ఫక్కున నవ్వెను పూర్ణమ్మ….

-వసుంధర

అబద్ధం చెప్పే అలవాటు చిన్నప్పుడే లేదు నాకు. కొత్తగా రమ్మంటే ఇప్పుడెలా వస్తుందీ? 

కానీ నా గురించి మంచి మాటలు చెప్పినవాళ్ల గురించి నేనూ నాలుగు మంచి మాటలు చెప్పాలి కదా!

అబద్ధం చెప్పలేను. నిజం చెబుదామంటే – నిష్ఠూరమౌతుందని భయం.

నన్ను ప్రేమించేవాళ్లు. నా మనసుకు కష్టం కలగకూడదనుకునేవాళ్లు. ఆపైన తామందుకుంటున్న ఉన్నత శిఖరాలకు నేనే కారణమని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నవాళ్లు. 

వాళ్ల గురించి అబద్ధం చెప్పలేను. నిజం చెప్పాలి. కానే దానికిదా సమయం?

నిజం. చిన్నప్పట్నించీ వెంటాడుతూ జ్ఞాపకాల్లోంచి తప్పుకుందుకు నిరాకరిస్తున్న నిజం! 

మనసు ఆ నిజాన్ని మరోసారి తడమడం మొదలెట్టింది….

1

పద్నాలుగేళ్లు నాకు. తొమ్మిదో క్లాసు చదువుతున్నా, ఏడవ తరగతినుంచీ క్లాసులో టాప్‌ ఫైవులో ఉంటున్నా. నంబర్‌ వన్‌ స్థానం మాత్రం ఎప్పుడూ గోపాల్‌దే. ఆ రాంక్‌ కోసం రెండేళ్లుగా పట్టుదలగా చేస్తున్న నా కృషి – ఈసారి హాఫియర్‌ పరీక్షల్లో ఫలించింది. అదీ మామూలుగా కాదు. సెకండ్‌ రాంక్‌ వచ్చిన గోపాల్‌కి ప్రతి సబ్జక్టులోనూ నాకంటే కనీసం ఐదు మార్కులు తక్కువొచ్చాయి.

ఫలితాలు ప్రకటిస్తూ క్లాస్‌ టీచర్‌ నిర్మల నన్ను ప్రత్యేకంగా మెచ్చుకుని, ‘‘మనిషి తెలివిని రాంకులతో కొలవకూడదని నాకు తెలుసు. కానీ పశ్నప్రత్రాలకు నువ్విచ్చిన జవాబుల తీరుని బట్టి చెబుతున్నా. చదువులో గొప్పగా రాణిస్తావ్‌. జీవితంలో చాలా ఎత్తుకి ఎదుగుతావ్‌. నీ కృషి ఇలాగే కొనసాగించు’’ అంది.

అదో గొప్ప ప్రేరణ. ‘అంటే ఇకమీదట క్లాసులో ప్రతి పరీక్షలోనూ నేనే టాపర్ని కావాలి. గోపాల్‌ ఎప్పటికీ నా వెనుకే ఉండాలి’ అనుకుంటూ – రిపోర్టు కార్డుతో సంబరంగా ఇంటికొచ్చాను. అప్పటికే ఇంట్లోవాళ్లు నాకంటే సంబరంగా ఉన్నారు. నేను క్లాసు ఫస్టొచ్చిన కబురు నాకంటే ముందు చేరేసిందెవరబ్బా అనుకున్నాను. 

కానీ వాళ్ల సంబరానికి కారణం వేరు. నాకు పెళ్లి కుదిరిందిట!

వరుడు ఎమ్మెస్సీ చదివి పీహెచ్‌డీ చేస్తున్నాడు. నాకంటే ఎనిమిదేళ్లు పెద్ద. చాలా బుద్ధిమంతుడు.  

దృష్టంతా చదువుమీదున్న నా ఊహల్లో పెళ్లికి చోటు లేదు. ‘‘ఇప్పుడిప్పుడే క్లాసులో టాపర్నయ్యే రహస్యం భేదించా. చదువులో గొప్పగా రాణిస్తానని నిర్మలా టీచర్‌ చెప్పింది. నాకిప్పుడు పెళ్లొద్దు” అన్నాను ఆమ్మతో.

ఆమ్మ నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, ‘‘అంత చదివి కూడా – పెద్దలమీద గౌరవంతో, పెళ్లిచూపులు లేకుండా సరేనన్నాడా అబ్బాయి. ఈ రోజుల్లో అలాంటివాళ్లు అరుదు. అతడు మొగుడవడం గొప్ప అదృష్టం నీకు’’ అంది అమ్మ.

మాట్లాడకుండా నే పెళ్లికొప్పుకుంటే, వరుణ్ణి చూడకుండానే పెళ్లికొప్పుకుందని  నన్నూ మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. ఎందుకంటే అంత చదువున్న అబ్బాయికి, ఇంతే చదువున్న అమ్మాయిని నేను.  

మొగుడంటే స్పష్టమైన ఆలోచన, ఆసక్తి లేని వయసు. మొగుడికంటే చదువుమీదే ఆసక్తి చూపించే  మనసు నాది. ‘‘నాకింకా చదవాలనుంది. ఈవేళ క్లాసులో ఫస్టొచ్చానని నాన్నకి చెప్పు’’ అన్నాను అమ్మతో.

అమ్మ చెప్పింది. నాన్న విన్నాడు. ‘‘ఆడపిల్లకి పెళ్లికోసమే చదువు. ఆ తర్వాత దాంపత్య జీవితమే చదువు’’ అన్నాడు. అది వివరణ కాదు. సంజాయిషీ కాదు. తన నిర్ణయం.

దశాబ్దాల క్రితం ఐతే ఏమో కానీ – ప్రస్తుతం నాకు తెలిసి – ఇంత తక్కువ వయసులో పెళ్లిళ్లౌతున్న ఆడపిల్లలు మా కుటుంబాల్లో ఇంచుమించు లేరు. అలాగని ఇంట్లో ప్రతిఘటించడానికీ నా వయసు తక్కువే.

విషయం తెలిసిన నిర్మలా టీచర్‌ నాన్నని కలుసుకుని, ‘‘బాగా తెలిసినవారు కాబట్టి చెబుతున్నాను. పూర్ణ చాలా బాగా చదువుతోంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి, అప్పుడు తన పెళ్లి గురించి ఆలోచించాలి. అదీకాక తనింకా బాగా చిన్నపిల్ల. ఈ వయసులో పెళ్లి చట్టరీత్యా నేరం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే – పెళ్లి చేసినవాళ్లూ, చేసుకున్నవాళ్లూ కూడా జైలుకి పోవాల్సుంటుంది’’ అని హితబోధ చేసింది.

ఆ మాటల్లో నాన్న ఒక్క ఫిర్యాదు గురించే స్పందించాడు, ‘‘ఫిర్యాదెవరు చెస్తారు? నువ్వు చేస్తావా? మరి నీ పెళ్లికి నేనే మధ్యవర్తిగా ఉండి కట్నాన్ని పన్నెండునుంచి ఎనిమిది వేలకి తగ్గించాను. కట్నం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా, నాకు తెలియదా? జనాలకి మేలు చెయ్యాలని చట్టాలు చేస్తారు. జనం తమకేం మేలో తాము చూసుకుంటారు. ఇతరులకి ఇబ్బంది కలిగించనంతవరకూ, మనం చట్టాల్ని పట్టించుకోకూడదు’’. 

