ప్రమద

టోనీ మారిసన్

 

ఎ.వి. రమణమూర్తి

 

టోనీ మారిసన్ రాసిన కథ- రెసిటటిఫ్ (1983)

ఈ కథలోని గమ్మత్తైన విషయం ఏమిటంటే, కథ బొత్తిగా అర్థం కాకుండా పోదు; అలాగని పూర్తిగానూ అర్థం అయినట్టు ఉండదు. ఎక్కడో ఒక అసౌకర్యపు మలుపు దగ్గర మనల్ని వదిలేసే ఈ  కథలోని అంతరార్థాల ఉనికిని గమనించి, వాటిగురించి ఆలోచించడం కోసం దీనిని చదవాలి. 1987లో ప్రచురించబడిన ‘Beloved’ నవలకి ముందు,1983లో టోనీ మారిసన్ రాసిన కథ ఇది. 2015లో ది న్యూయార్కర్ పత్రిక టోనీ మారిసన్‌దే ‘Sweetness’ అనే మరో కథని ప్రచురించారు కానీ, అది నిజానికి స్వతంత్రమైన కథ కాదు. ఆవిడ రాసిన ‘God Help the Child’ అనే నవలలోని మూడు విడి విడి అధ్యాయాలు మాత్రమే.  

ఆ రకంగా ఆవిడ రాసిన (లేదా, ప్రచురింపబడిన) ఏకైక కథ  – రెసిటటిఫ్. ఈ పదం ఫ్రెంచ్ భాషనుంచి వచ్చింది. సంగీతానికీ, వచనానికీ మధ్యగా సాగే కథన ప్రక్రియని రెసిటటిఫ్ అని వ్యవహరిస్తారు. 1983లో Amiri Baraka, Amina Baraka సంయుక్తంగా సంపాదకత్వం వహించిన ‘Confirmation: An Anthology of African American Women’ అనే సంకలనంలో ఈ కథ ప్రచురించబడింది. ఎక్కువ ప్రచారానికి నోచుకోకపోయినా, దీనిమీద చర్చలు మాత్రం చాలానే జరిగాయి. నాకున్న పరిమిత వనరులలోనే ఈ కథకి సంబంధించిన ఒక పది వ్యాసాల వరకూ చదివివుంటాను. ఇక మనకి తెలియని ఎంత చర్చ అక్కడ అమెరికాలో జరిగివుండవచ్చో ఊహించడం కష్టం కాదు. 

టోనీ మారిసన్ కథ కాబట్టి, ఇది బ్లాక్-వైట్ సమస్య మీద రాసిన కథ అయివుండవచ్చు అని మీరు ఊహిస్తే, మీరు కరెక్టే. అంత పెద్ద సమస్యని, ఒక కథ రూపంలో, ఆ సమస్య తాలూకు చారిత్రాత్మక విశేషాలతో సహా కథలో ప్రవేశపెట్టిన పద్ధతి ఈ కథలోని గొప్పదనంలోని అతితక్కువ భాగం. కథని ఎంత ఎనిగ్మాటిక్‌గా రాసారో గమనిస్తే, కథని చదవడం ముగిసాక మీకో విషయం అర్థం అవుతుంది. కానీ, ఆ విషయం ముందే చెప్పేస్తే, కథ పూర్తయ్యాక నేను పడ్డ ఇబ్బందే మీరూ పడాల్సి వస్తుంది. అందుకని, ముందు కథని ఈ లింక్‌లో చదవండి:

bit.ly/tm-recitatif

పై లింక్‌లో కథని చదివేసినవారూ, తెలుగులో చదవడం సౌలభ్యంగా ఉంటుందనుకునేవారూ, ‘స్పాయిలర్స్’ ఉన్నా మరేమీ పర్వాలేదనుకునేవారూ ఇక ఈ క్రింది కథాసంగ్రహాన్ని చదవొచ్చు. ఇది కథ ఏమిటీ అనేది స్థూలంగా చెప్పడమే కాబట్టి, కథలో ఉండే చాలా సున్నితమైన అంశాలూ (nuances), అంతరార్థాలూ (sub-text) కచ్చితంగా ఇందులో ఉండవు. ఇది కేవలం ఒక కథాపరిచయం మాత్రమే…

