నారి సారించిన నవల

-కాత్యాయనీ విద్మహే   

4

1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందుమాట వలన  పిరాట్టమ్మ జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆమె భర్త శ్రీమాన్ ఏ. నమ్మాళ్వారయ్య. ఆయన కడప మండలం లో ప్రొద్దుటూరు తాలూకా తహసీల్దారు గా పనిచేసాడు. ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషా సాహిత్య పండితుడు. అనేక పుస్తకాలకు పరిష్కర్త, పీఠికా కర్త అయిన శ్రీమాన్ తేవేప్పెరుమాళ్ళయ్య ఆయన తల్లి కి అక్కకొడుకో , చెల్లెలికొడుకో అవుతాడు.  వ్యాకరణ శాస్త్ర కారుడు చిన్నయ సూరి ఆయన బంధుకోటిలోని వాడే . భార్య పిరాట్టమ్మ ఆయనకు తగిన విదుషీమణి.  

పదహారేళ్ళ వయసులోనే  పిరాట్టమ్మ ‘శోభావతి’  నవల వ్రాసింది. విదుషీ మణులు వ్రాసిన గ్రంధాలు ఎన్నో ఉండగా ఇది ఎందుకులే అని చాలాకాలం ప్రచురణ మాట తలపెట్టలేదు.‘ప్రతివ్రతా రత్నము యొక్క చరితమగుటచే స్త్రీలోకమవశ్యము చదువ దగినది’ అని భర్త పుస్తక ప్రచురణకు ఆమెను ప్రోత్సహించాడు. కడపజిల్లా కలెక్టరు సతీమణి కలెట్టి దొరసానికి అంకితమివ్వమని కూడా సూచించాడు.కానీ  ముద్రణ పూర్తి కాకమునుపే ఆయన హటాత్హుగా మరణించాడు. అప్పటికే నమ్మాళ్వారయ్య మిత్రుడు, సమీప గ్రామమైన పర్లపాడు వాస్తవ్యులు, బాల కవిరత్న బిరుదాంకితులు అయిన కసిరెడ్డి వేంకట సుబ్బయ్య (1923 సెప్టెంబర్ 30) ఈ నవలకు ముందుమాట వ్రాసి ఉంటాడు.ఎందుకంటే అందులో ఆయన మరణం గురించిన ప్రస్తావన లేదు.నవల ప్రచురణ కాలానికి ఆమె వయసు ఎంతో ఎక్కడా సూచనలేదు. బిడ్డలతల్లి అని మాత్రం తెలుస్తుంది. కనుక ఈ నవల రచనాకాలం ఎప్పుడో, ఎన్నేళ్ల తరువాత ప్రచురించబడిందో చెప్పలేము.  

భర్త మరణించిన  దుఃఖంలో పిరాట్టమ్మ  నవల ప్రచురణ విషయం పూర్తిగా వదిలేస్తే కసిరెడ్డి వేంకట సుబ్బయ్య తో పాటునమ్మాళ్వారయ్య కు మరొక కవిమిత్రుడైన  మహబూబ్ మియ్యాన్ సాహెబ్ , మరిది కూడా నవల బయటకు తీసుకొని రావాలని, పరలోకంలో ఉన్న భర్తకు అది సంతోషం కలిగిస్తుందని ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు. 1924 అక్టోబర్ ఒకటవ తేదీ నాడు  ఆమె తనముందుమాట వ్రాసింది.నవలను ప్రచురించింది. నవలను’కొలది మాసముల క్రిందటకోల్పోయిన జీవితేశ్వరునకు’ కన్నీటిధారతో కాళ్ళు కడిగి’ అంకితం చేసింది. అప్పటికి ఆమె మద్రాస్ చేరినా నవల ముద్రణ మాత్రం ప్రొద్దుటూరు జానకీ ముద్రాక్షర శాల లోనే పూర్తయింది.  వీటన్నిటినీ బట్టి ఆమె తమిళ మూలాలు వున్న రాయలసీమ రచయిత్రి అని నిర్ధారణ అవుతున్నది.మరి ఆమెను సీతా పిరాట్టమ్మ అని, నల్లగొండ నివాసి అని, తెలంగాణాలో తొలి తెలుగు నవలా రచయిత్రి అని గీతాంజలి ఏ ఆధారాలతో చెప్పారో తెలియదు. (తీరొక్క పువ్వులు -భిన్న అస్తిత్వాల స్త్రీల సాహిత్యం – పరిచయవ్యాసాలు ,ప్రరవే, 2016,పుట 125)

