క”వన” కోకిలలు : ఎల్లా వీలర్ విల్ కాక్స్
-నాగరాజు రామస్వామి
( నవంబర్ 5,1850 – అక్టోబర్ 30,1919 )
నువ్వు నవ్వితే నీతో కలిసి నవ్వుతుంది లోకం,
ఏడ్చావా, ఒంటరిగానే ఏడ్వాల్సి ఉంటుంది;
పుడమికీ వుంది పుట్టెడు దుఃఖం.
– ఎల్లా వీలర్ విల్ కాక్స్
పై వాక్యాలు ఆమె ప్రసిద్ధ కవిత Solitude లోనివి.
ఎల్లా వీలర్ విలుకాక్స్ అమెరికన్ రచయిత్రి, కవయిత్రి. ఆమె రచించిన ముఖ్యమైన కవితా సంపుటులు Passion and Solitude , ఆత్మకథ The Worlds and I . ఆమె 1850 లో జాన్స్ టౌన్ లో జన్మించింది. కొన్నాళ్ల తరువాత మాడిసన్ కు మారింది. ఆమెది ఆంగ్ల భాషపై పట్టున్న మేధావుల కుటుంబం. 8 ఏళ్లకే రాయడం ప్రారంభించి, 13 సంవత్సరాలకి మొదటి పోయెమ్ ప్రచురించింది. హైస్కూల్ చదువు ముగిసే నాటికే ఆమె తన స్టేట్ లో కవయిత్రిగా గుర్తించబడింది. రాబర్ట్ విలకోక్స్ ను పెళ్లిచేసుకొని స్థిరపడింది. దివ్యజ్ఞాన సంబంధమైన (Theosophy ) ఆధ్యాత్మిక చింతన వాళ్ళిద్దరిని బాగా ఆకర్షించింది. 30 ఏళ్ల వైవాహిక జీవితం రాబర్ట్ మరణంతో ముగియడంతో మనోవ్యధకు గురై, అజ్ఞాత రహస్య జ్ఞానాన్ని (Occult ) ఆశ్రయించి, ప్రజలకు బోధించడం మొదలు పెట్టింది. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను గట్టిగా నమ్మింది. మరణం అంతిమ జీవితం కాదని, మెరుగైన జీవనం ఊర్ధ్వ స్తరాలలో లభిస్తుందని విశ్వసించింది. ఆమె కాన్సర్ వ్యాధి వల్ల 1919 లో మరణించింది.
ఎల్లా వీలర్ విలుకాక్స్ ది లోకప్రియా కవిత్వం. సరళమైన దేశవాళీ భాషలో రాసిన, ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపే అంత్యప్రాసల నియమ కవిత్వం ఆమెది. సాహితీ పరంగా ఆమె శతాబ్ది మహిళగా (Woman of the Century ) పరిగణించబడింది. సమకాలీన సాహిత్య మిత్ర మండలుల కేంద్రబిందువయింది. ఆమె ప్రచురించిన కవితా సంకలనాలలో “Drops of Water”, “Shells”, “Poems of Passion “, Poems of Pleasure, Poems of Sentiment , and World Voices కొన్ని. పలు కవితా సంకలనాలే కాక అనేక నవలలు కూడా వెలువరించింది. ఆమె తొలినాళ్లలో రాసిన కవిత ” Solitude ” ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. కొన్నాళ్ల తరువాత, అదే పేరుతో సంకలనంగా వెలుగులోకి వచ్చింది.
ఆమె భావ ధారలోని కొత్త కోణం “అనంత జ్ఞానం” ( Infinite Intellegence ). ఆమె గ్రంథాలు ” The Power of Right Thought “, ” New Thought Common Sense ” ఆత్మవిశ్వాసాన్ని పెంచే కొత్త జ్ఞాన నిధులుగా పేరు పొందాయి. ఆ నవీన ఆలోచన సమకాలీన సాహితీ సహసమాజంలో నవ్య భావుక చింతనలను నారు పోసిందని ప్రతీతి. ఆమె ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కింది. ఆమె రచనలు హైందవ, బౌద్ధుల విచార ధారలను నవనవంగా ఆవిష్కరించాయి.
