క’వన’ కోకిలలు- అమ్రితా ప్రీతమ్
-నాగరాజు రామస్వామి
( ఆగస్టు 31 , 1919 – అక్టోబర్ 31 , 2005 )
” శాంతి కేవలం సంక్షోభ రాహిత్యం కాదు; శాంతి అంటే పూలు వికసించిన వేళ.” – అమ్రితా ప్రీతం.
అమ్రితా ప్రీతమ్ ప్రముఖ పంజాబీ రచయిత్రి, కవయిత్రి. పంజాబీ హిందీ భాషలలో రచనలు చేసింది. ఆరు దశాబ్దాల పాటు సాగిన సాహితీ ప్రస్థానంలో ఆమె 100 కు పైగా కవితా సంపుటాలను, నవలలను, వ్యాస సంకలనాలను ప్రచురించింది. భావాభ్యుదయ కవిత్వం ( Romantic-Progressivism ) రాయడంలో ఆమెది అందె వేసిన చేయి. 18 వ శతాబ్దం కవి వారిష్ షా పై రాసిన స్మృతి కావ్యం “Ode to Waris Shah”) చెప్పుకో దిగింది. ఆమె నవల పింజర్ ( Pinjar ) ఆధారంగా వచ్చిన సినిమా అవార్డులను గెలుచుకుంది. ఆమె ప్రతిష్ఠాత్మకమైన పలు పురస్కారాలను స్వంతం చేసుకుంది. ముఖ్యమైనవి సాహిత్య అకాడెమి (1956 ), భారతీయ జ్ఞానపీఠ్ ( 1982 ), శతాబ్ది సమ్మాన్ ( 2000 ), పద్మ శ్రీ (1969), పద్మ విభూషణ్ ( 2004 ) పురస్కారాలు. సాహిత్య అకాడెమి విశిష్ట గౌరవ సభ్యత్వం (Sahitya Academe Fellowship) జీవం సాఫల్య పురస్కారం. ఢిల్లీ, జైపూర్, విశ్వభారతి, పాకిస్తాన్ , ఫ్రాన్స్ యూనివర్సిటీల నుండి గౌరవ డిగ్రీలు( D . Litt ) పొందింది . 1986 లో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభించింది.
1935 లో లాహోర్ వ్యాపారస్తుని కొడుకుకు ప్రీతంసింగ్ ను పెళ్లి చేసుకొని 1960 లో విడాకులు తీసుకుంది.
ప్రఖ్యాత లిరిక్ రచయిత, కవి సాహిర్ లుద్వాన్వి పై పిచ్చి ప్రేమను పెంచుకుంది. ఆమె ప్రేమోన్మత్త. భగ్నప్రేమిక. సాహిర్ మరణానంతరం ఆమె రాసుకున్న ఈ కవిత ఆమె ప్రణయ తత్వానికి అద్దం పడుతుంది. “నిన్ను గుర్తుకు తెచ్చుకున్నాను / మళ్ళీ జ్వలిత జ్వాలను చుంబించాను / ప్రేమ విషభరితమైన పానపాత్రం కావచ్చు / కాని,/ కావాలి నాకు మళ్ళీ మరో నిండు చషకం.” సాహిర్ జీవితంలోకి మరో అమ్మాయి సుధా మల్హోత్రా ప్రవేశించినందున, ఆమె కళాకారుడూ, రచయితా ఐన ఇమ్రోజ్ ను పెళ్లి చేసుకుని 40 ఏళ్ల శేషజీవితం గడిపి 86వ ఏట తనువు చాలించింది.
ఆమె కారుణ్య విచలిత. భారత విభజన కాలం నాటి ఆందోళనలలో అసంఖ్యాక పౌరులు హతమైన సంఘటన ఆమెను అమితంగా కదిలించింది. ఝటిత స్ఫూర్తితో ఆమె రాసిన కవిత ( To Warish Shah ) ఆమెకు అశేష ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆమె ఇండియా, పాకిస్తాన్ ఇరు దేశాలకు ఇష్టమైన కవయిత్రి. పాకిస్తానీ పాఠకులు సూఫీ కవి వారిష్ షా సమాధి మీది పవిత్ర చాదర్ ను ఆమెకు పంపించి తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు.