***

అది ప్రభుత్వం నిర్వహించే ఒక షెల్టర్ హోమ్. అక్కడ అనాథ పిల్లల్నే కాకుండా, ఏవైనా సమస్యలు ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లపాటు తమ పిల్లల్ని అక్కడ ఉంచగల సౌకర్యం కూడా ఉంది. కథ ఈ షెల్టర్‌ వర్ణనతో, ట్వైలా అనే అమ్మాయి రాబెర్టా అనే ఇంకో అమ్మాయిని కలుసుకోవడంతో ప్రారంభం అవుతుంది. ఇద్దరికీ సుమారు ఎనిమిదేళ్ల వయసు. రాబెర్టా లాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలనీ, వాళ్లు తలస్నానం కూడా చేయని మనుషులనీ, వాళ్లదగ్గర ఓ వింత వాసన వస్తూంటూందనీ తన తల్లి చెప్పటం ట్వైలా గుర్తుచేసుకుంటుంది. ఈ కారణం వల్ల, రాబెర్టాకి షెల్టర్ వాళ్లు తన గదిలోనే వసతి కల్పించినప్పుడు మొదట్లో ట్వైలా అభ్యంతరపడుతుంది. ఆనక రాబెర్టాతో కొంత పరిచయం యేర్పడ్డాక సర్దుకుపోతుంది. మిగతా పిల్లలతో ఎక్కువగా కలవని వీళ్లిద్దరూ ఒక జట్టుగా కలిసి తిరుగుతుంటారు. అక్కడ ఉన్న వయసొచ్చిన అమ్మాయిలంటే వీళ్లిద్దరికీ భయం కూడా. అసలు వీళ్లిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ట్వైలా వాళ్ల అమ్మకి ‘రాత్రంతా డాన్సులు చేయడం’ తోటే సరిపోతుందట. రాబెర్టా వాళ్ల అమ్మకేమో అనారోగ్యం (‘My mother danced all night and Roberta’s was sick.’).

ట్వైలా ఆ షెల్టర్ హోమ్‌లో ఉన్న తోటని గుర్తుచేసుకుంటుంది. ఇప్పటికీ అది తన జ్ఞాపకాల్లో ప్రముఖంగా ఉండటమే కాకుండా, ఆ జ్ఞాపకానికి ఒక ప్రత్యేకమైన చిత్రం కూడా మనసు పొరల్లో నిక్షిప్తమైపోయి ఉంది. ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటనని ఇప్పటికీ తనకి గుర్తే! అక్కడి హోమ్‌లోని కిచెన్‌లో పనిచేసే మాగీ అనే అమ్మాయి – మూగ, అవిటి అమ్మాయి; కాళ్లుకూడా వంకర తిరిగిపోయి ఉంటాయి – ఆ తోటలో కిందపడిపోయినప్పుడు, పెద్ద పెద్ద అమ్మాయిలందరూ అవహేళనగా నవ్వడమూ, తనూ రాబెర్టా మాత్రం మౌనంగా ఉండిపోవడమూ తనకి ఇప్పటికీ గుర్తుండిపోయింది. పడిపోయిన మాగీకి ఎలాంటి సహాయమూ చేయలేదని కూడా గుర్తుండిపోయింది. పడిపోయిన మాగీ చుట్టూ మూగినవాళ్లంతా ఆ అమ్మాయిని ఏడిపిస్తూ నానామాటలూ అనడం, వీళ్లు మౌనంగా వాటిని వినడం – ఇప్పుడు తలుచుకుంటే ట్వైలాకి సిగ్గేస్తుంది. 