ఆమె దయాశీలి. వృద్ధాప్య దశలోని ఆమె తలితండ్రులకే, కాక ఎందరికో అండగా నిలిచింది. జీవితం కేవలం భగవంతుడు ఇచ్చిన అమూల్య వరం మాత్రమే కాదు, అది మానవునికి లభించిన గొప్ప విశేషాధికారం అని ఆమె నిశ్చితాభిప్రాయం. ‘కలుపు మొక్క ఒక వికసించని కుసుమం’ అని అంటుంది.
ఆమె రచించిన అసంఖ్యాక కవితలలో కొన్నింటిని అనువదించి అందిస్తున్నందుకు నాకు ఆనందంగా వుంది :
1. : కృతజ్ఞతల రోజు :
( Thanksgiving )
మనం
నక్షత్ర ధవళ మైదానాలలోనడుస్తుంటాం;
పట్టించుకో౦
డయసీ పూలను,
విస్తృతంగా లభించే పృథివీ వరాలను.
మన జీవితాలను అందగించుకునేందుకు
ఏ మహదానందాన్నో కలగంటుంటా౦;
లెక్కచేయం
అనుదినం అందివచ్చే చిరు సంతోషాలను,
లలిత లలితమైన చిరుత ఆనందాలను.
అడ్డుకుంటవి
రోజంతా వెన్నంటే మన చీకుచింతలు
మన ఆలోచనలను, మన సంవేదనలను;
సంతోషాలను ఒరుసుకుంటూ పోతూనే
అంతలోనే అంతా మరచి పోతుంటాం.
మనం ఏమాత్రం పరాకుగా ఉన్నా
మన జీవితాలను కబళిస్తవి మన దుఃఖాలు.
కాని,
ఏడాదిలోని ప్రతి రోజూ
దాచి ఉంచుతుంది గుప్తసంతోషాలను,
నిండు గానే ఉంటుంది నిన్నటి ఆనందం.
ఆశీస్సులు మంచి మిత్రుల్లాంటివి
మన చుట్టే వుండి మన కోసం శ్రమిస్తుంటివి;
అందుకే పాడాలి స్తుతిగీతాలు
సజీవ హృదయాలకు వినిపించేలా.
ఒక్కోసారి
దుఃఖమో కష్టమో కప్పేయవచ్చు ఆశీర్వచనాన్ని,
అయినా
దూరదృష్టి ఉన్న ఆత్మకు అంతా తెలుసు
అసలేమిటో, ముసుగేమిటో.
నీకు విచారాన్ని ఇచ్చినా, దేవుణ్ని కొలిచావా
నీ ఉదయాలు సంతోషంతో కళకళలాడుతవి.
అందుకే, మనం
మన మౌన జీవన క్షణాలతో,
మన నిశ్శబ్ద జీవస్వరాలతో కూర్చిన
కృతజ్ఞతా సమర్పణాన్ని
సంగీత బృందగీతంగా పాడుకుందాం.
2 . : ఒంటరితనం :
( Solitude )
నువ్వు నవ్వితే
లోకం నీతో కలిసి నవ్వుతుంది,
ఏడ్చావా
ఒంటరిగానే ఏడ్వాల్సి ఉంటుంది;
పుడమికీ వుంది పుట్టెడు దుఃఖం!
పాడావా
పర్వతాలు నీతో యుగళగీతాలు పాడుతవి,
నీ ఆనందగీతాలు నింగిలో నినదిస్తవి,
నిట్టూర్చావా
అవి గాలిలో కలుస్తవి.
నువ్వు ఆనందంగా ఉంటే
అందరు నిన్ను హత్తుకుంటారు,
దిగులుగా ఉంటే
దారి వెతుక్కుంటారు.
వాళ్లకు నీ సంతోషాలు కావాలి
నీ విషాదాలు కాదు.
నీవు నవ్వుతూ ఉంటే
నీ మిత్రబృందం నీ చుట్టు చేరుతుంది,
ఆనందోత్సవాలతో నీ ఇల్లు నిండుతుంది;
కాదంటే అది నీకు దూరమవుతుంది.
ఎవరు వద్దంటారు నీ మధుపానీయాన్ని?
మనం పయనించే ఉత్సాహాల బళ్ళలో
ఎంతో చోటు ఉంటుంది,
పూరించాలి ఉల్లాసాలతో బాధల ఖాళీలను.
3. : అసహనం :
( Impatience )
ఓపేదెలా
నీవు వచ్చేదాకా ?
పాత ఉదయాలు
నా దారిలో తచ్చాడు తుంటే
వాటి అపహాస్యాల రవి కిరణాలు
నన్ను తాకుతుంటే ?
