ఇట్లు మీ వసుధారాణి.
ఆనందాంబరం మా నాన్న-2
-వసుధారాణి
మా తాతగారు అలా అర్ధాంతరంగా చనిపోవటం ,మా నాయనమ్మ అయిదుగురు కొడుకులతో విజయవాడలో ఉండటం విన్నప్పుడు నాకు కుంతీదేవి తన కొడుకులతో లక్కయింటి నుంచి బకాసురుడి ఊరు వెళ్లటం గుర్తుకు వచ్చింది .
తమ బాబాయి కొడుకు అయిన రూపెనగుంట్ల పిచ్చయ్య గారి కుటుంబం ఇలా అయిందని తెలుసుకుని మా పెద్ద అమ్మమ్మ విజయవాడకు తమ్ముడి భార్యని అంటే మా నాయనమ్మని పలకరించటానికి వచ్చిందట.అప్పుడు 16 సంవత్సరాల వయసులో, ఉంగరాల జుట్టుతో,గుండ్రని చక్కని అందమైన ముఖంతో,పచ్చటి మేని ఛాయతో ఉన్న మా నాన్నని చూసి ఆవిడ పిల్లాడు చక్కగా ఉన్నాడు మన రాధమ్మకి ఈడుజోడు అని ఆనంద పడిపోయి,పైగా తమ్ముడి కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఉంటుంది అనుకుని మా నాయనమ్మతో మాట్లాడుకుని పెళ్లి నిశ్చయం చేసుకుని వెళ్లిందట.
పెళ్లి నాటికి మా అమ్మకు 9 ఏళ్ళు,మా నాన్నకు 16 ఏళ్ళు.అలా పెళ్లి చేసి అమ్మకి 16 వ ఏట నాన్నని ఇల్లరికం తీసుకువచ్చుకున్నారు అమ్మమ్మలు ఇద్దరు.పేరుకి ఇల్లరికమే నాన్న అక్కడ ఉండకుండా మద్రాసు,త్రివేండ్రం, మంగుళూరు,ఉడిపి, ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కాంట్రాక్టు పనుల పేరుతో తిరుగుతూ ఉండే వారు. పెద్దమ్మమ్మ చనిపోయేనాటికి ఆయన బెంగుళూరులో పరిమళ ,ప్రదీప్ అనే జంట సినిమా హాళ్ళకి వర్కింగ్ పార్టనర్ గా ఉన్నారట.
పెద్దమ్మమ్మ చనిపోయినాక ఇంక ఆయన ఇంటిపట్టున ఉండటం తప్పని సరి అయింది.అయితే అచ్చం మా తాతగారి లాగానే చేసారు అన్ని రోజులు ఆ సినిమా హాళ్ల కట్టుబడి నుంచి అన్నీ చూసుకున్న ఆయన తన వాటాని మిగిలిన భాగస్తులు న్యాయంగా పంచి ఇవ్వటం లేదని మొత్తం హక్కులు ఉదారంగా వదిలేసి వచ్చేసారు.
చూసేవారికి పిచ్చితనంలా ఉన్నా, ఇక్కడ భార్యాపిల్లలకి అన్యాయం జరిగినా మాట పడక పోవటం ,డబ్బువిషయాల గురించి గొడవ పడక పోవటం జీన్స్ లోనే వచ్చిన లక్షణం అన్నమాట.అలా కట్టుబట్టలతో వెనక్కి వచ్చిన నాన్న ఇక్కడ ఉన్న పొలం వ్యవసాయం చూసుకోవడం మొదలు పెట్టారు.ఐతే మాకు అదృష్టం కొంచెం తక్కువ అనుకుంటా ఆయనకు ఉన్న మధుమేహ వ్యాధి వలన కాలికి వేసుకునే బూటు ఒరుచుకుని అయిన గాయం సెప్టిక్ అయ్యి ఆయన కుడి కాలు తొడవరకూ తీసేయాల్సి వచ్చింది.