ఇంతలో ఓ ఆదివారంనాడు, తమ పిల్లల్ని కలుసుకోవడం కోసం ఈ ఇద్దరి పిల్లల తల్లులూ వస్తారు. పిల్లలు ఉత్సాహంగా మంచి డ్రస్సులు వేసుకుని చర్చ్ దగ్గర కలవడానికి తయారవుతారు. చాలా మామూలుగా ఉండే ఒక గ్రీన్ డ్రస్ వేసుకుని వచ్చిన తన తల్లిని చూసి ట్వైలాకి ఇబ్బందిగా అనిపించినా ఆవిడ చాలా అందంగా ఉన్నందుకు మాత్రం గర్వంగా ఫీలవుతుంది. ఇంకోపక్క, రాబెర్టా వాళ్ల అమ్మని చూస్తే, ఆవిడ మెడలో ఓ పెద్ద క్రాస్ ఉన్న గొలుసుతో, చేతిలో ఒక పెద్ద బైబిల్‌తో కనిపిస్తూ ఉంటుంది. తన తల్లిని రాబెర్టా పరిచయం చేసినప్పుడు, ట్వైలా వాళ్ల అమ్మ హాండ్‌షేక్‌ కోసం చాచిన చేతిని రాబెర్టా వాళ్ల అమ్మ పట్టించుకోదు. ఈ ఘటనతో చకితురాలైన ట్వైలా వాళ్ల అమ్మ  ఆవిడని ఉద్దేశించి ‘దట్ బిచ్….’ అనడమే కాకుండా, చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నంతసేపూ ఏదో ఒకటి గొణుక్కుంటూ ఉండటం ట్వైలాకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతాచేసి, రాబెర్టా వాళ్ల అమ్మ తన కూతురికోసం రకరకాల తినుబండారాలు తీసుకురాగా, ట్వైలా వాళ్ల అమ్మమాత్రం ఉత్త ఖాళీ చేతుల్తో వచ్చింది. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నదేదో తినడం- అంతే!

అప్పుడు ఆ హోమ్‌లో కొన్నాళ్లుండి ఆ తర్వాత విడిపోయిన పిల్లలిద్దరూ చాలా ఏళ్లు కలుసుకోలేదు. ఆ తర్వాతెప్పుడో, ట్వైలా వెయిట్రెస్‌గా పనిచేస్తున్న హోటల్‌కి – అప్పటికి తన వయసు బహుశా పదహారు, పదిహేడేళ్లు – రాబెర్టా వస్తుంది, పక్కన ఇద్దరు అబ్బాయిలతో. వాళ్లందరూ జిమీ హెండ్రిక్స్‌ని చూడటానికి వెళ్తున్నట్టు రాబెర్టా చెబుతుంది కానీ, ఆ జిమీ హెండ్రిక్స్ ఎవరో ట్వైలాకి అస్సలు తెలీదు (అతను ఆఫ్రికన్- అమెరికన్ మూలాలున్న ప్రముఖ గిటారిస్ట్, గాయకుడు, పాటల రచయితా). హెండ్రిక్స్ తెలీదా అన్నట్టు ఎగతాళి చేస్తుంది రాబెర్టా. ట్వైలా మాత్రం రాబెర్టా వాళ్ల అమ్మ గురించి అడుగుతుంది. తన తల్లి మాత్రం ఎప్పట్లానే అందంగా, బొమ్మలాగా ఉందని చెప్పుకుని మురిసిపోతుంది. 

అ తర్వాత కథ జరిగేది ట్వైలాకి ఇరవై ఎనిమిదేళ్ల వయసప్పుడు.  అప్పటికి ట్వైలాకి పెళ్లయిపోయింది. భర్త ఒక వర్కింగ్ క్లాస్‌కి చెందిన వాడు. న్యూబర్గ్‌లో, ఒక సాధారణమైన మధ్యతరగతి ప్రాంతంలో వాళ్ల కాపురం. ఆ పక్కనే ఉన్న ఒక మాల్‌కి వెళ్లినప్పుడు అక్కడ రాబెర్టా మళ్లీ కనిపిస్తుంది. ఇప్పుడు తను కూడా వివాహితే; మంచి సంపన్నుడయిన భర్తా, ఓ పెద్ద కారూ, దానికో డ్రైవరూ. ఈసారి మాత్రం రాబెర్టా ఆప్యాయంగా మాట్లాడి, కాఫీ తాగొద్దాం పద అంటుంది. ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ మాటల మధ్యలో, పాతకాలం నాటి షెల్టర్‌లో ఉన్నప్పటి రోజుల్లోని మాగీ ప్రస్తావన వస్తుంది. ఆ రోజు, ఆ తోటలో నిజానికి మాగీ తనంతట తను పడిపోలేదనీ, ఆ పెద్ద అమ్మాయిలు మాగీని తోసేసారనీ రాబెర్టా అంటుంది. జరిగిన విషయం ఇప్పడు ట్వైలాకి పూర్తిగా గుర్తులేక, గుర్తురాక, కొద్దిగా ఇబ్బంది ఫీలవుతుంది. అది సరే, ఇంతకుమునుపు మనం కలిసినప్పుడు ఎందుకంత ముభావంగా ఉన్నావని ట్వైలా అడగ్గా, రాబెర్టా ‘నీకు తెలుసు కదా ఆ రోజులు ఎలా ఉండేవో? నలుపు, తెలుపు సమస్యలు…’ (Oh, Twyla, you know how it was in those days: black-white.) అంటుంది. కానీ, ఆ రోజుల్లో అంత సమస్య ఉన్నట్టు కూడా ట్వైలాకి గుర్తులేదు. నిజానికి, అందరూ కలిసి హాయిగా తిరుగుతున్నట్టే జ్ఞాపకం. సరే, మళ్లీ కలుద్దాం, టచ్‌లో ఉందాం అనుకుని అప్పటికి విడిపోతారు ఇద్దరూ. 

