దీపావళి మ్యూజింగ్స్ 

-పద్మా మీనాక్షి 

అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే…

జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే..

వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో!

ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా?

ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా అయితే కాకరపువ్వొత్తులు తప్ప…ఎవరైనా కాలుస్తుంటే కరెన్సీ కాలుస్తున్నట్లుగా ఉంటుంది..

అయినా దీపావళి అంటే ఇష్టం…కొత్త బట్టలు, రంగు రంగుల ముగ్గులు, నానమ్మ బంతిపూల చంద్రహారం, జడగంటలు, పాపిడి బొట్లు, చంద్ర వంకలు రోజులు ఎలా ఎగిరిపోయాయో, కాల చక్రం లో…

లక్ష్మి పూజ, అలంకరణలు, పూల దండలు, దీపాలు….దీపావళి అంటే నాకు ఇంతే…

నా పని అంతా దీపాలని శుభ్రం చేయడం, ప్రమిదలలో నూనె వేసి వెలిగించడం…అపుడపుడే మొదలయ్యే చలిగాలుల నుంచి  దీపం ఆరిపోతుందేమో అని రక్షించుకోవడం..రాత్రి అయ్యేసరికి ఇక అలిసిపోయి వదిలేయడం…జీవితం లో ఓటమి లాగే!

దీపావళికి ఇల్లు సర్దుతుంటే…దీపావళి జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా వచ్చి వాలాయి నా మనసులో.

దసరా ముగియడంతోనే దీపావళి కి పడే తపన, మట్టి దీపాలు కొనుక్కుని వచ్చి రంగులు వేసుకోవడం ఒక పెద్ద పని…నాకొక యజ్ఞం…

యూనివర్సిటీ లో చదువుతున్న టైం లో పెదనాన్నగారు చిత్తూర్ డిస్ట్రిక్ట్ జడ్జి గా ఉండటం, అన్ని పండగలకి పెద్దమ్మ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరిని పిలవడం, కలిసి పండగ చేసుకోవడం సాధారణం. పిల్లలంతా తయారు అయి సరదాగా గడపడమే తెలుసు..

నాకు తెలిసిన దీపాల ముగ్గులన్ని పెట్టేసి ఆ రోజుకి పండగ ఫీలింగ్ లో ఇమ్మెర్స్ అయిపోయేదానిని..

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేని రోజుల్లో సొంత బ్రెయిన్ కి పని చెప్పి ఎలా పెట్టుకోవాలి అని ఆలోచించడానికి, సర్దుకోవడానికే టైం పట్టేది..

కాకరపువ్వొత్తులు, మతాబులులానే మనం ఇద్దరం గడిపిన సమయం కూడా కరిగిపోయింది..

దీపాల వెలుగులో కొన్ని జ్ఞాపకాలు ఫ్లాష్ లా వెలిగి మాయమవుతూ ఉంటాయి.

నేను అలంకరించిన దీపాలు నువ్వు చూసి ప్రశంసిస్తే దీపం వెలిగినంత ఆనందపడిపోయే సాయంత్రాలు..

కళ్ళతోనే ఇంటిని చూసి సంబరపడితే నాకు అదే నిజమైన దీపావళిగా మురిసిపోయిన ఉదయాలు..

 ఎన్నని చెప్పను…

బాణాసంచా ఎండలో పెట్టుకుని ఇవి నావంటూ నావని కజిన్స్ అంతా వాటాలు వేసుకుంటుంటే నేను మాత్రం నా వంతు కూడా మీరే కాల్చేయండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో!

ఇప్పుడు అసలు ఆ పంపకాల గొడవే లేదుగా..

కావల్సినవన్నీ తెమ్మని నేను ఇంట్లో వాళ్లకి ఇచ్చే ఆర్డర్ లు, అవన్నీ తెచ్చి నా మీద ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేసే మనుషులు ,,,ఏమయ్యారో.?

 పండగకి ఏ చీర కట్టుకోవాలో, ఏమి వండాలో చెప్పేసి , పండగ నాడు కూడా ఇంటిలో ఉండకుండా ఊరంతా జరుపుకుంటున్న పండగ కవర్ చేయాలంటూ వెళ్లిపోతుంటే…ఏమిటి పండగ రోజు కూడా ఇంటిలో ఉండవంటూ విసుక్కున్న రోజులు…ఇపుడు ఎవరి మీదా విసుక్కోవడానికి వీలు లేనంత స్పేస్…

 గాలికి కొట్టుమిట్టాడే దీపపు కుందెలో దీపాన్ని నిలపడానికి చేసే ప్రయత్నాలు పెను తుఫానుకి నిలవవని ఆరిపోతున్న దీపంలానే జీవితం లో మనుషులు కూడా కనుమరుగయిపోయారు..

జీవితం పరీక్షలు పెడుతూ ప్రశ్నిస్తున్నపుడు కంచి కామాక్షి సన్నిధిలో దీపావళి జరుపుకోవాలని అమ్మ నాన్న తో కలిసి వెళ్లి అమ్మవారి సాన్నిహిత్యంతో ఓలలాడిన రోజులు…అమ్మ నాన్నలతో నేను చేసిన ప్రయాణం అన్నీ నిన్న మొన్న జరిగాయా అన్నట్లుగా అనిపించి, ఇక లేరా నాతో అని అనిపించగానే ఏదో వ్యధ…

ఒంటరి ప్రాణానికి దీపావళి ఎందుకు అంటే ఏమని చెప్పను? ఒక్కరే అంత బాగా అలంకరించుకున్నారా?

నాకనిపిస్తుంది..ఒక్కరైనా, వంద మంది అయినా చిన్న నాటి జ్ఞాపకాలని బ్రతికించుకునే ప్రయత్నమే నేను చేసుకునే దివ్వెల పండగ అని…

మనుషులు రారు…తెలుసు…కానీ..ఆశ..ఎక్కడో ఏ దీపం వెలుగులోంచో నన్ను నా ఆనందాన్ని చూసి మురిసిపోతారేమో అని …

నా అలంకరణ చూసి మనసులోనే ఆనందపడిపోయే అమ్మ పై నుంచి చూస్తుందేమో, అని ఒక ఆశ…

మరి ఇష్టమైన వాళ్ళు లేని దీపావళి ఏమిటి అని అనిపించినా…ఆ దీపాల వెలుగులో నవ్వుతున్న అమ్మ నాన్నలు కనిపిస్తారు..

ఎవరు ఉన్నా లేకపోయినా…దీపావళి వెలుగులు విరజిమ్ముతూ ప్రతి ఏటా వస్తూనే ఉంది. నేను మాత్రం ఒక మ్యూజికల్ చైర్ లా అనిపించే నా లైఫ్ లోంచి తీసేసిన కుర్చీలను చూస్తూ…ఆ ఖాళీలను నా బొమ్మలతో నింపేస్తూ బిగ్గరగా నవ్వేసుకుంటూ ఉంటాను,

నా సంతోష జ్వాలలని ఇన్స్టా, ఎఫ్ బి స్టోరీ లతో పంచేస్తూ పండగ కానిచ్ఛేస్తున్నా…

జీవితంలో అమావాస్య మిగిల్చిన చీకటిని అవలీలగా దాటేస్తూ, వెలుగుల్లో కొట్టుకుపోతున్నా!

*****



Please follow and like us:

One thought on “దీపావళి మ్యూజింగ్స్”

  1. వేదన మాటున వెన్నెల -చీకటి చాటున దీప వూయల. నరేషన్ బాగుంది

Leave a Reply

Your email address will not be published.