షర్మిలాం”తరంగం”
అమ్మాయంటే ఆస్తి కాదురా !
-షర్మిల కోనేరు
అయిదుగురూ సమానంగా పంచుకోమని తల్లి చెప్తే పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని భారతంలో విన్నాం .
ఆస్తి పంచుకున్నట్టు అమ్మాయిని పంచుకోవడం ఏంటో !
ఆడాళ్లని వస్తువులుగా ఆస్తులుగా చూడడం అప్పుడూ ఇప్పుడూ కూడా ఏం కొత్త కాదు .
అర్జున్ రెడ్డి సినిమాలో ఈ పిల్ల నాది అని కర్చీఫ్ వేసేస్తాడు .
వాడికి నచ్చితే చాలు ! ఆ పిల్లతో పని లేదు
ఎవడూ ఆ పిల్లని చూసే సాహసం చేయకుండా ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు .
సినిమాలు చూసి బయట అనుకరిస్తున్నారో లేకపోతే బయట జరిగేవి సినిమాల్లో చూపిస్తున్నారో గానీ వీధికొక
అర్జున్ రెడ్డిలు , కబీర్ సింగ్ తయారవుతున్నారు.
ఆపిల్ కాయలు ఎంచుకుని ఇది బాగుంది అని బుట్టలో వేసుకున్నట్టు అమ్మాయిల్ని వాళ్లే ఎంచేసుకునే ఘనులు తయారయ్యారవుతున్నారు .
మొన్నటికి మొన్న విశాఖపట్నం దగ్గర అనకాపల్లిలో పావురాయిలా వున్న ఓ పిల్ల గొంతు కోసాడు ఒక జులాయి .
నాకీ పిల్లే కావాలి దీన్నే చేసుకుంటాను అని ఆ పిల్ల తల్లితండ్రులకు కూడా తెగేసి చెప్పాడట .
పిల్లకి ఇష్టంలేదు , చదువుకుంటోంది దాని మానాన దాన్ని వదిలేయండని వాడి తల్లితండ్రులకు కూడా ఆ అమ్మాయి అమ్మానాన్న చెప్పి వచ్చారట .
తనని ప్రేమించనందుకూ వేరే వాళ్లతో మాట్లాడుతున్నందుకూ కాలేజీ నుంచి వస్తున్న అమ్మాయిని అందరూ చూస్తుండగానే గొంతులోనూ డొక్కలోనూ ఇష్టం వచ్చినట్టు పొడిచేశాడు .
పాపం ఆ పిల్ల గొంతులో దిగిన కత్తి పోట్లకు విలవిలలాడుతూ నేల కూలిపోయింది .
వాడే కాదు అలాంటి సంఘటనలెన్నో నేను స్వయంగా చూశాను .
ప్రేమించిన అమ్మాయి ఎవరితో మాట్లాడినా ఓర్చుకోలేనితనం చాలామందికే వుంటుంది .
కానీ ఏక పక్షంగా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించలేదు మొర్రో అన్నా …
నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకే స్వంతం అని పెత్తనం చేసే మూర్ఖులు ఎంతకైనా తెగిస్తున్నారు .
ఇది టీవీలో చూసినప్పుడు విషయం గుర్తొచ్చింది .
నా స్నేహితురాలి కూతురు 16 ఏళ్ల లేలేత ప్రాయం … ఇంటర్లో ఎవరో పరిచయం చేస్తే వాడితో కొన్నాళ్లు మాట్టాడేదట .
వాడు బస్టాపుల దగ్గర కాలేజీ బయట సాక్షాత్కరిస్తూ వుండేవాడట .
కొన్నాళ్లు పోయాకా వాడో జులాయి అని నేర చరిత్ర వుందని తెలిసి మాట్లాడడం మానేసింది.
ఇక వాడు ఆ అమ్మాయిని ఏ స్థాయిలో ఫోన్ చేసి బెదిరింపులు మొదలెట్టాడంటే మాట్లాడకపోతే ఏసిడ్ పోసేస్తానని అనేవాడు .