నేతల అవినీతిపట్ల, మన జనం స్పందనలాంటిదే ఆ జవాబు. ఆ జవాబు నేటికీ మన సమాజంలో అన్ని రంగాలకూ యథాతథంగా వర్తించడం మన జనం ఆలోచనల ప్రగతికి సూచిక.

పెళ్లి కుదిరింది. పెద్దలు తమ సరదాలు తీర్చుకుందుకు పెళ్ళిచూపులన్నారు. నాలో ఏమాత్రం రొమాంటిక్‌ ఫీలింగ్సు లేవు. వరుడు కూడా నన్ను పలకరించి మాట్లాడలేదు. పెళ్లిచూపులంటే వాలాయితీ అనుకున్నాడో, నా వయసు చూసి అనవసరం అనుకున్నాడో మరి! 

నేనతణ్ణి సరిగ్గా చూడలేదు. చూడాలన్న ఆసక్తీ నాలో లేదు. ఆ తర్వాత కూడా అతడి గురించిన ఆలోచనలు నాలో రాలేదు. ఐనా నా ప్రమేయం లేకుండానే జంట బాగుందని పెద్దలు మురిసిపోయారు. తాంబూలా లుచ్చుకున్నారు. పెళ్లికి ముహూర్తం పెట్టేశారు.

ఆ ముహూర్తం కూడా సరిగ్గా నా పరీక్షల టైంలో పడింది. ‘‘మళ్లీ స్కూలుకెడుతుందా ఏమన్నానా?’’ అనుకుంటూ ఎవరూ ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ ముహూర్తం నా చదువుకి శాపంలా అనిపించి ఒంటరిగా గదిలో కూర్చుని కాసేపు ఏడ్చాను.

వివాహం విద్యనాశాయ అన్న వ్యాఖ్య మగవాళ్ల గురించే చేస్తారు. మరి నేను పెళ్లి పేరు చెప్పి రెండు పరీక్షలు రాయలేకపోయాను. రాసినవాటికీ సరైన ప్రిపరేషను లేక, ఏదో రాశాననిపించాను. 

వరుడు నా మెడలో తాళి కడుతుంటే, పెద్దల మొహాల్లో సంతోషాన్ని వెదజల్లుతూ చిరునవ్వులు. వారి చేతులనుంచి దీవెనలు మోస్తూ మా ఇద్దరిపై వెదజల్లబడుతున్న అక్షతలు. ‘‘రాంకులో గోపాల్‌ని దాటించే అవకాశం నీకిక లేదుసుమా’’ అన్నట్లు వినిపిస్తున్న వేదమంత్రాలు.

మా స్కూలు వార్షికోత్సవ వేడుకలో ఏడాది క్రితం వేదికపై ప్రదర్శించిన – గురజాడవారి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయ నాటికలో – ‘దీవెన వింటూ ఫక్కున నవ్వెను పుత్తడిబొమ్మా పూర్ణమ్మ’ అన్న చరణం గుర్తొచ్చింది. 

అప్రయత్నంగా నేనూ ఫక్కున నవ్వాను. 

2

నా భర్త శేఖర్‌ మంచివాడు. సంసారిగా సంస్కారి. మొదటిరాత్రి నన్ను తన స్వంతం చేసుకోబోయేముందు, నాలో దాంపత్య జీవితంపై ఉన్న బెరుకులు పోగొట్టాడు. నాకు మనసు విప్పి మాట్లాడే చనువు, ధైర్యం ఇచ్చాడు.

అవకాశమొచ్చిందని, క్లాసులో నా ప్రతిభని గొప్పగా చెప్పుకున్నా. ఇంకా చదవాలనుందని ఆశగా అడిగా. 

అతడు మెచ్చుకున్నాడు. తనకి తెలిసిన ఆడపిల్లలు చాలామంది పది పన్నెండేళ్ల వయసుకే పెళ్లి గురించి కలలు కంటారనీ, చదువుపట్ల ఇంత ఆసక్తి ఉన్న నేను చదువు కొనసాగించి తీరాలనీ అన్నాడు. 

‘‘నాన్నకంటే ఇతనే నయం. పెళ్లి నాకు మేలే చేసింది’’ అనుకున్నాను. కనీసం టెన్తు పూర్తయ్యేదాకా నేను పుట్టింటనే ఉండడానికీ, అంతవరకూ మేం కాపురం పెట్టకూడదనీ – ఆ మూడు రాత్రుల్లోనూ నిర్ణయించుకున్నాం. 

మేమప్పుడు విడిపోయి నెల తిరిగిందో లేదో, కాపురం పెట్టించమని మామగారి కబురు.

వాళ్లది పెద్ద కుటుంబం. పల్లెటూళ్లో ఉంటున్నారు. మా మరిది గ్రాడ్యుయేషన్లోకీ, ఆడపడుచు టెన్తులోకీ వచ్చారు. వాళ్లని పట్నంలో శేఖర్‌ దగ్గరుంచి చదివించాలని మామగారి యోచన. 

ఎదిగిన ఆడపిల్లని గుండెలమీద కుంపటంటారు. పెళ్లైన ఆడపిల్ల అంతకంటే ఎక్కువ కాబోలు – అలాంటి కబురు కోసమే ఎదురు చూస్తున్నవాడిలా నాన్న వెంటనే ఒప్పుకున్నాడు. ఒకవిధంగా నాకిదే మంచిదనిపించింది. మా ఆడపడుచుది నా ఈడే కాబట్టి ఇద్దరం కలిసి బడికెళ్లొచ్చు. నేను చదువు కొనసాగించొచ్చు. 

అంతా నా కల. వాస్తవంలో ఎవ్వరికీ నా చదువు గురించిన ఆలోచనే లేదు. నేను తొమ్మిది ఫెయిలైతే, అందుకు కారణం కొన్ని పరీక్షలకి యాబ్సెంటన్న విషయం వదిలేశారు. అంతకుముందు హాఫియర్లీలో నా ఫస్ట్‌ రాంక్‌ గురించి మర్చిపోయి, ఫెయిల్యూరుని ఫెయిల్యూరుగానే తీసుకున్నారు. నాకు చదువంటే శ్రద్ధ లేదన్నారు. ‘ఇంకా నయం, తొందరగా పెళ్లయిపోయింది. లేకాపోతే, ఇటు చదువూ రాక, అటు మంచి సంబంధమూ దొరక్క, దీని బతుకేమయ్యేదో’ అని కూడా వాపోయారు. 

నా ఫెయిల్యూర్ని వాళ్లు తమ నిరంకుశత్వాన్ని సమర్థించుకుందుకు వాడుకుంటుంటే, చెప్పలేనంత ఉక్రోష మొచ్చింది నాకు. ఎవరో చేసిన తప్పుకి నా చదువు బలై పోయిందని ఎంత ఘోషించినా ఎవరూ పట్టించుకోరు. నేనేమిటో నిరూపించుకుని, వారికి సరైన సమాధానమివ్వాలని గట్టిగా అనుకున్నాను. 

