ద్వీపాంతం
-శ్రీ సుధ
ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి
సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో
అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి
వెన్నెల లేని చంద్రుడు
హృదయం లేని ఆకాశం
వుంటాయని తెలియదు వాటికి
విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై
వీచే ఈదరగాలుల్లో అలసి
ఎప్పటికో నిదురపోతాయి
తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి
రెండో మూడో ఝాములు దాటాక
నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా
బహుశా యిక ఆ తరువాత
దీపస్తంభాలకి ఆ ద్వీపాలు
మధురమైన పాటలే వినిపించి వుంటాయి
*****