తెగితే అతకదు ఈ బంధం  

హిందీ మూలం – జ్యోతి జైన్

అనుసృజన – ఆర్.శాంతసుందరి

అనుభ,  కవిత చదవటం పూర్తిచేయగానే ఆ చిన్న హాలు చప్పట్లతో మారుమోగింది.  ఆమె కొద్దిగా వంగి, అందరికీ నమస్కరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది.
” అనుభ గారూ ఎంత బావుందండీ కవిత ! కవితలోని మీ భావం కూడా అద్భుతం ! కంగ్రాచులేషన్స్ ,”అంటూ జుబేర్ తన చేతిని అనుభవైపు చాపాడు . 
”థ్యాంక్స్, ” అంటూ అనుభ అతనికి కరచాలనం చేసి, వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. 
” అనుభా , మీలో ఇంకా ఎన్ని రకాల కళలు దాగున్నాయో తెలీదు. ముగ్గులు వెయ్యటం, డిబేట్ లో పాల్గొనటం… స్పోర్ట్స్ లో అందెవేసిన చెయ్యి, మరిప్పుడు 

కవిత్వం ! ఈసారి ఇంకే కొత్త కళతో   ప్రత్యక్షమౌతారో ?”
”అలాటిదేం లేదు సార్ , మీరు మరీ పొగిడేసి ఇబ్బంది పెడుతున్నారు,” అంది అనుభ తన సీనియర్ అంతలా పొగిడేస్తూంటే నిజంగానే ఆమెకి ఇబ్బందనిపించింది.
”లేదు అనుభా, నిజంగానే నువ్వు ఆల్-ఇన్-వన్ వి,” అంది వైజయంతి, అనుభ సీనియర్. అందరూ ఆమె  మాటతో ఏకీభవిస్తూ అనుభని పొగడటం ప్రారంభించారు.అలా అందరి ప్రశంసలనీ వినయంగా అందుకుంటూ అనుభ అందరికీ దూరంగా నిలబడ్డ ఒక  వ్యక్తిని చూసింది. ఆమెవైపే కన్నార్పకుండా చూస్తున్నాడు ఆమెతో  పనిచేసే జుబేర్ . అతని చూపులకి తట్టుకోలేక ఆమె కళ్ళు దించుకుంది. ఆ తరవాత కార్యక్రమం ముగియటంతో అందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అనుభ, జుబేర్ కలిసి పనిచేసే శాఖకి బాస్ దత్తా మేడమ్. ఆమె చాలా హుందాగా ఉంటుంది. బొద్దుగా ఉన్నా, చాలా చురుగ్గా ఉంటుంది. చీరకట్టులో అమెకి ఆమే సాటి. లావాటి ఫ్రేమున్న కళ్ళద్దాలు, నుదుట పెద్ద బొట్టు, చేతికి ఎరుపు,తెలుపు గాజులు, ఆమె ఉచ్చారణలో బెంగాలీ యాస తెలిసిపోతూ ఉంటుంది. ఆమెకి కళలంటేనూ, సాహిత్యమంటేనూ చాలా ఇష్టం. ఆఫీసుపని ఎప్పుడూ ఒకే రొటీన్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఉద్యోగులకి విసుగు కలిగిస్తుందని ఆవిడ అభిప్రాయం.అందుకే ప్రతి నెలా రెండో శనివారం మూడు గంటలపాటు ఉద్యోగులకి తమ ప్రతిభని ప్రదర్శించేందుకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. రకరకాల కళలతో బాటు సామాజిక కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ జరుగుతాయి.

అనుభకి కూడా దత్తా మేడమ్ లాగే సాహిత్యమన్నా, ఇతర కళలన్నా ప్రేమ. తనకి చేతనైనంతవరకూ అన్నిట్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ప్రతిసారీ అందరి మెప్పూ పొందుతూనే ఉన్నా, ఈసారి ఆమె కవితకి వచ్చిన స్పందన అద్భుతమనిపించింది. బాస్ తనని ప్రత్యేకంగా మెచ్చుకుంది. జుబేర్ అయితే అలా పొగుడుతూనే ఉన్నాడు. అతన్ని తల్చుకున్నప్పుడల్లా అతని సూదంటురాయి లాంటి చూపులు గుర్తొస్తాయి అనుభకి.

‘ ఏమిటిది? ఎందుకిలా అదే గుర్తొస్తూ ఉంటుంది? స్టుపిడ్!’ అని తనని తనే మందలించుకుంటుంది.
అనుభ ఈ ఆఫీసులో చేరి సంవత్సరం అవుతోంది. ఎమ్. బి. ఎ చేశాక ఇదే మొదటి ఉద్యోగం. మంచి జీతం , ఆఫీసు వాతావరణం బాగుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మంచి బాస్ దొరికింది.’ ఆడదానికి ఆడదే శత్రువు’ అనే సామెతని అబద్ధం చేసేట్టుగా దత్తా మేడమ్ అందరు ఉద్యోగులతోనూ, ముఖ్యంగా ఆఫీసులో పనిచేసే స్త్రీలతో చాలా చక్కగా ట్యూన్ అయిపోతుంది. ఆవిడ  ఒక ఆదర్శమైన అధికారిణి  ! గత కొన్ని నెలలుగా ఆవిడ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆఫీసు సిబ్బంది ప్రదర్శించే కార్యక్రమాలతో బాటు అప్పుడప్పుడూ సామాజిక ప్రయోజనాన్నిచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఒకసారి ఎవరైనా లేడీ డాక్టర్ని అమ్మాయిలు  చదివే సర్కారు స్కూళ్ళకి పంపి వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఒక్కోసారి పేద పిల్లలకి ఉచితంగా శానిటరీ నాప్కిన్లు పంచిపెడుతుంది.

