్యం మెండుగా ఉన్న దానివి. తెలివిగలదానివి. అతను నీకెందుకు నచ్చాడో చెప్పు.” అని
“అన్నట్లు రిప్లై ఇస్తున్నావా?” అంది వనజ.
*****
(ఇంకా ఉంది)