జయపూర్ వెళ్లి కృత్రిమ కాలు తయారు చేయించుకుని వేసుకున్నారు దానికోసం వేసుకున్న బూటు వలన రెండవ కాలు కూడా అలానే అయి మోకాలు కింద వరకూ రెండవ కాలు తీసేయాల్సి వచ్చింది.నాకు అప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు.
ఒక మనిషి కష్టాల్లో కూడా నిబ్బరంగా ఉండటం మీరు చూసి వుంటారు,ధైర్యంగా ఎదుర్కోవటం కూడా చూసి ఉంటారు , అసలు ఇది కష్టం అన్న విషయం ఆయన మర్చిపోయి పక్కవాళ్ళని కూడా మరిపించేలా చేయగలిగిన వ్యక్తిత్వం మా నాన్నది.
ఇంత దురదృష్టంలో కూడా మిగిలిన అందరు పిల్లలకు దక్కనిది, నాకు దక్కినది అయిన అదృష్టం ఏమిటంటే ఆయనతో గడిపే సమయం.ఆయన అప్పటివరకు చూసిన బాహ్య ప్రపంచం ఆయన దృష్టితో నాకు చూపించారు.ఆయన మొత్తం దక్షిణాది భాషలూ,హిందీ,ఆంగ్లము అనర్గళంగా మాట్లాడగలడు.సంతోషంగా ,సరదాగా ఉండేవాడు.చిన్నప్పటి నుంచి నాకో అలవాటు ఉంది ఏదైనా తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన వారిని వెతికి పట్టుకొని ప్రశ్నలు వేసి సమాధానాలు శ్రద్ధగా విని తెలుసు కోవటం.మా నాన్నకు తెలియని విషయం లేదు అన్నట్లు ఉండేవాడు ఇంకేముంది ఇంట్లో నే నాకు బోలెడు సమాచారం.
మా నాన్నతో చెప్పించుకున్న వింతలూ, విశేషాలూ అన్నీ బడిలో పిల్లల దగ్గర గొప్పగా కోతలు కోస్తుండే దాన్ని.ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం చాలా సులువుగా దొరికేది.ప్రశాంతమైన ఆలోచన చేయటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను.ఒకసారి చెప్పాడు” నేను నా రెండుకాళ్ళు పోగొట్టుకుని మంచంలో ఉండి ఇలా అమ్మ మీద , మీమీద ఆధారపడ్డాను ఇక ఇంతకంటే కష్టం నా జీవితంలో ఇంకేమి వస్తుంది.ఇంక దేనికి నేను భయపడాలి అని.”
ఆ పాఠం నా చిట్టి బుర్రకి బాగానే ఎక్కింది అనుకుంటా. నాకూ కష్టాలకి వెరచే గుణం రాలేదు.ఏమవుతుంది మహా అయితే అన్న మొండిదైర్యం ఏదో ముందుకు నడిపించేది.అయితే అజాగ్రత్త మాత్రం లేదు సావధానంగా,అప్రమత్తం గా ఉండటం రెండూ కూడా నాన్న నాకు చెప్పేవాడు. అప్పటి నా వయసుకు తగ్గట్టు వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ,తెలివిగా ఎలా ఆలోచించుకోవాలో నాన్నే నేర్పాడు.అంతే కాదు మా అందరికీ వచ్చిన స్నేహశీలత్వం కూడా మా నాన్న నుంచి వచ్చిందే.
సినిమా నటుడు రావుగోపాల రావు మానాన్నకి ఓ ఉత్తరం రాసాడు ఆయనకి రెండవ కాలు తెసేసారని తెలిసినప్పుడు.నీ వంటి సంతోషకరమైన,హుషారైన మిత్రునికి ఇలా జరగటం బాధ కలిగించింది అని.ఆయనకి చాలా మంది వివిధ రంగాలలో గొప్ప గొప్ప వారయిన మిత్రులు ఉన్నారు. ఈయన వాళ్ళని సంతోషంగా ఉంచాలని చూసేవాడు తప్పితే ఎప్పుడూ ఏ స్నేహితునీ ఏ సహాయం అడగలేదు తన గడ్డు రోజుల్లో కూడా.