మంచి బాసూ, స్నేహంగా ఉండే సహోద్యోగులతో  అనుభకి ఆఫీసులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా గడిచిపోయేది. కానీ కొన్నాళ్ళుగా ఆమెకి జుబేర్ చూపుల్లో ఏదో తేడా కనిపించసాగింది. అదేమిటో అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదామె. అయినా ఆడవాళ్లకి  సిక్స్త్ సెన్స్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. చూపులబట్టి అవతలి మనిషి మనసులో ఏముందో పసిగట్టగల సహజమైన నేర్పు ఉంటుంది. జుబేర్ చూపులు ఏమంటున్నాయో తెలిసినా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చెయ్యదల్చుకోలేదామె. అన్యమతస్థుడి పట్ల ఇంట్లోవాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటూందో తనకి తెలుసు. ఇంట్లో భూకంపం సృష్టించటం ఆమెకి ఇష్టం లేదు.

కానీ ప్రేమ గుడ్డిదంటారు కదా? ఒక్కోసారి ప్రేమ మూర్ఖంగా కూడా ఉంటుంది.తప్పుదారిన వెళ్తున్నామని తెలిసి కూడా అటే వెళ్తారు.అనుభ దృష్టిలో జుబేర్ మంచి మనిషే. ఇద్దరూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తారు. కొన్నాళ్ళు బాగా పరిచయం పెరిగాక కలిసి జీవిస్తే ఆనందంగా గడపగలమని అనిపించింది. హిందూ, బొహరా ముస్లిముల కుటుంబాలు కలవటం కష్టమే ,కానీ ఆ రెండు కుటుంబాలూ వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాయని తెలిసి, ఆఫీసులో అందరూ ఆశ్చర్యపోయారు.ముందు కొంత తర్జనభర్జన జరిగినా పిల్లల ఇష్టం కాదనలేక పెద్దలు సరేనన్నారు.

భావి జీవితం గురించి కలలు కనటం మొదలెట్టింది అనుభ. ఆ సంబంధానికి సామాజిక ఆమోదం కూడా లభిస్తే బావుంటుందనుకున్నారు అనుభ తలిదండ్రులు. పెళ్ళి నిశ్చయం చేసే తంతు ముగిస్తే ఇద్దరూ స్వెచ్ఛగా కలిసి తిరగచ్చని అనుకున్నారు.అంతా సవ్యంగా, సాఫీగా జరిగిపోతూ ఉంటే, నిశ్చలంగా ఉన్న నీళ్ళలో గులకరాయి విసిరినట్టయింది.

ఆరోజు ఆఫీసు ముగిశాక “మరీ ఇంత పిసినారులేమిటి? పార్టీ ఇవ్వరా?” అన్నారెవరో. కనీసం కాఫీ అయినా ఇప్పించమని వైజయంతి సతాయించింది. ఒక పదిమంది తేలారు. కాఫీ అన్నారే  కానీ, చివరికి ఏవేవో ఆర్డరిచ్చారు.
”జుబేర్ , మొత్తానికి చాలా ధైర్యం చూపించావు,”అంది లోచన్. ఆమె గుజరాతీ.
”మీవాళ్ళయితే ఇంత సులభంగా ఒప్పుకునేవాళ్ళు కాదేమో కదా?” అన్నాడు రోషన్.

” అలా చూస్తే అనుభకి కూడా వాళ్ళవాళ్ళని ఒప్పించటం కష్టమే అయింది. వీళ్ళ నాన్నయితే…ఓ మై గాడ్ ! చెప్పు అనుభా!”
”అవును మావాళ్ళు కూడా అంత సులభంగా ఒప్పుకోలేదు,కానీ దేవుడి దయవల్ల ప్రస్తుతం అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి,” అంటూ అనుభ జుబేర్ వైపు చూసి నవ్వింది.
” కానీ యార్, మీలో ఇలాంటి పెళ్ళికి ఒప్పుకోరని విన్నాను, నిజమా? నీ పేరెంట్స్ ..” అన్నాడు దీపక్ జుబేర్ తో.