అదే సంవత్సరం ఆ న్యూబర్గ్ ప్రాంతంలో జాతివిద్వేషాలు రేగుతాయి. నల్లజాతి పిల్లల్నీ, తెల్లజాతి పిల్లల్నీ ఒకే స్కూల్ బస్సులో కలిపి పంపటానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా. వీటి గురించి ఆందోళనలూ నిరసనలూ కూడా మొదలవుతాయి. ట్వైలా ఒకరోజు వాళ్ల అబ్బాయి ఉంటున్న స్కూలుకి కారులో వెళ్లినప్పుడు, అక్కడ ఆందోళన చేస్తున్న వారిలో రాబెర్టా కనిపిస్తుంది. ట్వైలా కారాపి రాబెర్టాతో మామూలుగా మాట్లాడుతూ ఉండగానే, వాళ్లిద్దరి సంభాషణ వాగ్వివాదంగా మారుతుంది. వీళ్లిద్దరి వివాదాన్ని చూసిన అక్కడి ఆందోళనకారులు, రాబెర్టాకి మద్దతుగా వచ్చి, ట్వైలా కూర్చుని ఉన్న కారుని కుదిపేసి, పక్కకి తోసేసినంత పనిచేస్తారు. పడిపోబోతున్న కంగారులో,  రాబెర్టా సాయం చేస్తుందని తనవైపు చేయి చాస్తుంది ట్వైలా. అలా ఒకరి గురించి మరొకరు జాగ్రత్త తీసుకున్న సందర్భాలు వాళ్ల పాత షెల్టర్ రోజుల్లో చాలా ఉన్నాయి మరి. కానీ, ఇప్పుడు మాత్రం రాబెర్టా ఎలాంటి సహాయమూ చేయడానికి ముందుకు రాదు. చివరికి పోలీసులు వచ్కి ట్వైలాని రక్షిస్తారు. అక్కడినుంచి ట్వైలా బయలుదేరి వెళ్లబోతూ ఉండగా, “ఆ రోజున ఆ నల్లజాతి మాగీ పాపం నేలమీద పడిపోయివున్నప్పుడు తన్నిన అదే మనిషివి నువ్వు, ఇంకా,” అని ట్వైలాని రాబెర్టా నిందిస్తుంది. మాగీ నల్లజాతి మహిళ కాదనీ, రాబెర్టా అబద్ధాలు చెబుతోందనీ అంటుంది ట్వైలా. అదేం కాదు, నువ్వు అబద్ధాలకోరువి, ఇద్దరం కలిసే మాగీని తన్నాం అంటుంది రాబెర్టా. 

పై సంఘటన ఫలితం ఏమిటంటే, రాబెర్టా వర్గానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వర్గంతో చేరి తానూ ప్లకార్డు పట్టుకుని నిలబడుతుంది ట్వైలా. ట్వైలా ప్లకార్డ్‌లోని నినాదాలన్నీ, రాబెర్టా ప్లకార్డ్‌లోని నినాదాలకి సమాధానాలుగానో, తిరుగుప్రశ్నల్లాగానో ఉంటూ ఉండేవి. ఆరువారాల పాటు సాగిన ఆ ఆందోళనలో చివరికి ట్వైలా ప్లకార్డ్ మీద ఉన్నదేమిటంటే: ‘మీ అమ్మ బాగుందా?’ 