కుంభకోణం,తంజావూరు, ఈ నవలకు కథాస్థలాలు. నవలా నాయిక శోభావతి పుట్టిల్లు కుంభకోణం. అత్తిల్లు తంజావూరు. మొదటి రెండు ప్రకరణాలలో ఆ రెండు ఊళ్ళు, ఆ రెండు కుటుంబాలు ,వాళ్ళ మధ్య ఉన్న వైషమ్య సంబంధాలు పరిచయం చేయబడ్డాయి. ఆ రెండూ బ్రాహ్మణ కుటుంబాలు. కథాకాలానికి అయిదేళ్ల పూర్వమే శోభావతికి పట్టాభి రాముడితో  వివాహం అయింది. శోభావతి ఈడేరి నాలుగేళ్లయిందన్న ప్రస్తావనను బట్టి కథాకాలానికి ఆమె వయసు పదహారు అనుకోవచ్చు. పట్టాభిరాముడి వయసు పద్ధెనిమిది. శోభావతి అత్తగారు జానకమ్మ. పెళ్ళిలో మర్యాదలు సరిగా లేవన్న ఆరోపణలతో పెళ్లి తరువాత వియ్యాల వారింటి వైపు ఎవరూ తొంగి చూడకుండా చేసింది. ఆమె గయ్యాళి తనానికి జడిసి భర్త శేషయ్య పంతులు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఈ పరిస్థితులలో నవలలో కథ మొదలవుతుంది.  

కథా ప్రారంభంలోనే శోభావతి తండ్రి రామచంద్రయ్య వియ్యాలవారిని దీపావళి పండగకు ,మరునాడు జరిగే లక్ష్మీ నోములకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ వ్రాసాడు. దానికి వారి నుండి ప్రతిస్పందన ఏమీలేదు. కానీ రామచంద్రయ్యకు వియ్యంకుడు అవధాని శేషయ్య పంతులు వైశాఖ బహుళదశిమినాడు జరగబోయే కూతురి పెళ్ళికి, చిన్నకొడుకు పెళ్ళికి కోడలిని తీసుకొని రావలసిందిగా ఆహ్వానిస్తూ వ్రాసిన లేఖతో కథలో కదలిక మొదలవు తుంది. దీపావళి ఆశ్వీజమాసపు చివరిరోజు. వైశాఖంలో పెళ్లిళ్లు అంటే ఆరునెలలతరువాత. శోభావతిని తీసుకొని ఆ పెళ్ళికి తల్లి కల్యాణి,ఆమె తండ్రి హయగ్రీవులు తంజావూరు వెళ్లారు. పెళ్లిళ్లు అయినతరువాత తిరిగి రావటానికి ఇష్టపడని కూతురిని అత్తగారింట వదిలేసి తల్లి తాత కుంభకోణం తిరిగి వెళ్లిపోయారు. 

అత్తగారింటి ఆమె ఉన్నది ఎన్నిరోజులో కానీ పుట్టింట నాయనమ్మ పార్వతమ్మ మాత్రం ఇంట గౌరీ పూజ జరుగుతున్న సందర్భంలో శోభావతి లేదే అని బాధపడుతూ నెలలు కాదు , పిల్ల వెళ్లి సంవత్సరాలు కావస్తున్నది అని కొడుకు దగ్గర వాపోతుంది. అత్తగారింట అత్తగారి సాధింపులు, భర్త దౌర్జన్యం భరిస్తూ వంటిమీద నగలన్నీ వలుచుకు వెళ్లి వేశ్యలకు పెడుతుంటే సహిస్తూ గడుపుతున్న శోభావతి గర్భవతి కావటం మరొక మలుపు. పురిటికి పుట్టింటివాళ్ళు ఆమెను తీసుకుపోతే నెల నెలా తండ్రి ఆమెకు పంపుతున్న పది రూపాయలు తనకు దక్కవన్న దుగ్ధ  ,ఆమె ముక్కు కు వున్న ముక్కు పుడకలు కాజెయ్యాలన్న దుర్బుద్ధి – కలిసి తిరుచునాపల్లి లో ఉద్యోగం అనే నెపంతో ఆమెను వెంటపెట్టుకొని ప్రయాణమై మార్గమధ్యంలో ఒక స్టేషనులో రైలు దింపి డొంక మార్గాన తీసుకొనిపోతూ కొట్టి ముక్కుపుల్లలు లాక్కొని గాయపరిచి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం ,వారు రైలు దిగిన వూరు కుంభకోణమే కావటం ,ఎవరో బాటసారి ఆమెను తండ్రి ఇంటికి చేర్చటం తో కథలో ఒక ఘట్టం ముగిసింది.  

