తీర్పు
–అనసూయ కన్నెగంటి
ఒకరోజు ఒక విచిత్రమైన తగవు తీర్పు కోసం వచ్చింది రాజుగారి దగ్గరకి.
గంగయ్య, మంగయ్య ఇద్దరూ పక్క పక్క పొలాలున్న రైతులు. గంగయ్య మోసకారి.
తన పొలం నాలుగు పక్కలా ఉన్న రైతుల్లో ముగ్గురు రైతులు వాళ్ళ వాళ్ల పొలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. కానీ నాలుగవ పక్కనున్న మంగయ్య మాత్రం చాల సౌమ్యుడు. అతనికి తగాదాలంటే భయం. అది అలుసుగా తీసుకుని పొలం గట్టుని కొంచెం కొంచెం మెల్ల మెల్లగా జరిపేస్తూ మంగయ్య పొలాన్ని తన పొలంలో కలిపేసుకోసాగాడు గంగయ్య.
కొంతకాలానికి అది గమనించాడు మంగయ్య. గంగయ్యను హెచ్చరించాడు. అయినా గంగయ్య ఆక్రమించటం మానలేదు. ఏం చెయ్యాలో తెలియని మంగయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి పిర్యాదు చేసాడు. దాంతో కొంతమంది పొలానికి వెళ్ళి ఆ పొలాన్ని వాళ్ల దగ్గర ఉన్న పత్రాలతో సరి చూసి కొలిచి గంగయ్య చేసిన దురాక్రమణను గుర్తించారు.
కాసిన్ని చివాట్లేసి..మరోసారి ఇలా చేస్తే రాజు గారికి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
అంతే కాదు..” అతని పొలానికీ , నీ పొలానికీ మధ్యలో సరిహద్దుగా తాటి మొక్కలు నాటుకో. ఇలాంటి మోసకారులతో ఎప్పటికీ ప్రమాదమే “ అని మంగయ్యకు సలహా ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్లే తన పొలం గట్టు మీద తాటి మొక్కల్ని నాటుకున్నాడు మంగయ్య.
అవి పెరక్కుండా ఎన్నో ఆటంకాలు కల్పించాడు గంగయ్య. కొన్నిసార్లు పీకి అవతల పారేసాడు కూడా. అయినా మళ్ళీ మళ్ళీ తాటి మొక్కల్ని నాటి మరీ పెంచాడు మంగయ్య.
కొంతకాలానికి అవి పెరిగి పెద్దై కాపుకి వచ్చి బాగా ముగ్గిన తాటి పళ్ళు చెట్టు మీద నుండి రాలి కింద పడేవి. కొన్నికొన్నిసార్లు గంగయ్య చేలో కూడా పడేవి. అలా తాటిపండు తన చేలో రాలి పడ్దప్పుడల్లా తన పంట నాశనం అయిపోతుందని మంగయ్య దగ్గర గొడవ చేసేవాడు గంగయ్య. పైగా తాటి చెట్ల నీడకి పంట దిగుబడి తగ్గిపోయి..నష్టాలు వస్తున్నాయని మంగయ్య పంటలో సగం పంటని దబాయించి పట్టుకెళ్ళిపోయేవాడు. మంగయ్య ఏమీ అనలేకపోయేవాడు.
కొంతకాలానికి మంగయ్య కొడుకు పెద్దవాడయ్యాడు. గంగయ్య మోసం గమనించిన మంగయ్య కొడుకు రాజుగారికి పిర్యాదు చేద్దాం అన్నాడు. అందుకు ఒప్పుకోలేదు మంగయ్య. పైగా ..
“ పక్క పక్క పొలాల వాళ్ల మధ్య సఖ్యత ఉండాలి. లేదంటే కష్టం. పోనీలే వదిలెయ్ “ అన్నాడు.
అయినా వినలేదు మంగయ్య కొడుకు. రాజుగారికి పిర్యాదు చేసాడు. గంగయ్యను పిలిపించాడు రాజు.
అంతా విన్న రాజు తీర్పు చెప్పటానికని రెండు రోజుల తర్వాత రమ్మని అందర్నీ పంపించేసాడు.
