జలసూర్య
రచయిత్రి : అరవింద
-వసుధారాణి
‘అవతలి గట్టు’ నవల ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి A S మణి (అరవింద వీరి కలం పేరు) రచించిన మరో నవల ‘జలసూర్య’.జూలై 1978 లో అచ్చయిన ఈ నవల ఓ స్టడీ మెటీరియల్ లాగా విడి విడి జిరాక్స్ కాగితాల రూపంలో నా చేతికి వచ్చింది. సాహిత్యంలో నిధులు ఇలాంటి రూపంలోనే ఉంటాయని గత అనుభవాలు కొన్ని నేర్పాయి.అందుకని అన్ని కాగితలని చక్కగా అమర్చుకుని చదవటం మొదలు పెట్టాను.
నా అంచనా తప్పుకాలేదు అందుకే ఆ సారాన్ని మీకు అందించాలని ఈ సమీక్ష వ్రాస్తున్నాను. ఈ నవలలో కథానాయకుడు సూరిబాబుగా పిలవబడే సూర్యం.విశ్లేషణ చెయ్యాలి అంటే మూడు భాగాలుగా విభజించుకుని చూడవలసిన నవల . సూర్యం బాల్యం,పేదరికం ఒక విభాగం. ధనార్జన ,ప్రేమ ఒక విభాగం. సూర్యం మానసిక స్థితి మొత్తం నవలంతా ఒక విభాగంలా తీసుకోవాలి.
సముద్రం అంటే అమితమైన ఆకర్షణకు గురయ్యే పిల్లవాడు సూరి.జాలరి కన్నయ్యకి తొలి సంతానం.సూర్యం చేప పిల్లలాగా సహజంగానే గొప్ప ఈతగాడు.సముద్రమే వాళ్ళకి అన్నీ సంతోషం,ఆదాయం,దుఃఖం కూడా అని తెలుసుకుంటాడు.అక్క భర్తని,తండ్రిని పడవతో సహా సముద్రం తనలో కలిపేసుకున్నా సముద్రం అంటే తనకు ఉన్నప్రేమ,ఆకర్షణను పోగొట్టుకో లేడు.తనకు కాస్త చదువు సంస్కారం నేర్పిన చిన్ననాటి మిత్రుడు చంద్రం ప్రాణాలు కూడా సముద్రం పాలవ్వటం సూర్యంకి తట్టుకోలేని బాధను కలిగిస్తుంది. తల్లి, తనకన్నా చిన్నవాళ్లయిన చెల్లెళ్ళు, తమ్ముళ్ల కోసం ఓ పడవని అద్దెకు తీసుకుని చేపలు పట్టటం మొదలు పెడతాడు.ఇక్కడ అరవింద గారు నవలలో ఒక వేగవంతమైన ఒరవడిని చూపిస్తారు.మనమూ ఉప్పునీటి సముద్రాన మునకలేస్తాం.పేదరికం,తమ్ముళ్లు,చెల్లెళ్ళ బాధ్యత ,చిన్ని సూరిబాబు సంఘర్షణ అంతా మనమూ తీసుకుంటాం.
సముద్రంలో మునిగిపోతున్న ధనవంతుడైన బంగారయ్య కూతురు నవనీతంను సూరి కాపాడతాడు.అలా పరిచయం అయిన నవనీతం పట్ల సూర్యం ఆకర్షితుడు అవుతాడు.సూర్యం లోని చురుకుతనాన్ని పెట్టేసిన బంగారయ్య తన వ్యాపారంలో సూర్యాన్ని కలవమని కోరతాడు.
ఇక్కడి వరకూ నవల ఆపకుండా చదివించేస్తుంది.ఒక చక్కని బెస్తపల్లె నేపధ్యం ,బాధ్యత గల అన్న ,కుటుంబం, ఓ స్నేహితుడు,ఓ ప్రియురాలు ,సముద్రం ఇలా ఓ చక్కని దృశ్య రూపం.ఇక్కడి నుండి అరవిందగారు నవలను సినిమా పంథా లోకి మార్చారు.