నేననుకున్నది సాధించగలనని నా క్లాస్‌మేట్‌ గోపాల్‌కి స్వానుభవం. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటేనని – గోపాలే కాదు, ఏ అబ్బాయైనా తనతో పోటీపడే అమ్మాయిల గురించి అనుకోడా?  

పుట్టింట్లో చదువాశ పోయింది. భర్తతో కాపురానికి పట్నం వెళ్లాను. అక్కడ మేమిద్దరం, మాకిద్దరు అన్నట్లు నా మరిది, ఆడపడుచు. మరిది గ్రాడ్యుయేషన్లో చేరాడు. ఆడపడుచు స్కూల్లో చేరింది.

‘‘నువ్వు మళ్లీ తొమ్మిది చదవడం నాకిష్టం లేదు. ప్రయివేటుగా మెట్రిక్‌ కడుదువుగాని’’ అన్నాడు శేఖర్‌. 

విద్యాధికుడనీ, తెలివైనవాడనీ, మంచివాడనీ శేఖర్‌మీద ఓ అభిప్రాయమేర్పడి బలపడుతోంది. అతడేం చెప్పినా గుడ్డిగా నమ్మడం అలవాటైంది. 

‘‘నాకింకా ఉదోగం లేదు. రీసెర్చి స్కాలర్ని. వచ్చే ఆదాయంతో ఇల్లు, చదువులు గడవాలి. కాబట్టి మనం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయివేటుగా కట్టే మెట్రిక్‌ ఇప్పుడైనా, కొన్నేళ్ల తర్వాతైనా ఒకటే. కాబట్టి, ప్రస్తుతానికి నీ చదువు వాయిదా వేద్దాం. ఏమంటావ్‌!’’ అన్నాడతడు.

‘‘మెట్రిక్‌ చదవడానికి అంత ఖర్చవుతుందా?’’ అన్నాను అమాయకంగా.

‘‘చదువుకి పెద్దగా అవదు. కానీ ఈ ఇంటికి నేను యజమాన్నయితే, నువ్వు నాకు యజమానురాలివి. ఇప్పటికే పెళ్లయిపోయింది కాబట్టి చదువు నీకు మరీ అంత ముఖ్యం కాదు. పీహెచ్‌డీ అయ్యేదాకా నాకేమో రాత్రంబవళ్లు లాబొరేటరీలో పనుంటుంది. అంచేత ఇల్లు నడపాల్సిన బాధ్యత పూర్తిగా నీది’’ అన్నాడతడు.

‘ఆడపిల్ల లక్ష్యం పెళ్లి. ఆ పెళ్లికి చదువొక మెట్టు. పెళ్లయిపోతే ఆమెకిక చదువు మెట్లు అక్కర్లేదు’ అన్న భావన ఆ మాటల్లో ఉంది. కానీ నన్నేదో దేశానికి పీఎంని చేస్తున్నంత బిల్డప్‌ ఇచ్చాడతడు. దానికి పడిపోయాను.   

అంతవరకూ ఇల్లెలా నడపాలో తెలియదు. వంట కూడా సరిగ్గా రాదు. శేఖర్‌కీ ఇవన్నీ పెద్దగా తెలియవు. లోకజ్ఞానం ఉపయోగించి ఒకొక్కటే కలిసి నేర్చుకున్నాం.

ఫస్టు రాగానే స్కాలరుషిప్పు మొత్తం అంతా తెచ్చి నా చేతిలో పోసేవాడు.

బొగ్గుల కుంపటి, కిరసనాయిలు స్టవ్‌. వాటిమీద వంట. ఎవరి సాయమున్నా లేకున్నా – ఇల్లు నడిపే బాధ్యత నాది. డబ్బుకి కూడా శేఖర్‌తో సహా అంతా నన్నే అడుగుతారు.

ఉదయం, సాయంత్రం వంట నా పని. మధ్యాహ్నాలు తీరబడి సమయంలో చదువుకుందుకు లైబ్రరీనుంచి కథల పుస్తకాలు తెచ్చేవాడు శేఖర్‌. వాటి బదులు సబ్జక్టు పుస్తకాలు చదవుతానంటే వద్దవేవాడు. సాహిత్యం మనోవికాసానికి అవసరమనీ, ఆదే గొప్ప చదువనీ అనేవాడు. 

‘ఆడపిల్లకు పెళ్లికోసమే చదువు. ఆ తర్వాత దాంపత్య జీవితమే చదువు’’ అన్న నాన్న మాటలు గుర్తొచ్చినా, అతడంటే ఏదో తెలియని ఆకర్షణ!  

సాయంత్రాలు సరదాగా తిరిగేవాళ్లం. ఖర్చు లేకుండా దగ్గర్లో పార్కులకి నడిచే వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడు సినిమాలూ చూసేవాళ్లం.  

తొందరగానే సంసారం నడపడం పట్టుబడింది. నెలాఖర్లో పై నెలకి బడ్జెట్‌ వేసేదాన్ని. ఉన్నంతలో అందరి అవసరాలూ తీరేవి. ఎప్పుడూ డబ్బుకి కటకటలాడలేదు.

‘‘మీ చదువు గొప్పది. స్కాలరుషిప్పు కూడా జీతంలా సరిపోతోంది’’ అని ఓసారి శేఖర్ని మెచ్చుకున్నాను.

శేఖర్‌ వెంటనే, ‘‘అవసరాలకే డబ్బనుకుంటే, రోజు కూలీలకూ ఆదాయం చక్కగా సరిపోతుంది. నీకు చీరలు, నగలు, మేకప్‌ వగైరాలపై మోజు లేదు. అదే మన కంఫర్టుకి కారణం. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నాడు. ఆ మాట వినడం ఎంత బాగుందంటే – ఎల్లకాలం అన్నీ త్యాగం చేసి, ఇలా బడ్జెట్‌ జీవితం గడపాలనిపించేది ఆ క్షణంలో.

నా ఆడపడుచు, మరిది పుస్తకాలు ముందేసుకుని కూర్చోగా, నేను కథల పుస్తకం తియ్యాల్సొచ్చినప్పుడు వాళ్లంటే ఆసూయ కలిగేది. తను పరీక్షకోసం చదువుతుంటే, నేను కులాసాగా కథల పుస్తకం తియ్యడం మా ఆడపడుచుకీ అసూయగా ఉందని – శేఖర్‌ అనేవాడు. లేనిదానికోసం ఆశపడ్డం మనిషికి సహజమేమో!

ఆడపడుచు స్కూలుకెడుతుంటే నాలో అసూయ. ఎవరో నన్ను ముత్తైదువగా పేరంటానికి రమ్మంటే ఆమెలో అసూయ. ఇవన్నీ క్షణికాలు. మేమందరం మంచి మిత్రుల్లా మహా సరదాగా కాలం గడిపేవాళ్లం. 