ఆ తర్వాత వాళ్లిద్దరూ చాలారోజుల పాటు కలుసుకోవడం జరగలేదు. కానీ, ఈ మధ్యకాలంలో ట్వైలా తనమీద ఆరోపించబడినవాటి గురించి ఆలోచిస్తూనే ఉంది. తను మాగీని తన్నలేదు, తనకి గుర్తుంది. కానీ, ఆ గోధుమ రంగులో ఉండే మాగీ నల్లజాతి మహిళా? ఆ విషయం మాత్రం ఎంత ఆలోచించినా తేలడం లేదు. ఇలా ఉండగా, ఒకరోజు ఓ పేద్ద పార్టీనుంచి తిరిగివస్తున్న రాబెర్టా కనిపిస్తుంది. తనే ట్వైలా దగ్గరకి వచ్చి, తనతో మాట్లాడాలంటుంది రాబెర్టా. వాళ్లిద్దరి సంభాషణలో మాగీని నిజానికి తామిద్దరమూ తన్నలేదని ఒప్పుకుంటూనే, మాగీ నల్లజాతి మహిళే అని అంటుంది రాబెర్టా. తను మాగీని తన్నలేదు కానీ, తన్నాలని అనుకున్నాను, అనుకోవడమంటే దాదాపు చేయడమే కదా అంటుంది రాబెర్టా- కళ్లనిండా నీళ్లతో. 

“మనం ఇద్దరం అప్పటికి చిన్నపిల్లలం, రాబెర్టా.”

“అవును, నిజమే. ఇద్దరం చిన్నపిల్లలం.”

“ఎనిమిదేళ్లు.”

“అవును, ఎనిమిదేళ్లు.”

“ఒంటరితనం, పైగా.”

“ భయం కూడా.”

రాబెర్టా కళ్లు తుడుచుకుంది. “సరే, మొత్తం మీద చెప్పాలనుకున్నది చెప్పేసాను.”

ట్వైలా తల ఊపింది, అర్థం చేసుకుంటున్నట్టుగా. 

కాసేపు నిశ్శబ్దం.

“థాంక్స్, రాబెర్టా,” అంది ట్వైలా. 

“ష్యూర్.” 

“నీకు చెప్పానా?  మా అమ్మ ఇప్పటికీ డాన్స్ చేయడం ఆపలేదు.”

“అవును, చెప్పావు. మా అమ్మ తన అనారోగ్యం నుంచి తేరుకోలేకపోయింది.” టేబిల్ మీద ఉన్న చేతులని తీసుకుని మొహం కప్పుకుంది రాబెర్టా. కాసేపటి తర్వాత చేతులు తీసేసినప్పుడు చూస్తే, అప్పటివరకూ రాబెర్టా ఎంత ఏడుస్తూ ఉందో తెలుస్తూ ఉంది.

ఏడుస్తూనే అంది రాబెర్టా. 

“Oh shit, Twyla. Shit, shit, shit. What the hell happened to Maggie?”

***

అదీ కథ. 

కథ మొత్తంమీద, ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు బ్లాక్, ఎవరు వైట్ అనేది మాత్రం టోనీ మారిసన్ ఎక్కడా చెప్పలేదు. కాకపోతే, కథ నడుస్తూ ఉన్నప్పుడు, రచయిత్రి అక్కడక్కడా వదిలే రకరకాల హింట్స్ (రంగులూ, జుట్లూ, బాగుండటం, శరీరాకృతీ, నివసించే ప్రదేశాలూ, సంగీతాభిరుచులూ, చేసే ఉద్యోగాలూ, భర్తల ఆర్థిక స్థితులూ- ఇలా కథ మొత్తం మీద చాలా ఉన్నాయి) ని బట్టి, మనకు ఒక్కోసారి ట్వైలా నల్లజాతి అమ్మాయి అనీ, ఇంకోసారి కాదు-రాబెర్టాయే నల్లజాతి అమ్మాయి అనీ అనిపిస్తూ ఉంటుంది. పై సూచనలు అన్నీ కూడా ఆయా జాతుల గురించి అందరి మనసుల్లోనూ నాటుకుపోయి ఉన్న స్టీరియోటైప్స్; సింబల్స్. వాటి ఆధారంగా కథలోని పాత్రలని అనుసరించడానికి రచయిత్రి కథలో అక్కడక్కడా ఆ జాడల్ని పరిచారు. ఆ మాయాజాలంలో పాఠకుడు కూడా చిక్కుకునిపోతాడు. 