బంగారయ్య చేసే వ్యాపారం సముద్రంలో దూరంగా లంగరు వేసి ఉన్న పెద్ద పెద్ద ఓడల దగ్గరికి చిన్న చిన్న చేపల పడవల మాదిరిగా పడవలు వేసుకెళ్లి ఓడలలోనుంచి స్మగుల్డ్ వస్తువులను తీసుకురావటం ,వాటిని నల్ల బజారులో అమ్ముకోవటం.ఆఖరుకు బంగారం కూడా స్మగుల్డ్ చేసే దాకా సూర్యం ఎదుగుతాడు. చెల్లెల్ని,తమ్ముణ్ణి డబ్బుకు లోటులేకుండా పెంచి చదివిస్తాడు.వ్యాపారంలో మెళకువలు అన్నీ నేర్చుకుని త్వరలోనే బంగారయ్యకు కుడి భుజంగా మారిపోతాడు.నవనీతాన్ని మనసులోనే ప్రేమిస్తూ ఉంటాడు. చిన్ననాటి నేస్తం చంద్రం నేర్పిన నీతి సూత్రాలు,సత్ప్రవర్తన ,దొంగ వ్యాపారం వీటి మధ్య కొంత మానసిక సంఘర్షణకు గురవుతున్నా ,అన్నిటికీ డబ్బు ప్రధానం అన్న బంగారయ్య సూత్రాన్ని బాగా వంటపట్టించుకుంటాడు.
బంగారయ్య తన వ్యాపారానికి,తనకు సరైన వారసుడు సూర్యమే అనుకుని నవనీతాన్ని సూర్యనికి ఇచ్చి పెళ్లిచేస్తానని చెపుతాడు.పని మీద సింగపూర్ వెళ్లిన సూర్యం అక్కడ నవనీతానికి కానుకగా ఓ ముత్యాల హారాన్ని కొనుక్కుని పెళ్ళిని గురించి బోలెడు కలలతో తిరిగి వస్తాడు.ముత్యాలహారం మెడలో వేసే వేళ నవనీతం సూర్యం తమ్ముడు చిట్టిని ప్రేమిస్తున్నానని చెపుతుంది.
నవనీతం సూర్యం నువ్వంటే నాకు ఇష్టం,గౌరవమే కానీ చిట్టి అంటే ప్రేమ అతను చదువుకున్న వాడు అంటుంది.ఆమె ప్రేమని గౌరవించి బంగారయ్యను ఒప్పించి చిట్టికి, నవనీతానికి పెళ్లి జరిగేలా చూస్తాడు.ఇక్కడ అతను చూపిన మానసిక పరిణితి,పడిన అంతర్మధనం రచయిత్రి చాలా బాగా వ్రాసారు.
సూర్యం లాంటి ప్రయోజకుడు తన అల్లుడు కాలేదన్న దిగులుతో తన కూతురుకు,సూర్యానికి ఆస్తిని సమానంగా పంచివేసి బంగారయ్య కన్నుమూస్తాడు.నవనీతం ,చిట్టీలను వదిలి ఊరికి దూరంగా మద్రాసు నగరానికి చేరతాడు.
ఇక్కడి నుంచి కథ ,సూర్యం,చదివే పాఠకుడు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు.నవలలో మూడవ పంథా ఇది. మొదట బాల్యం,అమాయకపు బెస్త పిల్లవాడి జీవితం. రెండవది ఇంటికి పెద్దకొడుకుగా బాధ్యత ,ధనార్జన చేయాల్సిన ఆవశ్యకత వలన బంగారయ్యతో కలిసి దొంగవ్యాపారం,ప్రేమ ,ప్రేమలో నిరాశ,బంగారయ్య వారసుడిగా దక్కిన సగం ఆస్తి.
మూడవ పంథా అకస్మాత్త గా అంతర్జాతీయ స్థాయికి వెళుతుంది.ఒకదశలో ప్రపంచ సాహిత్యం మొత్తం అంతర్జాతీయ స్మగ్లర్లు,దొంగవ్యాపారుల కథల వెనుక ,తేలికగా ఎక్కువ ధనార్జన చేసేవారి సినిమాలు,కథల వెనుక పరుగెత్తింది. ఇది కూడా అంతేనా అనిపించేలాగా కొంత కథా గమనం అలాగే సాగుతుంది.
మద్రాసుతో ఆగని సూర్య వ్యాపార దక్షత జపాన్ దాకా వెళ్లి, అక్కడ అతను ఒక అత్యంత ఆధునిక సరుకురవాణా నౌక కొనేదాకా సాగుతుంది. ఆ నౌకకు ‘జలసూర్య’ అన్న పేరు పెట్టి వ్యాపార నౌక ఏజన్సీ ఒకటి స్థాపిస్తాడు.సింగపూర్ కేంద్రంగా చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. చక్రి అని పిలవబడే చక్రధరం,ఓబులేసు ఆంతరంగికులుగా జలసూర్యలో తనకి ఒక అత్యాధునిక మైన ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకుని ఎక్కువగా జలసూర్యలోనే సముద్రంలో ప్రయాణిస్తూ గడుపుతుంటాడు.