తల్లిదండ్రుల పోషణలో ఆరోగ్యవతి అయిన శోభావతి ఆడపిల్లను కన్నది. ఆ పిల్లకు తొమ్మిదవ నెల వచ్చాక గానీ కోడలు పుట్టింట్లో క్షేమంగా ఉన్నదన్న సంగతి తెలియని మామగారు తెలిసాక వియ్యంకుడు ఎంత తప్పు పడతాడో అని సందేహించినప్పటికీ వెళ్లక పోవటం తనతప్పు అవుతుందని, కొడుకు దుర్మార్గానికి ఏమి ఎదురైనా భరించక తప్పదని కుంభకోణం వెళ్ళాడు. మామగారి వెంట వెళ్ళటానికి శోభావతి సిద్ధపడటం, తరువాత ఎవరినైనా పంపుతానని వెళ్లిన ఆయన వదినగారిని తీసుకురావటానికి చిన్నకొడుకును పంపటంతో కథ మళ్ళీ తంజావూరుకు తరలింది. 

తన వ్యసనాలకు డబ్బు వచ్చే మార్గాలు ఏవీ లేకపోయేసరికి పట్టాభిరాముడు పాఠశాలలో అధ్యాకుడుగా కుదురుకొన్నా అంతా వేశ్యలకే ఖర్చుపెడుతూ భార్యపై  ఇదివరకులాగే చేయిచేసుకొంటూ తన ఆధిక్యతను ప్రకటించుకొంటూనే ఉన్నాడు. బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేసరికి శోభావతి మళ్ళీ గర్భవతి. కొడుకు పుట్టాడు. కథాక్రమంలో మూడేళ్లు పూర్తయినట్లు. భర్త సరిగా చూసుకొనకపోవటం వల్ల పెరుగుతూవచ్చిన మానసిక వేదన, అతని దెబ్బలకు అవిసిన శరీరం, జబ్బుపడ్డ అత్తగారికి  సేవలు వీటన్నిటితో జబ్బుపడి శోభావతి మంచం పట్టటం కథలో క్లైమాక్స్. భర్త దయ లేదనే విచారం, అతనికి సేవచేసే భాగ్యం లేదే అని దిగులు , భర్తకు పనికి రాణి బ్రతుకు ఎందుకన్న నిరాశా నిస్పృహలు కారణంగా మందులు ఏవీ పనిచేయని స్థితిలో అయిదారునెలలు గడిచి ఉంటాయి. అప్పటికి ఇద్దరు వెళ్లగొట్టగా రాగమంజరి అనే  మరొక వేశ్యను చేరిన పట్టాభి ఆమె బోధ వలన వివేకం కలిగి భార్య పట్ల, ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ ,ఆసక్తి కన బరచడం,పిల్లలను దగ్గరకు తీయటం మొదలుపెడతాడు. ఈ పరిణామాలు శోభావతిని మృత్యుముఖం నుండి తప్పించి తేరుకొనేలా చేశాయి.   