తర్వాత రెండు రోజులకు గంగయ్య , మంగయ్య తీర్పు కోసం రాజు గారి ఆస్ధానానికి వచ్చారు.
అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలైంది.
మంత్రిగారు గంగయ్య మంగయ్యల దగ్గరకు వచ్చి..
” రాజుగారు మీ తగవుపై తీర్పు ఆరుబయట ఇస్తారట. పదండి బయటికి వెళదాం “ అనేసరికి అంతా ఆరుబయటికి చేరుకున్నారు. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. అక్కడ నాలుగు పలకలుగా రెండు గడులు గీచి ఉన్నాయి.
మంత్రి గంగయ్య నూ మంగయ్యనూ..వారివారికి గీచిన గడుల్లో నిలబడమన్నాడు.
అలా ఎందుకు నిలబడమన్నాడో చూస్తున్నవారెవరికీ అర్ధం కాలేదు.
“సరేనని..” ఆయా గడుల్లో నిలబడ్దారు ఇద్దరూ. మిట్త మధ్యాహ్నం కావటంతో సూర్యుడు నడినెత్తిన ఉండటంతో వారి నీడ వాళ్ళ మీదనే పడసాగింది.
సరిగ్గా అప్పుడే రాజు వచ్చాడు అక్కడికి.
“ మీ మీస్ధానాల్లో నిలబడే ఉండండి నేను తీర్పు చెప్పేదాకా. మీరుగానీ మీ నీడగానీ పక్క వారి గడిపై ఎంతమాత్రమూ పడకూడదు “ అని ఆజ్ఞాపించాడు.
ముఖాముఖాలు చూసుకున్నారు గంగయ్య, మంగయ్య.
సూర్యుడు మెల్లిగా కిందకి దిగసాగాడు. దాంతో గంగయ్య నీడ వెళ్ళి మంగయ్య గడిలో పడసాగైంది. అది చూసి రాజుకి కోపం వచ్చింది. “నీ నీడకు చెప్పు. అలా మంగయ్య గడి మీద పడవద్దని..” అని గంగయ్య మీద అరిచా డు రాజు.
“ అది నా చేతుల్లో ఉండదు కదా మహారాజా ..సూర్యుణ్ణి బట్టి కదా ..? మీకు తెలియనిది ఏముంది మహారాజా?” అన్నాడు గంగయ్య.
“ నీ నీడకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్పగలరు? నీ నీడకే నువ్వు చెప్పలేనప్పుడు..మంగయ్య మాత్రం తన తాటి చెట్లకు ఎలా చెప్పగలడు? అలా చెప్పలేకపోతున్నాడనే కదా అతని పంటలో సగం తీసేసుకుంటున్నావు. ఇప్పుడు నేను ఆజ్ఞాపించినా కానీ నీ నీడ మంగయ్య గడిలో పడింది..దానికి నువ్విప్పుడు సొమ్ములు చెల్లించాలి. ఏవి ..తీసుకు వచ్చావా? “ అన్నాడు.
దాంతో సభలోని వారంతా గొల్లున నవ్వారు.
తను చేసిన తప్పు తనకి అర్ధమై రాజుగారి కాళ్ల మీద పడ్డాడు క్షమించమని గంగయ్య.
“క్షమించటం కాదు. ఇప్పటి వరకూ ఇదే సాకు చూపించి మంగయ్య దగ్గర ఎంత పంట తీసుకున్నావో అంతకి మూడింతలు మంగయ్యకి చెల్లించు. లేదా కారాగారశిక్ష తప్పదు. “ అని తన తీర్పు చెప్పాడు రాజు.
రాజు మాటలకి భయపడిపోయిన గంగయ్య తన తప్పుని ఒప్పుకుని మంగయ్యకు పరిహారాన్ని చెల్లించాడు గంగయ్య.
అది చూసి మిగతా రైతులు కూడా తమ పొలాల సరిహద్దుల్లో తాటిచెట్లను నాటి గట్టును పటిష్టం చేసుకున్నారు.
*****