మైనా
-వసుధారాణి
రచయిత :- శీలావీర్రాజు
1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం లభించింది.
వెలుగు రేఖలు
కాంతిపూలు
కరుణించని దేవత
ఆయన ఇతర నవలలు.
పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను రచించారు.
కాలానికి ఇటూ అటూ (వ్యాస సంపుటి)
శిల్పరేఖ (లేపాక్షి రేఖా చిత్రాలు)
శీలావీర్రాజు చిత్రకార్తీయం (వర్ణ చిత్రాల ఆల్బమ్).
ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయివుండటం అరుదైన విషయం.సాహిత్యం,చిత్రకళ ఈ రెండిటిలోనూ సమానంగా మెప్పించిన సృజనకారుడు శీలావీర్రాజు గారు. సాహిత్యంలో కవిత్వం,కథా రచన, నవలా ప్రక్రియ మూడు విధాలా పేరు గడించారు. అలాగే చిత్రకళ రెండు దశాబ్దాల పాటు ఆయన ముఖచిత్రం గీయని పుస్తకం లేదు.సౌమ్యత,వివాదరహితుడుగా ఉండటం ఆయన వ్యక్తిత్వం.
ప్రధమ ముద్రణ 1965 ద్వితీయ ముద్రణ 1969 లో నేను పుట్టక ముందు అచ్చయిన పుస్తకం ‘మైనా’.నవల చదివే ముందు అంటూ ఆయనే రాసుకున్న ముందుమాట ,ఈ నవలని ఎలా అర్థం చేసుకోవాలో,నవలకు వర్ణచిత్రానికీ ఉన్నపోలికని ,కథకు ,నవలకు ఉన్న బేధాన్ని తెలిపేలా వ్రాసారు. నవలలో ఏమి ఉండబోతోందో ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో కూడా చెప్పారు.ఇలాంటి ముందుమాటను నేను ఇదివరలో ఎప్పుడూ చదవలేదు.
నట్టినడి సముద్రంలో చెలరేగిన తుఫానులో చిక్కుకున్న ఓడ నుంచి కథ మొదలవుతుంది. తుఫాను వర్ణన,సంక్లిష్టమైన సమయాన,ఇంక బతకడం కల్ల అనుకున్నప్పుడు మనుషుల మదిలో చెలరేగే భావాలూ , కల్లోల కడలి వర్ణన అద్భుతంగా ఉంటుంది.
కోస్తా తీరం నుంచి రంగూన్ వ్యాపారం జరిగే రోజుల్లో తిరుపతయ్య బట్టల బేళ్లు కాకినాడ నుంచి బర్మా లోని రంగూన్ కి తీసుకువెళ్ళి అమ్మకం చేసేవాడు.అక్కడి నుంచి బియ్యము, పంచదార ఇక్కడికి. కాకినాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం,భీమునిపట్నం,కళింగపట్నం,బారువ ,గోపాలపురం రేవుల మీదుగా సుమారు ఆరురోజులు ప్రయాణం చేసి రంగూన్ చేరేదట ఓడ.1935 నాటికి బర్మాలో రెందు లక్షల మంది ఆంధ్రులు ఉన్నారట.అక్కడి ఆంధ్రులను ‘కోరంగీ’లనే వారట.బర్మా బ్రిటీషువారి స్వాధీనం అయిన తర్వాత ఆ దేశానికి తెలుగువారు మొట్టమొదట గోదావరి ప్రాంతంలోని ‘కోరంగి’రేవు పట్టణం నుండి వచ్చారట .ఆ కారణం వల్ల వారికి ఆపేరు వచ్చివుండాలి.