జబ్బుపడిన కూతురికి సహాయంగా ఉండాలని వచ్చిన కల్యాణి తేరుకొంటున్న కూతురిని తన వెంట తీసుకొని కొన్నాళ్ళు ఉంచుకొని పూర్తిగా బాగుపడ్డాక పంపిస్తానని అంటే సరేనని పంపిన పట్టాభి పది రోజులలోనే ఆమెను పిల్లలను వదిలి ఉండలేక మామగారు పిలవకుండా ఎలా వెళ్లటమా అని దిగులుపడుతున్నప్పుడు ఆ అహాలు, సంకోచాలు అన్నీ వదిలి భార్యాపిల్లల కోసం అత్తగారింటికి వెళ్లే చొరవ తీసుకొనటానికి కూడా రాగమంజరి సలహాయే కారణమైంది. ఏమైనా పట్టాభిలో పరివర్తన పరిపూర్తి అయిందనటానికి ఈ ఘట్టం శిఖర స్థాయి రుజువు. శోభావతి సహనానికి, తన్నిన కాళ్లే పట్టుకొని క్షమించమని వేడుకొనే పతివ్రతా లక్షణానికి, భర్త తప్పులు అన్నీ కడుపున దాచుకొని తనను తాను అతనికి అంకితంచేసుకొన్న నిబద్ధతకు ఫలితం పట్టాభి లో వచ్చిన ఈ మార్పు. మొత్తం మీద నాలుగైదేళ్ల కాలం మీద ప్రవర్తించింది ఈ నవలేతివృత్తం. 

స్త్రీలు గయ్యాళులు అయితే కుటుంబాలు అశాంతి నిలయాలవుతాయని చెప్పటానికి రచయిత్రి ఈ నవలలో  జానకమ్మ పాత్రను, ఆమె కూతురి పాత్రను పూర్తిగా ఉపయోగించు కొన్నది. భర్తృ నిరాదరణకు శోభావతి గురికావటానికి కారణం జానకమ్మ గయ్యాళితనం ఎంతకారణమో కొడుకును పెంచిన తీరు, ప్రభావితం చేసిన తీరు కూడా అంతే కారణమని ఇతివృత్తంలో సూచన ఉంది. అంతే కాదు కూతురు గయ్యాళి కావటం కూడా ఆ ప్రభావఫలితమే అన్న సూచన కూడా ఉంది. భర్త చనిపోయి బావగారింటఉంటూ ఇల్లు చక్కదిద్దుతున్న పిన్నత్తగారు సుభద్రమ్మ, తోడికోడలు మీనాక్షి శోభావతికి వెన్నుదన్నుగా వున్న స్త్రీలు. రాగమంజరి వేశ్య అయినా పెళ్లయి సంసారాలు ఉన్న పురుషులతో సంబంధం పెట్టుకోనన్న నియమం కాలవ్యక్తి. ఆ విషయం మీదనే తల్లితో ఘర్షణ పడి ఊరువదిలి తంజావూరు చేరింది. పట్టాభి అబద్ధాలాడి తనకు చేరువయ్యాడు అన్న విషయం తెలిసాక ఆమె అతడిని పూర్తిగా పక్కకు పెట్టింది. భార్యా పిల్లల తో కలిసి బతకటానికి అవసరమైన సంస్కారం అతనికి నేర్పింది. భార్యను నిర్లక్ష్యం చేసి తనదగ్గరకు వచ్చేపురుషుడి మార్గం సరైనది కాదని చెప్పటంలోనూ, సంసారాలు బాగుగుకు తాపత్రయ పడటంలోనూ రాగమంజరిలో కనీశుల్కం నాటకం లోని మధురవాణి – చెడనివాడిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది – అని చెప్పిన మధురవాణి పోలికలు దూరంగానైనా కనబడతాయి.  

సర్వజన సామాన్యమైన గృహ ఛిద్రాలను వస్తువుగా చేసి సర్వసద్గుణ శోభిత , పతిభక్తి పరాయణురాలు అయిన శోభావతి  కష్టపరంపరలను ఎదుర్కొని జీవించిన తీరును చిత్రించిన ఈ నవలలో పురుషపాత్రల చిత్రణ సరిగా జరగలేదన్న విమర్శ ఉంది. అలా చిత్రించలేకపోవటం స్త్రీ సహజమేమో అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు విమర్శకులు.