ఒకసారి ఓ పార్కులో ఓ పెద్దాయన మా నలుగుర్నీ చూసి ముచ్చటపడి దగ్గరకొచ్చి పలకరించాడు. మా వివరాలడిగి, ‘‘ఈ అమ్మాయికి పెళ్లయిందా?’’ అని నా గురించి ఆశ్చర్యపోయాడు. తర్వాత శేఖర్‌తో, ‘‘నీ చెల్లికే కాదు. పెళ్లానికీ చదువుండాలి. వెంటనే మెట్రిక్కి కట్టించి, ఆ వెంటనే కాలేజిలో జేర్పించు. చిన్నపిల్ల. ఇప్పట్నించీ సంసారపు రంధిలో పడిపోకూడదు. పీహెచ్‌డీ చేస్తున్నావ్‌. ఈ మాత్రం తెలియదా?’’ అని మందలించాడు.

నాకు చాలా సంతోషమేసినా, శేఖర్‌ నొచ్చుకుంటాడని భయపడ్డాను. కాని శేఖర్‌ వెంటనే, ‘‘తను చాలా బ్రిలియంటు. పెళ్లికిముందు క్లాసుకి ఫస్టు. ఇప్పుడు కుదరదు కానీ, పీహెచ్‌డీ అయి ఉద్యోగంలో చేరగానే తన చదువే నా లక్ష్యం’’ అన్నాడు ఏమాత్రం తడుముకోకుండా.

అబద్ధాలాడేవాళ్లు తడుముకుంటారు కానీ, నిజం చెప్పేవాళ్లు తడుముకోరని, మా అమ్మ నేను నిజం చెప్పినప్పుడల్లా మెచ్చుకునేది. నేనూ అతణ్ణి మనసులో మెచ్చుకున్నాను.

నా గురించి గొప్పగా చెప్పాడు. సిగ్గేసింది. నా చదువు గురించి తెగ ఆలోచిస్తున్నాడు. సంతోషం కలిగింది.  

రెండేళ్లలో శేఖర్‌ పీహెచ్‌డి ఐపోయింది. అదంతా నా సహకారంవల్లనేనని అతడన్నప్పుడు పొంగిపోయాను. 

ఉద్యోగప్రయత్నాలు మొదలెట్టాక శేఖర్‌ మరింత బిజీ ఐపోయాడు. ఇంటర్వ్యూలకి వెళ్లడం, రావడం. ఉన్న స్కాలర్‌షిప్‌ గడువు కాలం ముగిసేలోగా మరో స్కాలరుషిప్పుకి దరఖాస్తులు పెట్టడం.

నేను పూర్తిగా ఇంటికీ, వంటింటికీ పరికమితమైపోయాను. చదువు ఆలోచన బుర్రలోంచి తప్పుకుంది.

3

శేఖర్‌కి పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో ఉద్యోగమొచ్చింది. మా మకాం భువనేశ్వర్‌కి మారింది.

మొదటి నెల జీతం నా చేతిలో పెడుతూ, ‘‘ఇప్పుడు మనం నిజంగా మన కాళ్లమీద మనం నిలబడ్డట్లు’’ అన్నాడతడు. ఔననబోయాను కానీ, ఎక్కడో మనసులో కలుక్కుమంది. ‘‘మీరు మీ కాళ్లమీద నిలబడ్డారు. ఆ కాళ్లమీదే నేనూ నిలబడ్డాను’’ అని సవరించాను.

‘‘దాంపత్య జీవితమంటే నువ్వూ నేనూ కాదు. మనం’’ అన్నాడతడు.

శేఖర్‌ మాటవరసకి కూడా నన్నెప్పుడూ తక్కువ చెయ్యడు. కానీ నాలోనే ఏదో న్యూనతాభావం. దాంతో, ‘పైనున్నవాడు కిందున్నవాణ్ణి తనతో సమం చేస్తే అది సంస్కారం. కిందున్నవాడు అది నిజమనుకుంటే అది అహంకారం’ అనిపిస్తుంది.

శేఖర్ని చూసినప్పుడల్లా నాకు గోపాల్‌ గుర్తుకొస్తాడు. తను కాలేజిలో డిగ్రీ చేస్తుంటాడు. నేను పెళ్లి చేసుకుని వంటింటి కుందేలు నయ్యాను. గోపాలూ నేనూ సమమని లోకమనొచ్చు. నాకనిపించదు.

చదవాలి. డిగ్రీ తెచ్చుకోవాలి. ఏదో సాధించాలి.

నా కోరిక విన్నప్పుడల్లా శేఖర్‌, నా దృక్పథాన్ని మెచ్చుకునేవాడు. తన సహకారాన్ని అందిస్తాననేవాడు. కానీ అప్పుడే కాదుట. ఉద్యోగంలో కొత్త. పరిస్థితులు ఆకళింపు చేసుకుని, అవిరళ కృషి చేసి, తొందరగా పై స్థాయికి చేరుకోవాలిట. అలాగే చేరిన రెండేళ్లకే ప్రమోషనొస్తే, ‘‘మన కాంబినేషన్‌ గ్రేట్‌. చూస్తూండు. తొందరగా మనమింకా ఎంతెత్తుకి ఎదిగిపోతామో’’ అన్నాడు.

అతడెంత ప్రయత్నించినా – మనమంటే తనేనన్న భావం నాలో పోవడం లేదు. ఎందుకంటే ఆఫీసు పని తనది. ఇంటి బాధ్యతలు నావి. ఆదాయం తనది. ఖర్చు నాది. అతడి పనికి విలువ కట్టేవారున్నారు. ఏటా ఇంక్రిమెంట్లు. అప్పుడప్పుడు ప్రమోషన్లు. అలా ఆ విలువ పరుగుతూంటుంది.

నా పనికి విలువ లేదు. అమూల్యమని అతడనొచ్చు. నన్ను ఇంటికీ, వంటింటికీ పరిమితం చెయ్యడానికే ఆ విలువని నాకనిపిస్తుంది.

కలిసి తిరిగేవాళ్లం. సినిమాలు చూసేవాళ్లం. విహారయాత్రలూ చేసేవాళ్లం.  

సరదాలకే మేము మనం. ఇంటిపనుల్లో నేను నేనే. ఆఫీసు పనుల్లో తను తనే!

తనకి అవసరమని బాంకు పనులు దగ్గరుండి నేర్పించాడు. మెట్రిక్కి కడతానంటే ఫారాలు తెప్పించడానిక్కుడా సమయం లేదంటాడు. 

ఈలోగా ఇంటర్‌ ప్యాసైన నా ఆడపడుచు పెళ్లి. మరిది ఎమ్మే చదివే ప్లానులో ఉంటే – డిగ్రీ ఆలోచన లేకుండా ఆమెకి పెళ్లి. ఇంటి కోడలిగా ఆ పెళ్లి నా బాధ్యత. నా ఈడు పిల్ల పెళ్లికి నేనో పెళ్లిపెద్దని.

వరుడామె మెడలో తాళి కడుతుంటే ఆనందంగా నవ్వుతూ, అక్షతలతో దీవిస్తున్నవారిలో నేనూ ఉన్నాను.

ఆడపడుచు మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ఆమె మొహంలో నవ్వు చూశాను. అది సంతోషమా లేక పుత్తడిబొమ్మ పూర్ణమ్మలా….