ఆమె గ్రంథాలలో ముఖ్యమైనవి : పింజర్ ( నవల), రసీది టికెట్, షాడో ఆఫ్ వర్డ్స్, అమ్రిత లహరే, సునేహాది (సాహిత్య అకాడెమీ అవార్డు ), కాగజ్ కా కాన్వాస్ ( భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం ).
ఆమె అసంఖ్యాక కవితలలో కొన్నింటికి నా అనువాదం :
1.స్మృతి ( Memory )
ఈ రోజు
అదోలా ఉన్నాడు సూర్యుడు;
కాంతి గవాక్షం తెరుస్తూ ,
మబ్బు కిటికీ మూస్తూ
చీకటి మెట్లు దిగుతున్నాడు.
చెమర్చినవి
నుదుటి మీద ఆణిముత్యాలు;
ఆకాశం
చుక్కల గుండీలు తీస్తూ ,
వెన్నెల అంగీ విప్పుతున్నది.
ఓ మూలన
పరధ్యాన్నంగా నాలోకి నేను;
నన్ను చేరుకున్న నీ జ్ఞాపకం
పచ్చి దుంగ కాలుతున్నట్టు
కారు నల్లని పొగలు కక్కుతున్నది.
కాలుతున్న ఎండు కట్టెల
ఎర్రని నిట్టూర్పుల్లా
కూడావచ్చినవి వంద ఆలోచనలు;
ఆర్పేశా ఆ రెండు కొఱవి కర్రలను.
వత్సరాల నిప్పుకణికలు
చెల్లా చెదురుగా పడిఉన్నవి;
కొన్ని చల్లారినవి, కొన్ని చల్లారనివి;
ఊడ్చేందుకు యత్నించిన
కాలం కొసవేళ్లు కాలిపోయినవి.
నీ చేయి జారిన వంట పాత్ర
నేల మీద పడి పగిలి పోయింది ;
మనం విందుకు పిలిచిన చరిత్ర
ఆకలితోనే వెనుతిరిగి వెళ్లి పోయింది.
2.నిన్ను కలుసుకొని తీరుతాను ( I Will Meet You Again )
ఎక్కడో, ఎలాగో తెలియదు గాని
మళ్ళీ కలుసుకుంటాను నిన్ను
కల్పనల్లోనే సాధ్యమయ్యే వాస్తవంలా
కరిగి పోతాను నీ ఊహల్లో
నీవు గీస్తున్న చిత్రపటం మీద
మార్మిక రేఖా రూపంగా
నన్ను నేను పరచుకొని
నిన్ను వీక్షిస్తుంటాను
నీ రంగులు పులుముకున్న
రవి కిరణ్నాన్నై
నీ కాన్వాసు మీది వర్ణచిత్రాన్నౌతాను
ఎలాగో, ఎక్కడో తెలియదు గాని
నిన్ను తప్పక కలిసి తీరుతాను
నీ మండే గుండెలమీద
నా చలువల నురుగులు రుద్దే
సుతిమెత్తని తుండు గుడ్డ నౌతాను
నడుస్తుంటుంది నా వెంట
నా జీవితం ఇలాగే ;
దేహ చ్యుతితో నశించేవే అన్నీనూ;
అయినా
దృఢమైనవి స్మృతి సూత్రాలు,
గట్టివి ఆ నూలు పోగులు;
ఆ పోగుల అణువులను పోగుచేసుకొని
తెగని బంధాల దారాలు పేనుతాను.
మళ్ళీ ఎలాగైనా
నిన్ను కలిసికొని తీరుతాను
3.శూన్య దేశం (Empty Space )
రెండే రెండు రాజ్యాలు ఉండేవి
ఒకటి నన్నూ అతన్నీ వెలివేశాయి
రెండో దాన్ని మేమే వదిలేశా౦
చాలాకాలం
నేను నాని పోయాను
నా దేహ వర్షంలో
అతను పుచ్చి పోయాడు
అతని వానలో
విషం వంటి గత వత్సరాల ప్రీతిని తాగేసి
వణుకుతున్న చేయితో నన్ను ఒడిసిపట్టుకుని
అన్నాడు
“రా,
కొంత సేపు
నెత్తిమీద ఓ పైకప్పును వేసుకుందాం,
ముందున్నది చూడు
అక్కడ సత్యాసత్యాల నడుమ
ఓ చిన్న ఖాళీ ప్రదేశం”
4.వాగ్దానం ( Pledge )
నా బాధాతప్త హస్తరేఖల్లో
చెక్కబడి వుంది ఓ వాగ్దానం;
ప్రాణరేఖను మించింది ప్రణయరేఖ
ఎన్నాళ్ళు నా ప్రేమ జీవిస్తుందనే కదా నీ ప్రశ్న ?