చిట్టి,నవనీతం మధ్య వచ్చిన విభేదాలను సర్దుబాటు చేస్తాడు.మిగిలిన బాధ్యతలు అన్నీ పూర్తి చేస్తాడు. కానీ తీవ్రమైన ఒంటరితనముతో,ప్రేమ రాహిత్యంతో బ్రతుకుతూ తాగుడు అలవాటు చేసుకుంటాడు.
నౌకలో పనిచేయటానికి వచ్చిన మాళవిక అన్న అమ్మాయి ప్రవర్తన ,నడవడిక పట్ల మెల్లగా ఆకర్షితుడైన సూర్యం ఆ మ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.అయితే మీ సేవకురాలుగా ఏమైనా చేస్తాను కానీ నేను ఇదివరకే పెళ్లి అయిన దానిని అని మాళవిక సమాధానం ఇస్తుంది.
ఓ రాత్రి మాళవిక తన విచిత్ర గాధను వినిపిస్తుంది.అరవింద గారు ఒక నవలలో ఎన్ని కోణాలు చూపించారంటే మాళవిక గత చరిత్ర అంతా గొప్ప మానసిక విశ్లేషణలాగా,వ్యక్తిత్వవికాస పాఠంలాగా ఉంటుంది.అచ్చం మాళవిక ,ఆవిడ జీవితంలో ఎదురైన వింత సంఘటనలు,జీవితాన్ని ఆవిడ తీసుకున్న తీరు ,జీవితం తీసుకున్న మలుపులు వీటి మీదనే ఓ పెద్ద నవల రాయవచ్చు.కొంచెం సేపు జలసూర్య నౌక,సముద్రాన్ని వదిలి మాళవిక గాధలో కొట్టుకుపోతాము.అప్పటి దాకా సూర్య పక్షం వహించిన పాఠకుడు మాళవిక వైపు నిలబడాల్సి వస్తుంది.
మాళవికని వివాహం చేసుకుని ఆమె పేరుతో ఓ పెద్ద హోటల్ కట్టిస్తాడు.వారిద్దరి దాంపత్య జీవితం మళ్ళీ నవల మొదటి భాగంలో ఎలాంటి ఒరవడిలో వుందో అలా హాయిగా సాగుతుంది.ఇద్దరు ముత్యాల లాంటి పిల్లలు సుఖమయ జీవితం గడుపుతూ ఉండగా దురదృష్టం సూర్య తలుపు తట్టటమే కాదు ఈసారి తోసుకుని మరీ లోపలికి వస్తుంది.పిల్లలు,మాళవిక అనుకోకుండా కారు ప్రమాదంలో మరణిస్తారు.ఆ క్షణంలో సూర్య పడే వేదన కష్టకాలం వచ్చినప్పుడు మనం చేసిన తప్పులను గుర్తుకు తెచ్చుకుని బాధపడతాం,భయపడతాం,పాపం చేశామని పశ్చాత్తాప పడతాం అలాగే ఉంటుంది.
తను చేసిన దొంగవ్యాపారాలను ప్రభుత్వం పట్టుకోక పోయినా భగవంతుడు శిక్షించాడు అని బాధ పడతాడు.
ఒక్క మాళవిక హోటల్ ను తన పేరున ఉంచుకుని తనని నమ్ముకుని ఉన్న చక్రికి తన తదనంతరం మిగిలిన ఆస్తి అంతా రాసిస్తాడు. ‘మనిషి ఏదైనా పొందినప్పుడు కాదు కోల్పోయినప్పుడే తనలో వెలుగు నింపుకుంటాడు.’ నవల మొత్తంలోకి నాకు నచ్చిన వాక్యం ఇది.
సింగపూర్ వెళ్ళటానికి జలసూర్యలో సన్నాహాలు చేసుకుని ప్రయాణికులతో,సరుకులతో, బాధాతప్త హృదయుడైన సూర్య బయలుదేరతాడు.ప్రయాణంలో ఓ ప్రయాణికుడు అయిన ఆనంద్ శంకర్ గిటార్ వాయిస్తుంటే విని కొంత సాంత్వన కొరకు గిటార్ నేర్చుకుంటాడు.
అరవిందగారు ఇక్కడ ఎంతో నేర్పుతో మనిషి దుఃఖం పొందటానికి ,దాని నుంచి బయట పడటానికి ఏవి కారణాలో చూపించారు.ఉపశమనం సంగీత, సాహిత్య రూపాల్లో మనిషికి త్వరగా చేరుతుంది.