నేను తొమ్మిదితో ఆపేస్తే తను పన్నెండుతో ఆపేసింది. ఆ మూడేళ్ల అదనపు చదువునీ ఆమె జీవితంలో ఎలా ఉపయోగించుకుంటుంది?

నా ఆడపడుచు ఇంటర్‌తో చదువాపేసింది. 

మా వారి ఆఫీసులో డిగ్రీ, పిజి, పిహెచ్‌డి చేసిన గృహిణులున్నారు. తొమ్మిదితో చదువాపేసిన నేనూ, వాళ్లూ గృహిణులుగా మాత్రం ఒకే స్థాయిలో ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది.

ఇంటికీ వంటింటికీ పరిమితమైపోతే – ఆ చదువుని ఏమనాలి? గుడ్డి కన్ను. అది మూసినా, తెరచినా ఒకటే!

అప్పుడే అనుకున్నా, నాకు కూతురు పుడితే, ఆమె చదువు గుడ్డికన్ను కాకూడదని!    

4

చదువుకుని గృహిణులుగా ఉండిపోయిన ఆడవాళ్లని చూసేక, చదువు లేదన్న న్యూనతాభావం నాలో పోతుందని శేఖర్‌ అన్నాడు. నేనొప్పుకోలేదు. విద్యాధికులైన మహిళలు గృహిణులుగా సామాన్యంగా కనిపించొచ్చు. కానీ చదువువల్ల మనోవికాసం కలుగుతుంది. సంస్కారం అలవడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదీకాక చదువు విషయమై నాకు న్యూనతాభావం లేదు. అది నా ఆకాంక్ష. అదే శేఖర్‌కి చెబితే, అతడు నిజమేనని ఒప్పుకున్నాడు. నా చదువుమీద తను దృష్టి పెట్టడానికి ఆర్నెల్లు గడువడిగాడు.  

ఎప్పటికప్పుడు శేఖర్ని నమ్మడం నా బలహీనత. ఇంకొక్కసారి నమ్మి చూద్దామనుకుంటే – నాలుగు నెల్లయినా తిరక్కుండా అమ్మాయి కడుపున పడింది. 

ఆడపిల్ల ఆశయాలకు ప్రకృతి కూడా ఎన్ని అంతరాయాలు సృష్టించగలదో గ్రహించినా నిరుత్సాహ పడలేదు. దూరాలోచన చేశాను. ఎలాగూ ఇద్దరు పిల్లలనుకున్నాం కాబట్టి ఆ ముచ్చటయ్యాకే చదువనుకున్నాను. ఆపైన వయసు నావైపున ఉందన్న ధైర్యం ఒకటి!

పాప పుట్టిన రెండేళ్లకి బాబు. వాళ్లని పెంచి పెద్ద చెయ్యడం అదో సరదా, బాధ్యత. సరదా ఎక్కువగా అతడిది. బాధ్యత ఎక్కువగా నాది. చదువు గురించి ఆలోచిద్దామన్నా, ఊపిరికే సమయం చిక్కని పరిస్థితి.

పిల్లలిద్దరికీ భౌతికంగా ఏ లోపాలూ లేవు. తెలివైనవాళ్లు. చురుకైనవాళ్లు. బుద్ధిమంతులు.

అంతా మమ్మల్ని అదృష్టవంతులమనేవారు. జీవితం బాగుంది నాకు. 

పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్లడం మొదలయ్యేక క్రమంగా మా రొటీన్‌ మారింది. 

పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, రాంకులకోసం వేధించడం, సాటిపిల్లలతో పోల్చడం వగైరా సమకాలీన పద్ధతులు మేం అనుసరించలేదు. ఫస్టు రాంకులు రాకపోయినా, వాళ్లు స్కూల్లో టాప్‌ టెన్‌లో ఉండేవారు. 

చిన్నప్పట్నించీ ఇద్దరికీ, ‘‘మీ చదువుకి ఆకాశమే హద్దు. ఏం చదవాలనుకున్నారో ఛాయిస్‌ మీది. మీ ఛాయిస్‌కి అనుగుణమైన కోర్సులో సీటు సంపాదించుకోవడం మాత్రం మీ బాధ్యత’’ అని చెప్పేదాన్ని.

తీరిక సమయాల్లో ఆటలాడేవారు. కాలనీలో తెలిసినవాళ్లింట్లో సంగీతం నేర్చుకునేవారు. తమ స్వేచ్ఛని మాత్రం దురుపయోగం చేసుకునేవారు కాదు.

అలాంటి సమయంలో మా కాలనీలో సాయంసమయాల్లో తెరిచే మ్యూజిక్‌ స్కూలు తెరిచారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలతో పాటు – తబల, సితార్‌, వీణ, గిటార్‌, వయొలిన్‌ వంటి వివిధ వాయిద్యాలు కూడా నేర్పడానికి సదుపాయముంది. మా పిల్లలు అందులో చేరారు. అక్కడ నేర్చుకున్నది ఇంటికొచ్చి సాధన  చేస్తుంటే – హఠాత్తుగా నాకనిపించింది – నేనెందుకు సంగీతం నేర్చుకోకూడదని!

శేఖర్‌ మెచ్చుకుని, ‘‘సంగీతమూ చదువే కదా! మన స్కూల్లో నువ్వు పిజి చెయ్యొచ్చు’’ అని ప్రోత్సహించాడు. 

కానీ – సాయంత్రం వంట? ఆఫీసునుంచి అలసి వచ్చిన శేఖర్‌కి వంట చేసే ఓపిక లేదు. ఐనా వంటకీ అతడికీ ఎప్పుడూ ఆమడ దూరం. మధ్యాహ్నాలు నాకు కాళీయే. కానీ అప్పుడు చేస్తే వంటకాలు చల్లారిపోతాయి. పిల్లలకీ తనకీ వంటకాలు వేడి వేడిగా ఉండాలి. తాత్కాలికంగా మ్యూజిక్‌ స్కూలు ఆలోచన మానుకున్నాను.

ఐతే అనుకోకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. మా ఆడవాళ్లలో చాలామందికి మ్యూజిక్‌ స్కూల్లో చేరాలనుంది. వాళ్ల సమస్య వేరు. సాయంకాలమనేసరికి షికార్లు, సినిమాలు, షాపింగులు, విజిట్సు వగైరా ప్రతిబంధకాలేవో వాళ్లకున్నాయి. ఉదయం 10-12. మధ్యాహ్నం 2-4 ఐతే అందరికీ కాళీ. ఆ సమయంలో కాలనీ గృహిణులకి మ్యూజిక్‌ క్లాసులు పెట్టాలని మేమంతా కలిసి విన్నవిస్తే, ఆఫీసు ఓకే అంది.

శేఖర్‌ నాకా విషయం చెప్పి నన్ను అభినందించాడు. నేను సంబరపడ్డాను కానీ అది కాసేపే!