వ్యాపారనిమిత్తమై సరుకువేసుకెళ్లే రంగం బావలు ఆరునెలలు అక్కడే వుండి వీరిసరుకు అక్కడ అమ్మి అక్కడినుంచి ఇక్కడికి ఇంకో సరుకుతో వచ్చి.రూపాయికి రూపాయి తీసే పనిలో ఉండేవారు.ఏళ్లకొలది పరసీమల్లో ఉండి నిర్దాక్షిణ్యంగా భార్యల్ని ఆలోచనలతోనే బతకమని,మనసు పుట్టినప్పుడు లాభాలని వెంటబెట్టుకుని దిగే దొరబాబులు అంటూ రంగం వ్యాపారం వెనుక కన్నీటి వ్యధలను, భార్యల త్యాగాలను రచయిత మనకు తుఫాను నేపథ్యంలోనే చూపిస్తారు.
ఇంటిదగ్గర నిండుచులాలు భార్య గుర్తుకు వస్తుంది తిరుపతయ్యకు ,బొడ్లోదోపిన సంచిలోంచి గుప్పెడు వెండిరూపాయలు నీళ్లలోకి విసిరి తమ ఊరిలో నాగుల్ మీరా సాయిబాబా అని రాసివుండే ఓ చిన్న గుడి లోని దేవుడిని గుర్తుచేసుకుని ‘తండ్రీ ఈ ఆపద నుంచి బయటపడి నాభార్య క్షేమంగా ప్రసవిస్తే నీ పేరు పెట్టకుంటాను ఆబిడ్డకి ‘ అంటూ మొక్కుకుంటాడు.
తుఫాను తప్పిపోయినా రెండవ ప్రపంచ యుద్ధం తిరుపతయ్యను వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ వైమానిక దాడులు బర్మామీద భయోత్పాతాన్ని సృష్టిస్తే , దగ్గరున్న డబ్బుతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమందితో కలిసి పారిపోయి వస్తుండగా.లక్ష్మణ్ గౌడ్ అనే ఒరిస్సా వాడు సహ బాటసారి అవుతాడు అతనికి ,అలా కొన్నిరోజులు అందరూ కలిసి ఆకలిదప్పులు తట్టుకుంటూ ప్రయాణం చేస్తుంటారు.ఒకరోజు ఉదయం లేచేసరికి అందరూ వెళ్ళిపోయి వుంటారు .ఆ కొండలు రాళ్ళమధ్య లక్ష్మణ్ గౌడ్, తిరుపతయ్య ఇద్దరే. తిరుపతయ్య డబ్బుల పెట్టె కూడా వెళ్ళిపోతుంది.లక్ష్మణ్ గౌడ్ విపరీతమైన ఫ్లూ జ్వరంతో ప్రాణాలు కళ్ళలో పెట్టుకుని.
కఠినాత్ముడైన తిరుపతయ్యలో లోపల తనకే తెలియని మానవత్వం, లక్ష్మణ్ ని అలా వదిలేయలేక,డబ్బుపోయిన విచారాన్ని కూడా వదిలేసి అతన్ని భుజంపై వేసుకుని కొన్ని మైళ్ళు నడుస్తాడు.లక్ష్మణ్ పెంచుకునే మైనగోరు అరుస్తూ లక్ష్మణ్ భుజం పై వాలటం అన్న చోట శీలావీర్రాజు గారు చెప్పదలుచుకున్న కథ మొదలవుతుంది.
లక్ష్మణ్ గౌడ్ ని తీవ్రమైన జ్వరం వల్ల చనిపోతాడు. ఎలాగోలాగా ఇంటికి చేరిన తిరుపతయ్య, మైనగోరుని పంజరంలో పెట్టితీసుకొస్తాడు. సంద్రంలో గిరవాటు వేసిన వెండి నాణాల వల్ల క్షేమంగా పుట్టిన సాయి కి ,తనకంటే ముందు పుట్టిన అన్నయ్య,చెల్లి , అమ్మ ,తండ్రి తిరుపతయ్య.
