యాత్రాగీతం(మెక్సికో)-4
కాన్ కూన్
-డా||కె.గీత
భాగం-6
కాన్ కూన్ లో మొదటి రోజు టైం షేరింగు స్కీము వాళ్ల బారిన పడి సగం రోజు వృథా అయినా సాయంత్రం వెళ్లిన పైరేట్ షిప్పుటూరుతో ఆహ్లాదంగా గడిచింది. రెండవ రోజు మేం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన “చిచెన్ ఇట్జా” టూరుకు బుక్ చేసుకున్నందున ఉదయానే లేచి తయారయ్యి హోటలు లాబీలో చక్కని రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి టూరు బస్సు కోసం సిద్ధమయ్యేం. మా హోటలు నుంచి మరో రిసార్టు వరకు చిన్న వ్యానులో వెళ్లి అక్కడి నుండి పెద్ద బస్సులో ఎక్కేం. దాదాపు మూడు గంటల పాటు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసేం.
దారి పొడవునా భూమి నుంచి దాదాపు పదడుగుల వరకు పెరిగిన దట్టమైన మొక్కల వంటి పొదలే తప్ప ఎత్తైన వృక్షాలు లేవు.
ఇక పల్లెటూళ్లయితే అచ్చు ఇండియాలోలాగే ఉన్నాయి. ఎటొచ్చీ అంత జనాభా లేరు, అంతే తేడా.
దాదాపు 11 గంటల వేళ చిచెన్ ఇట్జా కు చేరుకున్నాం. చిచెన్ ఇట్జా మాయా సంస్కృతికి చెందిన ఎత్తైన ప్రాచీన కట్టడం.
దాదాపు పావు మైలు దూరంలో బస్సులు నిలిపే స్థలం నుంచి లోపలికి నడవాలి.
అక్కడ ఎంట్రన్సు టిక్కెట్లు కొనుక్కున్న ప్రదేశం నుంచి మొదలుకొని చిచెన్ ఇట్జా కట్టడం వరకు దారి పొడవునా బట్టలు, పూసలు, రాళ్లు మొ.వి అమ్మే దుకాణాల వరుసలు మళ్లీ ఇండియాని తలపింపజేసేయి.
చివరి దుకాణం దాటుతూనే ఎదురుగా కనబడ్డ చిచెన్ ఇట్జా కట్టడం వైపు చూసేసరికి నోటమాట రాలేదు. ఆ కట్టడం చిన్నదీ, చితకదీ కాదు. భూమి మీద నుంచి ఆకాశమ్మీదికి పోటీ పడుతూ నిత్యగంభీరంగా శతాబ్దాల తరబడి మా కోసమే వీక్షిస్తున్న అత్యద్భుత మేరు పర్వతంలా ఉందది. అమెరికా ఖండంలో మేం చూసిన మొట్టమొదటి అత్యంత ప్రాచీన కట్టడమది.
ఎక్కడికక్కడ పెళ్లలు ఊడి రాలుతున్న కట్టడం చుట్టూ తాళ్లు కట్టి ఎవర్నీ దాటి పైకి ఎక్కడానికి అనుమతించడంలేదు. కట్టడాన్ని పరిరక్షించడం కోసం, పునర్నిర్మించడం కోసం అలా చేస్తున్నా పైకి ఎక్కాలనుకున్న వారికి ఆశాభంగమే.
ఇక నేను గైడు చెప్పే మాటలు వినడం పక్కనబెట్టి, అలా నిలబడి కట్టడం వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను.
ప్రధాన కట్టడానికి నాలుగు వైపులా ఇతర కట్టడాల వంటివి ఉన్నాయి. అవి కూడా ఎత్తుగానే ఉన్నాయి.
ఆ రోజు బాగా వేడిగా ఉండడంతో ఎండ చుర్రుమంటూంది.
అంతలో సిరి అస్సలు నడవనని పేచీ మొదలు పెట్టింది.