మ్యూజిక్‌ స్కూల్లో చేరడానికి కనీసార్హత మెట్రిక్‌ అనేసరికి – ఉక్రోషం, కోపం, సిగ్గు, అవమానం – అన్నీ నన్ను నాలుగు రోజులపాటు బాగా కృంగదీశాయి. శేఖర్‌ నన్ను ఓదార్చాడు. ఇంటికొచ్చి సంగీతం నేర్పేందుకు టీచర్ని పెడతానన్నాడు. స్కూల్లోవాళ్లకంటే నీకే గొప్పగానూ, తొందరగానూ సంగీతం అబ్బుతుందన్నాడు.

మెట్రిక్‌కి కడతాననినేరుగా అనకుండా, ‘‘అందువల్ల నాకు మ్యూజిక్‌ స్కూలో చేరే అర్హత రాదు కదా!’’ అన్నాను. దానికి శేఖర్‌, ‘‘ఈ వయసులో, ఈ బాధ్యతల్తో మెట్రిక్‌కి కడితే – ప్యాసవడం కష్టం. మరేమో ఫెయిలైతే చిన్నతనంగా ఉంటుంది’’ అన్నాడు నేరుగానే. అది నాకు సవాల్లా అనిపించి, ‘‘ఊరుకోకూడదు. నన్ను నేను ఋజువు చేసుకుని చూపాలి’’ అనుకున్నాను.

అప్పటికి నా తమ్ముడు ఎమ్మెస్సీ చేసి రీసెర్చిలో ఉన్నాడు. ఈ విషయం ఉత్తరం రాస్తే వెంటనే స్పందించి, ‘‘మహానటి భానుమతి నలబైఏళ్లప్పుడు మెట్రిక్‌కి కట్టింది. నువ్వు తనకంటే బాగా చిన్న. ఇక్కడికొచ్చేయ్‌. కోచింగ్‌ కూడా ఇస్తా’’ అని బదులిచ్చాడు. పరీక్షలకని నాల్రోజులైతే ఫరవాలేదు కానీ, 3-4 వారాలంటే శేఖరూ, పిల్లలూ గడుపుకోలేరు. ఆ మాట చెప్పి తమ్ముడి దగ్గర వాళ్లని చిన్నబుచ్చడం ఇష్టం లేక, వేరే సాకు చెప్పాను. తమ్ముడు అప్లికేషను, ఫీజు కట్టేసి, పుస్తకాలు పోస్టులో పంపించాడు.

శేఖర్‌కీ, పిల్లలకీ ఏ లోటూ రాకుండా చూసుకుంటూ తీరిక సమయాల్లో చదివేదాన్ని. ముప్పై దాటిన నా వయసుకి ఆకళింపు పెరిగిందేమో, మెట్రిక్‌ పాఠాలు నాకు ఏమాత్రం కష్టమనిపించలేదు. 

జరుగుతున్నది ఇంట్లో ఎవరికీ తెలియదు. మెట్రిక్‌ పరీక్షల సమయానికి తమ్ముడు, ఏదో వంకన నన్ను తన దగ్గరకి రప్పించుకున్నాడు. పరీక్షలకోసం వారం రోజులున్నానక్కడ. 

వాడి గది, స్నేహితులు, ఆ వాతావరణం – అదో కొత్త ప్రపంచం. జీవితంలో అది మిస్సయ్యానన్న బాధని పక్కనెడితే – తమ్ముడి మిత్రులు నన్ను స్వంత అక్కకంటే ఆత్మీయంగా చూసుకున్నారు. 

నేను వెళ్లగానే వాళ్లు మెట్రిక్‌ పరీక్ష వ్రాస్తున్న రెగ్యులర్‌ స్టూడెంట్సు నోట్సు కొన్ని తెచ్చి చూపిస్తే, అప్పుడు తెలిసింది నాకు – మిగతావన్నీ ఓకే కానీ, ఇంగ్లీషు, తెలుగులకి మాత్రం సిలబస్‌ మారింది. తమ్ముడు నాకు పంపిన పుస్తకాలు అంతకుముందు పరీక్షలవి. అంటే ఆ రెండు సబ్జక్ట్సులోనూ పరీక్ష పోవడం కాయం. 

ఏంచెయ్యాలా అన్న మీమాంసలో నేనుండగా, ‘‘ఆ రెండూ వదిలేసి మిగతా సబ్జక్ట్సు క్లియర్‌ చేసేయ్‌. ఆర్నెల్ల తర్వాత మళ్లీ పరీక్షలొస్తాయి. అప్పుడవి క్లియర్‌ చేద్దువు గాని’’ అన్నాడు తమ్ముడు.

రెండు సబ్జక్ట్సుకి పరీక్షలు వ్రాయక తొమ్మిదో తరగతి ఫెయిలయ్యా. తప్పు నాది కాదని తెలిసీ, మావాళ్లు నాకు చదువు రాదని తేల్చారు. ఇప్పుడు నేను మెట్రిక్‌ ఫెయిలైతే, నా తెలివిమీద మళ్లీ అదే ముద్ర పడుతుంది.

‘‘అపజయానికి జడిసి ప్రయత్నం ఆపను. ఆ రెండు సబ్జక్ట్సూ కూడా వదలను’’ అన్నాను. ఏమనుకున్నాడో తమ్ముడు అప్పటికప్పుడు ఆ సబ్జక్ట్సుకి సంబంధించిన గైడ్సు కొని తెచ్చాడు.  

అన్ని పరీక్షలూ వ్రాశా. ఆ రెండు సబ్జక్ట్సుకీ మాత్రం ప్రిపరేషన్‌ కేవలం ఒక్క రాత్రి. ఆ సమయంలో నా ఏకాగ్రతనాకే ఆశ్చర్యం కలిగించింది. 

ఏకాగ్రతో, నమ్మకమో, పట్టుదలో, ఆదృష్టమో – మెట్రిక్‌ ప్యాసయ్యా. ఆ విషయం తమ్ముడు ఉత్తరంలో తెలియబర్చినప్పుడు – మొదటిసారిగా జీవితంలో ఏదో సాధించిన అనుభూతి చెందాను. పిహెచ్‌డి వచ్చినప్పుడు శేఖర్‌కి కూడా అలాంటి అనుభూతి కలిగుండదు.

బాగా ఆడ్డం కాదు. పతకం సాధించాలి. బాగా పాడ్డం కాదు. కచేరీ చేసి వహ్వా అనిపించుకోవాలి.

నేను మ్యూజిక్‌ స్కూల్లో చేరేదాకా శేఖర్‌కీ, పిల్లలకీ నా మెట్రిక్‌ విషయం తెలియదు.

ఆ విజయం పట్టుదలని పెంచింది. సిలబస్‌ మారిన సబ్జక్ట్సు విషయంలో చూపిన ఏకాగ్రతనే సంగీతంలో చూపాను. క్లాసులో సంగీతం టీచరు నా శ్రద్ధాసక్తుల్ని అందరికీ ఆదర్శంగా చెప్పేది. ఐతే సంగీతానికి సాధన అవసరం. అందుకు నాకు తీరిక సమయాల్లో కూడా వీలు చిక్కేది కాదు.