కవిత్వం,కథ,వ్యాసం మొదలైన భిన్నప్రక్రియలలో అనేక రచనలు చేసిన కనుపర్తి వరలక్ష్మమ్మ(1896 అక్టోబర్ 6 – 1978 ఆగస్ట్ 13 ) ‘అపరాధిని’, ‘వసుమతి’ అనే సాంఘిక నవలల ను, ‘వరదరాజేశ్వరి’ అనే చారిత్రక నవలను వ్రాసింది. 1959 లో ‘సప్తపది’  అనే గొలుసు నవలను రేడియో కోసం వ్రాసిన ఏడుగురిలో వరలక్ష్మమ్మ ఒకరు. అందులో మొదటి భాగం ఆమె వ్రాసింది. 1963 లో ఆ నవల ముద్రించబడింది.  

వసుమతి 1925 లో వ్రాసిన నవల. వరలక్ష్మమ్మ భర్త కనుపర్తి హనుమంతరావు గారి మిత్రుడు గిడుగు వెంకట రామమూర్తి. ఆయన  దీనికి పీఠిక వ్రాసాడు.విజ్ఞప్తి అనే పేర వ్రాసిన ముందుమాటలో కనుపర్తి వరలక్ష్మమ్మ ఈ నవలావస్తువును తన పద్నాలుగేళ్ల వయసులో తమయింటికి వచ్చిన ఒక వృద్ధురాలు తల్లికి చెప్తుండగా విన్న కథనం నుండి స్వీకరించానని చెప్పుకొన్నది. స్త్రీలోలుడైన భర్తవల్ల కూతురు పడ్డ కష్టాలను గురించి ఆమె చెప్పిన విషయమే తనను నవలా రచనకు ప్రేరేపించిందని పేర్కొన్నది. ఒకటి రెండు సంవత్సరాల తరువాత వ్రాసి అలావదిలేసానని, ఎనిమిదేళ్ల తరువాత శిధిలమవుతున్న  ప్రతిని తిరిగి వ్రాసి ముద్రిస్తున్నట్లు చెప్పింది. ఆ రకంగా పదహారు పదిహేడేళ్ల వయసులోనే వ్రాసిన ఈ నవలను ఆమె 1925 లో ముద్రించ గలిగింది . పదహారేళ్లకే నవల వ్రాయటం, ఆ తరువాత ఎప్పుడో అచ్చువేయటం లోనే కాదు, సాధ్వి అయిన స్త్రీకి వేశ్యాలంపటుడైన భర్తవల్ల ఎదురైన కష్టాలు, వాటినుండి బయటపడ్డ తీరును నవలకు ఇతివృత్తంగా ఎంచుకొనటం లోనూ వరలక్ష్మమ్మకు పెరియ పిరాట్టమ్మ తో దగ్గరి పోలిక కనబడుతుంది. 

వసుమతి నవలలో కథ దసరా పండుగలలో మొదలవుతుంది. కథాకాలం నాటికి తొమ్మిది సంవత్సరాలకు ముందు భర్తను కోల్పోయి కొడుకును చదివిస్తూ కూతుళ్ళిద్దరికి పెళ్లిళ్లు చేసిన మహాలక్ష్మమ్మ ఇంట జరుగుతున్న దసరా పండుగ అది. విజయవాడ కథాస్థలం. కొడుకు రామచంద్రం. పెద్దకూతురు రాజ్యలక్ష్మి. భర్తతో బాపట్లతో ఉంటుంది. చిన్నకూతురు వసుమతి .అన్న ఆమెకు ఇంటివద్ద చదువు చెప్తుంటాడు. కొత్తగా స్థాపించబడిన రామ మోహన పుస్తకభాండాగారం నుండి  చక్కటి పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదివిస్తుంటాడు. ఆమెకు ఆనందరావు తో పెళ్లయి అయిదారునెలలు. ఇంకా కాపురానికి పోలేదు.గుంటూరు లో చదువుకొంటున్న ఆనందరావు కు మరొక స్త్రీతో సంబంధాలు వు న్నా యని రామచంద్రానికి స్నేహితుడు కృష్ణమూర్తి ద్వారా తెలుస్తుంది. ఆవిషయమై తమ్ముడిని కాస్త హెచ్చరించమని నరసరావు పేటలో వున్న అతని అన్నగారికి ఉత్తరం వ్రాస్తాడు. ఆ ఉత్తరం వ్రాసింది 20-10-1909 నాడు. నవల చివర రంగూన్ లో ఉన్న ఆనందరావు కు వ్రాసిన ఉత్తరం ప్రస్తావన వస్తుంది. ఆఉత్తరం వ్రాసింది 1914 లో. అంటే నవలలో కథ 1909 నుండి 1914 వరకు అయిదేళ్ల కాలం మీద ప్రవర్తించిందన్న మాట.  

