గద్వాల రాజసం… రాచరీకము
-విశాలి పేరి
గద్వాల్… ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది చీరలు, ఆ తరవాత ఈ మద్యన వచ్చిన అరుందతి సినిమా!
కానీ ఆ గద్వాల… అంటే విద్వద్ గద్వాల అని సాహీతీ సుమాల మాల అని
పట్టుచీరల జరీ రెపరెపల… కృష్ణమ్మ పరవళ్ళ గలగలల గద్వాల్ అని మీకు తెలుసా? (ఎంత మందికి తెలుసు..?)
చరిత్ర :
ఈ గద్వాల చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్య ప్రాంతములో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములో కాకతీయ సామ్రాజ్య పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సుల్తానులకు సామంతులు అయినారు. గద్వాల సంస్థానమునకు మూలపురుషుడు బుడ్డారెడ్డి. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
రాచరిక వ్యవస్థ ఘనంగా కొనసాగుతున్న రోజుల్లో గద్వాల సంస్థానం తనకంటూ ఓ ప్రత్యేక చరిత్ర సృష్టించుకొంది. ప్రస్తుత ఇప్పటి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పటి గద్వాల పేరు చెబితే ఇరుగు పొరుగు పాలెగాళ్లు గడగడ లాడిపోయేవారు. ఈ సంస్థానం వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అంతెందుకు నిజాం నవాబు సైతం గద్వాలను ప్రత్యేకంగానే పరిగణించేవారు. అలాంటి ఆ సంస్థానానికి నిర్మాణ వ్యవస్థాపక మూలవిరాట్టుగా నిలిచిన పాలెగాడు నల సోమనాద్రి. ఈ సంస్థానాన్ని ధర్మనిరతితో పరిపాలించిన సుప్రసిద్ధ పాలకుడు. ఇతన్ని పెద్ద సోమభూపాలుడు, పెద శోభనాద్రి, సోమనాద్రి అని ప్రజలు ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు. ఈ సంస్థానం స్థాపించాడానికి ముందు సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. క్రీ.శ. 1663లో ఈ సంస్థాన స్థాపనకు గద్వాలలో బీజం వేశాడు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించాడు. ఈ పాళెగాని తండ్రి పెద్దారెడ్డి. తల్లి బక్కమ్మ. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య అమ్మక్కమ్మ, చిన భార్య లింగమ్మ . తల్లి బక్కమ్మ పుట్టినిల్లు పూడూరు. ఆ పూడూరే సోమనాద్రి తొలి రాజధాని.
మనం స్మరించు కోవాల్సిన ఎందరెందరో కథానాయికల్లో సోమనాద్రి సతీమణి లింగమ్మ కూడా ఒకరు. శత్రురాజుల కోటలో తన భర్త బందీగా మారి కొన ఊపిరితో పోరాడుతున్నారన్న సమాచారం అందుకొంది రాణి. అంతలోనే వేగులు వచ్చి పూర్తిస్థాయి సమాచార మిచ్చారు. శతృ రాజులు యుద్దరంగంలో నిలవ లేక కర్నూలు కోటకు పారిపోతుండగా సోమనాద్రి వారిని వెంటబడి తరుముతూ కర్నూలు కోటలో బందీగా చిక్కాడని చెప్పారు. రాజును విడిపించేందుకు కోట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నమైనా చేయకుండా తమ సైన్యం చేతులెత్తేసారని, అనుమతిస్తే వెనుదిరిగి వస్తామంటూ కబురు పంపించారని రాణి లింగమ్మతో చావు కబురు చల్లగా చెప్పారు.
అప్పుడు రాణి లింగమ్మ ” అలాగే రండి! కాకపోతే నేను పంపించిన ఈ గాజులు, చీరలు, పసుపు, కుంకుమలు ధరించి తిరిగిరండ” ని ప్రత్యుత్తరం పంపింది” దీంతో ఎక్కడ లేని పౌరుషం పొడుచు కొచ్చిన సైన్యం ఇక విజయమో, వీరస్వర్గమో ఎదో ఒకటి తేలిపోవాలని భావించింది. కళ్లు మూసి తెరిచేలోగా కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టారు. పెల్లుబికిన ఆగ్రహంతో కోటలోకి దుమికారు. విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చే ప్రయత్నాల్లో ఉండగా కపటోపాయంతో నిజాం సైన్యం సోమనాద్రిని హతమార్చింది. అయితే నిజాంని గద్వాలను వశపర్చుకోనీకుండా సోమనాద్రి సతీమణి లింగమ్మను రాణిగా కొనసాగింది.
గద్వాల సంస్థాన రాజధానిని పోడూరు నుంచి గద్వాల మార్చారు. పూడూరులో చాళక్యులు పరిపాలన సాగుతున్న కాలంలో చాళుక్యులకు పల్లవులకు జరిగిన యుద్ధంలో పెద్ద సోమభూపాలుదు కూడా పాల్గొన్నప్పుదు గదను, వాలాన్ని వాడాడుట, అందుకు ఈ రాజధానికి “గద్వాలము(గద+వాలము) ” అని పేరు వచ్చింది. ఈ గద్వాల సంస్థానాన్ని పదకొండు మంది రాజులు, తొమ్మిది మంది రాణులు పరిపాలించారు. వారిలో ప్రముఖులు లింగమ్మ, ఆది లక్ష్మీదేవమ్మ. గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి.
