కనక నారాయణీయం -2

-పుట్టపర్తి నాగపద్మిని 

 

“ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’

    “ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”

   భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!

   కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద పడ్డాయీసారి!!

    ఆ ఇల్లాలిక చేస్తున్న పని ఆపి.. మెల్లిగా లేచి, తాను దగ్గరుంచుకున్న లాంతరును తీసుకుని..మందాసనం దగ్గరికి చేరుకుంది.

మెల్లిగా ఆయాస పడుతూ, మందాసనం దగ్గరికి చేరుకుని, చేతిలోని లాంతరును మందాసనం కిందకి వెలుగు పడేలా చేయి ముందుకు సాచుతూందో లేదో….

  ఇంతలో ఏముంది?? బుస్..బుస్..మంటూ..నాగుపాము పడగ విప్పి  ముందుకు వచ్చింది.

  ఆ ఇల్లాలు గట్టిగా అరచింది.  దడదడలాడుతున్న గుండెలతో..వెనక్కి అడుగు వేసింది. అంత భయంలోనూ, చేతిలో లాంతరును వదలలేదా పిచ్చి తల్లి!!  చేయి..కాస్త దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే …పాము కాటు బారిన పడేదే!!

  వణికి పోతున్న గొంతుతో…’ఏమండీ…పామండీ…’ అని అరిచిందామె!!

  “ఆ….నాగ సాయి ఐఉంటుందిలే..ఈ రోజు గురువారం కదా..షిర్దీ బాబా పూజ చేసుకున్నాం కదా..మన పూజకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యాడీవిధంగా!! పాలు పెట్టు ముందు..తాగి వెళ్ళిపోతాడులే..’ ఇదీ కూర్చున్న చోటునుంచీ కదలకుండా.. ఆ పతిదేవుని సమాధానం.

  నిజమే కదా!! ఈ రోజు గురువారం. మందాసనం నిండా పువ్వులే!! పచ్చ పచ్చటి చామంతుల మధ్య, నాగ సాయి పటం…దాని ముందు..ఇప్పుడిదిగో..పడగ విప్పిన నాగుబాము!!

  పతిదేవుని మాటలు  అక్షర సత్యాలే!! కానీ..ఇప్పుడు తానున్న పరిస్థితి?? తానేమో నిండు గర్భిణి..అటువైపు గదిలో..ముగ్గురాడపిల్లలూ..ఒక కొడుకూ.. ఆదమరచి నిద్రపోతున్నారు.ఇక్కడింత రాద్ధాంతం జరుగుతున్నా,  ఆ చివరి గదిలో పుస్తకాల నడుమ కదలకుండా కూర్చుని అక్కడినుంచే సలహాలిస్తున్న భర్త!!  

పతిదేవుడలా అన్నాడంటే…ఇంక తిరుగేముంటుంది?? పైగా, పదునాలుగేళ్ళ వయసులో, మెడవంచి ఆయనతో తాళి కట్టించుకున్ననాటినుండీ, ఇదిగో..ఇప్పటివరకూ, యీ పందొమ్మిదేళ్ళ లోనూ, ఆయన అన్న మాటలను, మనసా వాచా కర్మణా విశ్వసించి, ఆచరించటం తప్ప, వేరేగా ఆలోచించటమన్న మాటే లేదు కదా మరి!!

  అందుకే..ఆ ఇల్లాలు, ఆ వణుకుతున్న చేతులతోనే, ఆ అరుగుమీద వేరే గిన్నెలో తాను పడుకోబోయేముందు తాగాలని ఉంచుకున్న పాలను చిన్న పాత్రలో పోసి, మెల్లిగా…ఇంకా పడగ విప్పి తనవైపే చూస్తున్న నాగబాము వైపు చటుకున్న జరిపి తాను వెంటనే వెనక్కి అడుగేసింది, చిక్కబట్టుకున్న గుండెలతో!!

  అంత భయంలోనూ, ఆ నాగసాయికి  మనసారా మొక్కుకుంది, ‘పిల్లలున్న ఇల్లు తండ్రీ!! ఈ పాలు తాగి వెళ్ళిపో!! నిన్నింతవరకూ, ధూప దీప నైవేద్యాలతో కొలుచుకున్నాం. నీ దయవల్ల, రేపు పుట్టబోయేదెవరైనా, ఆ బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాము స్వామీ..’ !! అని!! 

  ఆ వచ్చినది, నిజంగా నాగసాయేనా కాదా, ఆ ఇల్లాలి వేదనను గమనించే వెళ్ళిందా..అన్న విశ్లేషణనటుంచి, భయంతోనూ, భక్తితోనూ, కన్నీళ్ళు కారుతుండగా, చేతులు జోడించి అలాగే నిలుచునే వున్న ఆ ఇల్లాలు, కాసేపటికి కళ్ళు తెరిచి చూచేసరికి…..మందాసనం కింద నాగు పాము యెటువెళ్ళిపోయిందో ఏమో!!

  ఆ చీకటిలో..అది ఇంట్లోకే ప్రవేశించిందో, లేక వెనకనున్న కలుగులోకే వెళ్ళిపోయిందో తెలియక, ఆ ఇల్లాలికి ఆ రాత్రంతా జాగారమే దిక్కైంది!!