అన్నగారు మందలించినా ఆనందరావు చెడు  సహవాసాలు మానకపోవటం, ఆస్తి పంచమని గొడవపెట్టటం, భార్య కాపురానికి వస్తే దారికి వస్తాడేమోనని వసుమతిని కాపురానికి తీసుకొనిరావటం, చదువుకొన్న ఆడది మగనికి లొంగి ఉండదని ఆమెను పుస్తకాలకు, పుట్టింటికి కూడా దూరంచేసి అదుపుచేయడం, సతీధర్మాన్ని నమ్మి వసుమతి ఎదిరించకుండా జీవించటం , భర్త గుంటూరులో వేరుకాపురం పెట్టి అన్నగారి నుండి పంచుకువచ్చిన ఆస్తిని ఖర్చుపెడుతూ ,తనకళ్ళముందరే నాగుమణితో సంబంధాలు కొనసాగిస్తున్నా,  ఆమె స్వయంగా తనను ఎంత వేధిస్తున్నా, అవమానిస్తున్నా సహించి ఊరుకొనటం – వంటి ఘటనలతో నడిచే కథ ఆనందరావు నాగుమణితో రంగూన్ కు వెళ్లిపోవటంతో ఒక మలుపు తిరుగుతుంది. పుట్టింటికి చేరిన వసుమతి జబ్బుపడటం, భర్త నుండి రంగూన్ కు రమ్మన్న పిలుపుయితో వచ్చిన లేఖ తిరిగి తనలో ఊపిరిపోయగా ప్రయాణానికి సిద్ధంకావటం ,కానీ మళ్ళీ అతనినుండి రావద్దు అన్నలేఖ రావటంతో ఆగిపోవటం అన్నగారిదగ్గర ఉండిపోవటం ,చివరకు పశ్చాత్తాపంతో భార్యను వెతుక్కొంటూ రంగూన్ నుండి ఆనందరావు రావటంతో వసుమతి జీవితానికి ఊరట, సార్ధకత లభించటం నవలకు ముగింపు. 

