సోమరాజు సుశీల స్మృతిలో –
ఇల్లేరమ్మకు నివాళి
-తమిరిశ జానకి
స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ తెచ్చుకున్నారు. పారిశ్రామికరంగంలో అడుగుపెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్త్రీ పారిశ్రామిక వేత్తగా ప్రముఖులచేత ప్రశంశలు పొందారు. సుశీలగారు నిరాడంబరులు సౌమ్యులు. ఆవిడను చూస్తే ఇంత చదువుకున్నారా అని స్వంతంగా పరిశ్రమ నడుపుతున్నారా అని ఆశ్చర్యం కలగక మానదు. భాగ్యనగర్ లేబొరేటరీస్ స్థాపించారు. మహిళా ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్న ఘనత ఆవిడది.
యాభై సంవత్సరాలు దాటిన తర్వాత రచనారంగంలో అడుగుపెట్టిన సుశీలగారు మొదటి అడుగుతోనే ప్రముఖ రచయిత్రిగా పేరు గడించారు. ఇల్లేరమ్మ కధలతో ఆవిడ పేరు ఇల్లేరమ్మగా స్థిరపడిపోయిందనడంలో ఆశ్చర్యంలేదు. ఇల్లేరమ్మ కధలు కల్పితంకాదు ఆకధలన్నీ ఉన్నదున్నట్టు రాసిన మా ఇంటి కదలే అంటారు ఆవిడ. ఇల్లేరమ్మ కధలు ప్రతి ఒక్కరూ చదివవలసిన కధలు. అలాగే ఆకలంనుండి జాలువారిన చిన్నపరిశ్రమలు – పెద్దకధలు అనే ధారావాహిక పారిశ్రామికరంగంలో ఆవిడ ఎదుర్కొన్న కష్టాలకి ఒక రూపం. అవి కధలుకావు నా గోడు వెళ్ళబోసుకోవడమే అని ఒక్క ముక్కలో అనేస్తారు. స్వానుభవమ్మీద రాసినవి మరి. ఆలస్యంగా రచనలు మొదలుపెట్టినా రాసిన కధలన్నీ ఆణిముత్యాలే. పరిశ్రమలు , రచనలు మాత్రమే కాదు. వివిధ సామాజిక సేవా రంగాలలో ఎప్పుడూ ముందుంటారు ఆవిడ.
రామసేతు ప్రాజెక్టులో యాక్టివ్ గా పనిచేశారు. తిరుమల తిరుపతి సంరక్షక సమితికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. లయనెస్ క్లబ్ కి జిల్లా అధ్యక్షులుగానూ, వాలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాణి రుద్రమ ట్రస్టుకి మరియు అపరాజిత సేవాసమితి వాలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి రెండింటికీకూడా అధ్యక్షులుగా ఉన్నారు.
ప్రాంత్ సంపర్క్ ప్రముఖ్ లో పది సంవత్సరాలుగా పాలుపంచుకుంటున్నారు.రాష్ట్ర సేవికాసమితిలో 2005 నుండి సామాజికసేవ చేస్తున్నారు. ఎన్నో సెమినార్లు , వర్క్ షాపులలో అధ్యక్షులుగా వాలంటరీ వర్క్ చేశారు. మహిళలసాధికారత , స్వయుంఉపాధి, విద్య ,సాంకేతికరంగంలో అభివృద్ధి ఇంకా ఇతరములైన సామాజిక అంశములపై ఎన్నో సభలలో ప్రసంగించారు.
సుశీలగారు హిందూధర్మం , సంప్రదాయాలను వివరిస్తూ మంచి రచనలు పాఠకులకు అందించారు .చిన్నపరిశ్రమల గురించి మాత్రమేకాదు ప్రముఖులైన శాస్త్రవేత్తలు విద్యావేత్తలు గురించిన పుస్తకాలు రాయడమే కాదు ప్రముఖ శాస్త్రవేత్త నాయుడమ్మ జీవితచరిత్ర రాశారంటే ఆవిడ గొప్పతనం మాటల్లో చెప్పలేనిది.
లక్ష్మీబాయి కేల్కర్ మరాఠీ భాషలో రాసిన రామాయణంపై ప్రసంగాలను , ఆర్.ఎస్.ఎస్.లో ప్రముఖ సంచాలకులైన ప్రొఫెసర్ సింధునవలేకర్ ఇచ్చిన ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు సుశీలగారు.
సామాజికంగానూ సాహిత్యపరంగానూ ఇంకా ఎంతో సేవ చేసే మనస్తత్వం ఉన్న సుశీలగారివంటి మంచిమనిషి హఠాత్తుగా సెప్టెంబర్ 26-2019న ఈలోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మనందరికీ ఒక తీరని లోటు. జీర్ణించుకోలేని సత్యం. నమ్మకతప్పదు. ఆవిడకు మనందరి తరఫునా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
*****
ప్రయాణం
-సోమరాజు సుశీల
పేరు…………..తమిరిశ జానకి
పుట్టినఊరు….మచిలీపట్నం, క్రిష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ . ( అమ్మమ్మగారి ఊరు )
తండ్రిగారి ఊరు—నర్సాపురం , పశ్చిమగోదావరిజిల్లా .
పుట్టినతేదీ——-26- 10- 1946
విద్య———–బి.ఏ.
రచనలు చేయడం మొదలుపెట్టినది 1960 లో హైస్కూల్లో చదువుతున్నప్పటినుండీ. హైస్కూల్ మేగజైన్ ,కళాశాల మేగజైన్ , చిన్నచిన్న స్థానిక పత్రికలలోనూ రచనలు చేశాను. అప్పుడు నాపేరు యర్రమిల్లి జానకి. పూర్తిపేరుతో రాయకుండా వై.జె. అనే పేరుతో రాసేదాన్ని. కళాశాలలో చదివేటప్పుడు మంజువాణి అనే పత్రికవారు అన్ని ఊళ్ళల్లోని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన కధలపోటీలో నా కధకు బహుమతి వచ్చింది. యువ, జ్యోతి మాసపత్రికలలోనూ, ఆంధ్రపత్రిక, చుక్కాని పక్షపత్రికలోనూ,కృష్ణాపత్రికలోనూ, ఎమ్.ఎస్.కో వారి పుస్తకప్రపంచంలోనూ వై.జె. అనే పేరుతోనూ, వై.జానకి అనేపేరుతోనూ కధలు రాసేదాన్ని. 1965లో వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్ని పత్రికలలోనూ కధలు , కవితలు , వ్యాసాలు, నవలలు రాస్తూనే ఉన్నాను.