గురుశిష్యులు
-అనసూయ కన్నెగంటి
తల్లి కాకికి బెంగగా ఉంది.
పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకటి బాగానే ఉంది. రెక్కలు రాగానే తన తిండి తాను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. రెండవ దానితోనే తల్లి కాకికి బెంగ. దానికీ ఎగరటం బాగానే వచ్చింది. కానీ చెట్టుని విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్లటం లేదు. ఎప్పుడు చూసినా చెట్టు మీదనే ఉంటుంది. అది కూడా తన ఆహారాన్ని తాను సంపాదించుకుంటే తల్లి కాకికి సంతోషంగా ఉండేది. తన తోడు తాను వెదుక్కునేది.
కానీ రోజులు గడచిపోతున్నాయి. పిల్ల కాకిలో మాత్రం మార్పు రావటం లేదు.
ఎన్ని రకాలుగా చెప్పి చూసినా అది వినటం లేదు. చెట్టుని వదిలి ఎక్కడికీ వెళ్ళటం లేదు.
పెరిగి పెద్దది అయినా దానిక్కూడా తనే ఆహారం సంపాదించి తీసుకు రావాల్సి రావటంతో తల్లి కాకికి కష్టంగా ఉంది.
అయినా ఇలా ఎన్నాళ్ళు? తనైనా ఎన్ని రోజులని ఇలా కూర్చోపెట్టి తెచ్చి మేపుతుంది ? అని ఆలోచించి రెండు, మూడు రోజులు తీసుకు రాకపోతే ఆకలి వేసి అదే సంపాదించుకుంటుంది అనుకుని తాను బయట తినేసి పిల్ల కాకికి ఆహారం తేకుండా ఉండిపోయింది.
ఒక రోజు చూసింది పిల్ల కాకి, తల్లి తెచ్చి పెడుతుందేమోనని. తీసుకుని రాలేదు. దాంతో రెండవ రోజు ఆకలి వేసి కూర్చున్న చోటు నుండి కదలకుండానే చుట్టూ చూసింది ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమోనని. ఎక్కడ ఉంటుంది? ఎక్కడా లేదు.
కానీ పక్క కొమ్మ మీద ఉన్న కొంగ గూటిలో చిన్న చేప పిల్ల దాని కంటపడింది. ఆ సమయంలో గూటిలో కొంగలేదు. దాంతో కాకి కొంగ గూట్లోకి వెళ్ళి ఆ చేపను తెచ్చుకుని తినేసింది.
ఇదేం చేస్తుందా అని గమనిస్తున్న తల్లికాకికి అది చూసి కోపం వచ్చింది.
“ దొంగతనం చేసావా?” అని అడిగింది.
“ ఆకలి వేసింది. తప్పేముంది? “ అని తిరిగ్ ప్రశ్నించింది పిల్ల కాకి.
“ ఇంకొకరి ఆహారాన్ని దొంగిలించటం తప్పే! కొంగకు తెలిస్తే నిన్ను క్షమించదు” అంది తల్లి కాకి.
“తెలిస్తే కదా! “ బద్దకంగా బదులిచ్చింది పిల్లకాకి.
“తెలియక పోతే ..తప్పు కాదా? దాని ఆహారాన్ని నువ్వు తినేస్తున్నావని తెలిస్తే అది ఊరుకోదు “
బాధగా అంది తల్లికాకి.
“ అమ్మా..! అది అప్పటికే ఆ చేపలో సగం తినేసింది. మళ్ళీ కొత్త చేప కోసం అది బయటికి వెళ్ళింది. దానికి ఇంకో చేప దొరకగానే దీని సంగతి అది మర్చిపోతుంది. ఒకవేళ అది తెచ్చుకోగానే దీనిని కిందకి తోసేస్తుంది. అప్పుడైనా అది నాకు దొరుకుతుంది. ..”
“ ఛీ..ఛీ..ఎంగిలి ఆహారం తిని బతుకుతావా? “ అంది బాధగా తల్లి కాకి.
“ నువ్వు బయటికి వెళ్ళి తిని వచ్చేదీ, నాకు తెచ్చేది ఎంగిలి ఆహారమే కదమ్మా! అదేదో నేను ఇక్కడే వెతుక్కుంటున్నాను” అంది పిల్ల కాకి పెద్ద తెలివిగా.
ఎలా చెప్పాలో , ఏమని చెప్పాలో అర్ధం కాక..ఊరుకుంది తల్లికాకి.
ఆ మర్నాడు తన స్నేహితురాలితో ఇదంతా చెప్పి “ నిజానికి అది చాల తెలివైనది. దానిని అక్కడ్నించి ఎలా కదిలించాలో తెలియటం లేదు. గూళ్లల్లోని చేపలను తినేస్తుందని తెలిసిందంటే కొంగలన్నీ కలసి పిల్లను బతకనివ్వవు. అది నా బాధ “ అని బాధపడింది తల్లికాకి.