గద్వాల సంస్థాన పరిపాలన పరిశీలిస్తే ఎక్కువ శాతం స్త్రీలే.. పట్టపు రాణులే పరిపాలించిన విషయాలు కనపడుతాయి.
1712 వ సంవత్సరం సోమభూపాలుడు మరణిచే సమయానికి ఆయన రెండో భార్యకు కలిగిన కుమారుడు తిరుమల్ రావ్ , రామారావ్ చిన్నపిల్లలైనందున సోమభూపాలుని భార్యలు పరిపాలన బాధ్యతల్ని నిర్వహించారు. 1713 నుండి 1724 వరకు మొదటి భార్య అమ్మక్క పరిపాలించగా , 1724 నుండి 1738 వరకూ రెండవ భార్య లింగమ్మ పరిపాలించారు.
ఆ తరవాత తిరుమల్ రావ్ మృతి చెందాక అతని మొదటి భార్య మంగమ్మ 1742 నుంచి ఒక సంవత్సరం పాటు పరిపాలన కొనసాగించింది. 1743 నుండి 1747 వరకూ రెండవ భార్య చొక్కమ్మ పరిపాలించింది.
గద్వాల చివరి సంస్థానాదీసుడు సీతారామభూపాలుడు. ఇతను 1924 వరకు గద్వాలని పరిపాలించాడు. అతనికి ఇద్దరు భార్యలు రామక్క, ఆదిలక్ష్మిదేవమ్మ. ఇతను 1924 మే 12 న చనిపోయాడు. ఇతని తరవాత అతని రెండవ భార్య ఆదిలక్ష్మీదేవమ్మ పరిపాలానాధికారాన్ని చెపట్టింది. వీరికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే, రాణి న్యాయపోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించింది. సంస్థానంలో సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ, ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్గద్వాలగా కీర్తి రావడానికి కారకులయ్యారు. ఆవిడ స్వతహాగా విద్యాధికురాలు కావడంతో ఎంతోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేశారు. ఈవిడ 1924 నుంచి 1949 వరకు గద్వాల్ సంస్థానాన్ని పరిపాలించారు.
1947 లో దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పటికి నిజాం రాజు మాత్రం ఇండియన్ యూనియన్ లో కలవలేదు. అయితే గద్వాల సంస్థానం అటు ఇండియన్ యూనియన్లోనూ లేక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రదేశంగా మిగిలిపోవడం విశేషం. 1949 లో సంస్థానాధికారాన్ని వదులుకున్నాక రాణి ఆదిలక్ష్మిదేవమ్మ భూములన్నీ రైతులకు అప్పగించేశారు. సంస్థానాన్ని ప్రభుత్వానికి అప్పగించి లోపల రాజమందిరం డిగ్రీకాలేజీకి, మరికొంతభాగాన్ని టౌణాల్ కు అప్పగించారు. చెన్నకేశవ ఆలయాన్ని రాఘవేంద్రస్వామి మఠానికి అప్పగించారు.
గద్వాల చీరలు :
గద్వాల పేరు చెప్పగానే గుర్తొచ్చేవి అక్కడి చీరలు. ఇక్కడి సంస్థానాన్ని పరిపాలించింది ఎక్కువగా మహిళలే కాబట్టి చీరల నేతలలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే వారని చెబుతారు. బొంబాయి(ముంబై) నుండి చీరల నేతలలో నిష్ణాతులైన వారికి తీసుకొనొచ్చి అద్భుతమైన అంటే బంగారు జరీ, వెండి జరీలతో చీర నేయించేవారుట. ఆరోజుల్లో హుందాగా, రాజసంతో కనిపించే చీరలు నేయించుకొనేవారు. అందువలన ఈనాటికీ గద్వాల చీరలంటే యావద్ భారత దేశంలో ప్రత్యేక స్థానం ఉంది.
తరతరాల చరిత్ర గల ఎన్నో సంస్థానాలలో ఈ గద్వాల ముఖ్యమైనది. వారి ఘనత మనము తెలుసుకొని కీర్తించాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళ గొప్పదన్నాని తెలుసుకుంద్దాము.. కీర్తిద్దాము.. గర్విద్దాము.
*****
నా పేరు విశాలి పేరి. చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. విపుల, నమస్తే తెలంగాణ, ఆంధ్ర జ్యోతి, ఉషోదయ వెలుగు, చినుకు లో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి.
చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు
Breef గా చక్కగా వివరించారు విశాలీ. మరిన్ని ఆర్టికల్స్ వ్రాయండి. చక్కని టెక్నీక్ మీది . అల్ ద బెస్ట్