ఇంకా ఈ జలసూర్య ఎందుకలా సముద్రాన సాగుతోంది అనుకునే వేళకి సముద్రంలో భీకరతుఫాను . ఓడ అంతా అల్లకల్లోలమై కెప్టెన్ ఎంత ప్రయతించినప్పటికీ నౌక మునగక తప్పదు అనే సమయం వస్తుంది.విలువైన వజ్రాలు,బంగారం అన్నీ ఓ పెట్టెలో సర్దుతారు సూర్యం,చక్రి.చిన్న చిన్న పడవల్లో కొందరు అతి కష్టం మీద ఓ దీవిని చేరతారు.జలసూర్య పూర్తిగా మునిగిపోతుంది.
ఇక్కడ మనకు అనేక ఆంగ్ల సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆహారాన్ని వెతుక్కోవటం,దీవిలో అడవిలో రకరకాల ఉత్కంఠ భరితమైన ప్రమాదాల మధ్య జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వుంటారు.ఒకరోజు చేపలతో వండిన ఆహారం తిని అందరూ అక్కడికక్కడే మరణిస్తారు.సూర్య,చక్రి,కెప్టెన్ మిగులుతారు.
కెప్టెన్ చక్రి మీద అనుమానంగా ఉంది విషప్రయోగం చేసి అతనే అందరినీ చంపేసి ఉంటాడు అని చెపుతాడు.సూర్య నమ్మడు.కానీ ఓ చోట విషపుచెట్టు వేరు తవ్వి ఉండటం చూసి చక్రి అత్యాశను గమనిస్తాడు.
ఆకలి,అవసరం,తక్కువ వనరులు మనిషిని ఎంత స్వార్ధ పరుడిని చేస్తాయో తెలుసుకుంటాడు.
అనుమానాస్పద పరిస్థితులలో కెప్టెన్ కూడా మరణిస్తాడు.జీవితం ఇంక సూర్య,చక్రిల మధ్య క్రీనీడల ఆట ఆడుతుంటుంది.ముందు దీవి నుంచి బయటపడటం కోసం కష్టపడి గట్టి పడవను ఒకదాన్ని కొన్ని రోజులు కష్టపడి తయారు చేస్తారు.ఆ అడవిలో ఓ కోతి సూర్యాకు నేస్తం అవుతుంది. ఇంకో రెండు రోజుల్లో బయలు దేరతాము అనగా చక్రి చాటునుంచి సూర్యను బండరాయి వేసి చంపబోతాడు . నేస్తం కోతి హెచ్చరిక ద్వారా సూర్యం తప్పించుకుంటాడు.
చక్రి ని ఇక వదిలేస్తే లాభం లేదని పానీయంలో విషం వేరు కలిపి తప్పని పరిస్థితిలో చక్రి అడ్డు తొలగించుకుంటాడు. అతని జాకెట్ లో డైరీ,చేతిలో పాడయిపోయిన గిటార్ తో ఎన్నో రోజుల తర్వాత ఓ రష్యన్ నౌక వారికి దొరుకుతాడు.
పూర్తిగా మతిస్థిమితం కోల్పోయిన అతడు ఎవరో డైరీ ద్వారా తెలుసుకుని అతన్ని కలుసుకోవాలని వెళ్లిన విలేకరులకు పాడయిపోయిన గిటారుతో ఆ పిచ్చివాడు పారిపోయాడు అని హాస్పటల్ వారు చెప్పటంతో నవల ముగుస్తుంది.
ఒక అమాయక బాల్యం, మలినం ఎరుగని ప్రేమ, తప్పొప్పులు చూడని బాధ్యత,వ్యాపారదక్షత ,చక్కని దంపత్యజీవనం, అన్నీ ఉన్న సూర్య జీవితం ఎన్ని మలుపులు తీసుకుందో ,ఎలాంటి ముగింపు పొందిందో ఒక ఎత్తు అయితే.నవల మొత్తంలో అరవిందగారు అందించిన మాసిక విశ్లేషణ, సంఘర్షణ,పరివర్తన ఇవన్నీ నవల కన్నా ఒక సైకాలజీ పుస్తకం చదివిన అనుభూతిని కలిగిస్తాయి.మనల్ని మనం తరిచి చూసుకునేలా చేసే పుస్తకం ఈ జలసూర్య. అరవింద గారికి అభినందనలు.
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.