అంతా విన్న ఆ స్నేహితురాలు..” ఆ విషయం ..నాకు వదిలెయ్ . నేను చూసుకుంటాను “ అని తల్లికాకికి ధైర్యం చెప్పింది.
ఆ మర్నాడు..తల్లి కాకిని రావద్దని చెప్పి ఒక కాలికి కట్టు కట్టుకుని మంచి ఎర్రగా ముగ్గిన దొండపండుని ముక్కున కరచుకుని తిన్నగా వెళ్ళి పిల్ల కాకి పక్కనే వాలి దానిని కొమ్మపై ఉంచి పొడిచి పొడిచి తినసాగింది.
అదేదో కొత్తగా, ఎర్రగా అందంగా కనిపించింది పిల్లకాకికి. కాసేపలా చూసి..
“ అదేమిటి? అంత ఎర్రగా ఉంది? “ అని అడిగింది.
“ ఇది దొండపండు..చాల బలం. వైద్యుడు చెప్పాడు ఇవే తినమని. “ అని చెప్పింది కొత్త కాకి.
“అవునా? కాలికి ఏమైంది? “ అనడిగింది పిల్ల కాకి.
“ కాలు పనిచెయ్యటం లేదు.” అంది కొత్త కాకి.
“ అయ్యో! అవునా? ఎందుకు ?
“ మొన్నటి వరకూ మా నాన్న సంపాదించి తెస్తే తినేవాణ్ణి. వద్దన్నా వినేవాడు కాదు మా నాన్న..పైగా రోజూ చేపలే తెచ్చేవాడు..రోజూ అవే తింటే రోగాలు రాక ఏమవుతుంది..“
“ అదృష్టవంతురాలివి…” అంది పిల్లకాకి.
“ అదృష్టమా? ఏమి అదృష్టం? మనకి కాళ్ళూ, చేతులూ ఉన్నది మన తిండి మనల్ని సంపాదించుకోమని. అప్పుడే అవీ సరిగ్గా పని చేస్తాయి. రోజూ మా నాన్న తెచ్చినవి తిని కాళ్లకూ, రెక్కలకూ పని లేకుండా పోయింది. అలా పని చెయ్యకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. పైగా బలమని రోజూ చేపలే పెట్టి మరో రుచి తెలియకుండా చేసేసింది. ఇది ఎంత రుచిగా ఉందో తెలుసా? “ అంది నోరు ఊరించేలా లొట్టలేసుకుని తింటూ..
అది తినటం చూస్తే పిల్ల కాకికీ నోరూరి..”ఎక్కడ దొరుకుతాయవి?” అనడిగింది.
దాంతో దూరంగా అవి దొరికే స్ధలాన్ని చూపిస్తానని కూడా తీసుకుపోయింది కొత్త కాకి..
అక్కడ పిల్ల కాకికి రకరకాల పళ్ళూ..ఆహారం కనిపించే సరికి ఆనందం వేసేసింది..
అప్పుడంది..కొత్తకాకి..
“ఉన్న చోటనే కదలకుండా ఉండి దొరికినదానితో సంతృప్తి పడిపోతే ఆనందం ఏముంటుంది? బయటికి రావాలి. కొత్త కొత్త ఆహారం కోసం వెదకాలి.తినాలి. అప్పుడే కాళ్ళూ, రెక్కలూ బాగా పనిచేస్తాయి. ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే ఆహారం రుచి పెరుగుతుంది..”
“నిజమే “ అన్నట్టు తలూపింది తియ్యటి మిగల ముగ్గిన జాంపండుని పొడిచి పొడిచి తింటూ పిల్లకాకి.
దూరాన్నించే ఇదంతా గమనిస్తున్న తల్లి కాకికి..గురుశిష్యుల్లా అనిపించారు వాళ్లిద్దరూ.
మనసులోనే తన స్నేహితురాలకు కృతజ్ఞతలు చెప్పి ఆనందంతో అక్కడ్నించి ఎగిరిపోయింది తల్లికాకి.
*****
కన్నెగంటి అనసూయ 1962 డిశంబర్ 1 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో పుట్టారు. బి.కామ్., బి.ఎల్.ఐ.ఎస్.సి ., ఎం.కామ్ , ఎమ్మె పాలిటిక్స్ , చదివి కంప్యూటర్ కోర్సులు చేశారు .. ఇప్పటి వరకూ అనేక కధలూ, బాలల కధలూ, కవితలూ, నవలా, వ్యాసాలూ వ్రాసారు. 2009 లో “మానస స్వచ్ఛంద సేవా సంస్ధను స్థాపించి రక్తదాన శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బాలలకు బాల్యంకరువైపోయిందని బాధపడే కన్నెగంటి అనసూయ భవిష్యత్ కార్యక్రమంగా అనేక బాల సాహిత్య కదా కార్యశాలలు ఏర్పాటు చేసి బాల కథారచయిత్రులనూ, బాల సాహితీవేత్తలనూ, బాలలే బాలల కధలు వ్రాసేలా కృషి చేయదలచుకున్నారు