కథానాయకుడు తిరుపతయ్య కాదు సాయి.మొరటువాడయిన తిరుపతయ్య రంగం వ్యాపార నష్టాన్ని పూడ్చుకోవటం కోసం ఏదేదో చేసి ఇంకా నష్టాల పాలవుతాడు.స్వచ్ఛమైన గాలి ,నీరు,నేస్తాలు, మైనగోరు ఇది సాయి బాల్యం.తన చెల్లి,మేనమామ కూతురు చిట్టి.తండ్రి క్రూరత్వం ,స్వార్ధం మూలంగా తల్లి పడే కష్టాలను చూసి చిన్నతనం నుంచే తల్లిని ఆదుకోవాలనే తపనతో ఉంటాడు సాయి. నీలకంఠం అనే స్నేహితుడు మిత్రులతో పందెంకాసి సమాధి మీద నిమ్మకాయలకై వెళ్లి ప్రమాదవశాత్తు మరణించటం,మైనగోరుని నల్లపిల్లి నోటకరుచుకుని తీసుకువెళ్లి తినేయటం సాయి కి నిరంతరం గుర్తుకు వచ్చి బాధించే అంశాలుగా అవుతాయి.
తల్లికి చేయూత ఇవ్వటం కోసం నేతపని చేసి కూలీ తేవటం, తండ్రి చేరతీసిన స్త్రీ తోటలో కొబ్బరికాయలు దొంగతనం చేసి వాటిని అమ్మి తల్లికి డబ్బు ఇవ్వటం.తండ్రి చేతుల్లో తన్నులు తినటం.సాయిలో ఒకలాంటి పట్టుదలను పెంచుతాయి.మేనమామ కూతురు నీ భార్యే అని వేళాకోళం ఆడే మామయ్య,అత్తయ్య వల్ల చిట్టి అంటే చిన్నతనంలో తెలియని ఆప్యాయత పెంచుకుంటాడు.
అన్నయ్య పనికి వెళుతున్నా ఇంటి పట్ల బాధ్యతగా వుండకపోవటం ,తండ్రి ఎక్కువ సమయం ఆ వేరే స్త్రీ తోనే గడపటం వీటివల్ల తల్లికి సంసారం నడిపించడం కష్టమయిపోతుందని తెలిసి చదువును ఆపి కూలికి వెళ్లటం,కొన్నిరోజులు చదువుకోవడం ఇలా చాలీ చాలని చదువు చదువుకుంటాడు.
తండ్రి అకారణంగా చూపించే కోపం నుంచి దూరంగా వెళ్లటం కోసం ఊరిలో తెలిసిన ఒక మిత్రుని సాయంతో బెంగుళూరు వెళ్లి కొన్ని రోజులు మిలటరీ ట్రైనింగ్ లో ఉంటాడు.అక్కడ నిలువలేక మళ్లీ వెనక్కి వచ్చేస్తాడు.ఊరులో చేసేందుకు పని ఏమీ లేకపోవటం ,యువకులు అందరూ ఖాళీగా ఉండటం ఒకప్పటి ,ఇప్పటికి కూడా ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో కొద్దిగా చదువుకున్న యువకుల నిరుద్యోగ సమస్య ఏమిటో తెలుపుతుంది.
అన్నయ్య ,ఊరిలోని ఇంకొంత మంది యువకులతో కలిసి నిజామాబాద్ పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లటం.సాయి జీవితంలో సరికొత్త ప్రయాణం.కోనసీమ నుంచి కొండలు,గుట్టలు,ఎర్రని చేలూ ఉన్న తెలంగాణా ప్రాంతం సాయికి కొత్తగానూ వింతగానూ తోస్తుంది.పోలీస్ ట్రైనింగ్ లో పరిచయం అయిన పై ఆఫీసర్ ,అతని కూతురు రాధ చూపిన నిష్కల్మషమైన ఆదరణ సాయికి ఒక మరపురాని అనుభవం.