“నిజమే, చాలా కష్టం మీద ఒప్పించగలిగాను.అందుకే ఇంతాలస్యమైంది. కానీ ఒక చిన్న షరతు పెట్టారు. అనుభ  తన మతం మార్చుకోటమనే ఫార్మాలిటీ అయాకే పెళ్ళి జరుగుతుంది. ఆ తరవాత ఇక ఎలాటి ఇబ్బందీ ఉండదులే.”
అనుభ చేతిలోని కాఫీ కప్పు తొణికింది.”ఏమంటున్నావు జుబేర్?” అంది. ఆమెకి తన గొంతు మరెవరి గొంతులాగో అనిపించింది.
కొన్ని క్షణాలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.కొందరు అయోమయంగా చూశారు.కొందరి మొహాల్లో,’ ఇలాటిదేదో జరుగుతుందని మాకు ముందే తెలుసు,’అన్న భావం కనిపించింది.
అనుభ – జుబేర్ ఇతరులముందు సొంత విషయాలు చర్చించకూడదన్న వివేకం కనబరుస్తూ ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించలేదు.అంతా మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ పార్టీ ముగించారు.అందరూ తమ కార్ల దగ్గరకి వెళ్ళాక జుబేర్ అనుభతో బాటు తన కారు దగ్గరకి నడిచాడు.
అనుభ తన వెంట రాదనే అనుకున్నాడు జుబేర్. అందరూ అదే అనుకున్నారు.కానీ అనుభ నవ్వుతూ అందరికీ ‘బై’ చెప్పి కారు తలుపు తెరిచి అతని పక్కన కూర్చుంది.

కొంతసేపు మౌనంగా ఉన్నాక జుబేర్ గొంతు సవరించుకుని ఏదో అనబోతూ ఉంటే అనుభ అతను మాట్లాడే లోపల శాంతంగా,” చూడు జుబేర్, అక్కడ పార్కు  దగ్గర కారు కొంచెం ఆపుతావా?” అంది.
జుబేర్ కారు రోడ్డు వార ఆపాడు. ” ఇది చాలా చిన్న విషయం కదా అనూ? ఒకసారి పెళ్ళయిపోతే ఆ తరవాత నీ ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు. నువ్వు హిందువులాగే బతకచ్చు. ఇది ఒక తంతు మాత్రమే. ఎలాగూ నీకు చెప్పాలనే అనుకున్నాను,” అన్నాడు జుబేర్.
”నువ్వు నాకు చెప్పావా లేదా, ముందే ఎందుకు చెప్పలేదు లాంటి ప్రశ్నలు ముఖ్యం కాదు. అసలు నాకు కావలసిందేమిటనేదే ముఖ్యం. నాకు మీ మతమన్నా, అసలు ఏ మతమన్నా కూడా గౌరవమే.  నా మతాన్ని కూడా అంతే గౌరవిస్తాను. అయితే నా నమ్మకాలు నా  నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. వాటిని ఒక్కసారిగా తెంపివెయ్యటం సాధ్యం కాదు,” అంది అనుభ ఏమాత్రం భావోద్రేకం లేకుండా.
”నిన్ను తెంపెయ్యమని ఎవరంటున్నారు అనుభా?” అన్నాడు జుబేర్ అసహనంగా.
”సారీ, జుబేర్. ఫార్మాలిటీకి కూడా నేనీ పని చెయ్యలేను. నా సంతోషం కోసమే మా అమ్మా నాన్నా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. వాళ్ళు షరతులేవీ పెట్టలేదే?మన సంతోషమే చూడాలి గాని మీవాళ్ళు ఇలా షరతులు పెట్టటమేమిటి?ప్రేమకి షరతులుంటాయా ఎక్కడైనా?”
”నిన్ను చూడగానే నాకు నీమీద కలిగింది ప్రేమే కదా అనూ?” అన్నాడు జుబేర్.అతని గొంతులో నిజమైన ప్రేమ ధ్వనించింది.
”లేదు, జుబేర్, అది ప్రేమ కాదు, ఆకర్షణ అయుంటుంది.ప్రేమే అయితే నా మతాన్ని గౌరవించేవాడివి,” అంది అనుభ నిర్వికారంగా.
”నీకు తెలుసా జుబేర్? మా మతంలో దారప్పోగులు చాలా ముఖ్యమైన సంకేతాలు. దిష్టి తగలకుండా, రక్షాబంధన్ కి, వ్రతాలకి దారంతో ముడులు వేస్తాం,చివరికి పెళ్ళిలో సప్తపదిలో కూడా వరుడి కొంగూ, వధువు కొంగూ కలిపి ముడేస్తారు. అది ప్రేమకీ, నమ్మకానికీ, వాళ్ళిద్దరి మధ్యా ఉండే పరస్పర గౌరవానికీ సంకేతం. కానీ ప్రేమ బంధం చాలా గొప్పది. దాన్ని ఎప్పుడూ తెంపకూడదు. తెగితే మళ్ళీ అతకని బంధం అది. ఒకవేళ తెగితే  ముడెయ్యచ్చు కానీ మునుపటిలా అది సాఫీగా ఉండదు కదా? అలాంటి సంబంధం నాకు అక్కర్లేదు జుబేర్…ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం, వాదనలు వద్దు. నన్ను మా ఇంటి దగ్గర దింపి వెళ్ళిపో,” అంది అనుభ అదే తుది నిర్ణయం అన్నట్టు.

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.