షర్మిలాం”తరంగం”

వ్యక్తిగతాల్లోకి జొరపడొద్దు

-షర్మిల కోనేరు 

పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగి చూసే నైజం మనలో ఎక్కువగానే కనిపిస్తుంది .

వాళ్లతో కష్టం సుఖం పంచుకోవడం వేరు వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడడం వేరు.

ఎదుటివాళ్ల వ్యక్తిగతాన్ని వాళ్లకే వదిలెయ్యాలనే కనీస స్పృహ లోపిస్తోంది.

ఇంతగా ఎదుగుతున్న మనం మరుగుజ్జులుగా మారిపోతున్నాం .

ఎదుటివాళ్లను జడ్జ్ చేసే అధికారం మనకు ఎవరిచ్చారు?

ఇటీవల ప్రముఖవ్యక్తులు కొందరి మరణం ఇదే ప్రశ్న లేవనెత్తింది.

ఎదుటి వాళ్ల జీవితం గురించి , విలువల గురించి తీర్పులు చెప్పాల్సిన అవసరం, హక్కు ఎవరికీ లేదు.

ఇదే కాదు బాడీ షేమింగ్ అనే మాట ఇప్పుడు ఎక్కువ వాడుకలో వున్న పదం. రూపురేఖల ప్రస్తావన, లావయ్యావనో సన్నబడ్డావనో , రంగుల ప్రస్తావన కూడా కూడా చాలా ఎక్కువ .

ఇది మనసుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మాటల్లో వర్ణించలేము .

24 గంటల్లో పడుకునే సమయం తప్ప డైటింగనో వాకింగ్ అనో వెయిట్ అనో ఉచ్చరించకుండా సమయం గడవని వాళ్లంతా బాడీ షేమింగ్ బాధితులే .

ఎవరో కాదు … స్వయానా నేనే ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడి , ఇప్పుడు నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను .

నా పిల్ల పెళ్లి కాక ముందు నాజూగ్గా సన్నజాజి తీగలాగా వుండేది .

పెళ్లయి పిల్ల పుట్టాక బొండుమల్లె పొదలా మారింది .

ఇక అందరూ ” అబ్బో ఇలా తయారయ్యిందేంటి ” అనటం విని విని నేను కూడా దాన్ని సాధించడం మొదలెట్టాను .

అది నా ఎదురుగా అన్నం తినాలన్నా భయపడే స్థితికి తెచ్చాను .

చుట్టూ వున్న జనం కన్నా నేనేం భిన్నం గా ప్రవర్తించాను? నేనూ ఈ సమూహంలో దాన్నేగా!

జీవితాంతం ఎదుటివాళ్ల మెప్పుకోసం బతకలేం .

నిజంగా అందర్నీ మెప్పించలేం కూడా .

వాళ్ల రంగాల్లో అత్యంత ప్రతిభావంతులైన మైకేల్ జాక్సన్,  శ్రీదేవి లాంటి వాళ్లు కూడా ఆత్మన్యూనతతో సర్జరీలు చేయించుకున్న వాళ్లే .

మైకేల్ జాక్సన్ తండ్రి కొడుకు ముక్కు బాగాలేదని ఎప్పుడూ కించపరిచే వాడట .

ఆ ఆత్మన్యూనత చివరి వరకూ ఆ పాప్ స్టార్ ను వెంటాడింది .

అతని ప్రతిభ ముందు ఆ చిన్న లోపం ఎంత .

ఎవరిదాకానో ఎందుకు నేనూ నా బిడ్డకి వున్న ఎన్నో గొప్ప గుణాలు గుర్తించడం మానేసి దాన్ని వేధించడం సిల్లీగా అనిపిస్తుంది నాకే .

అంతెందుకు ఈ వయసులో డైట్లనీ అదనీ ఇదనీ మొదలెట్టి స్లిమ్ గా కనబడాలనే తాపత్రయం వెనుక కూడా తెలియని సమూహపు వత్తిడే కారణం .

నన్ను చూసి నా మనవరాలు ” నేనూ ఎక్కువ తినను ఫ్యాట్ అవుతానేమో !” అన్నప్పుడే నేను చేస్తున్నది ఎంత తప్పో అర్ధమైంది .

పసి మనసుని కూడా కలుషితం చేసే సిగ్గుమాలిన పని ఇక చేయకూడదని నిశ్చయించుకున్నా .

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో మహేష్ బాబు అంటాడు .

మీకేం పనిలేదేంట్రా ఎవరన్నా కనపడగానే లావయ్యావ్ ! సన్నబడ్డావ్ అనే మాటలు తప్ప ఇంకా మాటల్లేవా అని .

ఈ స్లిమ్మింగ్ సెంటర్లు , బ్యూటీ పార్లర్ల ఎండమావుల వెంట పరిగెత్తే దౌర్భాగ్యానికి స్వస్తి చెప్పి ఫిట్ గా వుండడం , ఆరోగ్యంగా తినడం అలవాటు చేసుకోవాలని నా మట్టుకు నేను డిసైడ్ అయ్యాను.

ఎదుటి వారికి కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల వారిలో తెలియని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కాస్త మంచి బట్టలేసుకుంటే ” నైస్ డ్రెస్ !” అన్న కాంప్లిమెంట్ ఇవ్వడం తెల్ల వాళ్లకి బాగా అలవాటు .

మొన్న ఒకావిడ నాతో వాపోయింది. మంచి చీర కట్టుకుని చక్కగా తయారై ఫుంక్షన్లకి వెళ్లినా బ్లౌస్ కుదరలేదనో , ఇంకో బోర్డర్ అయితే అదిరిపోయేదనో అని మొహం చిన్నబుచ్చే వరకూ వాళ్ల చుట్టాలు వదలడం లేదట .

అదే ఎవరైనా మెచ్చుకుంటే ఉత్సాహంగా అనిపిస్తుందని కానీ ఎప్పుడూ నీరుగార్చే వాళ్లే తప్ప కాంప్లిమెంట్లు ఇచ్చే వాళ్లే కనబడరని ఆమె చెప్పినప్పుడు నిజమే అనిపించింది .

ఈ చీర నీకు బాగా నప్పిందనో , చక్కగా కనిపిస్తున్నావనో అంటే మన సొమ్మేమీ పోదుకదా !

అంతేగానీ లోపాల్ని ఎత్తి చూపి వాళ్లు తెల్లమొహం వేసుకుంటే ఆనందించే వాళ్లని ఏమందాం ?

*****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-4”

  1. షర్మిల గారూ మంచి అంశాన్ని ప్రస్తావించారు. అందులో మిమ్మల్ని మీరు చూపించు కోవటం అభినందించాలి. మనలను మనం సంస్కార వంతులుగా దిద్దుకుంటే సమాజాన్ని ఉద్ధరించి నట్లే కదండీ.

Leave a Reply

Your email address will not be published.