జాతివిద్వేషాలు ప్రబలంగా ఉన్న రోజుల్లో మనుషులు ఎంత స్టీరియోటిపికల్‌గా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు.  కానీ, ఇప్పుడు ఈ కథ చదువుతున్న పాఠకుడు కూడా, ఆ హింట్స్‌ని అనుసరించి ఎవరు బ్లాకో, ఎవరు వైటో తేలుద్దామని అనుకుంటున్నాడంటే, మనం కూడా ఆ మూసల్లోకి ఒదిగిపోయి అలానే ఆలోచిస్తున్నామన్నమాట. అలా, ఈ కథ, పాఠకుడి మీదకి ఎక్కుబెట్టబడ్డ విమర్శ. మన ఆలోచనాధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎత్తిచూపే సూచన. ఈ విషయం అర్థమయ్యాక మాత్రమే, కథ ముగింపులో వచ్చిన ‘అసలు మాగీ ఆ తర్వాత ఏమై పోయింది?’ అన్నది మానవీయ కోణంలో మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న అని అర్థం అవుతుంది. మనం మన గీతలు దాటి ముందుకురానంత కాలం, ఈ కథ ముగింపు చాలా మామూలుగా అనిపిస్తుంది. దాటాక మాత్రమే అది ఒక ప్రశ్న మీద నిలిచిపోయిన అసాధారణమైన ముగింపు అని తెలిసివస్తుంది. 

దాదాపు ముప్ఫై యేళ్ల కాలపరిధిలో నడిచిన కథలో, పాత్రలు పొందిన పరిణామక్రమం మరో ఆశావహమైన అంశం. ఇద్దరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఒక డిసేబుల్డ్ మనిషి మీద అలా అమానుషంగా ప్రవర్తించారూ అంటే, అంగవైకల్యం అనేది జాతిమతాలకి అతీతంగా అవహేళన చేయబడుతున్న అంశం అనేది స్పష్టమవుతోంది. అది ఊహిస్తేనే ఒక గగుర్పాటు కలుగుతుంది.  అదృష్టవశాత్తూ, ఒక స్థాయి దాటాక, వెనక్కి తిరిగి జరిగిన విషయాల గురించి మానవతా దృక్పథంతో ఇద్దరూ ఆలోచించగలుగుతున్నారూ అంటే, ముందు జరగబోయే వాటిని కూడా అలాంటి కోణం నుంచే చూస్తారన్న చిన్న ఆశని కథ కలిగిస్తుంది. కనీసం వాళ్ల పిల్లలకి వాళ్లు నేర్పే పాఠాలు సంకుచితంగా ఉండబోవన్న ఆశ కూడా కలుగుతుంది. ఈ కోణాన్ని చూడగలిగిన పాఠకుడికి ఒక రిలీఫ్ కలుగుతుంది.

కథలో మరొక విశేషాంశం: 1983లో ప్రచురించబడిన ఈ కథ, అంతకుముందు ముప్ఫై యేళ్ల చరిత్రని ప్రతిఫలించడం. అప్పటివరకూ స్కూళ్లల్లో ఉన్న వివక్షలని రద్దుచేసే 1954లో అమెరికాలోని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పూ; మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ఉద్యమమూ; నల్లజాతీయులూ, తెల్లజాతీయులూ విడివిడిగా చేసిన ఆందోళనలూ; డెబ్భైలలో, జాతి ఆధారంగా స్కూల్ బస్సుల్ని విడివిడిగా నడపటం పట్ల అభ్యంతరం తెలిపిన కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లూ – ఇవన్నీ కూడా కథలో ప్రతిబింబించడం చూస్తే, కథని ఎంత ప్రణాళికాబద్ధంగా శ్రద్ధగా రచయిత్రి రాసారో అర్థం అవుతుంది. 