ట్రైనింగ్ తరువాత సాయిని,చంద్రం అనే మరో యువకుడిని డి.ఎస్.పికి బాడీగార్డులు గా వేస్తారు.సాయిలోని చురుకుతనం డి .ఎస్. పిని ఆకర్షిస్తుంది. అడవిలో ఎన్నో కమ్యూనిస్టు వ్యతిరేక ఆపరేషన్లు కలిసి చేస్తారు. అయితే ఇద్దరు వ్యక్తుల సాన్నిహిత్యానికి హఠాత్తుగా అధికారం, దర్పం అడ్డుగా వచ్చి దూరం అవుతారు.
సాయి ఒక అద్దె ఇంట్లోకి మారటం మొత్తం సాయి జీవితానికి,కథకు కీలక మైన మలుపు.ఓ మార్వాడీ సేట్ ఇంట్లో అద్దెకు దిగిన సాయి తన మంచితనం వలన అనతి కాలంలోనే ఆ కుటుంబానికి దగ్గరవుతాడు.సేట్ జీ చాలా మంచి వ్యక్తి వ్యాపారనిమిత్తం ఎక్కువ రోజులు బయట ఊళ్లలోనే తిరుగుతుంటాడు.అతని ముసలి తల్లి,రెండో పెళ్లి అవ్వటంవలన వయసులో చిన్నదైన భార్య.ఇదీ సేట్ జీ కుటుంబం.వారింట ఫలహారం,తేనీరు,భోజనం సమస్తానికి సాయి అర్హుడు అవుతాడు ఒకరోజు రాత్రి ముసలావిడ ప్రాణం మీదకు వచ్చినప్పుడు డాక్టరుని పిలుచుకువచ్చి ఆవిడ ప్రాణం కాపాడినందుకు. ఆ రాత్రే అతను అస్తమానము ముసుగులోపల వుండే సేట్ జీ భార్య ముసియాను చూస్తాడు.ఆమె అందానికి అబ్బుర పడతాడు.
ఆ సంఘటన తర్వాత ముసియా అతనికి కొద్ది కొద్దిగా దగ్గరవ్వటం మొదలు పెడుతుంది.నిలువరించలేని ఇద్దరు మనుషులు సాంగత్యం శీలా వీర్రాజు గారు ఇక్కడ కథ నడిపిన తీరు అమోఘం . మనమూ తప్పొప్పుల తీరాలు దాటి సాయి భావోద్వేగంలో,ముసియా అవసరంలో భాగస్వాములం అయిపోతాం.సాధారణంగా ఇలాంటి బంధం ఎలా చెప్పినా సానుకూలత కలగటం కష్టంగా ఉంటుంది.అలాంటిది ఎంతో సహజంగా ఈ బంధం ఎందుకు వప్పుకుంటామో రచయిత సున్నిత్వం కావచ్చు,సాయిని,ముసియాను ఎవరినీ తక్కువ చేయకుండా చెప్పిన తీరు కావచ్చు.
ముసియా గర్భవతి అవుతుంది.డి.ఎస్.పి తో గొడవ వల్ల సాయికి హైద్రాబాద్ ట్రాన్స్ఫర్ అవుతుంది.సేట్ జీ వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తాను ఉండిపొమ్మంటాడు.ముసియా వెళ్లవద్దని ప్రాధేయపడుతుంది.నగలు ,డబ్బు తీసుకుని వచ్చి ఒకరాత్రి పూట వెళ్లిపోదాం పదమంటుంది. సేట్ జీ మంచితనం సాయిని ఆ పనినుంచి ఆపుతుంది.ముసియాకు వీడ్కోలు చెప్పే సంఘటన మనుషుల జీవితాలు వారి చేతుల్లో ఎలా ఉండవో చెప్పే సంఘటన.తండ్రి తిరుపతయ్య ని పరాయి స్త్రీ తో సంబంధం కలిగి ఉన్నాడని అసహ్యించుకున్న సాయి. ఇంకొకరి భార్యతో సంబంధాన్ని ఏర్పరుచుకోవటం.తిరుపతయ్య బంధం కోపాన్ని,సాయి బంధం ఉదాత్తతని కలిగించడం రచయిత చిత్రీకరణ అనే కన్నా జీవితం కొన్నింటిని అనివార్యం బహునేర్పుగా చేస్తుంది అనిపిస్తుంది.