ఇక మాది గైడెడ్ టూరు కావడంతో గైడు, తోటి సందర్శకులతో బాటూ సత్యని, వరుని వెళ్లమని నేను సిరితో బాటూ మొదటి చెట్టు కిందే ఉన్న బెంచీమీద కూచున్నాను. అయితేనేం ఎదురుగా చిచెన్ ఇట్జా నాతో తన ఊసులన్నీ కలబోసుకుంటూనే ఉంది.
ఒకప్పటి మాయా సంస్కృతిలో భాగమైన ఈ అతి పెద్ద కట్టడం ప్రపంచంలో ఎనిమిది ఆధునిక వింతల్లో చోటు చేసుకుందంటే ఆశ్చర్యం లేదు.
అక్కడ ఉన్న స్థానికులంతా మాయా సంతతికి చెందిన వాళ్లే. వాళ్లని చూడడం, మాట్లాడడం అత్యంత ఆనందాన్ని కలిగించేయి నాకు.
మాయా సంతతికి చెందిన వాళ్లంతా పొట్టిగా, లావుగా ఉన్న మనుషులు. వారి పూర్వీకులు ఇలాంటి ఆకాశ హర్మ్యాన్ని నిర్మించగలిగేరంటే చాలా గొప్ప విషయం.
క్రీ.శ 750 నుండి 900 వరకూ ఈ కట్టడాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి.
మెక్సికో లోని యూకతాన్ ద్వీపకల్పానికి చిచెన్ ఇట్జా ఒకప్పుడు ప్రధాన నగరం. ఈ చుట్టుపక్కలంతా “సెనోట్”లనబడే భూగర్భ జలాంతర్వాహినులుంటాయి. ఇవి అతి పెద్ద మంచి నీటి నిల్వలు. ఇక్కడ సహజ సిద్ధంగా కొన్ని చోట్ల అత్యంత పెద్దవైన బావులేర్పడ్డాయి. కొన్ని జలాంతర్వాహినులు గుహాంతరాళాల్లో ప్రవహిస్తూ ఉంటాయి.
స్థానిక భాషలో “చిచెన్ ఇట్జా” అంటే ఇట్జా జాతికి చెందిన భూగర్భ జలాంతర్వాహిని ముఖ ద్వారమని అర్థమట.
చిచెన్ ఇట్జా లోని ఎత్తైన ప్రధాన కట్టడాన్ని స్పానిషు భాషలో “ఎల్ కాస్తిలో” (The Castle) అని అంటారు. దీనినే స్థానికులు “కుకుల్కాన్ గుడి” (Temple of Kukulcan) అని అంటారు. ఇది పిరమిడ్ ఆకారంలో కట్టబడింది.
దాదాపు 5 చదరపు కిలోమీటర్ల లో విస్తరించి ఉన్న చిచెన్ ఇట్జా ఒక్క కట్టడం కాదు. కట్టడాల సముదాయం.
ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశాన్ని కాస్తిలో పిరమిడ్ (Castillo pyramid) , లాస్మోహాస్ (Las Monjas) , ఒసారియో (Osario), ప్రధాన నైరుతిమూల కట్టడాలు అనే నాలుగు విభాగాలుగా విభజించారు.
ఇవన్నీ ఒక రకమైన సున్నపురాతితో నిర్మించిన కట్టడాలు. ఒకప్పుడు స్థానికంగా చెట్ల నుండి, రాళ్ల నుండి లభ్యమయ్యే ఎరుపు, పచ్చ, నీలం, ఊదా రంగులతో అలంకరించబడి ఉన్నవి కూడా.
ఇక ఇక్కడ చూడదగ్గ ప్రధానమైన ప్రదేశాలు ఏవిటంటే ఉత్తరాన కుకుల్కాన్ గుడి [El Castillo (Temple of Kukulcan)], వీరుల ఆటస్థలం (Temple of Warriors and the Great Ball Court), ఒసారియో విభాగంలో తోలిక్ గుడి (Temple of Xtoloc) మధ్యస్థాన కారాకోల్ (the Caracol),లాస్మోహాస్ (Las Monjas), అకాబ్ దీబ్ (Akab Dzib) కట్టడాలు, దక్షిణాన పాత చిచెన్ లేదా చిచెన్ ఓహో(Chichén Viejo- Old Chichén).
*****
(ఇంకా ఉంది)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –