కొత్త అడుగులు-3
వెలుగుతున్న మొక్క నస్రీన్
-శిలాలోలిత
తెలంగాణా మట్టిని తొలుచుకుని వచ్చిన మరో స్వప్న ఫలకం నస్రీన్. ఒక జర్నలిస్టుగా తాను చూసిన జీవితంలోంచి, ఒక ‘పరీ’ కన్న కలే ఆమె కవిత్వం. ఆమె రాసిన ‘అంధేరా’ కవితను చదివి నేను పెట్టిన కామెంట్ గుర్తొస్తోంది. ‘పరీ’(దేవత)… ‘ఓ నా దేవతా! మొలిచిన రెక్కలు జాగ్రత్త’ అని. నస్రీన్ జర్నలిస్ట్‌గా ఎదిగిన క్రమంలో జీవితాన్ని అతి దగ్గరగా చూసే నైపుణ్యం ఆమెకు తెలియకుండానే పట్టుబడింది. పుట్టింటి వైపు చూస్తే పి.జి. వరకూ చదువుకున్న వాళ్ళల్లో నస్రీనే మొదటి స్త్రీ. అలాగే అత్తింటి వైపు నుంచి గమనించినా ఆమే ప్రథమం. ఒక విధంగా చెప్పాలంటే నస్రీన్ బతుకును గెలుస్తూ వస్తున్న మహిళగా మనం అంచనా వేయొచ్చు.
‘రెండు భుజాల మీదుగా
కిందకు వేలాడుతున్న చున్నీలో
రెక్కలు మొలిచాయి
పరీ లాగ కనిపిస్తున్నాను
ఈ సుందర దృశ్యాలను
కళ్ళతో
ఫొటోలు తీస్తోంది మనసు’
అలాంటి తన్మయ స్థితిలోకి వచ్చిన తర్వాతా ఒక్కసారిగా ‘కోపంలో తిట్లూ, ఆజ్ఞలు వినబడటంతో రెక్కలు మాయమయ్యాయి’ అనడంతో విషాద స్వరంతో కవిత ఆగిపోయింది. స్త్రీని చైతన్య పరిచే దిశగానే ఈమె కవిత్వమున్నప్పటికీ, వాస్తవ దృశ్యాల వ్యక్తీకరణ బాగా చేస్తుంది.
‘నస్రీన్ ఖాన్’ విలక్షణమైన కవయిత్రి. జర్నలిస్ట్ కవి కావడం వల్ల ఈమెను కదిలించినప్పుడు, కరిగించినప్పుడు, కన్నీళ్ళొలికించినప్పుడు కవితై మనముందుకొచ్చింది.
భారతీయ ముస్లిమ్ ల పట్ల సమాజ వివక్షను చాలా సూటిగా స్పష్టంగా ప్రకటించింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
‘ఇదే దేశపు ఇసుక రేణువును
సౌశీల్యత నిండిన నిగ్రహాన్ని…..
చేతి వృత్తులతోనైనా పొట్ట నింపుకోగలను నేను
సుంకం పేరుతో నోటి ముద్దను లాక్కొనే పైశాచికత్వం మాకు లేదు
సింగిడీ రంగులన్నింటినీ హత్తుకోగలను
కాషాయమే రంగు అనే మూర్ఖత్వంలో మునిగి తేలను…..
నా దేశంలో నన్ను పరాయిని చేస్తే…
నీదీ వలస బతుకేనని నిలదీయగలను
తల్లి పాదాల్లో స్వర్గం చూసే సంస్కృతి నాది
చూసినందుకే జిఎస్టీ వేయగల వంచన నీది
ఈ భూమిలో మొకెత్తిన అత్యంత సహజత్వాన్ని నేను
బహుజనుల్లో భాగాన్ని
మూలవాసీ చెట్టును
‘‘భారత ముస్లిం’’ను నేను
నస్రీన్ ఖాన్‌లో పరిణితి సాధించినతనం మనకీ కవితలో కనబడుతోంది. నేను అంటే ఇక్కడ బహువచనం. అందరినీ తనలో కలుపుకొని, అందరూ తానై, ఏక స్వరమై, తమ బతుకు చిత్రాల అతుకుల బొంతల్ని స్పష్టంగా చిత్రిస్తూ పోయింది.