ఆ పిల్ల ఇంట్లో చెప్తే కంగారు పడతారని , కాలేజీ కి వెళ్తే వాడు బయట కాపలా కాస్తాడని కాలేజీ కి వెళ్లడం మానేసేది . కాలేజీ నుంచి మీ అమ్మాయి రావడం లేదని ఫోన్ వస్తే ఇంట్లో వాళ్లు నిలదీసి అడిగితే నిజం చెప్పింది .
కాలేజీకి దింపి తీసుకుని వద్దామన్నా ” ఎంత కాలం తీసుకు రాగలం నువ్వే తెలివిగా అవాయిడ్ చెయ్యి !” అని చెప్పారు .
ఈసారి ఇంటికే వచ్చేశాడు . తల్లీ తండ్రి వుద్యోగాలకు వెళ్లిన టైం లో తలుపు తీయమని బెల్ల్ కొట్టి ఆ పిల్ల తీయక పోతే దుర్భాషలాడి కిటికీ అద్దాలు పగలకొట్టాడు .
తల్లికి ఏడుస్తూ ఆ పిల్ల ఫోన్ చేస్తే మహిళా హక్కుల కోసం పోరాడాలని చెప్పే వాళ్ల అమ్మ నిలువునా చిగురాకులా వణికిపోయింది .
నా బిడ్డకి వాడేం హాని చేస్తాడో అని ఏడుపు మొదలెట్టింది .
అందరం కోప్పడి ” వాళ్ల నాన్నకి ఫోన్ చేసి చెప్పు ” , దగ్గరలో వుంటారు కాబట్టి ఇంటికి వెళ్తారన్నాం
తరవాత వాడి ఇల్లు తెలుసుకుని వెళ్లి మాట్టాడితే ” మీ అమ్మాయే మొదట్లో మాట్టాడేది” అని ఎదురు దాడికి దిగాడట .
వాళ్ల నాన్న ” అవును అప్పుడు దానికి ఇష్టమై మాట్టాడింది … ఇప్పుడు తనకి నీతో మాట్టాడాలని లేదు .
” ఇద్దరికీ ఇష్టమైతేనే ప్రేమైనా స్నేహమైనా …
నువ్వు ఎవడివిరా ? తను మాట్టాడాలి ప్రేమించాలని చెప్పడానికి , దాని జోలికొస్తే తాట తీస్తా ” అని వార్నింగ్ ఇచ్చి వచ్చారు .
వాళ్ల నాన్న కూడా రాజకీయ పలుకుబడి వున్న మనిషి అయినా వాడినుంచి పిల్లని రక్షించుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు .
ఈ సంఘటనలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే వాళ్ల నాన్న ఆ అమ్మాయికి ఇచ్చిన సపోర్ట్ .
” నీతో స్నేహం చేయడం అమ్మాయి ఇష్టం లేనప్పుడు శాసించడానికి నువ్వెవర్రా ?” అని అడిగిన విధానం .
చాలా మంది తల్లితండ్రులు ఈ చిన్న తర్కం మరిచి ” అసలు నువ్వు మాట్టాడడం వల్లే ఈ గొడవ ” అని ఆ పిల్లనే నిందిస్తారు .
టీనేజీలో బయట ప్రపంచం లోకి అడుగు పెట్టిన పిల్లలు అడుగులతో పాటు ఎప్పుడైనా తప్పటడుగు వేసే అవకాశం లేకపోలేదు .
అందుకే అమ్మాయిల్ని పెంచేటప్పుడూ అబ్బాయిల్ని పెంచేటప్పుడూ కూడా ప్రేమంటే ఏక పక్ష నిర్ణయం కాదని , అధికారం, శాసించడం కాదని చెప్పుకోవాలి .
తాత్కాలిక ఆకర్షణల వచ్చే కష్టనష్టాలపై పిల్లలతో చర్చించాలి .
ముఖ్యంగా ఆడవాళ్లంటే వస్తువులో , ఆస్తో కాదని గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అబ్బాయిలకు చెప్పాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులకు మరింత వుంది .
*****
షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.