జానకి జలధితరంగం- 2
-జానకి చామర్తి
గోదా దేవి
ఒక్కొక్క పూవే అందిస్తోంది తండ్రి విష్ణుచిత్తునకు, గోదా ,
ఏకాగ్రంగా, ఆ పూవుల అందమూ రంగు పరీక్షిస్తూ ,
ఏ పూల కి జత చేసి ఏ పూలు కట్టితే అధిక చక్కదనమో, మరువము దవనమూఆకుపచ్చకి ఈ పచ్చనిచామంతి పూలు నప్పునో నప్పవో అనుకుంటూ..నందివర్ధనాల మధ్య మందారాలు కూర్చిన దండ అందమా కాదా.. అనుకుంటూ.. విల్లిపుత్తూరు తోట పూవులు ఇవి, తులసీమాలలు అయితే కో కొల్లలు ..
ముగ్ధ కన్యలా పువ్వును ఏరి ఎంచుతోంది గోదా. కళ్ళ ముందు రంగనాధస్వామి రూపమే .. ఈ చిన్న ఎర్రపూలు స్వామి వంటిమీద ఎలా ఉంటాయి , పక్కన కాడమల్లెలు కూర్చితే అవి రెండు ఇవిరెండు చేర్చి, మాలతీ మనోహరాలు విడిగా పారిజాతాలు పొగడలు …
కట్టిన మాలను ఎత్తి కళ్ళనిండుగా చూసుకు తృప్తిగా నవ్వుకుని అదే కళ్ళతో కూతురుని చూసి,
నా కన్నతల్లి చిన్ని చేతులలో అందించగా, పూవులు , ఎంత అందంగా అర్ధవంతంగా అమిరాయి ఈ దండలో .. ఈ దండలు ధరియించి రంగనాధుడెంత సంతోషంతో నవ్వు మోముతో మురిసిపోతాడో కదా అనుకుని, బుట్టలో సద్దుకున్నాడు, విష్ణుచిత్తుడు.
మార్గశీర్ష మాసమున , తోటి చెలులతో కలసి , చేసే కాత్యాయనీ వ్రతశోభతో, రంగని సేవించి పొంది తరించాలన్న మధుర భక్తి భావముతో , వడలంతా అలముకున్న తాదాత్మ్యముతో , మసకగా కనుల కప్పిన ప్రేమ తో, పెదవులు ఉచ్ఛరించు రంగని నామముతో, మంది నిండి ఉన్న అమృత భావముతో, గోదా ఆ పూవుల దండ నందుకుంది.
తండ్రి చాటు పిల్లే, తండ్రి చాటుగ వెళ్ళినపుడే సాహసించింది. రంగడికి ప్రియమగునో లేదో ఈ మాల,ఎటులుండునోధరియింప..చూదమనుకుంటూ .. తానే ధరించి చూసుకుంది. సిగకు చుట్టుకుంది. చాపల్యంతో పరుగున అద్దము న తనని తాను చూసుకుంది.
అదేమి అద్దములో గోదాని ..నేనేది, కనిపించవలసినది నేను , కానికనిపించేది సాక్షాత్తూ రంగనాథుడు ,అయన వంటిమీద ఈమాలలు. పైగా స్వామి నవ్వుతున్నాడే… పలుకుతున్నాడు కూడా, నాతో మాటాడుతున్నాడే..,
గోదా .. ఆండాళ్ళూ ! ఏమి ఇవి , నీ అంత అందముగా ఈ రంగుపూలు, నీ వంటి వాసనంటెనేమో కదా పరిమళించెను,
ఈ మరువం దవనములు, ధరించనీ దండలు .. నీ కైదండ నను చుట్టినట్టు, నిను నా వక్షస్ధలమందు నిలుపునట్లు, నీ వ్రతము తపము ధ్యానము ఈ మాలలా నను చేరినట్లు..
అద్దములో చూచి తెలిసినది గోదాదేవికి , వలచిన స్వామి నేను ఇరువరముూ ఒకరమేగాని వేరు కాదు , ఈ పూలమాలలు నే ధరించినా.. స్వామి ధరించినా వేరే కాదు ఒకటే .. ఒక్కటే.
ప్రియుణ్నో పరమాత్మనో పరమునో చేరుకొను తపముతో , కృష్ణభగవానుని లీలలు కీర్తించి గానముచేయు పాశురములు రచించి, తిరుప్పావై పాడి , కళ్యాణ వధువై , రంగనాధుని పెళ్ళాడి , తరించిందొక చిన్ని పల్లె కన్నెపిల్ల, గోదాదేవి.వేరేది ఏమీ తెలియని ఏకాగ్ర ధ్యానము , తెలిసీ తెలియని తనమైనా స్వచ్ఛము, భక్తి భావము , కల్మషపుతేటి తాకని పూవు , భూమి మీద పుట్టి .. దివిలో పారిజాతమయ్యింది.
భక్తి సాహిత్య కావ్య నాయకిగోదాదేవి. ప్రేమ ఆరాధన ల లో ఆమెకు ఆమేసాటి. ఆమెను అలాగే అభిమానిస్తాం. కాని , ఆధునికయుగ భావాలకు ఆమెను అన్వయించగలమా.