హైద్రాబాద్ చేరిన సాయి ముసియా జ్ఞాపకాలను పారదోలటానికి ఎంతగానో కష్ట పడాల్సి వస్తుంది.ఎన్నోమార్లు తిరిగి ఆమె చెంతకు వెళ్లాలనుకుని .ఆ స్నేహాన్ని హత్య చేయటమే న్యాయం అనుకుంటాడు.
నిజామాబాద్ లో ఉన్నప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బులు పంపేవాడు.తన ఖర్చులు ముసియా చూసుకునేది.సేట్ జీ ఖరీదైన బట్టలు,కానుకలు ఇస్తుండేవాడు.హైదరాబాద్ వచ్చాక డబ్బు జాగర్తగా వాడవలసి వచ్చేది.తాయారమ్మ ఇంట్లో అద్దెకు చేరిన సాయి.చిత్రమైన పరిస్థితులలో హఫీజా అనే మైనర్ బాలికను చూస్తాడు.తాయారమ్మ ఇంట్లో జాజిపందిరిపై పూలు కోసుకోవటానికి వచ్చే హఫీజా అందం,అమాయకత్వం తన పట్ల ఆమె చూపే ఇష్టం సాయిలో కలవరం కలిగిస్తాయి.ఆమెలోని లేతమనసును చూస్తాడు .కానీ ఆమెపట్ల ఎటువంటి భావనలు పెట్టుకొడు సున్నితమైన జాజిపూవుని చూసిన సంతోషం మాత్రమే.హఫీజా తనతో చూపే చనువుని ఎలా అర్థం చేసుకోవాలో సతమతవుతున్నంతలో ఊరి నించి మరదలు చిట్టి. ఉరఫ్ కమల నుంచి ఉత్తరం.మామయ్య సంబంధాలు చూస్తున్నారు.నువ్వు నన్ను చేసుకుంటానని చెప్పకపోతే నీకు వేరే సంబంధం ఖాయం చేస్తారు.నేను నిన్నే పెళ్లాడతాను బావా అంటూ.
ఆరుసంవత్సరాల తర్వాత ఊరు వెళ్లిన సాయి మరదలు కమలని పెళ్లి చేసుకుని హైద్రాబాద్ తీసుకువస్తాడు.కమలకి హఫీజా నచ్చదు.సాయి పై అనుమానం కూడా.సాయి ఎంతో సంయమనం పాటిస్తాడు.పల్లెటూరులో అందరి మధ్య పెరిగిన కమలకు ఒక్క పని పూర్తిగా రాదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తున్నట్లే ఉండేది.పెరిగిన ఖర్చులు,కమల గర్భవతి కావటం .సాయి ఆమెకు పనులలో సాయం చేస్తూ జాగర్తగా చూసుకుంటాడు.కమల పురిటి వెళ్ళినప్పుడు హఫీజా కుటుంబం పాకిస్థాన్ వెళ్లి పోతుంది.ఆ వెళ్లే మధ్యలో హఫీజా పారిపోయిందని, ఆమె వేరే వారి వల్ల గర్భవతి అని తెలుస్తుంది.హఫీజా అలా చేయటం సాయికి మానవ సంబంధాలపైననే ఒకలాంటి నిర్లిప్తతని కలిగిస్తుంది.
ముసియాను, పిల్లవాడిని చూడాలని వెళితే వారి కుటుంబం అక్కడి నుంచి తరలి పోయిందని .పిల్లవాడు మృతి చెందాడని తెలుస్తుంది.కమల కూడా మృతశిశువును ప్రసవిస్తుంది.కమల తిరిగి హైదరాబాద్ వచ్చాక సాయి ,కమలల మధ్య మెల్లగా గాఢమైన బంధం ఒకటి ఏర్పడుతుంది.