విద్య యొక్క ప్రాధాన్యతను, ప్రత్యేకంగా స్త్రీల విద్యను గురించి నూతనభావాలకు ఈ నవలలో ప్రాతినిధ్యం వహించే పాత్ర రామచంద్రం. చెల్లలు చదువుగురించేకాదు, భార్య త్రిపుర సుందరి చదువు గురించి కూడా అతను శ్రద్ధ వహిస్తాడు. తాను పై చదువులకు మదరాసు వెళుతూ ఆమెకు మొల్ల రామాయణం, ఆంధ్రదేశ చరిత్ర, ఆరోగ్యశాస్త్రం, అబలా సచ్చరిత్ర రత్నమాల తీసుకొని వెళ్లి ఇస్తాడు. అసలు అతను  త్రిపుర ను పెళ్లాడింది ఆమె చెల్లెలి వలనే చదువుకున్న బాలిక అనే . వీరేశలింగం పంతులు కాలం నుండి స్త్రీవిద్యా ఉద్యమంలో ఆడపిల్లలకు ఏ స్థాయి చదువు ఉండాలి ? ఎంతవరకు వాళ్ళు చదువు కోవచ్చు? వంటి ప్రశ్నలు చర్చించబడుతూనే ఉన్నాయి. చదవను, వ్రాయను వస్తే సరి పోతుందని,పాక కళ ,గృహ నిర్వహణ, పిల్లలపెంపకం – వీటికి సంబంధించిన జ్ఞానం స్త్రీలకు సరిపోతుందని అన్నారు. ఇవన్నీ వింటూ చూస్తూ పెరిగిన వరలక్ష్మమ్మ స్త్రీవిద్య అంటే అంతే కాదని, లెక్కలు , చరిత్ర , భూగోళం వంటి జ్ఞాన విషయాలన్నీ పురుషులతో పాటు స్త్రీలకూ చదువుకోవలసినవే అన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకొన్నది. స్వయంగా తాను ఆ రకంగానే  సోదరుడి సానుభూతి సహాయసహకారాలతో ఇంటివద్దనే అనేక విషయాలు నేర్వగల్గింది. ఆ అభిప్రాయాలను, అనుభవాలను అన్నిటినీ ఈ నవలేతి వృత్తంలో భాగం చేసింది. అందుకే రాంచంద్రం తన చెల్లెలికి అన్ని రకాల పుస్తకాలు తెచ్చిచ్చి వాటిని ఆమెఅర్ధం చేసుకొన టానికి సహాయపడేవాడని కథను కల్పించింది. అంతేకాదు చదువు స్త్రీల సంస్కారంలో గొప్ప మార్పు తెస్తుందని కూడా వరలక్ష్మమ్మ నమ్మకం. అందుకనే చదువుకున్న వసుమతి, త్రిపురల సంస్కారాల కన్నా చదువులేని భాగ్యవంతుల ఇంటిబిడ్డ ,కృష్ణమూర్తి భార్య సంస్కారం సంకుచితంగా ఉంటుందని చూపిస్తూ అది కుటుంబంలో అశాంతికి కారణంకావటాన్ని చూపించి, దానికి పరిష్కారం అలాంటి వాళ్ళను పుస్తకాలు చదవటానికి అలవాటు పడేలా చేయటమేనని అంటుంది.  

త్రిపుర సుందరి రామచంద్రం   ప్రాణస్నేహితుడయిన కృష్ణమూర్తి చెల్లెలు. కట్నాలు ఇచ్చి పెళ్ళిచేయగల తాహతు లేక వాళ్ళు బాధపడుతున్నప్పుడు తాను ఆమెను పెళ్లిచేసుకొంటానని చెప్తాడు. ఆ సందర్భంలో పెళ్లిళ్లలో కట్నాల వ్యవస్థను వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. కట్నం ఇచ్చుకోలేని స్థితివల్ల ఆడపిల్లలకు పెళ్లి కాకపోవటం అనేది అతనిని బాధించినవిషయం. అందుకే కట్నమిచ్చుకొనలేని సామాన్యుల ఇంటిపిల్లను పెళ్లాడాలని అతను సంకల్పించాడు. తన స్నేహితుడి చెల్లెలు, చిన్నప్పటినుండి తనకుతెలిసిన పిల్ల , చదువుకున్నది కనుక  ఆమెను పెళ్లాడటం అతనికి ఇష్టమైంది. ఆ విషయంలో తల్లితో సంఘర్షించటానికి కూడా అతను వెనుకాడలేదు. అయితే కట్నం తీసుకొన కూడదు అనే సూత్రం సర్వులకూ ,సర్వకాలాల్లోనూ ఖచ్చితంగా పాటించవలసిన పిడి సూత్రం కాదన్న అవగాహన కూడా అతనికి ఉంది. కృష్ణమూర్తికి ఒక భాగ్యవంతులు కుటుంబం నుండి పెళ్లి సంబంధం వస్తే సామాన్యుల ఇంటిపిల్లను కట్నంలేకుండా చేసుకోవాలన్న తన ఆదర్శం గురించి కృష్ణమూర్తి విచారపడుతుంటే పైచదువులకు ఆర్ధిక వెసులుబాటు లేని కృష్ణమూర్తి పిల్లనిచ్చి చదువుచెప్పిస్తానని వచ్చిన సంబంధాన్ని,  వాళ్ళు ధనవంతులు అన్న కారణంగా తిరస్కరించటం సరైంది కాదంటాడు. భాగ్యవంతులు పిల్లలపై మనకేమన్న ద్వేషమా అని ప్రశ్నించి, ఏ స్త్రీలైనా ఉద్ధరించబడవలసిందే అని చెప్పి అతను ధనవంతుల ఇంటిబిడ్డను చేసుకొనటం నేరం ఎంతమాత్రం కాదని కృష్ణమూర్తి ని ఒప్పిస్తాడు. ఆ రకంగా ఆధునిక యువకులకు ఒక నమూనాగా రామచంద్రం పాత్రను తీర్చి దిద్దింది ఆమె. 