శేఖర్‌కి సినిమా పాటలిష్టం. కాళీ వస్తే రేడియోలోనో, గ్రామఫోన్లోనో. టేపు రికార్డర్లోనో పాటలు వినేవాడు. తనకి శాస్త్రీయం బొత్తిగా పడదు. ఇంట్లో నేను హమ్మింగ్‌ చేసినా తనకి నచ్చేది కాదు. పిల్లలకేమో కామిక్సు, ఆటలు, చదువు, టివి. వాళ్ల సంగీతం మ్యూజిక్‌ స్కూలుకే పరిమితం. పొరపాటున నేను గళం విప్పానో, ‘‘అమ్మా, ప్లీజ్‌’’ అనేసేవారు. సాధనకోసం ఒకోసారి మధాహ్నాలు నిద్ర మానేసేదాన్ని.

అదలాగుంచితే – ఇంట్లో శేఖర్‌కీ, పిల్లలకీ పూర్తిగా నామీదే ఆధారం. ఆఫీసులో రీసెర్చి విషయాలేమో కానీ, ఇంట్లో తన ఇన్‌కంటాక్సు ఫైల్సు దగ్గర్నుంచి అన్నీ నేనే చుడాలి. తనిలా అడగ్గానే అలా నేను తెచ్చివ్వాలి. ఇక పిల్లల సర్టిఫికెట్లూ, రిపోర్టులూ వగైరాలే కాదు – పెన్‌, పెన్సిల్‌, నోట్స్‌, జామెట్రీబాక్స్‌, యూనిఫాం, షూస్‌, సాక్స్‌ లన్నింటికీ నాదే బాధ్యత. వాళ్లందరికీ కావాల్సినవి తెచ్చివ్వడంలో నేను ఐంద్రజాలికుడు సర్కార్‌ స్థాయికి చేరుకున్నానంటాడు శేఖర్‌.

పిల్లలు కాలేజికొచ్చేసరికి ఇంట్లోకి కంప్యూటరూ, లాప్‌టాపు, స్కానరూ, ప్రింటరూ వచ్చాయి. అదనంగా మొబైల్సు. వీటన్నింటికీ ఇంటర్నెట్‌ జోడు. ఇవన్నీ మనిషికి అద్భుతమైన సదుపాయాలు. అందుకే మా ఇంట్లో డిగ్రీలూ, సర్టిఫికెట్లూ, ముఖ్యమైన డాక్యుమెంట్లూ వగైరాలన్నీ స్కాన్‌ చేసి డిజిటల్‌ ఫారంలో ఉంచాలని అంతా అనుకున్నాం. శేఖర్‌కీ, పిలల్లకీ అంత టైం లేక – తమ అవసరాల మేరకు కంప్యూటరు, స్కానింగు నేర్పారు నాకు. అంతవరకూ కంప్యూటరంటే ఏమో అనుకున్న నాకు, కంప్యూటరంటే ఇంతేనా అనిపించింది.

నేను కంప్యూటరు వాడతానని సాటి గృహిణులు ఆశ్చర్యపడినా, నేర్చుకుందుకు కుతూహలం చూపలేదు.

నా స్కానింగు, ఫైళ్ల ఆర్గనైజేషనూ గమనించిన శేఖర్‌, ‘‘ఆఫీసులో నువ్వు నా సెక్రటరీవైతే – మనమింకా ఎన్ని సాధించేవాళ్లమో!’’ అన్నాడు. ఏదైనా ఇట్టే అర్థం చేసుకుంటానని, పిల్లలు కూడా, ‘‘అమ్మా! నువ్వు చాలా స్మార్ట్‌’’ అని మెచ్చుకున్నారు. ఆ పొగడ్తలకి పొంగిపోకుండా, నా దృష్టి ఎప్పుడూ వేరే లక్ష్యాలమీదుండేది.

కంప్యూటరూ, ఇంటర్నెట్టూ నాకో కొత్త ప్రపంచపు తలుపులు తెరిచాయి. వాటిని మరింత బాగా అధ్యయనం చేద్దామంటే – తమ అవసరాలకు మించి శిక్షణ ఇచ్చే సమయం మా ఇంట్లోవాళ్లకి లేదు. అందులోనూ మొబైల్సు – మామధ్య దూరం తగ్గించడానికి బదులు పెంచుకుంటూ పోతున్నాయి. 

ఐనా మనసుంటే మార్గముంటుంది. మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గృహిణులకు కంప్యూటర్లో శిక్షణ ఇచ్చే సంస్థ ఒకటి వెలసింది. నేనక్కడ చేరి మూణ్ణెల్లు శిక్షణ పొందాను. ఇంట్లోవాళ్లకి ఇబ్బంది కలగనివ్వలేదు. వాళ్ల అవసరాలకి లోటు రానివ్వలేదు. నేనిలా శిక్షణ తీసుకుంటున్నానన్న విషయమే వాళ్లకి తెలియదు.

ఇప్పుడు అకౌంట్సుకి ఎక్సెల్‌ వాడుతున్నా. తెలుగులో టైపింగు చేస్తున్నా. అంతర్జాలంలో సోషల్‌ మీడియాను ఫాలో ఔతున్నా. యూ ట్యూబుతో సంగీతానికి మెరుగులు దిద్దుకుంటున్నా.

క్విక్‌ కమ్యూనికేషన్‌కి సంబంధించి, అంతర్జాలంలో సోషల్‌ మీడియా నాకు నచ్చింది. కానీ అందులో చాలామంది చేసే వ్యాఖ్యల్లో అపరిపక్వతా, తొందరపాటూ ఉంటోంది. కొందరు ఉబుసుపోక కబుర్లతో సమయం వృథా చేస్తుంటే, కొందరు స్వంత గొప్పలు చాటుతూ విసిగిస్తున్నారు. ఏ పని చేసినా ఓ ప్రయోజనముండాలనుకుని, ‘నాకిలా అనిపిస్తోంది. మరి మీకు?’ అనే శీర్షికతో ఓ బ్లాగు మొదలెట్టాను.

అందులో – నేనా రోజు సోషల్‌ మీడియాలో ఏయే సైట్లు చూశానో చెప్పి, వాటిలో ప్రయోజనకరమని నాకనిపించిన వాటికి లంకెలు ఇచ్చి, నా అభిప్రాయాన్ని వివరించేదాన్ని. వ్యాఖ్యలెలా ఉండకూడదని నేననుకుంటానో సకారణంగా వ్రాసేదాన్ని. ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని ప్రచురించేదాన్ని.
‘‘ఈ ఐడియా కొత్తది. బ్లాగర్లకి చాలా ఉపయోగం. ఇదివరలో టివిలో వార్తలైనా కాలక్షేపానికే వినే నేను, ఫేస్‌బుక్కులో ఆలోచించకుండా లైక్సు పెట్టే నేను, వాట్సాప్‌ సందేశాల్ని డ్యూటీలా చదివి మర్చిపోయే నేను – ఇప్పుడు ప్రతిదానికీ ఆలోచిస్తున్నా. నా సమయం నన్ను మెరుగుపర్చడానికి ఉపయోగపడాలనీ, నా అనుభూతుల్ని పదిమందికి ఉపయోగపడేలా పంచుకోవాలనీ అనుకుంటున్నాను’’ అని ఒకరు నా బ్లాగుని మెచ్చుకుంటూ వ్రాసేరు. చాలామంది ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. నా బ్లాగుని తెగ పొగిడితే, ఆ పొగడ్తల్ని ప్రస్తావించకుండా, పొగిడినవారి సంఖ్య తెలియబర్చేదాన్ని. వ్యాఖ్యానాల్లో – వీక్షకులకు ప్రయోజనకరమైన అంశాల్ని మాత్రం ప్రస్తావించేదాన్ని.