కమల మళ్లీ గర్భవతై కొడుకును కంటుంది.మెల్లగా జీవితం మీద ఆశ ,ఆశయం మొదలవుతాయి ఇద్దరికీ.డబ్బుతాలూకూ లేమిలోనే ఉన్నదానితో సంతృప్తిగా జీవనం సాగిస్తున్న సమయంలో మరో ఆనందకరమైన విషయం కమల మళ్లీ నెల తప్పుతుంది. ఒకరోజు డ్యూటీలో ఉండగా సాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. విపరీతమైన జ్వరం.TB అని తెలుస్తుంది.తీవ్రంగా కూడా ఉంది అని పరీక్షలో తేలుతుంది.కమలను ,పిల్లవాడిని ఊరికి పంపి మెడికల్ లీవ్ పై సానిటోరియం లో చేరతాడు.
జబ్బు తగ్గి ఇళ్లకు ఆనందంగా వెళ్ళేవాళ్ళు,ఇక్కడి నుంచే మృత్యువును చేరేవారు రకరకాల మనుషులను చూస్తాడు.అందరిలోకి మౌనంగా, భిన్నంగా వుండే రచయిత అతనికి దగ్గరవుతాడు.ఇద్దరూ కలిసి పాటలు పాడుకోవటం,గంటలు గంటలు మాట్లాడుకోవడం ఇలా ఉండగా.రచయితకు జబ్బు తగ్గటం వల్ల అతను డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతాడు .మళ్లీ సాయిని ఒంటరితనం భయం చుట్టుముడతాయి.
థెరిజా అన్న నర్సు,ఆవిడ సేవాభావం చూసి ఆమెతో చెలిమిచేస్తాడు.ఆవిడలోని మానవత్వానికి కరుడు కట్టిన సాయి నెమ్మదిగా కరుగుతాడు. వీరిద్దరి మధ్య సంభాషణలు,సంఘటనలు రచయిత అత్యంత సహజంగా , మనసుకు హత్తుకునేలా వ్రాసారు.నవల మొత్తంలో ముసియా తో సాయి గడిపిన కాలం,ఆసుపత్రిలో థెరిజా తో కలిసి ఉన్న ఘటనలు అత్యద్భుతమైన మానవీయ కోణాలు.పొరలు పొరలుగా మనుషుల్లో వివిధ కారణాలకు పేరుకున్న కాఠిన్యం, అవి తొలగిపోయే తీరు.నవల మొత్తం ఇలా రచయిత కాఠిన్యం తోలు తీసే పనిలోనే వుంటారు.
జబ్బు మొత్తం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారిన సాయి ఊరు వెళ్లేందుకు రైలు ఎక్కటానికి స్టేషన్ కు రావటం ఆఖరి ఘట్టం.మిత్రులు అందరూ వస్తారు.రచయిత మిత్రుడు కూడా, అతనికి సాయి చెపుతాడు కమల ప్రసవించిందని కూతురు పుట్టిందని పేరు ఏమి పెడుతున్నావ్ అని ప్రశ్నిస్తే “ మైనా” అంటాడు.
తిరుపతయ్య లోని మానవత్వం మేల్కొన్నప్పుడు వచ్చి చేరిన మైనా, మళ్లీ సాయి మనిషిగా విజయుడైనప్పుడు కూతురి రూపంలో అతని చెంత చేరింది.ఈ మైనా మన అందరిలోనూ ఉంది. మనం పెంచి పోషించాలి అంతే.
సాయి కథను రాయాలి అని రచయిత అనుకోవటం .ఆ రచయిత నేనే అంటూ ముగించటం కథలో ఇంకో కోసమెరుపు.
మైనా మనలోని మానవబంధాల,నైజాల, అవసరాల,ఆలోచనల,పరివర్తనల, బలహీనతల,బలాల సమాహారం.విశ్లేషణకి క్లిష్టమైన నవల. శీలా వీర్రాజు గారికి అభినందనలు.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.