డబ్బు సంపాదన మాత్రమే ప్రయోజకత్వం అనుకునే సమాజంలో ఆయన డబ్బుని సంపాదించలేదు కానీ ,వారసులకు కొన్ని గొప్ప గుణాలను పంచి ఇచ్చారు అది చాలదా అనుకుంటాను నేనయితే.
నా ఎనిమిదవ ఏట మొదటికాలు తరవాత ఏడాదికి రెండవకాలు పోగొట్టుకున్న నాన్న, నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా పక్షవాతానికి గురియై ఒక చేయి,మాట కూడా కోల్పోయారు.అలా ఆయన ఒకటిన్నర సంవత్సరం ఉన్నారు. ఆ సమయంలోకూడా ఎవరయినా బంధువులో,స్నేహితులో ఆయన్ని చూడటానికి వస్తే మెరిసే కళ్ళతో నవ్వుతూ చూసే వాడు. అప్పుడు ఈ సింహం మా నాన్న అని చెప్పలేని గర్వం కలిగేది.పాపం చూడటానికి వచ్చిన వారు ఆయనతో వారి వారి సన్నిహితత్వాన్ని ,స్నేహాన్ని గుర్తుచేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకునే వారు కానీ మానాన్న చాలా నిబ్బరంగా ఉండేవాడు.
నా పదవ తరగతి పరీక్షలు అయ్యాక ఎండాకాలం సెలవలకి నేను మా లక్ష్మి అక్కయ్య ఇంటికి హైద్రాబాద్ వెళ్ళాను.అప్పుడు మా అన్నయ్య ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవాడు.వాడు వచ్చి నాన్నని కొన్ని రోజులు నేను చూసుకుంటానని అమ్మకి ఇష్టం లేకపోయినా ఒప్పించి నాన్నని ,కొత్తగా పెళ్లయిన మా పద్మక్కని,బావగారిని ఢిల్లీ తీసుకు వెళ్ళాడు.
తీసుకెళ్లిన మూడవ రోజుకే నా గురువు,నా మార్గదర్శి మా నాన్న చనిపోయాడు. అక్కడి నుంచి హైదరాబాదుకు విమానంలో, అక్కడి నుంచి మా గోపాల్ బాబాయి వలన కొత్త బస్సులో ప్రయాణించి మా నాన్న పార్థివ శరీరం మా ఊరు చేరింది.చివరి చూపులో కూడా ఆయన మొహంలో చిరునవ్వే ,ఏడవద్దు అన్న సందేశమే. చిత్రం మానాన్న చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు .ఓ యుద్ధవీరుడు వీరమరణం పొందితే దేశానికి కలిగే గర్వం లాంటి భావన మాత్రం కలిగింది.
మళ్లీ వచ్చే నెచ్చెలిలో విజయలక్ష్మీ సరస్వతి అదేనండీ మా పెద్దక్కయ్య కబుర్లతో వస్తాను.అప్పటిదాకా ….
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
మీ నాన్నగారి కథ చదువుతుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. ఆయన 1931 లో పుట్టి 1989 లో కాలం చేశారు. కష్టంలోనూ, సంతోషంలోనూ ఒకలాగే ఉండటం, మితభాషిత్వం ఆయన hallmark qualities.
మీ స్ఫూర్తితో ఆయన గురించి FB లో రాయాలనిపిస్తోంది.
మీరు చెప్పే ప్రతీ కథలాంటి వాస్తవంలోనూ పాఠకులు కనెక్ట్ అయ్యే అంశం వుంటుంది ,ఏనాటికైనా నేర్చుకోవాల్సిన పాఠం వుంటుంది .ఈ కళను జాగ్రత్తగా పెంపొందించుకోండి .అభినందనలు.