కొందరు తప్పులెన్నేవారు. పొరపాటు నాదైతే ఒప్పుకోవడం, కాదనిపిస్తే ఎందుకు కాదో వివరించడం నేను పాటించిన సంప్రదాయం. ఐతే కొందరు, ‘‘నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్‌! నీకేం తెలుసని ఫలానా చెత్త వ్యాఖ్యని మెచ్చావ్‌! నీకేమర్థమయిందని ఫలానా గొప్ప వ్యాఖ్యని నిరసించావ్‌!’’ అని ఘాటుగా వ్రాసేవారు. 

‘‘నా అభిప్రాయాలు నావి. వాటిని మీతో పంచుకుంటున్నాను. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. మీ అభిప్రాయాల్నీ అంతా పంచుకుందాం. బ్లాగుకి సంబంధించి, వ్యక్తిగత వ్యాఖ్యలు నిషిద్ధం. భాష విషయంలో మర్యాద తప్పనిసరి’’ అని వారికి జవాబిచ్చేదాన్ని. పొగిడేవారు పొగుడుతున్నారు. తెగడేవారు తెగడతున్నారు. బ్లాగుకి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఎందరో అమూల్యమైన తమ అభిప్రాయాల్ని పంచుకుంటూ, బ్లాగు విలువని పెంచుతున్నారు. ఫలితంగా – ఏడాది తిరక్కుండా, నా బ్లాగుకి ఓ సంస్థ అవార్డు ప్రకటించింది. అలా మా ఇంట్లో బ్లాగు నడుపుతున్న విషయం బయటపడింది. 

అప్పటికి అమ్మాయి మెడిసిన్‌ పిజిలో గోల్డ్‌ మెడలిస్టు. అబ్బాయి బిట్స్‌ పిళానిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి అహమ్మదాబాదు ఐఐఎంలో ఎంబియ్యే చేస్తున్నాడు. అదే సమయంలో శేఖర్‌కి ఢిల్లీలో ఓ సంస్థ ‘సైంటిస్ట్‌ ఆఫ్‌ ది యియర్‌’ అవార్డ్‌ ప్రకటించింది. తెలుగువాడికి ఆ అవార్డు రావడాన్ని విశేషంగా భావించి, విశాఖపట్నంలో ఓ సంస్థ శేఖర్‌కి సన్మానం తలపెట్టింది. అది తెలియబర్చడానికి ఓ సుబ్బారావు శేఖర్‌కి ఫోన్‌ చేశాడు. 

మాటల్లో మా అందరి వివరాలూ విన్న సుబ్బారావు, ‘‘మైగాడ్‌! మీదో ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఫామిలీ! సన్మానం మీకే కాదు, మీ కుటుంబానికంతకీ జరగాలి’’ అంటే, మాటవరసకి అన్నాడనుకున్నాం. కానీ తర్వాత మాకొచ్చిన ఆహ్వానపత్రంలో సన్మానితుల స్థానంలో మా అందరి పేర్లూ ఉన్నాయి.

వేదికమీద మా నలుగురికీ సన్మానం ఘనంగా జరిగింది. తర్వాత ఒకొక్కర్నే మాట్లాడమంటే – ముందుగా శేఖర్‌ ఆ సంస్థకి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత జన్మనిచ్చిన తలిదండ్రుల్ని ప్రస్తావించాడు. చివర్లో, ‘‘ప్రతి మగాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. ఐతే నా భార్య నాకు వెనుక, ముందు, పక్కల, అన్నింటా ఉండి – నన్ను ముందుకి నడిపించింది. నాకై తను వెచ్చించిన సమయం, చేసిన త్యాగాలు అనన్యసామాన్యం. ఆమె సహకారం, ఆసరా లేకుంటే నేనీ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. తనకి తానుగా అవార్డులు సాధించుకో గలిగినా, నా ఈ ఆవార్డు కూడా ఆమెదే!’’ అన్నాడు. తర్వాత పిల్లలిద్దరూ కూడా అదే తరహాలో నన్ను తెగ పొగిడి, ‘‘అమ్మవల్లనే, మేమీ స్థాయికి చేరుకోగలిగాం’’ అని తేల్చారు.

నా వంతొచ్చింది. శేఖర్‌లాగే ముందు అమ్మానాన్నల్ని ప్రస్తావించాలనుకున్నాను. ఐతే – అబద్ధం చెప్పే అలవాటు చిన్నప్పుడే లేదు నాకు. కొత్తగా రమ్మంటే ఇప్పుడెలా వస్తుందీ? 

పోనీ అమ్మా నాన్నల్ని పక్కనపెట్టి శేఖర్నీ, పిల్లల్నీ పొగిడి బదులు తీర్చుకోవాలనుకున్నా అదే సమస్య!

అంతా నా గురించి మంచి మాటలన్నప్పుడు నేనూ వాళ్ల గురించి నాలుగు మంచి మాటలనాలి కదా! కానీ – అబద్ధం చెప్పలేను. నిజం చెబుదామంటే – నిష్ఠూరమౌతుందని భయం.

నన్ను ప్రేమించేవాళ్లు. నా మనసుకు కష్టం కలగకూడదనుకునేవాళ్లు. ఆపైన తామందుకుంటున్న ఉన్నత శిఖరాలకు నేనే కారణమని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నవాళ్లు. 

వాళ్ల గురించి అబద్ధం చెప్పలేను. నిజం చెప్పాలి. కానే దానికిదా సమయం? 

నా చెవుల్లో గురజాడ వారి గేయం – ‘ఫక్కున నవ్వెను పూర్ణమ్మ’ అని గింగురుమంటోంది. ఏం చెయ్యను?

సభకు రెండు చేతులూ జోడించి నమస్కరించాను. 

సభలో ఒకరా, ఇద్దరా ఎందరో మహానుభావులు. అంతా నన్ను అభినందనపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే ఆరాధనాభావంతో చూస్తున్నారు. నాకు మాత్రం వారంతా ఆడజన్మని తెగ పొగడుతూ, ఆడదాన్ని మాటల్లో అందలాలెక్కిస్తూ, ఆమె ఎదుగుదలకు చిన్నమెత్తు కృషి చెయ్యాలన్నా వెనుకాడేవాళ్లులాగే కనిపించారు.

పక్కకు చూస్తే నన్ను ఆకాశానికెత్తేసిన శేఖర్‌, పిల్లలు…. 

అప్రయత్నంగా ఫక్కున నవ్వాను.

జనమింకా నేనేదో చెబుతానని చూస్తున్నారు. 

నేను మాత్రం చెప్పాల్సిందైపోయినట్లు మళ్లీ నా సీట్లో కూర్చున్నాను……

    *****

 

 

 

 

   

 

 



Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.