కలలు నిండిన కనుపాపలెప్పుడూ అడుగుతూనే వున్నాయ్
***
అణచివేతకు అలవాటు పడిన భావజాలం
దాస్య శృంఖలాలకు స్వస్తి పలకాలి
పంజరంలోని పక్షిలా కాకుండా
నింగిలో విహరించే స్వేచ్ఛా స్వరం ఇప్పుడే కావాలి
ఒక స్థిరమైన, నిశ్చలమైన స్వరం నస్రీన్‌ది. ‘ఆసిఫా’ గురించి రాసిన కవిత ఉద్వేగపూరితంగా వుంది. వలస కార్మికుల కర్మాగారాలు అంటూ రాసిన కవితలో.
‘జఖ్మీ’గా సాహితీలోకంలోకి అడుగిడుతున్న నస్రీన్, కవిత్వాన్ని కూడా భిన్న భిన్న రూపాల్లో వ్యక్తీకరిస్తూ పోయింది. అమ్మీవ జయతే, గుండెల నిండుగా.., నామ్ గాఁవ్, అంధేరా, సప్నోంకీ బహార్. యుద్ధ నౌకను నేను, పరాయిని చేస్తే, మౌన వృక్షం, ఆసిఫా, హజ్రత్, శ్రోతలు కావాలి, నవాబులమే కానీ…, మూలవాసీ చెట్టు, ఖసాబునే..కడుపు కొట్టేవాణ్ణి కాదు, సమానత్వపు జాడలు, దిల్ కీ తక్లీఫ్, చమ్కీ చీర, కాలే బాల్, దేశభక్తి అంటే ద్వేషం పెంచడం కాదు, వేరీస్ మై రైట్, గుర్తింపు నాదా నాతో ఉన్న అవసరానిదా, మొహబ్బతీ జుబాన్, కాలా నాగిన్, రాత్ కీ కహానీ, ముసల్మానులం, సిల్ సిలా, కాలం తీసుకు రాని మార్పు నీవు, మౌలి సాబ్, శానిటరీ ఆఫ్ ఇండియా, మూర్ఖపు గోడలు, ఉప్పుకప్పురంబు, నిరామయ సైరన్ ఆమె, దుస్స్వప్నం, నీ ఊహల వెంట, సాంచా ఇవన్నీ నస్రీన్ రాసిన కవితా శీర్షికలు. ఆమెలో వున్న విభిన్నతా రూపాలివన్నీ. విస్తృతమైన కవితావస్తువులే కాక, ఒక కొత్త చూపుతో వాటిని రచించిన తీరు నిజంగా అభినందించదగింది.
ఇటీవలి కాలంలో కవయిత్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒంటరి గూళ్ళ నుంచి, రెక్కలు తొడుక్కుని ఎగురుతున్న పక్షి సమూహాల సంఖ్య పెరిగింది. బతుకంతా ఉప్పు సముద్రాల్లో ఈదుతున్నా ఒడ్డుకు చేరుకొనే ధైర్యసాహసాలతో స్ర్తీలు సాధించుకోగలుగుతున్నారు. నాలుగు గోడలకు ఆవలే సమస్త ప్రపంచమూ ఉందన్న వాస్తవాన్ని గ్రహించి, తామూ మనుషులుగా బతికేందుకు సమాయత్తమవుతున్నారు. స్త్రీ లోక సంఘటిత శక్తిగా ఎదుగుతున్నారు. వ్యక్తీకరణ వీరి కొత్త కోణం. సమస్యల్ని, సానుభూతుల్ని సహేతుకంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఒక సమ్యక్ దృష్టితో ఆలోచిస్తున్నారు. వివక్షకు గురవుతున్న స్త్రీల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నారు.
ముస్లిం స్త్రీలు మరింత వివక్ష ఎదుర్కొంటున్న తీరును, నిజాన్ని కవిత్వీకరించింది నస్రీన్. షాజహానా ఒక ఉరుము, ఒక మెరుపు. తన కవిత్వ ఆయుధంతో ఎన్నో అసమానతలను ఎదుర్కొంది. శంషాద్ బేగం, మేరాజ్ ఫాతిమా, రజియా సుల్తానా, మహెజబీన్, పర్వీన్, షహ్నాజ్ ఫాతిమా, సల్మా, జరీనా బేగం… వంటి కవయిత్రులు ఒక్కొక్కరూ ధైర్య కెరటాలు, ప్రశ్నల కొడవళ్ళను భుజాన వేసుకొని తిరుగుతున్న వాళ్ళు.