***

నాకు దొరికినంతలో దీనిమీద ఒక పది వ్యాసాల వరకూ చదివాను (ఆసక్తి ఉన్నవారి కోసం ఆ విమర్శకుల పేర్లు: David Goldstein-Shirley; Elizabeth Abel; Helane Adams Androne; Howard Sklar; Ivan Delazari; Robyn Warhol & Amy Shuman; Sandra Kumamoto Stanley; Sarah Madsen Hardy; Shanna Greene Benjamin.) ఇన్ని వ్యాసాలు చదవగలగడం ఈ ఇంటర్నెట్ కాలంలో మాత్రమే సంభవం కాగల ఒక అదృష్టమయితే, అవి కలగజేసిన కొత్తజ్ఞానం మాత్రం ఒక వినూత్నమైన అనుభవం.  ఈ కథని ఎన్నిసార్లు చదివి, ఎంతమందితో చర్చిస్తే మాత్రం ఇంత బాగా అర్థం అవుతుంది!

ప్రతి వ్యాసంలోనూ ఎవరు తెల్ల అమ్మాయీ ఎవరు నల్ల అమ్మాయీ అన్న చర్చ జరగకుండా పోలేదు. ఆ చర్చని ఎకడమిక్‌గా తీసుకోగలిగితే, వాళ్లు వాళ్లు మంచి విశ్లేషణలు చేసారని మనం ఒప్పుకుంటాం. పరస్పర విరుద్ధంగా ఉండే పరిష్కారాలు సూచించినప్పటికీ, వాటిని సహేతుకంగా కథలో ఉన్నదాని ఆధారంగా వాళ్లు ఆ పరిష్కారాలకి చేరుకోవడం వల్ల మరికొన్ని కొత్తవిషయాలు తెలిసివచ్చాయి. 

1992లో మారిసన్ రాసిన “Playing in the Dark: Whiteness and the Literary Imagination” అనే పుస్తకం ముందుమాటలో ఆవిడ ఈ కథని ప్రస్తావించారు.  సాహిత్యంలో మూసలనే సంకెళ్ల బారిన పడ్డ భాషని బయటపడేయడం తన ఉద్దేశంగా మారిసన్ పేర్కొన్నారు. ఈ కథలో జాతికి సంబంధించిన చిహ్నాలనన్నింటినీ తీసివేసానన్నారు. కానీ, ఈ వివరణ పూర్తిగా సంతృప్తినివ్వదు. అలాంటి రేషియల్ కోడ్స్ లేవూ అంటే, మరి ఇందులో ఉన్నవి ఏ కోడ్స్? ఏ సింబల్స్? ఆ విషయమై పూర్తి వివరణని తన1993లోని పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో పూర్తిచేశారు మారిసన్. 

Q: What about black writers… how do they write in a world dominated by and informed by their relations ship to a white culture?

A: By trying to alter language, simply to free it up, not to repress it or confine it, but to open it up. Tease it. Blast its racist straitjacket. I wrote a story entitled ‘Recitatif,’ in which there are two little girls in an orphanage, one white and one black. But the reader doesn’t know which is white and which is black. I use class codes, but no racial codes. 

ఇది పూర్తిగా కొత్తకోణం. కథలో ఉన్నవి జాతికి సంబంధించిన సింబల్స్ కావనీ, అవి క్లాస్‌కి సంబంధించిన చిహ్నాలనీ తెలుసుకోవడం (ఇందులో ఒక అమ్మాయి వర్కింగ్ క్లాస్ వర్గానికి చెందిన జీవితం, ఇంకో అమ్మాయిది సంపన్న మధ్యతరగతి వర్గం.) ఈ ఎరుకతో కథని చదివితే, కథ కొత్తగా కనిపిస్తుంది. ఏ సమస్య అయినా జటిలం కావడానికి దాన్ని ఆవరించుకుని ఉండే అనేకానేక ఇతర సమస్యాత్మక పొరలు చుట్టుకుని పోయి అవి వేసే చిక్కుముళ్లే కారణం అవుతాయని మళ్లీ ఒకసారి విశదమవుతుంది. 

***

కథలో ఆకర్షించేది- తరాల తరబడి నలుగుతున్న సమస్యని సరళమైన భాష, కథనాలతోనూ; అంత సరళం  కాని అంతరార్థాలతోనూ (పాఠకుల శక్తి మేరకు అవి కథలో లభ్యమవుతూ ఉంటాయి) ఒక రాజకీయ కథగా రూపొందించడం. ఆనక, ఆ కథ మనకు ప్రశ్నలని సంధించేలా చేయడం.

తలెత్తే ప్రతి ప్రశ్నా, తన సమాధానాలను తాను వెతుక్కోవడం ఆపదు కదా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.