అశాంతి నన్ను కుంగదీస్తున్నప్పుడు
అవి గేలిచేసే పోకిరి పిల్లల్లా
నాతో ఆటాడుకుంటుంటే ?
పరుగెత్తే క్షణాలు
నాతో కలిసి నడిచేందుకు నిరాకరిస్తుంటే ?
స్మృతుల చేతుల్లో పుష్పగుచ్చాలు పెట్టి
నాకు దూరంగా నడిచిపోతుంటే ?
నా ఏఒక్క పాటనూ లెక్కచేయని
నా గత క్షణాలు
నా నుండి పారిపోతుంటే ?
దయార్ద్రమైనవి రాత్రులు;
అవి మాత్రమే
నీవు నిండిన తీపి కలలను తెస్తుంటవి,
నన్ను రేపటి ఉదయాలకు చేర్చుతుంటవి.
కాలం గాలి రెక్కలమీద తేలిపోతుంటే
పాటను మరచి పండుగ చేసుకుంటాను నేను;
నీ ముఖమండలం మీద .
తొలి పొద్దుపొడుపుతో
తిమిర సమ్మోహ౦ సమసి పోగానే
పాపం రేతిరి వచ్చి
నా గుండె మీద వాలిపోతుంది.
తెలుసు నాకు
నీవు లేని నా ఎదిరిచూపుల రోజులలో
నాకు సహనం అవశ్యం అవసరమని .
కాని, ఓపేదెలా ?
నీ నయన తేజం
నా నీరవ ప్రపంచాన్ని వెలిగించే దాకా
నీ ఉన్మత్త హస్తస్పర్శ నన్ను స్పృశించే దాకా
ఓపేదెలా ఓ ప్రియా !
4. : నడివేసవి :
( Midsummer )
మే, జూన్ నెలలు గడిచాక
మధుర మకరందాల
అరుదైన అపురూప పుష్పాలను
భుజాన వేసుకొని
భూగోళాన్ని చుట్టి,
రాపాడే రాచరికపు ఠీవితో నడచి వస్తుంది
ఎర్రని ఎండల నడివేసవి మధ్యాహ్నం.
అప్పుడు
సూర్యుడు అనిమిష ఉగ్రనేత్రుడు !
ఆతని తీవ్రతాప తీక్షణ కిరణ వీక్షణాలకు
స్తంభిస్తుంది పగటి పవనం,
రాలి పడుతుంటవి ఎర్ర గులాబీలు.
మేఘరహిత ప్రణయం
స్వాతిశయ హేతు నక్షత్రాల మీదుగా
తేలి పోతున్నప్పుడు
అలాంటి ఆతప ఋతువే కమ్మేసింది
ఓ నా ఆరాధ్య దేవీ హృదయాన్ని !
ఆ మధ్యాహ్న సూర్యుని నిదాఘ తాపంలో
మహా అరుణగోళంలా మండుతున్నది ఎడద;
వదిలేటట్టు లేవు నన్ను
ఆర్పశక్యం కాని, మచ్చికకు లొంగని ఈ జ్వాలలు
నా ఎదను మంటల చెరువుగా మార్చే దాకా .
ఈ సూర్య దేవర రాచ దర్పంలో
నిన్నటి నా కలలు, నా భయాలు,
మెత్తని నిట్టూర్పుల, నునుసిగ్గుల నా ఆశలు
వసివాడి రాలిపోతున్నవి రోజా రేకుల్లా .
బాధల ద్వీప సమీరాల జాడ లేదు ;
సందేహాల పర్వతాల మీది ఏ కొండగాలీ
నన్ను చేరడం లేదు ;
నా సంతృప్త సంద్రం మీద
తప్త సితకాంతుల జ్వలిత సూర్యుడు !
ఓ నా ఆత్మా !
ఇక, మునిగి పోవాల్సిందే
ఈ స్వర్ణ వైభవాలలో నీవు,
ఓ నా హృదయమా !
మరణమే శరణ్యం నీకు
ఈ ఉన్మత్త తన్మయత్మ౦ లో ;
ఈపాటికి వచ్చేస్తూనే ఉంటుంది
విషాద గాధలతో శిశిరం ;
ఈ వేసవి శోభ ఇక వెనుతిరుగక తప్పదు.
Woman of the Century ! శతాబ్ది మహిళా శిరోమణి ఎల్లా వీలర్ విల్ కాక్స్ !
*****