నిజానికి నస్రీన్ ఇప్పుడిప్పుడే రాయడం మొదలు పెట్టలేదు. ,చాన్నాళ్ళుగా రాస్తునే వుంది. అనేక పత్రికల్లో, ఫేస్ బుక్లో, సంకలనాల్లో ఈమె కవితలు కనిపిస్తూనే వుండేవి. కలిసిన ప్రతిసారీ, నువ్వు ఎలాగూ కనబడుతున్నావ్ సరే! అక్షరాల్లో పుస్తక ముఖాన్ని తొడుక్కొని ఎప్పుడు కనిపిస్తావ్? అనే నా ప్రశ్నకి జవాబులా “జఖ్మి’ వచ్చింది.
యాభై ఆరు కవితలున్న ఈ పుస్తకంలో ప్రతి కవితా ఏదో ఒక రకంగా విశ్లేషించాల్సిన కవితే. మీరు చదువుతారు కదా! అప్పుడు నస్రీన్ మరింత లోతుగా అర్థమవుతుంది.
ఏదో ఒక ఉద్యమానికో, ధోరణికో, మతానికో, కట్టుబడిన కవితలు కావివి. సార్వజనీనమైన అంశాలను వ్యక్తీకరించడమే ఈ పుస్తకం ప్రత్యేకత. అందుకే ఇదొక విలక్షణమైనదిగా, విశాల దృక్పథాన్ని వ్యక్తీకరించే విధంగా తన స్థానాన్ని తానే నిర్ణయించుకుంది.
‘నస్రీన్ కవిత్వాన్ని మొత్తంగా పరిశీలించినప్పుడు మనకు రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఒకటి – విభిన్న అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించడమే కాక, అద్భుతంగా మలిచిన తీరు తెలుస్తోంది.
రెండు – ఒక సీనియర్ కవయిత్రిగా కనిపిస్తుందే కానీ, ఇప్పుడిప్పుడే రాస్తున్న తీరు ఎక్కడా కనిపించదు.
ఫెమినిజం స్పృహ ఈమెలో చైతన్య దిశగా పరుగు పెట్టడానికి ఎంతో దోహదపడింది. అది ‘ సప్నోంకి బహార్’ కవితలో, యుద్ధ నౌకను నేను అంటూ బలమైన వ్యక్తీకరణలున్న కవిత. ‘రాత్ కీ కహానీ’ – కవితలోనూ ఉద్వేగ ఛాయలు కనిపిస్తాయి. నువ్వు వేరు, నేను వేరు, ఎట్లా సమానమవుతామని సూటిగా ప్రశ్నిస్తుంది. తార్కికతను తారతమ్యం చేస్తూ లోతుపాతులు ఎత్తి చూపుతూ ఆఖరు తమ్ముడి ఆంక్షలు చెవుల్లో మార్మోగుతుండగా అని ఆవేదన చెందుతుంది. ‘పేరుకు పోయిన నియంత్రణలన్నింటినీ/ ఒక్కసారిగా తెంపి పారేయాలనిపిస్తుంది కదూ/ ఇప్పటికే ఆలస్యమైందంటూ’ నర్మగర్భంగా దిశా నిర్దేశం చేస్తుంది.
నల్గొండ జిల్లాకు చెందిన నస్రీన్ భవిష్యత్తులో ఒక నిర్ణాయక శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసం నాకుంది. షాజహానా తరువాత అంతే తీవ్రతతో, అంతే బలమైన వ్యక్తీకరణలతో, ప్రశ్నించే ఎరుకతో మరింత సాంద్రత నిండిన కవిత్వంతో మన ముందుకు వస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.
ముస్లిం స్త్రీలు సాహిత్యంలో సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. వారి సంఖ్య మీద, రచనల మీద దృష్టి పెట్టడం వల్ల ఇటీవలే వీరు ‘అంకుర్’ అనే తెలుగు ముస్లిం రచయిత్రులు వేదికను సృష్టించుకొని కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. అభినందనీయులు అందరూ. నా దృష్టిలో నస్రీన్ ఒక వెలుగుతున్న మొక్కలాంటిది.
ఇంత మంచి కవిత్వాన్ని రచించిన నస్రీన్‌ను అభినందిస్తూ, సాహిత్యాకాశంలో ఒక నక్షత్రమై వెలుగుతూ ఉండాలని అభిలషిస్తున్నాను.
***
1. “అమ్మీ”వ జయతే
మేడే వచ్చినప్పుడల్లా కళ్ళముందు నిలుస్తారు గడియారపు ముళ్ళలాంటి అమ్మీలునల్లని బురఖాలోంచి కళ్ళలో వెదుకులాటతోఅలా హుందాగా నడిచి వెళ్ళే అమ్మీలే మీకు తెలుసు కదూ!