ప్రేమకు మాటలు నేర్పే ప్రయత్నం వృధా సుమా;
ప్రేమ ఇంకా వినడం నేర్వనే లేదు
మాటల సంపద లేకున్నా
లక్షణంగా మనగలదు ప్రణయం
నా మేని దయమీద నిలిచింది నా జీవశ్వాస౦
అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు;
కాని, ఏ నాటికీ చెక్కు చెదరదు
కాలం వక్షం మీద చెక్కబడిన ప్రణయం
లైలాకు అనుకరణే౦ కాదు హీర్!
మజ్నును అనుసరించలేదు ర౦ఝ!
ఎన్నటికీ పునరుక్తి కాదు ప్రేమ
మళ్లీమళ్లీ వల్లించబడదు ప్రణయం
ప్రేమ పేజీ పాత కథలను ప్రచురించదు;
అది సదా నవనవం, అసమాంతరం.
ఆర్త బాణం గుచ్చుకుంది
నా అరచేతులకు, నా మునివేళ్లకు;
కాని, గాయపడిన నా కొసవేళ్ళ తుదన
జీవిత ఆశ ఎదో మేలుకొంటున్నది .
5.” వారిస్ షా కు ” ( To Waris Shah )
ఓ వారిస్ షా !
ఘోషించు
నీ సమాధి లోతులల్లోంచి,
చేర్చు ఓ కొత్త పేజీని
నీ ప్రేమ గ్రంథానికి.
నాడు
ఒక పంజాబ్ కూతురు ప్రణయ వేదనను
వేల రోదనలుగా వెదజల్లింది నీ కలం;
ఈ నాడు
నీ వేవేల కూతుళ్లు వేయి కన్నులతో
వేచి చూస్తున్నారు నీ కోసం
నీవు లేచి వస్తావని,
నేటి పంజాబును నిలదీస్తావని
ఓ వారిస్ షా !
పొలాలలో శవాలు కుప్పపడి వున్నవి,
చెనాబు నదీ జలాలు రక్తసిక్తమై ప్రవహిస్తున్నవి;
ఎవరు కలిపారో విషాన్ని !
మన ఐదు జీవ నదులు
పుడమికి కల్మషాన్ని పులుముతున్నవి,
అడవిలో విషవాయువులు విజృంభిస్తున్నవి,
పాడే చెట్టు కొమ్మలు పడగ విప్పిన విషసర్పాలై
జనగళాలను కాటేస్తున్నవి.
ఉన్నట్టుండి పంజాబ్ కాళ్ళు చల్లబడుతున్నవి,
దారం తెగిన చేరఖా భ్రమణస్వనాలు
గొంతులోనే వికలమౌతున్నవి,
ఊయల తాళ్లు ఊడిపడుతున్నవి,
ఛిద్రమై పడవ మునుగు తున్నది.
ఈ నాడు అందరూ
అందాన్ని, అనురాగాన్ని అపహరించే దొంగలే !
ఎక్కడ వెదుక్కోవాలి మరో వారిష్ ను ?
అలనాటి ఆ పంజాబు పుత్రిక విషాద గాధకు
అక్షర సాక్షం నీవు;
లే నీ సమాధి నుండి ఓ వారిష్ షా!
ఎలుగెత్తి పలుకు ఓ జాలి కథకుడా!
నీవు మాత్రమే మాట్లాడ గలవు
నీ సమాధి లోతుల్లోంచి,
మరో కొత్త పుటను మలచగలవు
నీ ప్రేమజీవుల ప్రణయ గ్రంథానికి .
* 18 వ శతాబ్దపు సూఫీ. భగ్న ప్రేమికులైన హీరా, రంఝాల ప్రణయ వృత్తా౦తాన్ని కనువిప్పు కలిగించే కావ్యంగా అక్షరీకరించిన పంజాబీ కవి.
భారతావని గర్వ కారణం విశ్వ విఖ్యాత కవయిత్రి అమ్రితా ప్రీతమ్ !
*****