  ఆ గుడ్డి వెలుతురులోనే మిగిలిన వంటింటి పని ముగించుకుని, పిల్లల దగ్గరే, కంట్లో ఒత్తులు వేసుకుని కూర్చుందామె, తెల్లారేవరకూ!!

  ఇంత జరుగుతున్నా, వాగ్దేవీ ఉపాసనలోంచీ వెలికి రాలేదామె భర్త!!

  తెల్లవారిన క్షణం నుంచీ, మళ్ళీ, ఇల్లూ వాకిలీ చిమ్ముకోవటం కోసం, నడుం వంచకతప్పలేదా ఇల్లాలికి!! కాసేపటికి, పెద్ద కూతురు కరుణాదేవి లేచి వచ్చి, చేయందుకోగానే, బీడ్డకు, రాత్రి జరిగిన ఉదంతం గురించి చెప్పింది.  ఆ పదునాలుగేళ్ళ పిల్ల, సంభ్రమంగా, చెల్లెళ్ళు తరులత, తులజలను ఉన్నపాటున లేపి, నాగుబాము వంటింట్లో చేసిన కలకలం గురించీ, అమ్మ ధైర్య సాహసాలగురించీ చెప్పింది.

ఈ కథ, చిలవలు పలవలుగా మా కుటుంబముంటున్న  నరసరామయ్య వీధికంతా క్షణాల్లో పాకిపోయింది.

  కనకమ్మ పతిభక్తినీ, ధైర్యాన్నీ మెచ్చుకున్నారు ఆ వీధిలోని ఇల్లాళ్ళు!! ‘ఆ..అదే పామనుకుంటా..ఇదిగిదిగో..ఇలా వెళ్ళిందిప్పుడే..’ ‘ఆ..నేనూచూశా…ఆ గోడ వెంబడి వెళ్తుంటే..’ ఇటువంటి మాటలూ ఆ తరువాత రెండు మూడు రోజులు వినబడ్డాయి..ఆ చుట్టుపక్కల!!

  తరువాత కూడా ఆ ఇంట్లో వెనుకవైపుండే డాబా మెట్ల దగ్గర, మా అమ్మమ్మ శేషమ్మ,  పిల్లలకు అన్నాలు కలిపి పెడుతున్న వేళ, పైనుండీ, గద్ద పట్టుకు వెళ్తున్న పాము జారి సరాసరి అన్నాలు తింటున్న పిల్లల మధ్య పడి, భయంతో, దగ్గరున్న కలుగులోకి పారిపోవటం కూడా జరిగిందని మా అమ్మమ్మ మాటల్లోనే విన్నాను తరువాత!!

  ఆ తరువాత, నేను పుట్టాను. మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, నామకరణాలూ వంటివి ఎవరికీ జరిగిన దాఖలాలు లేవనే గుర్తు. బహుశా ఉండి వుంటే, మా పెద్దక్కయ్యలిద్దరికీ జరిగిందేమో!! అంతే!! నా పేరు ముందే మా అమ్మ మొక్కుకున్నట్టుగా, ముందు నాగ, తరువాత, కొత్తదనం కోసం, కొనసాగింపుగా అయ్యా అమ్మా సృజనాత్మకతవల్లో  లేదా అక్కచెల్లెళ్ళ చలువవల్లో, ‘పద్మిని ..’ వచ్చి చేరి…’నాగ పద్మిని గా స్థిరపడటం జరిగిందన్నమాట!! 

(సశేషం)      

*****

(ఫోటో.. ప్రొద్దుటూరు వాస్తవ్యులు, ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు శ్రీ పెద్ద జమాలప్ప గారిది. ప్రొద్దుటూరులో మా అయ్య గారి సంగీతాభ్యాసానికి, దోహదపడినది వీరే. ఫోటో కర్టెసీ. శ్రీ జింకా సుబ్రహ్మణ్యం (పుట్టపర్తి సాహితీ పీఠం), మరియు పెద్ద జమాలప్ప గారి కుటుంబం)

Please follow and like us:

3 thoughts on “కనక నారాయణీయం-2”

  1. నాగపద్మిని గారు తమ నామౌచిత్యం తెలిపారు. నమస్సులు 🙏🏽

  2. చాలా కృతజ్ఞతలు గీత గారూ….మీ సారధ్యంలో విజయవంతంగా అశేషాభిమానుల అభిమాన సంపదతో, చురుగ్గా అడుగులు ముందుకేస్తున్న నెచ్చెలికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
    (ఫోటో.. ప్రొద్దుటూరు వాస్తవ్యులు, ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు శ్రీ పెద్ద జమాలప్ప గారిది. ప్రొద్దుటూరులో మా అయ్య గారి సంగీతాభ్యాసానికి, దోహదపడినది వీరే. ఫోటో కర్టెసీ.శ్రీ జింకా సుబ్రహ్మణ్యం (పుట్టపర్తి సాహితీ పీఠం), మరియు పెద్ద జమాలప్ప గారి కుటుంబం)

    1. పాఠకులకి ఆసక్తిదాయకంగా రాస్తున్న మీకు అనేక నెనర్లు పద్మిని గారూ! ఫోటో వివరాలు రచన చివరన జతపరుస్తాము.

Leave a Reply

Your email address will not be published.