మా దెహ్లీజ్ లను దాటుకున్న మీహృదయపు చూపులకుజిందగీలను ఈదుతూ మైనపుముద్దలయిన అమ్మీలు కనిపిస్తారుదెహ్లీజ్ కు ఆవలే తజ్బీ చదివినంత వేగంగాపనిలో నిమగ్నమైన మా అమ్మీలను చూడండి
అబ్బాల హుకూంలను అక్షరాలా పాటించే అమ్మీలుఅనుక్షణం అందరి ఆజ్ఞలు పొల్లు పోనీయని అమ్మీలుఏ ఒక్కరి పసంద్ నూ బేఖాతిర్ చేయనిమెమరీ చిప్ లు మా అమ్మీలు
పగలంతా పట్టెడన్నం కోసమే శ్రమించే పుట్ట లోపలి చీమలుఉన్నంతలో కాళ్ళు ముడుచుకునేఅపురూప అంతఃసౌందర్యవతులు
అందివచ్చే మాసూమ్ లకు తెహజీబ్ లు నేర్పుతూసాలీడులా అనుబంధాలు అల్లగల శ్రామికలుబంధాలను కట్టి ఉంచేదారపు పోగులు మా అమ్మీలు
దిన్ భర్ ఘడియాల్ లా తిరుగుతూముద్దు మురిపాలను నివాలాలుగా నోటికి అందిస్తూకళ్ళల్లో ఒత్తులేసుకుని కనిపెట్టుకునేమొహబ్బత్ ల ఊటలు అమ్మీలు
తాగుబోతు అబ్బాలు ఉన్న ఇంటి పరదాలనుఒక్కసారి జరిపి చూడండికంటికి నిద్దుర అంటని అమ్మీలు కనిపిస్తారుసంప్రదాయాల్లో ఒదిగి ఏ టైలరింగ్ చేస్తూనో,ఏ ఎంబ్రాయిడరీ వర్క్ లోనోమరే చోటనోఇంటి బరువును మొగ్రా మాలగా సూదిలోకిగుచ్చడంలో నిమగ్నమైన దిగులు కళ్ళ అమ్మీలకు కొదవేలేదు
నిరంతర శ్రామిక అయిన అమ్మీకిఅల్లడమే తెలుసుతెంచడమెలానో తెలియదుపని చేయడమే తెలుసుగంటలుగా కుదించుకోవడం తెలియదుకుటుంబ చక్రాలకు ఇరుసు అమ్మీప్రపంచంపై కన్నెత్తగలిగితేగోర్కీ “అమ్మ’ను తలపించగలదుఉద్యమాలకు ఊపిరి పోయగలదు
బిడ్డల ఆకలి తీర్చే నిత్య శ్రామికలుఅమ్మీలకు జేజేలు”అమ్మీ”వ జయతే!!
2. సాంచా
కంటిపైని కునుకు ఇంకా మాయమవలేదు
సూరీడి జాడ ఇంకా భూమిని తాకలేదు
కొంపలంటుకుపోయినట్లు
మజిలీలు దాటిపోతున్నట్లు
హడావుడిగా
కప్పుకున్న చాదర్ ను పక్కకు తప్పించి
వాలి ఉన్న వెన్నును నిటారు చేసుకుని
ఆవలింతలతో అలవాటుగా
వంటింట్లోకి అడుగుపెడుతుంది
వేరే ప్రపంచమేమీ తెలియనట్లుగా
కీ ఇచ్చిన బొమ్మలా
ఒక ఫార్మాట్ లో యంత్రానికి
పని అప్పగించినట్లుగా
ఒకదాని తరువాత మరొకటి
పిల్ల కాలువలో నీటి ప్రవాహంలా
అలా సాగుతూనే ఉంటుంది
మర బొమ్మగా మారలేని మనసుని
కొత్తగా
ఇష్టంగా చేయాల్సిన పనులేవో
రా రమ్మని తొందర పెడుతుంటాయి
తప్పించలేని పాత పనులు
జిన్న్ లా వెంటాడుతూంటాయి
పని చేస్తేనే ప్రేమ ఉన్నట్లు
చిత్రీకరించిన పాడు సమాజం
గుల్లగా మారుతున్నా కనికరించదు
మనసైన పనులను చేయనీయదు
ఔరత్…
మర్దానా రాసిన
ఇండెక్స్ తో ఒదిగి పోవాలి
గుండెల్లో ముల్లు సలపరిస్తున్నా సరే!
దిగులు తన శరీరాన్ని తినేస్తున్నా సరే!!
*****
1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017