ప్రేమ భావానికి ఆరాధనకు , కాలమాన పరిస్ధితులు మనుషులు అతీతులు కారు. ప్రేమ అజరామరము.
కాని .. ఇప్పటి కాలానుసారంగా ఎవరూ లేరా.. ఉండరా ..ఉంటారనుకోవడం ,అలాగే కాకపోయినా వేరే రకంగా, మనకి ప్రేమ మీద నమ్మకం కలుగచేస్తుంది. ప్రేమ ఆరాధన లకు సాక్ష్యం ఉంటుంది. పైకిచూపించికోపోయినా , మనసులో గుడి కట్టి , మనసైనవాడిని ఆరాధించేవారు ఉంటారు , పొందాలన్న భక్తి భావం తో ఉండేవారు, నిశ్చయమైనఅభిప్రాయం కలిగివారుకోరుకున్నవాడిపట్లఉంటారు .
అద్దంలోని తమ ప్రతిబింబాన్ని చూచినట్టుగాకోరుకున్న గుణగణాలు , ఇష్టాలు, ఏకాభిప్రాయాలుకలవాడు ను ధైర్యంగా ఎంచుకోవడం, ప్రేమపెంపొందించుకోవడం , నిశ్చలంగా అతనినేపొందాలన్న నిర్ణయాన్ని ఎన్ని ఒడుదుడుకులుఎదురైనా పొందగలగడం , కాదనగలమా .. వీరు ఆండాళ్ళు అడుగుజాడలలో నడుస్తున్నారని. ప్రేమవ్రతం పట్టి కోరుకున్నవాడిని పొంద సక్రమమైనమార్గంలో పయనిస్తున్నారు.
తల్లితండ్రుల చాటు పిల్లల లాగానే ప్రవర్తిస్తున్నారు, వివాహవిషయంలో..ప్రేమించిన వాడినితల్లితండ్రుకు చూపించి, వారి ని వప్పించి, వారిఅనుమతి తోనే జీవిత భాగస్వామి నిచేపడుతున్నారు. ఉన్నారు అటువంటి పడతులు , ఇప్పటికాలంలో కూడా , స్వచ్ఛమైన ప్రేమకు కాపుకాసేవారు.
గోదాదేవితరువాతికాలాలలోఆడపిల్లలకుప్రేమించడం నేర్పింది, ఎన్ని తరాలు ఎంత కాలంమారినా, ఎంత ఆధునిక కాలమైనా మనసునిండా ప్రేమించడంఅనుకునే ఆడపిల్లలు …గోదా వంటివారే.
గోదా కావ్యనాయకి, ఆరాధ్య నాయకి ..ఎప్పటికీ !
ధనుర్మాసం లో గోదా .. పాడిన పాట
విన్నవా చెలియా ఇదొ విన్నావా ..
కీచు కీచు లతో పొద్దు పొద్దున్నే పలకరింపుల
ముచ్చటలాడు ఆ భరధ్వాజ పక్షుల కబుర్లు విన్నావా
వినలేదా అది ఓ అమాయకపు పిల్లా !
గళమున తాళి కాసులపేరూ తావళమూ
కలగలసి చిందుచు చప్పుడు చేయగా
రెండు చేతులు సాచి లయబద్ధముగా కదలుతు
కొప్పున పూలదండలా అదురుకు జారి
మధుర సువాసన లలుముకొంటుంటే
గట్టి పెరుగు చిలుకుతున్నారా గొల్లభామలు
పెరుగులోని వెన్నవలె కన్నులకు తోపని పరమాత్మ,
అన్నిటా నిండి ఉండి , ఉన్న వానికి కూడా తెలియనిసర్వాంతరాత్మ
ఆధారము వాడె నియామకుడు వాడైన అంతరాత్మ
మన మామూలు కన్నలకానందముకలుగజేయ,నాయికలారా!
ఆ నారాయణుడే మనముందు రూపుదాల్చినాడు
మన లని బాధించు శత్రువుల
నాశము చేయు ఘనుడు కేశవుడు
అతని కీర్తనలే కదమ్మా గొంతెత్తి పాడుకొనుచున్నాము
విన్నా విననట్టు నీ వేల లేచిరావు
తలుపులు తెరచిరా తెలివైన తరుణీ,
తలపుల నారాయణుని నిలిపి
మేలుకో గోపికా మేలుకో
సకల జనుల మేలుకోరుకో!
*****
జానకి చామర్తి ( వరిగొండ)
మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా ,
అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా.
అందంగా కవితలా రాయాలని , రోజూవారీ జీవితాన్నైనా
ప్రకృతి యే ఆనందం , ఇప్పటికీ చదువు చెప్పే గురువు అదే.
నిజం చదువు MA Bed, ఉపయోగపడే విద్య yoga లో చేసిన PG Diploma,.
నివాసం విశాఖపట్టణం , ఎక్కువకాలం ప్రవాసం.
ప్రస్తుత నివాసం కౌలాలంపూరు.
అద్భుతమైన విశ్లేషణ
ధన్యవాదాలు