ఈ నవలలో వరలక్ష్మమ్మ సాహిత్యం యొక్క శక్తిని కూడా ఇతివృత్తంలో ఒక భాగం చేయటం విశేషం. ఆనందరావు చెడు సావాసాలు, పరస్త్రీ వ్యామోహం, భార్యపట్ల అతి నిర్లక్ష్యం , తిరస్కారం, పెద్దలపట్ల అలక్ష్యం,- వీటితో అందరినీ కాదనుకొని నాగుమణితో రంగూన్  వెళ్లిన ఆనందరావు కు ఆమె తనను వంచిస్తున్నదని అర్ధమయ్యే కొద్దీ భార్య కు చేసిన ద్రోహాన్ని గురించిన పశ్చాత్తాపం మొదలవుతుంది. ఉద్యోగం ఇచ్చి ఆదరించిన సుందరరావు సహవాసం, సంభాషణ అతనిని కాస్త కాస్త మెత్తపరుస్తున్నవేళ ‘హరిదాసి’ అనే పుస్తకం చదవటానికి దొరికిన అవకాశం అతనిలో మాలిన్యాలన్నీ కడిగేసుకొనటానికి కారణం కావటం గమనించవచ్చు. ఆ నవలలో కష్టాలు పడిన హరిదాసి స్థానంలో తనభార్యను చూచుకొని, తలచుకొని కన్నీరై కరిగిన ఆనందరావు లోపలి నుండి పరిశుద్ధుడై వసుమతిని కలవటానికి తక్షణం బయలుదేరి వచ్చాడు. సాహిత్యానికి మనిషిని ఉన్నత సంస్కారాల వైపు మార్చగల శక్తి ఉందని అనన్యంగా నిరూపించింది వరలక్ష్మమ్మ. 

స్త్రీ లోలుడైన భర్తవల్ల వసుమతి పడిన బాధలు, వాటిని ఎదుర్కొనటంలో ఆమె నేర్పరితనం, క్షమాశీల లక్షణం వస్తువుగా నడచిన ఈ నవల పాఠ్య గ్రంథ గౌరవాన్ని పొందింది. అయితే శోభావతి నవలలో శోభావతికి లేని ఆధునిక విద్య ఈ నవలలో వసుమతికి ఉన్నప్పటికీ భర్తపట్ల ఒద్దికలో,దాసభావం లో, పతివ్రతా ధర్మ నిర్వహణలో ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రవర్తించటం గమనించవచ్చు. ఆ నవలలో పట్టాభి అయినా ఈ నవలలో ఆనందరావు అయినా మారటం అన్న దానిలో ఈ స్త్రీలు ఇద్దరికీ ఏ ప్రమేయమూ లేదు. వాళ్ళు మారటం కేవలం వీళ్ళ అదృష్టం మీద ఆధారపడినదే కానీ మరొకటి కాదు. తమప్రవర్తనతో వాళ్ళు ఎంత హింసించినా విసుక్కోకుండా,నిందించకుండా, తిరస్కరించ కుండా  ఓర్పుతో ఎదురుచూడటమే వాళ్ళు చేసిన పని. అది పతివ్రతల లక్షణం. ఆధునిక నవల కూడా అందుకే ఉపయోగించబడటం, ఇంతవరకు స్త్రీలను నియంత్రించటానికి పురుష ధర్మశాస్త్రాలు చేసిన పని ఇప్పుడు స్త్రీలకోసం స్త్రీలే చేయటం చూస్తాం. స్త్రీల ద్వారా స్త్రీల పై హింసకు స్త్రీల సమ్మతిని సాధించి పెట్టె పనిలో అటు పిరాట్టమ్మ అయినా ఇటు వరలక్ష్మమ్మ అయినా తమకు తెలియకుండానే సాధనాలు అయినారు. పితృస్వామ్యపు మాయాజాలం అంటే ఇదే.    

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.